డెంగీ, జికా, మలేరియా, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధులు ఇవే. ఈ వ్యాధులన్నింటికీ మూలకారణం దోమల సంతతి విపరీతంగా పెరిగిపోవడమే. ఇలా దోమలు పెరిగిపోవడానికి, పర్యావరణంలో వస్తున్న మార్పులకి సంబంధం ఉందట. మానవ చరిత్రలో తిమింగలం కంటే ప్రమాదకరమైనది దోమేనని ప్రముఖ చరిత్రకారిణి తిమొతి వైన్‌గార్డ్ కొత్త పుస్తకంది మస్కిటో.. ఏ హ్యూమన్ హిస్టరీ ఆఫ్ అవర్ డెడ్లీయస్ట్ ప్రిడేటర్ పుస్తకంలో వెల్లడించారు. ఇందులో దోమలు ప్రపంచ దేశాలకు విస్తరించడానికి, వాతావరణంలో వస్తున్న మార్పులకి సంబంధం ఉందని విశ్లేషించారు.
100 దేశాలకు డెంగీ...
వాతావరణంలో వస్తున్న మార్పులు దోమల కారణంగా విస్తరించే వ్యాధులు అనే అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో డెంగీ మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా దక్షిణ యూరప్ దేశాల్లో వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల కారణంగా దోమలు పెరిగిపోయి డెంగీ వ్యాధి ప్రబలుతోందని ఆ అధ్యయనానికి నేతృత్వం వహించిన యాకూబ్ చెప్పారు. ‘భూమి వాతావరణం వేడెక్కిపోతున్న కొద్దీ దోమల సంఖ్య పెరిగిపోతుంది. ఆడదోమలు గుడ్లు పెట్టడానికి వేడి పరిస్థితులు ఉండాలి. వాతావరణం పొడిబారిపోవడం, కాలం కాని కాలంలో వర్షాలు, అడ్డగోలుగా పట్టణీకరణ వంటి కారణాలతో దోమలు ఎక్కువైపోతున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో దోమలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఉంది’అని ఆయన వెల్లడించారు. 1970కి ముందు కేవలం 10 దేశాల్లో మాత్రమే డెంగీ వ్యాధి ఉండేది. ఇప్పుడు 100కిపైగా దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఆ్రస్టేలియా, కండోడియా, చైనా, బంగ్లాదేశ్, మలేసియా వంటి దేశాల్లో డెంగీ వ్యాధి బాగా విస్తరించింది.
200 కోట్లకు బాధితులు
గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల్ని అదుపు చేయలేకపోతే వాతావరణంలో వస్తున్న 17 మార్పుల కారణంగా 2050 నాటికి ప్రపంచంలో సగం జనాభా ఉండే ప్రాంతాల్లో దోమలు బాగా వృద్ధి చెందుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి డెంగీ సహా వివిధ రకాల వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి సోకే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.
జీవో కవచం...
దోమలు మన రక్తం వాసనని పసిగట్టి కుట్టడానికి మీదకి వస్తాయి. ఈ రక్తం వాసనని పసిగట్టకుండా దోమల్ని నివారించడానికి గ్రాఫిన్ ఆక్సైడ్ (జీవో) అనే అతి సన్నని పదార్థంతో తయారు చేసిన రక్షణ కవచాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అందుబాటులోకి తేనున్నారు. గ్రాఫిన్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అణుపరిమాణం అంత సన్నగా ఉంటుంది. రబ్బరులా సాగే గుణం, ఉక్కు కంటే 200 రెట్లు గట్టిగా ఉంటుంది, రాగి కంటే సుల భంగా దేనితోనైనా కలిపేసే అవకాశం కూడా ఉంది. గ్రాఫిన్‌తో అభివృద్ధి చేసిన అతి పల్చటి కవచం దోమలు మనిషి ఒంటిపై రసాయనాలు గుర్తించకుండా కాపాడుతుందని బ్రౌన్ వర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ రాబర్ట్ హర్ట్ వెల్లడించారు. అన్నింటికంటే ముఖ్యంగా ఎలాంటి రసాయనాలు వాడకుండా దోమకాటు నుంచి తప్పించుకోవచ్చన్నారు.
మీకు తెలుసా?...
- దోమ ఒక్కసారి కాటుతో 0.001 నుంచి 0.1 ఎంఎల్ రక్తాన్ని పీలుస్తుంది.
- దోమలు వాటి బరువు కంటే మూడు రెట్లు ఎక్కువ రక్తాన్ని పీలుస్తాయి.
- మగ దోమలు శాకాహారులు. ఆడదోమలు మాత్రమే మనుషుల్ని కుడతాయి. ఎందుకంటే ఆడదోమలు గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్లు మనుషుల రక్తం నుంచే తీసుకుంటాయి.
- ‘ఓ’గ్రూప్ రక్తం ఉన్న వారిని దోమలు ఎక్కువగా కుడతాయి.
- ప్రపంచంలో ఐస్‌ల్యాండ్ మాత్రమే దోమలు లేని దేశం.
- మానవ శరీరంలో రక్తాన్ని అంతా 12 లక్షల దోమలు పీల్చగలవు.
- దోమలు వాసనల్ని పసిగడతాయి. కొన్ని రకాల వాసనలకు అవి దూరంగా ఉంటాయి. తులసి ఆకులు, నిమ్మకాయలు, వెల్లుల్లి, బంతిపూల వాసన వస్తే దోమలు దూరంగా పారిపోతాయి.
- ఆడదోమలు ఒకేసారి 300 గుడ్లు పెట్టగలవు.
- దోమల జీవిత కాలం 2 నెలలలోపే. మగ దోమలు 10 రోజులు, ఆడదోమలు 6 నుంచి 7 వారాలు జీవించి ఉండగలవు.
Comments
Please login to add a commentAdd a comment