lambada leaders
-
మాదిగ.. లంబాడా.. రెండు బెర్తులు!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ఇప్పుడు కేబినెట్ బెర్తుల ఫీవర్ పట్టుకుంది. మాదిగ, లంబాడా వర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే నెల మూడో తేదీన జరుగుతుందని భావిస్తున్న మంత్రివర్గం విస్తరణలో స్థానం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఫలానా ఎమ్మెల్యేలు మంత్రులయ్యే అవకాశాలున్నాయనే వార్తలు రావడం, తమ వర్గాలకు చెందిన పేర్ల ప్రస్తావన లేకపోవడంతో వారు అప్రమత్తమయ్యారు. తామెవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, అయితే ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన మాదిగ, లంబాడా వర్గాలకు కచి్చతంగా అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి మాదిగ, లంబాడా ఎమ్మెల్యేలు లేఖలు రాయగా, గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసేందుకు మాదిగ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాదిగ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు..? ‘రాష్ట్రంలో 32.33 లక్షల మంది మాదిగ కులస్తులున్నారని 2011 జనగణనలో వెల్లడైంది. ఆ తర్వాత మరో 15 లక్షల మంది జత కలిశారు. మేమంతా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా, అండగా ఉంటున్నాం. అయితే ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వు అయిన నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా మాదిగ కులస్తులకు ఇవ్వలేదు. ఆయా జిల్లాల్లో మాదిగ జనాభానే ఎక్కువ ఉంటుంది. అందువల్ల త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మా సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే మాకు తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చినట్టవుతుంది. మాదిగ సామాజిక వర్గానికి తెలంగాణ కేబినెట్లో మరో అవకాశం ఇవ్వండి..’అని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు రాసిన లేఖలో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను బుధవారం అసెంబ్లీ లాబీల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు అందజేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన వీరు లేఖ ప్రతిని అందజేశారు. మంత్రి పదవితో బంధం మరింత బలోపేతం మాదిగ ఎమ్మెల్యేల బాటలోనే లంబాడా ఎమ్మెల్యేలు కూడా లేఖాస్త్రం సంధించారు. తమ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఎన్. బాలూనాయక్, జె.రామచంద్రునాయక్, ఎం.రాందాస్‌నాయక్, బి.మురళీనాయక్‌లు అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఇటు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేలోనే తెలంగాణలో లంబాడాల జనాభా 32.20 లక్షలుగా వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 72 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 శాతానికి పైగా లంబాడా ఓటర్లున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి లంబాడా సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్లో లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి. తద్వారా లంబాడాల ఆకాంక్షను గుర్తించాలి. కేబినెట్లో స్థానం కల్పించడం ద్వారా మా వర్గ ప్రాధాన్యతలను అసెంబ్లీలో, ప్రభుత్వంలో వినిపించే అవకాశం ఉంటుంది. లంబాడాలు, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతమవుతుంది..’అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీతో పాటు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను బుధవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్లో ఆయన్ను కలిసి అందజేశారు. -
... అద్దాల అందం
‘నిన్నటి ఆధునిక కళ నేటి సంప్రదాయ కళ’ అంటారు. కొన్ని దశాబ్దాల వెనక్కి వెళితే....లంబాడ గిరిజనుల సంప్రదాయ వస్త్రాధారణ కన్నుల పండగగా ఉండేది. ఇప్పుడు ఎక్కడో తప్ప సంప్రదాయ దుస్తులు ధరించే వారు కనిపించడం లేదు. ఇక సంప్రదాయ వస్త్రధారణ అనేది నిన్నటి కళేనా? ‘కానే కాదు’ అంటుంది బాలమణి. ఎనభై సంవత్సరాల బాలమణి పాతతరం ప్రతినిధి. ‘అయ్యో...మా కళలు మాకు దూరం అవుతున్నాయే’ అని నిట్టూర్చేది ఒకప్పుడు. ఇప్పుడు ఆమెలో నిన్నటి నిట్టూర్పు లేదు. ‘ఇదిగో మా కళలు మళ్లీ మా దగ్గరికి వస్తున్నాయి’ అనే సంతోషం ఆమె కళ్లలో మెరుస్తుంది....కల్చరల్ ఐడెంటిటీగా భావించే ‘లంబాడీ ఎంబ్రాయిడరీ’కి మళ్లీ ప్రాధాన్యత పెరిగింది. సేవాలాల్, మేరీమా, పన్నీ భవానీ పూజలు, తీజ్...మొదలైన పండగలకు సంప్రదాయ దుస్తులు వేసుకోవడం తప్పనిసరిగా మారింది. ప్రత్యేక కార్యక్రమాల్లో సెలబ్రిటీలు కూడా బంజార సంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారు. దీంతో వీటిని రూ. 30వేల నుండి రూ. 2లక్షల వరకు ఖర్చుపెట్టి మరీ తయారు చేయించుకుంటున్నారు.సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ పాటల చిత్రీకరణకు ఈ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.మహిళలు వేసుకునే సంప్రదాయ దుస్తులను పేట్యి, పేట్, గుంగుటో, కాంట్లీపేటీ, పులియ, గున్నో ...ఇలా ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తారు. వారు ధరించే ఆభరణాలు టోబ్లీ(చెవులకు పెట్టుకునేవి), హస్లీ(మెడలో వేసుకునే కడియం), వాంగ్డీ, కస్తులు( కాళ్లకు వేసుకునే వంకులు), హారం( రూపాయి బిల్లలను అతికించి వెండితో తయారు చేసే ఆభరణం) బల్యా(గాజులు)లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పట్కారి వారు వీరికి దుస్తులు, ఆభరణాలు, అలంకరణ వస్తువులు తయారుచేస్తుంటారు.బాలమణికి, సోనియా రాథోడ్‌కి ఎన్నో తరాల దూరం ఉంది. అయితే సంప్రదాయ కళల పట్ల వారి అభిరుచి విషయంలో మాత్రం ఎలాంటి దూరం లేదు. ఒకరు తమ తరం కళను ఈతరంలో చూసుకోవాలనుకుంటున్నారు. మరొకరు అలనాటి సంప్రదాయ కళలకు వారధిగా ఉండాలనుకుంటున్నారు.ఒకరిది ఆశావాదం. మరొకరిది ఆ ఆశావాదాన్ని ఆచరణలో తీసుకొచ్చి పూర్వ కళలకు అపూర్వ వైభవాన్ని తీసుకువచ్చే నవ చైతన్యం.– ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్అద్దాల రవిక అందమే వేరు!నాకు 80 సంవత్సరాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి మా అమ్మానాయినలు, తర్వాత అత్తామామలు లంబాడ దుస్తులు తయారీ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. రెండు రూపాయిలకు రవిక కుట్టడం నుంచి నాకు తెలుసు, రవికలు, అద్దాలు, రంగు రంగుల అతుకులతో పేటీలు కుట్టి ఇస్తే వాళ్ల ఇండ్లల్లో పండే ప్రతీ పంట మాకు పెట్టేవాళ్లు. కాలం మారింది. ఇప్పుడు మాతోపాటు, ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని కుడుతున్నారు. ఏ బట్టలు వేసుకున్నా రాని అందం అద్దాల రవికతో వస్తుంది – బాలామణికలర్ఫుల్గా!నాకు చిన్నప్పటి నుండి మా సంస్కృతి సంప్రదాయాలంటే బాగా ఇష్టం. మా తండాలో ఉత్సవాలు జరిగినప్పుడు అందరం సంప్రదాయ దుస్తులు వేసుకుంటాం. తీజ్తో సహా ఇతర పండుగలకు కలర్‌ఫుల్ దుస్తులతో ఆడవారు కన్పించే తీరు కన్నుల పండుగగా ఉంటుంది. వేడుకలు, ఉత్సవాలలో సంప్రదాయ దుస్తులను ధరించడానికి ఇష్టపడతాను. – డాక్టర్ సోనికా రాథోడ్పెద్దల బాటలో...గిరిజన సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. వివాహాలు, ఇతర శుభ కార్యాక్రమాలలో సాంప్రదాయ దుస్తులు తప్పకుండా వేసుకోవాలి. అప్పుడు మన సంస్కృతి, సాంప్రదాయాన్ని పెద్దలు చూపిన మార్గాన్ని అనుసరించిన వారం అవుతాం. – పద్మ, సేవాలాల్ సేనా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు -
దళిత బంధు మాదిరిగా తమకు నిధులు విడుదల చేయాలి : లంబాడా నేతలు
-
హామీలు నెరవేర్చకుంటే గద్దె దింపుతాం
పరిగి వికారాబాద్ : గిరిజనులకిచ్చిన హామీలు నెరవేర్చకుంటే కేసీఆర్‌ను గద్దె దింపుతామని గిరిజన చైతన్య వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ కరాటే రాజు నాయక్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు సంపత్ నాయక్ అన్నారు. పరిగి మార్కెట్ యార్డులో గిరిజన చైతన్య యాత్ర జిల్లా సదస్సును మంగళవారం నిర్వహించారు. అంతకు ముందు ఆ సంఘం నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల పకడ్బందిగా అమలుచేయడం ద్వారా గిరిజన అభ్యున్నతికి బాటలు వేయాలన్నారు. లంబాడాలను మోసం చేస్తే తండాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. దేశంలోని ఒకే ఆచారం, ఒకే సాంప్రదాయం, ఒకే సంస్కృతి కలిగిన లంబాడాలనందరిని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో పాటు మూడెకరాల భూమి పంపిణీ హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. లంబాడా ఆదివాసీల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తున్న కుట్రలకు మోసపోవద్దని వారు పిలుపునిచ్చారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవుదినంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబో యే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని తండాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకుందామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన చైతన్య యాత్ర ఆయా జిల్లాల కో ఆర్డినేటర్లు, నా యకులు గోవింద్‌నాయక్, గట్టెనాయక్, శంకర్‌నాయక్, సేవ్యానాయక్, శ్రీనివాస్, గోపాల్, పరశురామ్, సూర్యా, నెహ్రూనాయక్ పాల్గొన్నారు. -
గవర్నర్‌ను కలిసిన లంబాడి హక్కుల నేతలు
హైదరాబాద్ : ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు అయ్యేలా చూడాలని లంబాడి హక్కుల సమితీ గురువారం గవర్నర్‌ను కలసి విజ్ఞప్తి చేసింది. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుతోపాటు ఒన్ ఆఫ్ 70 యాక్ట్టు వంటి వాటిని వెంటనే అమలు అయ్యేలా చూడాలని వారు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. గవర్నర్‌ను కలిసిన బృందంలో గిరిజన నేతలు బలరాం నాయక్, రవీంద్రనాయక్, బెల్లానాయక్ ఉన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా పలు హామీలు మ్యానిఫెస్టోలో పొందు పరిచిన సంగతి తెలిసిందే. వాటిని అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది. ఈ క్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి నేతలు గవర్నర్‌ను కలిశారు.