డెంగీ పంజా!
డెంగీ పంజా!
Published Thu, Oct 20 2016 5:28 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
* జిల్లాలో 15 మంది మృత్యువాత
* జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిట
* గుంటూరు జీజీహెచ్‌లో ఒక్కరోజే 11 డెంగీ పాజిటివ్ కేసులు
* దోమలపై దండయాత్ర ఆర్భాటమేనా!
డెంగీ మహమ్మారి దెబ్బకు జిల్లావాసులు విలవిల్లాడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో జనం విషజ్వరాలతో బాధపడుతూ మంచాలపై మూలుగుతున్నారు. మీరెన్ని దండయాత్రలైనా చేసుకోండి... మా పని మేము కాని చేస్తామన్న రీతిలో దోమల దండు విజృంభిస్తోంది. జిల్లాలో డెంగీ బారిన పడి ఇప్పటివరకు సుమారు 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.
సాక్షి, గుంటూరు : రోజురోజుకూ పెరుగుతున్న డెంగీ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు 11,078 మంది జ్వర పీడితులకు రక్తపరీక్షలు చేయగా.. 1,546 మందికి డెంగీ పాజిటివ్ ఉన్నట్లు నిర్థారించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న మెడాల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వానికి అధికారికంగా ఇచ్చిన నివేదిక ఇది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఈ ఏడాది జనవరి నుంచి నేటివరకు 175 డెంగీ కేసులు, 269 మలేరియా కేసులు మాత్రమే నమోదైనట్లు కాకి లెక్కలు చెబుతున్నారు. జిల్లాలో 169 హైరిస్క్ ప్రాంతాలను ప్రకటించినప్పటికీ డెంగీ ప్రబలకుండా తగు నివారణ చర్యలు చేపట్టడంలో వైద్య శాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఈ నెల 15వతేదీన 40 మంది జ్వరంతో బాధపడుతూ ఆపత్రిలో చేరగా.. 22 మందికి డెంగీ ఉన్నట్లు అనుమానించారు. వీరిలో 11 మందికి డెంగీ పాజిటివ్ ఉందని ధ్రువీకరించారు. 16న 11 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంఈకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఒక్క జీజీ హెచ్‌లోనే రోజుకు పదికి పైగా డెంగీ కేసులు నమోదవుతుంటే జిల్లా వ్యా ప్తంగా వీరి సంఖ్య ఏ స్థాయిలో ఉం టుందో అర్థం చేసుకోవచ్చు. డెంగీని నిర్థారించాలంటే గుంటూరు వైద్య కళాశాలలో ఉన్న మైక్రోబయాలజీ వార్డుకు సీరంను పంపి ఎలిసా పరీక్ష చేయాలి. ఈ తతంగమంతా పూర్తయి డెంగీ నిర్థారణ కావాలంటే వారానికి పైగా పడుతుండడంతో ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు ఈ ల్యాబ్‌కు సీరంను పంపేందుకు వెనుకాడుతున్నారు.
అధ్వానంగా పారిశుద్ధ్యం..
జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, గుంటూరు నగరంతో సహా అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలపై దండయాత్ర పేరుతో హడావుడి చేయడం మినహా అధికారులు ఏమీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డెంగీ, మలేరియా సంచార వాహనాల పేరుతో మొబైల్ వాహనాలను తిప్పుతున్నారు. కనీసం ఫాగింగ్ కూడా చేయకపోవడంతో జనం రోగాల బారిన పడుతున్నారు.
డెంగీతో చనిపోయింది ఇద్దరే..
జిల్లాలో 175 డెంగీ కేసులు, 269 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు డెంగీతో తాడేపల్లి, ఫణిదం గ్రామాల్లో ఇద్దరు మాత్రమే చనిపోయారు. మెడాల్ సంస్థ స్ట్రిప్ ఆధారంగా డెంగీ పాజిటివ్ కేసులు నిర్ధారించారు. ఎలిసా టెస్ట్ ద్వారా మాత్రమే డెంగీని పక్కాగా నిర్థారించవచ్చు. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో డెంగీ నివారణ చర్యలు చేపట్టాం.
– డాక్టర్ పద్మజారాణి, డీఎంహెచ్‌వో
Advertisement
Advertisement