కారేపల్లి, న్యూస్‌లైన్ : గిరిజన సంప్రదాయంలో వినూత్నమైన వేడుక డూండ్. భార్యలు భర్తలను కర్రలతో కొట్టడమే దీని ప్రత్యేకత. కారేపల్లి మండలం సామ్యాతండాలో సోమవారం సాయంత్రం ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ వేడుక తండాల్లో ఆనందోత్సాహాలను నింపింది.
ఈ ఏడాది ఎవరింట్లో జరిగిందంటే..?
ఈ యేడాది సామ్యతండాలో భూక్య శ్రీను, మంజుల దంపతుల ఇల్లు ఈ వేడుకలకు వేదికైంది. గత హోలీ తర్వాత వారికి కుమారుడు జన్మించడంతో పండుగ వారింట్లో నిర్వహించారు. ఈ వేడుక తండావాసుల్లో ఆనందోత్సాహాలను నింపడమే కాకుండా తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందని ఆ తండా గేర్యా వాంకుడోతు తులిస్యా, భూక్య కోట్యా, గేరీనీలు వాంకుడోతు వీరమ్మ, భూక్య పరోస వివరించారు. ఈ కార్యక్రమాన్ని కులపెద్దలు వాంకుడోతు సామ్య, భూక్య సక్రియ, ఈర్యానాయక్ పర్యవేక్షించారు.
డూండ్ అంటే...
డూండ్ అంటే వెతకడం అని అర్థం. గత హోలీ నుంచి, ఈ ఏడాది హోలీ మధ్యకాలంలో తండాలో ఎవరి కుటుంబంలో మగపిల్లాడు జన్మిస్తాడో.. అతనిని సంప్రదాయబద్ధంగా హోలీ రోజు తెల్లవారు జామున 4 గంటలకు గేరినిలు తండాలో ఒక చోట దాచి పెడ్తారు(ఇక్కడ పురుషులను గేర్యాలు అని, స్త్రీలను గేరినిలని అంటారు.). గేర్యాలు కర్రలు చేబూని ఎక్కడ దాచారో డూన్డ్ (వెతకడం) చేస్తారు. పిల్లవాడు దొరికాకా గేర్యా, గేరినిలు కామదహనం చేసి రంగులు పులుముకుంటారు. అనంతరం సాయంత్రం మగపిల్లాడి ఇంటి వద్ద ఒక స్తూపం (గుంజ) చుట్టూ గంగాళాల్లో తినుబండరాలు ఉంచుతారు.
వాటిని తాళ్లతో ఒకదానికొకటి బిగించి గేరినిలు (భార్యలు) కర్రలతో కాపలా కాస్తారు. ఇక గేర్యాలు వాటిని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు. తినుబండరాల కోసం వచ్చిన గేర్యాలను కర్రలతో కొడుతూ పాటలు పాడుతూ గేరినిలు స్తూపం చుట్టూ తిరుగుతారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపిస్తుంది. ఎవరైతే గేరినిలను చేధించుకుని ఆ గంగాళాలను ఎత్తుకొస్తారో వారిని తండాలో ధీరుడిగా గుర్తిస్తారు. అనంతరం ఆ తినుబండరాలను గేర్యా, గేరినిలు రెండు వాటాలుగా వేసుకుని కామదహనం చేసిన చోటికి వెళ్లి, దాన్ని చల్లార్చతారు. అనంతరం ఆ పక్కనే ఉన్న బీడుల్లో తినుబండరాలు ఆరగిస్తారు. దీంతో డూండ్ వేడుక ముగుస్తుంది.
ఘనంగా డూండ్ వేడుకలు
Published Tue, Mar 18 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
Advertisement
Advertisement