కొత్త ఆశ, కొత్త సంకల్పం, కొత్త ఎజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకోసం బీజేపీయేతర శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలి. ఆ దిశగానే చర్చించడానికి మహారాష్ట్రకు వచ్చా. ఉద్ధవ్‌ఠాక్రేతో దాదాపు అన్ని విషయాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాం. దేశంలో భావ సారూప్యత కలిగిన ఇతర పార్టీలతో మాట్లాడుతున్నాం. కొద్దిరోజుల్లోనే హైదరాబాద్‌లోగానీ, మరోచోటగానీ అందరం భేటీ అయి, భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తాం. మహారాష్ట్ర నుంచి ఏ కూటమి వచ్చినా విజయవంతం అవుతుంది. ఈ రోజు ఒక ప్రారంభం జరిగింది. తొలి అడుగు పడింది. – సీఎం కేసీఆర్
దేశంలో ప్రజాపాలన మంటగలిసి పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తు ఏమైపోతుంది? దీనిపై ఎవరో ఒకరు ఆలోచించాలి, ఈ అంశాన్ని లేవనెత్తాలి. అది ఈ రోజు మాతోనే ప్రారంభమవుతోంది. ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికొచ్చాం. ఆ ప్రకారం
ఒక్కొ అడుగు ముందుకు వేస్తూ వెళతాం.
– మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే
దేశంలో నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ధరల పెరుగుదల వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు భావ సారూప్యత ఉన్న శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసికట్టుగా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలి. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మా వంతు పూర్తి సహకారం ఉంటుంది. – ఎన్సీపీ అధినేత శరద్ పవార్
సాక్షి, హైదరాబాద్, ముంబై: దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీయేతర శక్తులన్నీ ఏకతాటిపైకి రావల్సిన అవసరం ఉందని.. ఆ దిశగానే దేశ రాజకీయాలు, దేశ వికాసం, పరిస్థితులను చర్చించడానికి మహారాష్ట్రకు వచ్చానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేతో చాలా అంశాలపై విస్తృతంగా చర్చించామని.. దాదాపు అన్ని విషయాల్లో ఏకాభిప్రాయానికి వచ్చామని చెప్పారు. దేశంలో భావ సారూప్యత కలిగిన ఇతర పార్టీలతోనూ మాట్లాడుతున్నామని.. కొద్దిరోజుల్లోనే హైదరాబాద్‌లోగానీ, మరోచోటగానీ అందరం భేటీ అయి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ఆదివారం ముంబై వెళ్లారు.
అక్కడి సీఎం అధికారిక నివాసం ‘వర్ష’వద్ద సీఎం కేసీఆర్, ఇతర రాష్ట్ర నేతలకు ఉద్ధవ్‌ఠాక్రే సాదరంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం భోజన విందు ఇచ్చారు. తర్వాత ఇరువురు సీఎంలు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్, ఉద్ధవ్‌ఠాక్రే మీడియాతో మాట్లాడారు. తొలుత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తమ చర్చల్లో దాదాపు అన్ని విషయాల్లో ఏకభిప్రాయానికి వచ్చామని, భవిష్యత్తులో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి ఏ కూటమి వచ్చినా విజయవంతం అవుతుందని చెప్పారు. ‘‘దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించాం. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో దేశం ఏమేర అభివృద్ధి సాధించాలో అంత సాధించలేదు. దేశంలో పెద్ద మార్పు అవసరముంది. దేశంలో ప్రస్తుతమున్న వాతావరణం పాడు కాకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. శివాజీ, బాలాసాహెబ్ ఠాక్రే, మరాఠా యోధులు అందించిన ప్రేరణతో ముందుకు సాగుతాం. కేంద్ర జులుంకు, అక్రమాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం పోరాడాలనుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ చర్చల సత్ఫలితాలను చూస్తాం. ఈ రోజు ఒక ప్రారంభం జరిగింది. ఇందులో ఎలాంటి ఊహాగానాలకు తావు లేదు. దేశంలోని మిగతా నేతలతో మాట్లాడుతాం. చర్చల తర్వాతే ఎజెండా ఖరారు చేస్తాం..’’అని కేసీఆర్ చెప్పారు.
ఎంతో ప్రేమ చూపారు.. తిరిగి ఇస్తాం..
మహారాష్ట్ర, తెలంగాణ మధ్య వెయ్యి కిలోమీటర్ల సరిహద్దు ఉందని, రెండు రాష్ట్రాలు సోదరుల వంటివని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర సహకారంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నామన్నారు. రెండు రాష్ట్రాలు చాలా విషయాల్లో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, వాటిపైనా చర్చించి ఏకభిప్రాయానికి వచ్చామన్నారు. ‘‘ఉద్ధవ్ ఠాక్రే నాకు ప్రేమతో భోజనం పెట్టారు. మహారాష్ట్ర నుంచి ప్రేమను మూటగట్టుకుని వెళ్తున్నాం. అదే ప్రేమను మేం కూడా తిరిగిస్తాం. వీలు చూసుకుని ఉద్ధవ్ ఠాక్రే హైదరాబాద్‌కు రావాలి’’అని ఆహ్వానించారు.
చకచకా పర్యటన..
ఆదివారం ఉదయం 11.40 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్, ఇతర నేతలు ముంబైకి బయలుదేరారు. మధ్యాహ్నం 12.50కు ముంబైలో దిగి.. గ్రాండ్ హయత్ హోటల్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అక్కడి నుంచి కేసీఆర్ బృందం ఎన్సీపీ అధినేత, మాజీ సీఎం శరద్ పవార్ నివాసానికి చేరుకుంది. వారిని శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులే సాదరంగా ఆహ్వానించారు. పవార్‌తో సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యాక.. కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాత్రి 7.20 గంటల సమయంలో ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి బయల్దేరి.. రాత్రి 8.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు.
కొత్త ఎజెండాతో వస్తాం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని.. దేశం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని సీఎం కేసీఆర్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌పవార్ ప్రకటించారు. ముంబై పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. శరద్‌పవార్ నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. వారు పలు అంశాలపై చర్చించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. దేశం సరైన మార్గంలో నడవడం లేదని.. దీనికి కారణాలు వెతికి కొత్త ఆశ, కొత్త సంకల్పం, కొత్త ఎజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.
‘‘1969 నాటి తెలంగాణ ఉద్యమం మొదలుకుని.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సఫలమయ్యేంత వరకు శరద్ పవార్ మాకు మద్దతుగా నిలిచారు. దేశంలో ఎంతో రాజకీయ అనుభవమున్న పవార్ ముందు నా ఆలోచనలు పెట్టాను. ఆయన ఆశీర్వదించారు. దేశ ప్రయోజనాల కోసం కలసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అంశంపై మా మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. వీలైనంత త్వరలో దేశంలోని ఇతర పార్టీలతో మాట్లాడేందుకు సమావేశం నిర్వహిస్తాం. దేశ ప్రజల ముందు ఒక ఎజెండా, టైమ్ టేబుల్, కార్యాచరణ పెడతాం’’అని కేసీఆర్ తెలిపారు.
భావ సారూప్య శక్తులు ఏకం కావాలి: శరద్‌పవార్
దేశంలో రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పోరాడుతోందని, సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశంసించారు. ‘‘దేశంలో నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ధరల పెరుగుదల వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు భావ సార్యూపత ఉన్న శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మా వంతు పూర్తి సహకారం ఉంటుంది’’అని ప్రకటించారు. ఇక గంటన్నర పాటు జరిగిన సమావేశంలో దేశంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై కేసీఆర్, పవార్ నడుమ చర్చ జరిగిందని ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ తెలిపారు.
వివిధ రాజకీయపక్షాలకు చెందినవారు కలిసి భావసారూప్యతలను పంచుకుంటూ కలిసి పనిచేయాలనే అభిప్రాయం వ్యక్తమైందని వెల్లడించారు. అందరూ కలిసికట్టుగా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందనే అంశంపై పవార్, కేసీఆర్ నడుమ ఏకాభిప్రాయం వ్యక్తమైందని వివరించారు. శరద్‌పవార్‌తో జరిగిన భేటీలో ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే, ఎంపీ ప్రఫుల్ పటేల్ తదితరులు ఉన్నారు. కాగా దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఎన్సీపీ అధికార ప్రతినిధి వైద్య ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకో న్యాయం, ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలకో న్యాయం అనుసరిస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment