విషమిస్తోంది.. కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు  | Telangana Villagers Fear Spread Of Malaria Dengue Typhoid | Sakshi
Sakshi News home page

విషమిస్తోంది.. కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు 

Published Wed, Aug 18 2021 2:48 AM | Last Updated on Wed, Aug 18 2021 3:11 AM

Telangana Villagers Fear Spread Of Malaria Dengue Typhoid - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో విష జ్వరాలు కమ్ముకుంటున్నాయి. పల్లెలు, ఆదివాసీ గూడేలు మంచం పడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ఊళ్లకు ఊళ్లు నీరసిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, మహబూబాబాద్‌ జిల్లాల పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వేలాది మంది బాధితులు క్యూ కడుతున్నారు. పలుచోట్ల ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి.

ఇక చాలా ప్రభుత్వాస్పత్రుల్లో డెంగీ బాధితులకు ప్లేట్‌లెట్లు ఎక్కించే సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. కొందరు పాత జిల్లా కేంద్రాలకు, హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ముందుగా గుర్తించలేక, సరైన సమయంలో చికిత్స అందక డెంగీ, ఇతర జ్వరాలబారిన పడ్డవారు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం నిర్మల్‌ జిల్లా డిప్యూటీ తహసీల్దార్‌ డెంగీతో, ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో మరో యువకుడు టైఫాయిడ్‌తో ప్రాణాలు వదిలారు. 

మూడు ఊళ్లు.. 200 మంది.. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం, ఇల్లందులపాడుతండా, తవిశలగూడెం గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మొదట ఈ నెల 4న ఇల్లందులపాడుతండాలో డెంగీ లక్షణాలతో ఒకరిద్దరు మంచాన పడ్డారు. క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ మూడు గ్రామాల్లో కలిపి 200మందికిపైగా డెంగీ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పటివరకు ఇద్దరు డెంగీ లక్షణాలతో చనిపోయారు. పదుల సంఖ్యలో బాధితులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లారు. 

ఒకరి వెనుక ఒకరుగా....
మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో విష జ్వరాలు కమ్ముకున్నాయి. గత నాలుగైదు రోజుల్లోనే లైన్‌తండా గ్రామంలో 12 మంది జ్వరాల బారిన పడ్డారు. భూపతిపేట, మచ్చర్ల గ్రామాలు, మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోనూ ఇదే పరిస్థితి. విష జ్వరాల బాధితులతో గూడూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో పడకలన్నీ నిండిపోయాయి. 

ఎక్కడ చూసినా అదే పరిస్థితి 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత నెల వ్యవధిలో విషజ్వరాలు, మలేరియా, డెంగీతో 35 మందికిపైగా చనిపోయారు. అందులో 20 మంది డెంగీ బాధితులే ఉన్నట్టు సమాచారం. అధికారిక లెక్కల ప్రకారమే.. జూలై ఒకటి నుంచి ఇప్పటివరకు 32 వేల మందికిపైగా విషజ్వరాల బారినపడ్డారు. 

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి జ్వర పీడితులతో నిండిపోయింది. పిల్లల వార్డులోనే వంద మందికిపైగా పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి రోజూ 100 మందికిపైగా విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్య సిబ్బంది చెప్తున్నారు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డెంగీ, మలే రియా, ఇతర విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గిరిజన తండాలు ఎక్కువున్న దేవరకొండ ప్రాంతంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. మిర్యాలగూడ, సూర్యాపేటలోనూ ఇదే పరిస్థితి. 

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ ఇతర విష జ్వరాల బాధితులతో నిండిపోయాయి. ఒక్కో ఆస్పత్రిలో పది నుంచి ఇరవై మంది డెంగీ, మలేరియా బాధితులున్నట్టు తెలిసింది. నిజామాబాద్‌ పట్టణంతోపాటు ఆర్మూర్, పోచంపాడ్, బాల్కొండ, భీంగల్, డిచ్‌పల్లి, సిరికొండ, నందిపేట, నవీపేట ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే.. 67 డెంగీ కేసులు, 2 చికున్‌గున్యా, 32 మలేరియా కేసులు నమోదయ్యా యి. అనధికారికంగా ఈ సంఖ్య వందల్లో ఉంటుందని స్థానిక అధికారులే చెప్తున్నారు. 

ఖమ్మం జిల్లాలో జూలైలో 42, ఈ నెలలో ఇప్పటివరకు 38 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో విషజ్వరాల బాధితులు కనిపిస్తున్నారు. 

డెంగీతో నాయబ్‌ తహసీల్దార్‌ ..
నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌లో నాయబ్‌ తహసీల్దార్‌గా పనిచేస్తున్న కొంతం శ్రీకాంత్‌(40) మంగళవారం డెంగీ బారినపడి మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని నాయుడివాడకు చెందిన ఆయన.. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలో వివిధస్థాయిల్లో పనిచేశారు. ఇటీవలే కలెక్టరేట్‌కు బదిలీపై వచ్చారు. నాలుగైదు రోజుల క్రితం తీవ్ర జ్వరంరాగా స్థానిక ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు డెంగీగా నిర్ధారించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. మంగళవారం వేకువజామున హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయారు. శ్రీకాంత్‌కు భార్య జ్యోతి, కూతురు(12), కుమారుడు(10) ఉన్నారు. 

టైఫాయిడ్‌తో యువకుడు మృతి 
ఇంద్రవెల్లి (ఖానాపూర్‌): ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు చెందిన అశోక్‌ (25) వారం కింద టైఫాయిడ్‌ బారినపడ్డాడు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. మంగళవారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. 

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం కొమిలిపెంటకు చెందిన
ఈ మహిళ పేరు జల్ల ముత్తమ్మ. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ.. స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది. వారమైనా జ్వరం అదుపులోకి రాకపోవడంతో మన్ననూరు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటోంది. 

అడ్డగోలు వసూళ్లకు దిగిన ఆస్పత్రులు 
విష జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారు పెరుగుతుండటంతో ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలు వసూళ్ల దందాకు దిగుతున్నాయి. అందులోనూ డెంగీ బారినపడ్డ వారి నుంచి రోజుకు రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. రోగులకు ప్లేట్‌లెట్లు ఎక్కిస్తూ.. ఒక్కో బ్యాగ్‌కు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. కన్సల్టేషన్, బెడ్, ఇతర చార్జీలు, మందుల పేరిట మరింతగా బిల్లులు వేస్తున్నారని బాధితులు చెప్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement