ఏలూరు : జిల్లాపై డెంగీ పంజా విసిరింది. ఇటీవల ఒక్కరోజే జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు డెంగీ జ్వరాల బారిన పడడం రాబోయే ప్రమాదానికి సంకేతంగా భావించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా జిల్లా అంతటా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాల పట్ల ఒక పక్క హర్షం వ్యక్తం అవుతుంటే మరోపక్క నానాటికీ పెరుగుతున్న జ్వరాల వ్యాప్తితో ప్రజానీకం మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే జిల్లాను టైఫాయిడ్, మలేరియా తదితర జ్వరాలు పీడిస్తుండగా తాజాగా జిల్లాపై డెంగీ పంజా విసురుతోంది. పలువురిని ఆసుపత్రుల పాలు చేస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో అంతంత మాత్రంగా ఉండే పారిశుద్ధ్యం ఈ వర్షం ధాటికి మరింత అధ్వానంగా తయారైంది. దాంతో గ్రామీణులను వ్యాధుల భయం వణికిస్తోంది. జిల్లాలోని ప్రతి మండలంలో పారిశుద్ధ్య లోపం కారణంగానే వ్యాధులు ప్రబలుతున్నాయి. వాస్తవానికి ఈ రోగాల నివారణకు కేవలం ఒక్క వైద్యారోగ్య శాఖాధికారులు మాత్రమే స్పందిస్తే సరిపోదు. గ్రామీణ నీటి సరఫరా శాఖ, పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖలు సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే ఈ రోగాలను ఆదిలోనే నివారించే అవకాశం ఉంది.
శాఖల మధ్య కొరవడిన సమన్వయ లోపం
జిల్లా వ్యాప్తంగా పంచాయతీ, గ్రామీణ తాగునీటి సరఫరా, పురపాలక, వైద్యారోగ్యశాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. అయితే ఈ శాఖలు సమన్వయంతో కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే వైద్యారోగ్యశా>ఖాధికారులదే లోపం అన్నట్లుగా ఇతర శాఖలు భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి వర్షాకాలానికి అనుగుణంగా వైద్యారోగ్య శాఖాధికారులు పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉంచారు. వైద్యులను, సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేశారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కలుషిత తాగునీటి సమస్యలను పూర్తిగా తొలగించి పరిశుభ్రమైన తాగునీరు అందుతుందో లేదో అనే విషయాన్ని మానిటర్ చేయాలి. పైపులైన్లు లీకేజీ వంటి వాటిని పూర్తిస్థాయిలో నివారించాలి. అదే విధంగా గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు పరిశుభ్రమైన నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యసేవలు అందించేందుకు నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. అయితే జిల్లాలో మాత్రం శాఖల మధ్య సమన్వయం లోపించి ఎవరి బాధ వారే పడతారనే రీతిలో విధులు నిర్వహిస్తున్నారు.
నెలల వ్యవధిలో మూడు డెంగీ కేసులు
మే నెలలో పెదవేగి మండలం రాయన్నపాలెంలో ఒక డెంగీ కేసు నమోదు అయితే సోమవారం ఒక్కరోజే జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఒక డెంగీ కేసు, అదే విధంగా ఎల్‌బి చర్ల సారవ గ్రామంలో మరో డెంగీ కేసు నమోదైంది. పారిశుద్ధ్య లోపం కారణంగానే జిల్లాలో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయనేది స్పష్టం అవుతోంది. వర్షాకాలం ప్రారంభంలోనే మూడు డెంగీ కేసులు నమోదయితే వర్షాలు మరింత ముదిరితే ఈ కేసులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్, కె.కోటేశ్వరి ఇప్పటికే డెంగీ లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వారికి అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు.
అప్రమత్తం కాకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది
జిల్లాలో ఆయాశాఖలు, ముఖ్యంగా వైద్యారోగ్యశాఖాధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా వ్యాప్తి చెందుతోంది. దీన్ని నివారించడంలో ఏజెన్సీలో చూపిస్తున్న శ్రద్ధ ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర రోగాలపైనా చూపించకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.
వైద్యాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశాం
జిల్లాలో ఒకే రోజు రెండు డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్యాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశాం. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎవరైనా జ్వరపీడితులు ఉంటే వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆధికారులను సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం. పాజిటివ్ కేసుల్లో బాధితులను జిల్లా ఆసుపత్రులకు తరలించి పూర్తిస్థాయిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. తాగునీరు కలుషితం కాకుండా గ్రామీణ నీటి సరఫరా శాఖ, గ్రామ పంచాయతీలతో సమన్వయం చేసుకుని పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో జ్వరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చాం.
– డాక్టర్ కె. కోటేశ్వరి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
‘పశ్చిమ’పై ‘డెంగీ’ పంజా
Published Thu, Jul 20 2017 2:50 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM
Advertisement