మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో డెంగ్యూ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో డెంగ్యూ బారిన పడి 1000 మందికి పైగా మరణించగా, రెండు లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. అల్ జజీరా నివేదిక తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్‌లో 2023లో డెంగ్యూ జ్వరం కారణంగా 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదికంటే ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లు ఎక్కువని ఆ నివేదిక పేర్కొంది.
2023 మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి నుండి సెప్టెంబర్ వరకు) కనీసం 1,017 మంది మరణించారని నివేదిక పేర్కొంది. దాదాపు 2,09,000 మంది వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 2000 మంది రోగులు రెండోసారి ఈ వ్యాధి బారిన పడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. బంగ్లాదేశ్‌లోని పలు ఆసుపత్రులు డెంగ్యూ బాధితులతో నిండిపోయాయి. మరోవైపు బాధితులకు సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
జనసాంద్రత అధికంగా ఉన్నఈ దక్షిణాసియా దేశంలో డెంగ్యూ వేగంగా విస్తరిస్తోంది. డెంగ్యూ అనేది ఉష్ణమండల ప్రాంతాలలో కనిపించే వ్యాధి. అధిక జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల నొప్పి, రక్తస్రావం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్, జికా వంటి దోమల వల్ల వచ్చే వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అందించే టీకా లేదా మందు ఇంతవరకూ అందుబాటులో లేదు. డెంగ్యూని వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టి దోమ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వృద్ధి చెందుతుంది. అందుకే మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.
ఇది కూడా చదవండి: అమెజాన్‌లో వందల డాల్ఫిన్ల మృతదేహాలు ఎందుకు తేలుతున్నాయి?
Comments
Please login to add a commentAdd a comment