
అనంతపురం న్యూసిటీ: ఓ వైపు తీవ్ర జ్వరం (107సెంటీగ్రేడ్). మరో వైపు చివరి పరీక్ష. పరీక్ష రాసిన తర్వాత వైద్యం తీసుకుందామనుకున్న ఆ అమ్మాయి...పరీక్ష హాల్‌లోనే కుప్పకూలి పోయింది. తోటి విద్యార్థినులు హుటాహుటీన సర్వజనాస్పత్రికి తరలించినా కోలుకలేక మృత్యుపడింది. వివరాల్లోకి వెళితే...మడకశిరలోని అమరాపురం మండలం రంగాపురం గ్రామానికి చెందిన కేఎన్ లక్ష్మణమూర్తి, శాంతమ్మల కూతురు ఎం.భవ్య (21) నగరంలోని ఆదర్శ నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. శుక్రవారం ఓబీజీ పరీక్ష రాసేందుకు వైద్య కళాశాలకు వచ్చింది. అయితే పరీక్ష కేంద్రంలో భవ్యకు ఫిట్స్ వచ్చాయి. నోటిలో నురుగ వస్తూ ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడింది.
దీంతో తోటి విద్యార్థులు కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి రక్త పరీక్షలకు సిఫార్సు చేశారు. ప్లేట్‌లెట్స్ 29,000 మాత్రమే ఉండడం... సెలైన్ పెట్టిన ప్రాంతంలో రక్తం రావడంతో వైద్యులు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాసనందించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కోలుకోని భవ్య మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతి చెందింది. దీంతో భవ్య స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. ఆదర్శ కళాశాల యాజమాన్యం భవ్య తండ్రి కేఎన్ లక్ష్మణమూర్తికు సమాచారం అందించగా...ఆమె పెద్దనాన్న నాగరాజు అనంతపురం వచ్చి మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లారు. తలలో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్ లెట్స్ తక్కువగా ఉండడంతోనే భవ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, భవ్య వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోందని స్నేహితులు చెబుతున్నారు.