సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రకు గోదావరి నీటినిచ్చే విషయంపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలతో ఉత్తర తెలంగాణ రైతాంగం ఆందోళనలో ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వేరే రాష్ట్రాల వారు మాట్లాడితే కేసీఆర్ సహించేవారు కాదని, కానీ బీఆర్‌ఎస్ ఏర్పాటు తర్వాత ఆయన వైఖరి మారిందన్నారు. కేసీఆర్ మహారాష్ట్రలో మాట్లాడినప్పుడు అవసరమైతే ఎస్సారెస్పీ నుంచి, ఆ పైనుంచి నది నుంచి నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు కనిపిస్తామని అన్నట్టు విన్నానని, వాస్తవంగా కేసీఆర్ చెప్పిందేమిటో ఆయనే స్పష్టత ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఆదివారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై ఈటల ప్రసంగించారు.
బీఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కేసీఆర్ సమక్షంలో మాట్లాడటం ఈటలకు ఇదే మొదటిసారి కావడం విశేషం. కేంద్రం నుంచి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశం లేదని, అక్కడి నుంచి నిధులు వస్తాయని అంచనా వేసుకోవటం సరికాదని ఈట ల చెప్పారు. చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రావట్లేదని, లాభాల కోణంలో చూడకుండా ఆర్టీసీ బస్సులు పెంచి అన్ని గ్రామాలకు వచ్చేలా చూడా లని కోరారు. ఈటల చెప్పిన విషయాలను నోట్ చేసుకోవాలని సీఎం ఈ సందర్భంగా మంత్రులకు సూచించారు. కాగా, ఈటల మాట్లాడుతుండగానే సమయం మించి పోయిందంటూ స్పీకర్ మైక్ కట్ చేసి సీఎం మాట్లాడాల్సిందిగా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment