ఉద్ధవ్, శరద్ ఇద్దరికీ ప్రతిష్టాత్మకం
మహాయుతి కూటమికి గట్టి పోటీ
మహారాష్ట్రలో మూడో దశ లోక్‌సభ ఎన్నికల సమరం మహాయుతి, మహా వికాస్ అగాడీ రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. పశి్చమ మహారాష్ట్రలో ఏడు స్థానాలు, కొంకణ్, మరాఠ్వాడా నుంచి రెండేసి చొప్పున మొత్తం 11 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది.
బీజేపీ, ఎన్‌సీపీ, శివసేనతో కూడిన అధికార మహాయుతి కూటమి ఒకవైపు.. కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన ఎంవీఏ మరోవైపు మోహరించాయి. పలుచోట్ల రెబెల్ అభ్యర్థులూ వాటికి సవాలు విసురుతున్నారు. ఉద్ధవ్, శరద్ వర్గాలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి...
ఉస్మానాబాద్
మరాఠ్వాడా ప్రాంతంలో ప్రముఖ పట్టణం. దీని పేరును సర్కారు ఇటీవలే దారాశివ్‌గా మార్చింది. సిట్టింగ్ ఎంపీ ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్ శివసేన (ఉద్ధవ్) తరఫున పోటీలో ఉన్నారు. తుల్జాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాణా జగ్‌జీత్ సిన్హా భార్య అర్చనా పాటిల్‌ను మహాయుతి కూటమి బరిలో దింపింది. ఆమె ఇటీవలే ఎన్సీపీ (అజిత్) పారీ్టలో చేరి లోక్‌సభ టికెట్ సంపాదించారు. అర్చన మామ పదమ్‌సిన్హా పాటిల్ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు.
అజిత్ పవార్ భార్య సునేత్రకు సోదరుడు కూడా. నింబాల్కర్ కుటుంబంతోనూ వీరికి దగ్గరి బంధుత్వముంది. కానీ వీరి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నింబాల్కర్ తండ్రిని చంపించినట్టు పదమ్‌సిన్హాపై ఆరోపణలున్నాయి! 2019 లోక్‌సభ ఎన్నికల్లో నింబాల్కర్ ఈ స్థానంలో రాణా జగ్‌జీత్ సిన్హాను ఓడించడం విశేషం. ఈసారి మహిళల ఓట్లు తనను గెలిపిస్తాయని అర్చన నమ్మకం పెట్టుకున్నారు.
సాంగ్లి
బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంజయ్ కాక పాటిల్ మళ్లీ బరిలో ఉన్నారు. విపక్ష మహా వికాస్ అగాడీ తరఫున కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ టికెట్ ఆశించగా పొత్తులో భాగంగా ఈ స్థానం శివసేన (ఉద్ధవ్)కు వెళ్లింది. దాంతో ఆయన రెబెల్‌గా పోటీకి దిగారు. శివసేన (ఉద్ధవ్) నుంచి రెజ్లర్ చంద్రహర్ పాటిల్ బరిలో ఉన్నారు. దాంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఓట్లను విశాల్ చీలుస్తారని, అది బీజేపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.
సోలాపూర్
2014, 2019ల్లో ఇక్కడ వరుసగా బీజేపీయే నెగ్గింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతీ షిండే బరిలో ఉండటమే అందుకు కారణం. నిజానికి ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చివరిదాకా ప్రయత్నించి విఫలమైంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సాత్పుతే రంగంలోకి దిగారు. ప్రణతి కూడా సోలాపూర్ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే కావడం విశేషం!
ఆమె తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని ఈసారి కూడా బీజేపీ కొనసాగించింది. 2014లో శరద్ బాన్సోడ్, 2019లో జైసిద్ధేశ్వర్ స్వామి బీజేపీ తరఫున గెలిచారు. ఆ రెండుసార్లూ ఓటమి చవిచూసింది సుశీల్‌కుమార్ షిండేనే! ఈసారి మజ్లిస్ ఇక్కడ అభ్యర్థిని ఉపసంహరించుకోవడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. సోలాపూర్, మాధా స్థానాల్లో విజయం కోసం చెమటోడ్చాల్సిందేనని బీజేపీ నేతలే అంగీకరిస్తుండటం విశేషం!
సతారా
మహాయుతి కూటమి తరఫున ఎన్సీపీ (శరద్ పవార్) నేత, కారి్మక నాయకుడు, ఎమ్మెల్సీ శశికాంత్ షిండే బరిలో ఉన్నారు. దాంతో కొల్హాపూర్ మాదిరిగానే ఇక్కడ కూడా బీజేపీ వ్యూహాత్మకంగా ఛత్రపతి శివాజీ వంశీయుడు, రాజ్యసభ ఎంపీ ఉదయన్‌రాజే భొసాలేకు టికెటిచి్చంది. మహాయుతి కూటమి నుంచి ఈ స్థానంలో పోటీ చేయాలని తొలుత ఎన్సీపీ (అజిత్) భావించింది. ఉదయన్‌రాజే భోసాలే పోటీకి ఆసక్తి చూపడంతో ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది.
రత్నగిరి–సింధుదుర్గ్
సిట్టింగ్ ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నేత వినాయక్ రౌత్ మళ్లీ బరిలో ఉన్నారు. ఆయనపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను బీజేపీ పోటీకి దింపింది. శివసేన రెండుగా చీలిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో రెండుసార్లుగా గెలుస్తూ వస్తున్న రౌత్‌కు ఈసారి విజయం తేలిక కాదంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ వర్గానికి చెందిన స్థానిక నేతలు, శ్రేణుల ఐక్యతకు ఈ ఎన్నిక పరీక్షగా మారింది.
రాయగఢ్
ఇక్కడ పోటీ ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కారే, శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి అనంత్ గీతే మధ్యే ఉంది. 2019 ఎన్నికల్లో అనంత్ గీతేపైనే తత్కారే 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు రెండు పర్యాయాలు వరుసగా అనంత్ గీతేనే ఇక్కడ గెలిచారు.
మాధా
బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ సిన్హా నాయక్ నింబాల్కర్ మళ్లీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సంజయ్‌మామ విఠల్‌రావు షిండేపై 86 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ మళ్లీ నింబాల్కర్‌కు టికెటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ జిల్లా కార్యదర్శి ధైర్యశీల్ మోహిత్ పాటిల్ ఇటీవలే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి రంగంలోకి దిగి బీజేపీకి గట్టి సవాలు విసురుతున్నారు. మోహిత్‌కు స్థానికంగా బాగా పట్టుండటంతో ఇక్కడ బీజేపీ ఎదురీదుతోందని చెబుతున్నారు.
అజిత్‌కూ ప్రతిష్టాత్మకమే
ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బాబాయి శరద్ పవార్‌తో విభేదించి పార్టీని చీల్చి తన వర్గానికే అసలు ఎన్సీపీగా అధికారిక గుర్తింపు సాధించుకోవడం తెలిసిందే. రాయగఢ్, ఉస్మానాబాద్‌తో పాటు బారామతిలో విజయం ఆయనకు
సవాలుగా మారింది. బారామతిలో అజిత్ భార్య సునేత్ర బరిలో ఉన్నారు. తన మరదలు, శరద్ పవార్ కూతురైన సిట్టింగ్ ఎంపీ సుప్రియా సులేతో ఆమె తలపడుతుండటం విశేషం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment