... అద్దాల అందం | traditional costume of Lambadi women | Sakshi
Sakshi News home page

... అద్దాల అందం

Published Wed, Nov 6 2024 12:01 AM | Last Updated on Wed, Nov 6 2024 12:01 AM

traditional costume of Lambadi women

‘నిన్నటి ఆధునిక కళ  నేటి సంప్రదాయ కళ’ అంటారు. కొన్ని దశాబ్దాల వెనక్కి వెళితే....లంబాడ గిరిజనుల సంప్రదాయ వస్త్రాధారణ కన్నుల పండగగా ఉండేది. ఇప్పుడు ఎక్కడో తప్ప సంప్రదాయ దుస్తులు ధరించే వారు కనిపించడం లేదు.  ఇక సంప్రదాయ వస్త్రధారణ అనేది నిన్నటి కళేనా? ‘కానే కాదు’ అంటుంది బాలమణి. ఎనభై సంవత్సరాల బాలమణి పాతతరం ప్రతినిధి. ‘అయ్యో...మా కళలు మాకు దూరం అవుతున్నాయే’ అని నిట్టూర్చేది ఒకప్పుడు. ఇప్పుడు ఆమెలో నిన్నటి నిట్టూర్పు లేదు. ‘ఇదిగో మా కళలు మళ్లీ మా దగ్గరికి వస్తున్నాయి’ అనే సంతోషం ఆమె కళ్లలో మెరుస్తుంది....

కల్చరల్‌ ఐడెంటిటీగా భావించే ‘లంబాడీ ఎంబ్రాయిడరీ’కి మళ్లీ ప్రాధాన్యత పెరిగింది. సేవాలాల్, మేరీమా, పన్నీ భవానీ పూజలు, తీజ్‌...మొదలైన పండగలకు సంప్రదాయ దుస్తులు వేసుకోవడం తప్పనిసరిగా మారింది. ప్రత్యేక కార్యక్రమాల్లో సెలబ్రిటీలు కూడా బంజార సంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారు. దీంతో వీటిని రూ. 30వేల నుండి రూ. 2లక్షల వరకు ఖర్చుపెట్టి మరీ తయారు చేయించుకుంటున్నారు.సినిమాలు, ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ పాటల చిత్రీకరణకు ఈ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మహిళలు వేసుకునే సంప్రదాయ దుస్తులను పేట్యి, పేట్, గుంగుటో, కాంట్లీపేటీ, పులియ, గున్నో ...ఇలా ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తారు. వారు ధరించే ఆభరణాలు టోబ్లీ(చెవులకు పెట్టుకునేవి), హస్లీ(మెడలో వేసుకునే కడియం), వాంగ్డీ, కస్తులు( కాళ్లకు వేసుకునే వంకులు), హారం( రూపాయి బిల్లలను అతికించి వెండితో తయారు చేసే ఆభరణం)  బల్యా(గాజులు)లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పట్కారి వారు వీరికి దుస్తులు, ఆభరణాలు, అలంకరణ వస్తువులు తయారుచేస్తుంటారు.

బాలమణికి, సోనియా రాథోడ్‌కి ఎన్నో తరాల దూరం ఉంది. అయితే సంప్రదాయ కళల పట్ల వారి అభిరుచి విషయంలో మాత్రం ఎలాంటి దూరం లేదు. ఒకరు తమ తరం కళను ఈతరంలో చూసుకోవాలనుకుంటున్నారు. మరొకరు అలనాటి సంప్రదాయ కళలకు వారధిగా ఉండాలనుకుంటున్నారు.

ఒకరిది ఆశావాదం. మరొకరిది ఆ ఆశావాదాన్ని ఆచరణలో తీసుకొచ్చి పూర్వ కళలకు అపూర్వ వైభవాన్ని తీసుకువచ్చే నవ చైతన్యం.
– ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్‌

అద్దాల రవిక అందమే వేరు!
నాకు 80 సంవత్సరాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి మా అమ్మానాయినలు, తర్వాత అత్తామామలు లంబాడ దుస్తులు తయారీ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. రెండు రూపాయిలకు రవిక కుట్టడం నుంచి నాకు తెలుసు, రవికలు, అద్దాలు, రంగు రంగుల అతుకులతో పేటీలు కుట్టి ఇస్తే వాళ్ల ఇండ్లల్లో పండే ప్రతీ పంట మాకు పెట్టేవాళ్లు. కాలం మారింది. ఇప్పుడు మాతోపాటు, ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని కుడుతున్నారు. ఏ బట్టలు వేసుకున్నా రాని అందం అద్దాల రవికతో వస్తుంది – బాలామణి

కలర్‌ఫుల్‌గా!
నాకు చిన్నప్పటి నుండి మా సంస్కృతి సంప్రదాయాలంటే బాగా ఇష్టం. మా తండాలో ఉత్సవాలు జరిగినప్పుడు అందరం సంప్రదాయ దుస్తులు వేసుకుంటాం. తీజ్‌తో సహా ఇతర పండుగలకు కలర్‌ఫుల్‌ దుస్తులతో ఆడవారు కన్పించే తీరు కన్నుల పండుగగా ఉంటుంది. వేడుకలు, ఉత్సవాలలో సంప్రదాయ దుస్తులను ధరించడానికి ఇష్టపడతాను. – డాక్టర్‌ సోనికా రాథోడ్‌

పెద్దల బాటలో...
గిరిజన సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. వివాహాలు, ఇతర శుభ కార్యాక్రమాలలో సాంప్రదాయ దుస్తులు తప్పకుండా వేసుకోవాలి. అప్పుడు మన సంస్కృతి, సాంప్రదాయాన్ని పెద్దలు చూపిన మార్గాన్ని అనుసరించిన వారం అవుతాం. – పద్మ, సేవాలాల్‌ సేనా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement