గోదావరి పరీవాహక ప్రాంతంలో విజృంభిస్తున్న డెంగీ, విషజ్వరాలు  | Dengue and toxic fevers are rampant in the Godavari basin | Sakshi
Sakshi News home page

గోదావరి పరీవాహక ప్రాంతంలో విజృంభిస్తున్న డెంగీ, విషజ్వరాలు 

Published Fri, Sep 15 2023 4:23 AM | Last Updated on Fri, Sep 15 2023 5:15 PM

Dengue and toxic fevers are rampant in the Godavari basin - Sakshi

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఊరి పేరు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని ప్రేమ్‌నగర్‌. ఈ గ్రామ జనాభా 300 మంది కాగా, వీరిలో 50 మందికిపైగా జ్వరాలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం ఇక్కడ 30 మంది జ్వరాల బారిన పడగా, గ్రామానికి చెందిన యువకుడు అవినాష్‌ రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఇదే గ్రామంలో తీవ్ర జ్వరంబారిన పడిన ఒకే కుటుంబానికి చెందిన రాంసింగ్, ఓంసింగ్, శారన్‌భాయ్‌లను కుటుంబసభ్యులు బుధవారం మెరుగైన వైద్యానికి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడా గ్రామం జ్వరాలతో విలవిల్లాడుతోంది.  

సాక్షిప్రతినిధి, వరంగల్‌: జూలై ,ఆగస్టు మాసాల్లో కురిసిన ఎడతెరపి లేని వర్షాలు గోదావరి పరీవాహక ఏజెన్సీ పల్లెలను కుదిపేశాయి. ఇప్పుడా ప్రాంతాలను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా మొదలు భద్రాద్రి కొత్తగూడెం వరకు అనేక గ్రామాలు డెంగీ, మలేరియాల వలయంలో బిక్కుబిక్కుమంటున్నాయి. ఎంజీఎం ఆస్పత్రి పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల పేషెంట్లతో కిటకిటలాడుతోంది. ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ఇప్పటికే ఎనిమిదిమంది వృద్ధులు, మహిళలు, బాలురు మృత్యువాత పడగా, 15 నుంచి 25 రోజులైనా తగ్గని జ్వరాలతో జనం ఆందోళన చెందుతున్నారు.  

ఇంటింటా జ్వరపీడితులే...

  • వర్షాలు, వరదలతో అతలాకుతలమైన జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలు.. ఇప్పుడు డెంగీ, మలేరియా, విషజ్వరాలతో విలవిలలాడుతున్నాయి. మహా ముత్తారం, గణపురం, తాడిచర్ల, రేగొండ, కాటారం, మొగుళ్లపల్లి పీహెచ్‌సీల్లో రోజుకు 150 నుంచి 250 మంది ఔట్‌పేòÙంట్లుగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.  
  • ములుగు జిల్లా వెంకటాపురం, మంగపేట, వాజేడు, ఏటూరునాగారం మండలాల్లోని పల్లెలు మంచం పట్టాయి. జిల్లాలో గత జనవరి నుంచి  51 మలేరియా, 18 డెంగీ కేసులు నమోదయ్యాయి.  
  • పెద్దపల్లి జిల్లా మంథని, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం తదితర మండలాల్లోని 39 గ్రామాల్లో డెంగీ, విషజ్వరాలు జనాలను జడిపిస్తున్నాయి. ముత్తారం మండలంలో బేగంపేటకు చెందిన ఓ మహిళ మృతి చెందగా... డెంగీ బాధితుల సంఖ్య 89కి చేరినట్టు అధికారులు ప్రకటించారు.
  • మహబూబాబాద్‌ జిల్లా గూడూరు, దంతాలపల్లి, మరిపెడ, కొత్తగూడ, గంగారం, కేసముద్రం, గార్ల తదితర మండలాల్లో డెంగీ, విషజ్వరాలు జడలు విప్పాయి.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, విషజ్వరాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా 162, డెంగీ 273, విషజ్వరాలు 2,35,835 కేసులు నమోదయ్యాయి.  

ఈ ఫొటోలో ఉన్న బాబు పేరు వర్షిత్‌కుమార్‌. ములుగు జిల్లా మంగపేట. రెండు రోజులనుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటున్నాడు. మలేరియా పాజిటివ్‌ వచి్చంది. రక్తం చాలా తక్కువ ఉందని వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకున్నారు. తల్లి రమ్య పక్కనే ఉంటూ సపర్యలు చేస్తోంది. 

వారం రోజులుగా జ్వరం తగ్గడం లేదు 
మాది ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట. నేను మూడు నెలల గర్భవతిని. వారం రోజుల నుంచి జ్వరం వస్తోంది. తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చా. చాలా నీరసంగా ఉంటోంది. – సరిత, రమణక్కపేట, ములుగు జిల్లా 

ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు
ఇద్దరు మహిళలు, డెంగీతో ఆరు నెలల పాప మృతి
వాజేడు/కన్నాయిగూడెం:
ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని (35),  ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌లో నివాసి మనీష (30) విషజ్వరంతో మృతిచెందారు. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప కూడా డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement