జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను కూడగట్టడంలో క్రియాశీల పాత్ర పోషిస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. అందులో భాగంగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. ఆదివారం ఉదయం 10:40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు.
గతంలో 2016లో గోదావరి నదీ జలాల ఒప్పందం కోసం, 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎంను ఆహ్వానించేందుకు కేసీఆర్ ముంబై వెళ్లారు. రెండు పర్యాయాలూ అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ప్రస్తుతం జరిగే మూడో పర్యటన మాత్రం పూర్తిగా రాజకీయ కోణంలో కొనసాగనుంది. కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ వారణాసి, సూరత్ తదితర చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తరహాలో.. సీఎం కేసీఆర్ పర్యటనను స్వాగతిస్తూ ముంబైలోని పలు ప్రాంతాల్లో ప్రవాస తెలంగాణవాసులతోపాటు శివసేన ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై గత కొన్నాళ్లుగా నిప్పులు చెరుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో విశాల రాజకీయ వేదిక ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 20న ముంబైకి రావాల్సిందిగా ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఆహ్వానం అందిన నేపథ్యంలో సీఎం మహారాష్ట్రకు వెళుతున్నారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావుతో పాటు ఒకరిద్దరు రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఆయన వెంట వెళ్లనున్నారు. ముంబైలో ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి కేసీఆర్ మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఠాక్రేతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడే అవకాశముంది. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కూడా కేసీఆర్ కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించవచ్చని తెలుస్తోంది. ముంబయి పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
బీజేపీపై పోరాటానికి కార్యాచరణపై చర్చ...
రాజ్యాంగం ముసుగులో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని మింగేయాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకు వేసి దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమనే వ్యాఖ్యలు కూడా చేశారు. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉండటంతో బీజేపీ వ్యతిరేక పార్టీల నడుమ ఐక్యత ఎజెండాగా కేసీఆర్, థాక్రేల భేటీ సాగుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. వివిధ రకాల భావజాలం, సైద్ధాంతిక పునాది కలిగిన రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఏకం కావడంలో ఎదురయ్యే అవరోధాలు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన మార్గంపై ఇరువురు సీఎంలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో కొనసాగించాల్సిన పోరు, అందుకు అవసరమైన కార్యాచరణ ఎలా ఉండాలనే కోణంలో ప్రధానంగా చర్చ జరుగుతుందని చెబుతున్నారు. గతంలో జాతీయ స్థాయిలో ఈ విధంగా జనతా, జనతాదళ్ పార్టీల రూపంలో సాగిన ప్రయత్నాలు, వాటి వైఫల్యానికి దారితీసిన కారణాలపై కేసీఆర్ ఇప్పటికే ఒక నోట్ సిద్ధం చేసినట్లు తెలిసింది. కేవలం బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకత, ఆ రెండు పార్టీల వైఫల్యం అనే అంశంపైనే కాకుండా దేశ ప్రజల ముందు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఆవశ్యకత, దేశం సాధించాల్సిన అభివృద్ధి నమూనా ఏ తరహాలో ఉండాలనే విషయమూ ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. దేశ అభివృద్ధికి అవసరమైన భౌతిక, మానవ వనరులు అందుబాటులో ఉన్నా కేంద్రం వాటిని వినియోగించుకోలేక పోతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలు ఆదివారం జరిగే భేటీ ఎజెండాగా ఉంటాయని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
త్వరలో మమత, స్టాలిన్‌తోనూ భేటీ...
తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రతో పాటు బీజేపీయేతర ముఖ్యమంత్రులతో త్వరలో ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. కాగా ఆదివారం థాక్రేతో జరిగే భేటీలో ఢిల్లీ సమావేశం ఎజెండా గురించి కూడా కేసీఆర్ చర్చిస్తారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మమతా బెనర్జీతో, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మరోసారి కేసీఆర్ భేటీ అయ్యే అవకాశముంది. ఇలావుండగా కేరళ సీఎం పినరయి విజయన్, ఆర్‌జేడీ నాయకులు తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజాతోనూ కేసీఆర్ ఇటీవల వేర్వేరు సందర్భాల్లో భేటీ అయ్యారు. కాగా జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంపై కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు జనతాదళ్ (సెక్యులర్) అధినేత దేవెగౌడ, మమత, స్టాలిన్ తదితరులు ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్ధవ్‌తో భేటీ అనంతరం జాతీయ రాజకీయాల్లో మరింత కీలకంగా పనిచేసేందుకు కేసీఆర్ ఇప్పటికే రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment