డెంగీపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
అనంతపురం అర్బన్ :
‘వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి. పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి. డెంగీ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించండి’ అని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ నుంచి డెంగీ వ్యాధి, గృహ నిర్మాణం, నీరు - ప్రగతి పనులపై వేర్వేరుగా ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రతి నాల్గో శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. ఆర్‌ఎంపీలు జ్వరంతో వచ్చిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేయాలని, అలా కాకుండా వైద్యం అందిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్‌టీఆర్ గ్రామీణ, పట్టణ గృహ పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల తీరు సక్రమంగా లేదన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 11,487 ఇళ్లు గ్రౌండింగ్ చేశారని, 2,285 మాత్రమే పూర్తి చేశారని, పట్టణాల్లో 2,590 గ్రౌండింగ్ చేశారని, 153 మాత్రమే పూర్తి చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామసభలు నిర్వహించి 2017 - 18, 2018 - 19 సంవత్సరాలకు లబ్ధిదారులను వారం రోజుల్లోగా ఎంపిక చేయాలని ఆదేశించారు. నీరు - ప్రగతి కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. టెండర్ల ద్వారా చేపట్టాల్సిన పనులకు సంబంధించి వారంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. సమావేశంలో జేసీ - 2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఇరిగేషన్ ఎస్‌ఈ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.