వ్యాధులపై ఆందోళన చెందవద్దు | Etela Rajender Open Free Medical Camp in Dammaiguda | Sakshi
Sakshi News home page

వ్యాధులపై ఆందోళన చెందవద్దు

Published Thu, Sep 5 2019 11:04 AM | Last Updated on Thu, Sep 5 2019 11:04 AM

Etela Rajender Open Free Medical Camp in Dammaiguda - Sakshi

డెంగీ నివారణకు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు రాజేందర్, మల్లారెడ్డి, మేయర్‌ రామ్మోహన్, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి

కీసర: డెంగీ జ్వరాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. బుధవారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సాయిభవాని గార్డెన్‌లో డెంగీ, మలేరియా తదితర సీజనల్‌ జ్వరాలపై అవగాహన కల్పించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మరో మంత్రి మల్లారెడ్డితో కలిసి పాల్గొన్న ఈటల మాట్లాడుతూ.. మంగళవారం తాను నల్లకుంట ఫీవర్, నిలోఫర్‌ ఆస్పత్రిలో పర్యటించానని, అక్కడి రోగులతో మాట్లాడితే  నలుగురు దమ్మాయిగూడకు చెందినవారిమని చెప్పారన్నారు. దీంతో వెంటనే ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న కేసుల్లో వైరల్‌ ఫీవర్స్‌ అధికంగా ఉన్నాయని, ఈ జ్వరాలను కూడా డెంగీగా భావించి ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వెనువెంటనే వైద్యసేవలు అందేలా సౌకర్యాలు కల్పించామని ఆయన వివరించారు.

ఈ సీజన్‌లో ఇప్పటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా 650 ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి 51 వేల మందికి వైద్య పరీక్షలు చేయగా అందులో 61 మందికి మాత్రమే డెంగీ నిర్థారణ అయిందన్నారు. జవహర్‌నగర్, దమ్మాయిగూడ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరికీ వైద్యపరీక్షలు, అవసరమైన మందుల పంపిణీ చేసేవరకు వైద్య శిబిరాలను నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాస్‌కు సూచించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా కొంత మేర రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఆష్కారం ఉందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. జవహార్‌నగర్‌ చెత్త డంపింగ్‌ యార్డు సమీపంలో ఉన్న దమ్మాయిగూడ మున్సిపాలిటీలో స్థానిక అధికారులు క్రమం తప్పకుండా పారిశుధ్య నిర్వహణతో పాటు, దోమల నివారణకు ఫాగింగ్‌ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 100 మందిని నెలరోజుల పాటు నియమించి పనులు చేయాలని కమిషనర్‌ రామలింగానికి సూచించారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులందరికీ  డెంగీ, మలేరియాపై అవగహన కల్పిండచంతో పాటు, హోమియో మందులను పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రులు విద్యార్థులకు డెంగీ, మలేరియా జ్వరాలు రాకుండా హోమియో మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లింగరాజు, రామంతాపూర్‌ ఆయుర్వేదిక్‌ ఆస్పత్రి వైద్యులు వెంకటయ్య, ఉమా మహేశ్వర్‌రావు, కీసర ఆయుర్వేదిక్‌ వైద్యాధికారి శ్రీదేవి, ఎంపీపీ మల్లారపు ఇందిర తదితరులు పాల్గొన్నారు. 

జ్వరాల నియంత్రణకు చర్యలు
రామంతాపూర్‌: వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌ జ్వరాలు ప్రబలుతున్నాయని, సీఎం ఆదేశాల మేరకు పట్టణ, గ్రామీణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. డెంగీ జ్వరాలు రాకుండా వాడే హోమియో మందుల ఉచిత పంపిణీ శిబిరాన్ని బుధవారం రామంతాపూర్‌ ప్రభుత్వ హోమియో బోధనాస్పత్రిలో ఆయన మేయర్‌ బొంతు రామ్మోహన్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. డెంగీ జ్వరాలపై ప్రజలు అపోహలు పెంచుకోవద్దని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 105 బస్తీ దవాఖానాలతో పాటు ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ ఆస్పత్రులలో సెలవు, పండగ దినాల్లో సైతం ఉదయం, సాయంత్రం కూడా ఓపీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా డెంగీ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. మంత్రుల వెంట ఆయూష్‌ అడిషనల్‌ డైరెక్టర్, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ లింగరాజు, కార్పొరేటర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement