కారేపల్లి, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా 2,98,220 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసే విధంగా లక్ష్యం నిర్ధేశించుకున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డీఐఓ) వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన మండలంలోని పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం కారేపల్లి పీహెచ్‌సీలో విలేకరులతో మాట్లాడారు. 3,327 పోలియో కేంద్రాలు, 90 మోబైల్ టీంలు, 62 తాత్కాలిక పోలియో కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
వైద్య సిబ్బందితో పాటు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వివిధ స్వచ్చంధ సేవా సంస్థల నుంచి వలంటీర్లు మొత్తంగా 13,944 మంది ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. గోదావరి నది పరివాహాక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలైన రేఖపల్లి, జీడికుప్ప, పోచారం, పేరాంటాలపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో రెండు లాంచీ లను, పర్ణశాల, అమలారం, ఏలూరి, తిప్పకుప్ప గ్రామాలకు మూడు బోట్లను ఏర్పాటుచేసి చిన్నారులకు పోలి యో చుక్కలను వేసినట్లు ఆయన తెలిపారు.
కొండరెడ్లు, ఆదివాసీలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక వలంటీర్లను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. వచ్చే నెల 11వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌ఓ)ద్వారా దేశానికి ఫ్రీ పోలి యో సర్టిఫికెట్‌ను ప్రధాన మంత్రి, రాష్ట్రపతిల చేతుల మీదుగా ఢిల్లీలో అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు కారేపల్లి పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీరి వెంట కారేపల్లి ప్రాజెక్టు సీడీపీఓ విజయలక్ష్మి, వైద్యురాలు నాగమణి, ల్యాబ్ టెక్నిషియన్ జియావుద్దీన్‌లు ఉన్నారు.
పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించిన డీఐఓ
Published Mon, Jan 20 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement