Tribal tradition
-
... అద్దాల అందం
‘నిన్నటి ఆధునిక కళ నేటి సంప్రదాయ కళ’ అంటారు. కొన్ని దశాబ్దాల వెనక్కి వెళితే....లంబాడ గిరిజనుల సంప్రదాయ వస్త్రాధారణ కన్నుల పండగగా ఉండేది. ఇప్పుడు ఎక్కడో తప్ప సంప్రదాయ దుస్తులు ధరించే వారు కనిపించడం లేదు. ఇక సంప్రదాయ వస్త్రధారణ అనేది నిన్నటి కళేనా? ‘కానే కాదు’ అంటుంది బాలమణి. ఎనభై సంవత్సరాల బాలమణి పాతతరం ప్రతినిధి. ‘అయ్యో...మా కళలు మాకు దూరం అవుతున్నాయే’ అని నిట్టూర్చేది ఒకప్పుడు. ఇప్పుడు ఆమెలో నిన్నటి నిట్టూర్పు లేదు. ‘ఇదిగో మా కళలు మళ్లీ మా దగ్గరికి వస్తున్నాయి’ అనే సంతోషం ఆమె కళ్లలో మెరుస్తుంది....కల్చరల్ ఐడెంటిటీగా భావించే ‘లంబాడీ ఎంబ్రాయిడరీ’కి మళ్లీ ప్రాధాన్యత పెరిగింది. సేవాలాల్, మేరీమా, పన్నీ భవానీ పూజలు, తీజ్...మొదలైన పండగలకు సంప్రదాయ దుస్తులు వేసుకోవడం తప్పనిసరిగా మారింది. ప్రత్యేక కార్యక్రమాల్లో సెలబ్రిటీలు కూడా బంజార సంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారు. దీంతో వీటిని రూ. 30వేల నుండి రూ. 2లక్షల వరకు ఖర్చుపెట్టి మరీ తయారు చేయించుకుంటున్నారు.సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ పాటల చిత్రీకరణకు ఈ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.మహిళలు వేసుకునే సంప్రదాయ దుస్తులను పేట్యి, పేట్, గుంగుటో, కాంట్లీపేటీ, పులియ, గున్నో ...ఇలా ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తారు. వారు ధరించే ఆభరణాలు టోబ్లీ(చెవులకు పెట్టుకునేవి), హస్లీ(మెడలో వేసుకునే కడియం), వాంగ్డీ, కస్తులు( కాళ్లకు వేసుకునే వంకులు), హారం( రూపాయి బిల్లలను అతికించి వెండితో తయారు చేసే ఆభరణం) బల్యా(గాజులు)లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పట్కారి వారు వీరికి దుస్తులు, ఆభరణాలు, అలంకరణ వస్తువులు తయారుచేస్తుంటారు.బాలమణికి, సోనియా రాథోడ్‌కి ఎన్నో తరాల దూరం ఉంది. అయితే సంప్రదాయ కళల పట్ల వారి అభిరుచి విషయంలో మాత్రం ఎలాంటి దూరం లేదు. ఒకరు తమ తరం కళను ఈతరంలో చూసుకోవాలనుకుంటున్నారు. మరొకరు అలనాటి సంప్రదాయ కళలకు వారధిగా ఉండాలనుకుంటున్నారు.ఒకరిది ఆశావాదం. మరొకరిది ఆ ఆశావాదాన్ని ఆచరణలో తీసుకొచ్చి పూర్వ కళలకు అపూర్వ వైభవాన్ని తీసుకువచ్చే నవ చైతన్యం.– ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్అద్దాల రవిక అందమే వేరు!నాకు 80 సంవత్సరాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి మా అమ్మానాయినలు, తర్వాత అత్తామామలు లంబాడ దుస్తులు తయారీ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. రెండు రూపాయిలకు రవిక కుట్టడం నుంచి నాకు తెలుసు, రవికలు, అద్దాలు, రంగు రంగుల అతుకులతో పేటీలు కుట్టి ఇస్తే వాళ్ల ఇండ్లల్లో పండే ప్రతీ పంట మాకు పెట్టేవాళ్లు. కాలం మారింది. ఇప్పుడు మాతోపాటు, ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని కుడుతున్నారు. ఏ బట్టలు వేసుకున్నా రాని అందం అద్దాల రవికతో వస్తుంది – బాలామణికలర్ఫుల్గా!నాకు చిన్నప్పటి నుండి మా సంస్కృతి సంప్రదాయాలంటే బాగా ఇష్టం. మా తండాలో ఉత్సవాలు జరిగినప్పుడు అందరం సంప్రదాయ దుస్తులు వేసుకుంటాం. తీజ్తో సహా ఇతర పండుగలకు కలర్‌ఫుల్ దుస్తులతో ఆడవారు కన్పించే తీరు కన్నుల పండుగగా ఉంటుంది. వేడుకలు, ఉత్సవాలలో సంప్రదాయ దుస్తులను ధరించడానికి ఇష్టపడతాను. – డాక్టర్ సోనికా రాథోడ్పెద్దల బాటలో...గిరిజన సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. వివాహాలు, ఇతర శుభ కార్యాక్రమాలలో సాంప్రదాయ దుస్తులు తప్పకుండా వేసుకోవాలి. అప్పుడు మన సంస్కృతి, సాంప్రదాయాన్ని పెద్దలు చూపిన మార్గాన్ని అనుసరించిన వారం అవుతాం. – పద్మ, సేవాలాల్ సేనా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు -
అరకులో న్యాయమూర్తి పెళ్లి వేడుక
సాక్షి, పాడేరు (ఏఎస్ఆర్ జిల్లా): గిరిజన సంప్రదాయంలో ఓ పెళ్లి వేడుక. వరుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి. వధువు ఆయన శ్రీమతి. చుట్టూ న్యాయమూర్తులు. గిరిజనులే పెళ్లి పెద్దలు. చట్టాలను ఔపోసన పట్టి, వేలాది కేసుల్లో ప్రతిభావవంతమైన తీర్పులిచ్చిన న్యాయమూర్తి, ఆయన శ్రీమతి ఆ గిరిజనుల ముందు సిగ్గుమొగ్గలయ్యారు. గిరిజన సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో మెరిసారు. మరోసారి పెళ్లి పీటలెక్కి ఒద్దికగా కూర్చున్నారు. గిరిజన పూజారులు న్యాయమూర్తి దంపతులకు గిరిజన ఆచారం ప్రకారం మరోసారి వైభవంగా వివాహం చేశారు. అలనాటి వివాహ వేడుకను గురుు తెచ్చుకుంటూ న్యాయమూర్తి మరోసారి తన శ్రీమతికి తాళి కట్టి మురిసిపోయారు. దండలు మార్చుకొని సంబరపడ్డారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని పెదలబుడు గ్రామంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, అమితా ఉదయ్ దంపతుల గిరిజన సంప్రదాయ వివాహ వేడుక అలరించింది. ఈ వేడుకలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, సుచితా మిశ్రా దంపతులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లాహ్, జీబా అమానుల్లాహ్ దంపతులు, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్, నల్సా డైరెక్టర్ పి. శేగల్, పాల్గొన్నారు. వేసవి విడిదిలో భాగంగా జిల్లాలోని అరకు లోయను సుప్రీంకోర్టు న్యాయమూర్తి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దంపతులు సందర్శించారు. వారితో పాటు జిల్లా న్యాయమూర్తులు రైలు మార్గంలో అరకు లోయ చేరుకున్నారు. వారికి రైల్వే స్టేషన్లో కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అభిషేక్ స్వాగతం పలికారు. గిరిజన మహిళలు థింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. న్యాయమూర్తులు పెదలబుడు గ్రామంలోని ఐటీడీఏ ఎకో టూరిజం ప్రాజెక్టు గిరి గ్రామదర్శినిని సందర్శించి గ్రామ దేవతలకు పూజలు చేశారు. -
ఘనంగా డూండ్ వేడుకలు
కారేపల్లి, న్యూస్‌లైన్ : గిరిజన సంప్రదాయంలో వినూత్నమైన వేడుక డూండ్. భార్యలు భర్తలను కర్రలతో కొట్టడమే దీని ప్రత్యేకత. కారేపల్లి మండలం సామ్యాతండాలో సోమవారం సాయంత్రం ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ వేడుక తండాల్లో ఆనందోత్సాహాలను నింపింది. ఈ ఏడాది ఎవరింట్లో జరిగిందంటే..? ఈ యేడాది సామ్యతండాలో భూక్య శ్రీను, మంజుల దంపతుల ఇల్లు ఈ వేడుకలకు వేదికైంది. గత హోలీ తర్వాత వారికి కుమారుడు జన్మించడంతో పండుగ వారింట్లో నిర్వహించారు. ఈ వేడుక తండావాసుల్లో ఆనందోత్సాహాలను నింపడమే కాకుండా తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందని ఆ తండా గేర్యా వాంకుడోతు తులిస్యా, భూక్య కోట్యా, గేరీనీలు వాంకుడోతు వీరమ్మ, భూక్య పరోస వివరించారు. ఈ కార్యక్రమాన్ని కులపెద్దలు వాంకుడోతు సామ్య, భూక్య సక్రియ, ఈర్యానాయక్ పర్యవేక్షించారు. డూండ్ అంటే... డూండ్ అంటే వెతకడం అని అర్థం. గత హోలీ నుంచి, ఈ ఏడాది హోలీ మధ్యకాలంలో తండాలో ఎవరి కుటుంబంలో మగపిల్లాడు జన్మిస్తాడో.. అతనిని సంప్రదాయబద్ధంగా హోలీ రోజు తెల్లవారు జామున 4 గంటలకు గేరినిలు తండాలో ఒక చోట దాచి పెడ్తారు(ఇక్కడ పురుషులను గేర్యాలు అని, స్త్రీలను గేరినిలని అంటారు.). గేర్యాలు కర్రలు చేబూని ఎక్కడ దాచారో డూన్డ్ (వెతకడం) చేస్తారు. పిల్లవాడు దొరికాకా గేర్యా, గేరినిలు కామదహనం చేసి రంగులు పులుముకుంటారు. అనంతరం సాయంత్రం మగపిల్లాడి ఇంటి వద్ద ఒక స్తూపం (గుంజ) చుట్టూ గంగాళాల్లో తినుబండరాలు ఉంచుతారు. వాటిని తాళ్లతో ఒకదానికొకటి బిగించి గేరినిలు (భార్యలు) కర్రలతో కాపలా కాస్తారు. ఇక గేర్యాలు వాటిని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు. తినుబండరాల కోసం వచ్చిన గేర్యాలను కర్రలతో కొడుతూ పాటలు పాడుతూ గేరినిలు స్తూపం చుట్టూ తిరుగుతారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపిస్తుంది. ఎవరైతే గేరినిలను చేధించుకుని ఆ గంగాళాలను ఎత్తుకొస్తారో వారిని తండాలో ధీరుడిగా గుర్తిస్తారు. అనంతరం ఆ తినుబండరాలను గేర్యా, గేరినిలు రెండు వాటాలుగా వేసుకుని కామదహనం చేసిన చోటికి వెళ్లి, దాన్ని చల్లార్చతారు. అనంతరం ఆ పక్కనే ఉన్న బీడుల్లో తినుబండరాలు ఆరగిస్తారు. దీంతో డూండ్ వేడుక ముగుస్తుంది.