మహారాష్ట్రలో 11 స్థానాలకు 13న పోలింగ్
మహాయుతి, ఎంవీఏ కూటముల హోరాహోరీ
మహారాష్ట్రలో ‘మహా’ కూటముల కొట్లాట కాక రేపుతోంది. యూపీ తర్వాత అత్యధికంగా ఇక్కడ 48 లోక్‌సభ స్థానాలుండగా తొలి మూడు దశల్లో 24 సీట్లలో పారీ్టల భవితవ్యం ఈవీఎంలలోకి చేరిపోయింది. నాలుగో అంకంలో 13న రాష్ట్రంలో మరో 11 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ (మహాయుతి), ఇండియా (మహా వికాస్ అగాడీ) కూటములు హోరాహోరీగా తలపడుతున్న కీలక నియోజకవర్గాలపై ఫోకస్...
ఔరంగాబాద్... మజ్లిస్ మేజిక్!
కాంగ్రెస్, శివసేనలకు కంచుకోటగా నిలిచిన ఈ స్థానంలో గత లోక్‌సభ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. శివసేన నుంచి వరుసగా నాలుగుసార్లు విక్టరీ కొట్టిన చంద్రకాంత్ ఖైరే మజ్లిస్ అభ్యర్థి సయ్యద్ ఇంతియాజ్ జలీల్ చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూశారు. 97 ఏళ్ల మజ్లిస్ చరిత్రలో తెలంగాణ వెలుపల ఇదే తొలి ఎంపీ స్థానం! 1980 తర్వాత ఔరంగాబాద్‌లో మైనారిటీ గెలుపొందడం అదే ప్రథమం.
స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ జాధవ్‌కు ఏకంగా 2.8 లక్షల ఓట్లు పోలవడం ఖైరే ఓటమికి ప్రధాన కారణం. మజ్లిస్ మళ్లీ జలీల్‌నే బరిలోకి దించింది. విపక్ష మహా వికాస్ అగాడీ తరఫున శివసేన (ఉద్దవ్) అభ్యరి్థగా ఖైరే కూడా పోయిన చోటే వెతుక్కుంటున్నారు. ఇక అధికార మహాయుతి కూటమి తరఫున శివసేన (షిండే) అభ్యర్థి సందీపన్‌రావ్ భూమ్రే బరిలో ఉన్నారు. ఆయన బలమైన మరాఠ్వాడా నేత.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ చేశారు. మరాఠా రిజర్వేషన్ల పోరుతో మరాఠ్వాడా ప్రాంతంలో ఎంతో పేరు సంపాదించిన హర్షవర్ధన్ ఈసారి కూడా ఇండిపెండెంట్‌గా ప్రధాన పార్టీలకు సవాలు విసురుతున్నారు. ప్రకాశ్ అంబేద్కర్ వంచిత బహుజన్ అగాడీ నుంచి అఫ్సర్ ఖాన్ పోటీలో ఉన్నారు. 32 శాతం ముస్లిం జనాభా ఉన్న ఔరంగాబాద్‌లో ఈసారి చతుర్ముఖ పోరులో ఎలాంటి సంచలనం నమోదవుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
జాల్నా... రావ్‌సాహెబ్ డబుల్ హ్యాట్రిక్ గురి
ఇది బీజేపీకి మరో కంచుకోట. 1999 నుంచి వరుసగా ఐదుసార్లు విజయ ఢంకా మోగించిన రావ్‌సాహెబ్ దన్వే పాటిల్ డబుల్ హ్యాట్రిక్ లక్ష్యంగా మరోసారి బరిలో నిలిచారు. మోదీ రెండు విడతల్లోనూ కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న దన్వే గత ఎన్నికల్లో 3.3 లక్షల పైగా మెజారిటీతో గెలిచారు. గత రెండు పర్యాయాలూ బీజేపీని ఢీకొన్న విలాస్ ఔతాడేను కాంగ్రెస్ ఈసారి పక్కనపెట్టింది. 2009లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చి కేవలం 8,482 ఓట్ల తేడాతో ఓడిన కల్యాణ్ విజినాథ్ కాలేను రంగంలోకి దించింది.
పుణె.. మాజీ మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే
ఇక్కడ గత రెండుసార్లూ బీజేపీదే విజయం. అయితే సిట్టింగ్ ఎంపీ గిరీశ్ బాపట్ గతేడాది మరణించడంతో పుణె మాజీ మేయర్ మురళీధర్ కిశాన్ మాహోల్‌కు ఈసారి బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్‌ను బరిలో నిలిపింది. పుణె లోక్‌సభ స్థానం పరిధిలోని కస్బాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో గతేడాది జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యరి్థని ధంగేకర్ మట్టికరిపించడం విశేషం. 28 ఏళ్లుగా కాషాయ జెండా ఎగురుతున్న ఈ సీటు చేజారడం కమలనాథులకు భారీ షాకే. ఇదే జోరుతో పుణె లోక్‌సభ స్థానాన్నీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయతి్నస్తోంది.
షిర్డీ... శివసేన కుస్తీ
2009లో ఉనికిలోకి వచి్చనప్పటి నుంచీ ఇది శివసేన ఖాతాలోనే పడుతోంది. గత రెండు ఎన్నికల్లో నెగ్గిన సదాశివ లోఖండే ఇప్పుడు శివసేన (షిండే) వర్గం నుంచి మహాయుతి అభ్యరి్థగా హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. షిర్డీ తొలి ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నేత భావుసాహెబ్ రాజారామ్ వాక్చౌరే ఎంవీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. రెండు శివసేన వర్గాలకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఈ స్థానం కోసం పట్టుబట్టినా సీఎం షిండే మోకాలడ్డారు. అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వీబీఏ అభ్యర్థి ఉత్కర్‡్ష రూపవతి ఎవరి ఓట్లకు గండి పెడతారన్నది ఆసక్తికరం!
బీడ్.. పంకజకు రిజర్వేషన్ సెగ
ఈ స్థానం బీజేపీ దుర్గం. దివంగత గోపీనాథ్ ముండే కుటుంబానికి గట్టి పట్టున్న స్థానం. ఈసారి అదే కుటుంబం నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రీతం ముండే బదులు అక్క, మాజీ మంత్రి పంకజా ముండేను బీజేపీ బరిలోకి దించింది. అయితే మారాఠా రిజర్వేషన్లపై అట్టుడుకుతున్న ఈ నియోజకవర్గంలో మహాయుతి కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతో పంకజ ఎదురీదాల్సిన పరిస్థితి! అయితే 2019లో పర్లీ అసెంబ్లీ స్థానంలో పంకజను ఓడించిన సోదరుడు ఎన్సీపీ (అజిత్) నేత ధనంజయ్ ముండే దన్నుగా నిలవడం ఆమెకు కలిసొచ్చే అంశం. 2019లో 5 లక్షల పై చిలుకు ఓట్లతో ప్రీతం మెజారిటీకి భారీగా గండికొట్టిన భజరంగ్ మనోహర్ సోన్వానే ఎంవీఏ కూటమి నుంచి ఎన్సీపీ (శరద్) టికెట్‌పై బీజేపీకి మళ్లీ సవాలు విసురుతున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న దంగర్ సామాజిక వర్గం ఎప్పటి నుంచో ఎస్టీ రిజర్వేషన్లు డిమాండ్ చేస్తోంది. మరాఠా కోటా, ఈ ఎస్టీ హోదా డిమాండ్లు ఎవరిని ముంచుతాయన్నది ఆసక్తికరం.
జల్గావ్... టఫ్ ఫైట్
రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ పాతుకుపోయిన కమలనాథులకు ఈసారి మహా వికాస్ అగాడీ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ నేత ఉన్మేశ్ పాటిల్ 4 లక్షల పైగా బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టారు. అయినా ఈసారి ఆయన్ను కాదని స్మితా వాఘ్‌కు బీజేపీ టికెటిచ్చింది. ఎంవీఏ నుంచి శివసేన (ఉద్దవ్) నేత కరన్ బాలాసాహెబ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. గతంలో గట్టి పోటీ ఇచి్చన ఎన్సీపీ (శరద్) దన్నుండటం కరన్‌కు కలిసొచ్చే అంశం. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లూ మహాయుతి కూటమి చేతిలోనే ఉన్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment