typhoid fever
-
ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే..
ప్రస్తుతం ప్రపంచమంతా పెనిస్ మష్రూమ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీని శాస్త్రీయనామం ఫాలస్ రూబికండస్. ఇది స్టిన్క్హాన్ కుటుంబానికి చెందిన ఫంగస్. దీనిని 1811లో కనిపెట్టారు. భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్, ఘనా, కాంగో, కెన్యా, దక్షిణాఫ్రిక వంటి ఉష్ణమండల దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఐతే దీనికి సంబంధించిన ఇమేజ్ను తాజాగా సైన్స్ అలర్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏమిటి ఈ పుట్టగొడుగుల ప్రత్యేకత పెనిస్ పుట్టగొడుగులు ఎటువంటి మట్టిలోనైనా బతుకుతాయి. ఐతే మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీలు మాత్రం ఈ పుట్టగొడుగులను జిరి-ఫిరి అని పిలుస్తారు. భరియా, బైగా ఆదివాసీల సంప్రదాయ ఔషధాల్లో ఇది ప్రముఖమైనది. ఈ పుట్టగొడుగులను టైఫాయిడ్, పేగు జ్వరాల నివారణకు ఔషధంగా వినియోగిస్తారు. చక్కెరతో ఈ పుట్టగొడుగులను బాగారుద్ది, ఎండబెట్టి పొడిచేస్తారు. ఈ పొడిని ప్రసవ సమయంలో మహిళలకు టీ స్పూను చొప్పున అందిస్తే సుఖ ప్రసవం జరుగుతుందట. అలాగే టైఫాయిడ్‌తో బాధపడుతున్నవారికి రోజుకు మూడు స్పూనుల చొప్పున పట్టిస్తే నయం అవుతుంది. ఈ విధంగా గిరిజనులు వివిధ రోగాలను నయంచేయడానికి పెనిస్ పుట్టగొడుగులను ఉపయోగిస్తుంటారు. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! మన దేశంలోనేకాకుండా, ఆస్ట్రేలియాలోని స్థానిక ఆదివాసీలు లైంగిక శక్తిని పెంచే ఔషధంగా దీనిని ఉపయోగిస్తారు. ఐతే దాని వాసన చాలా ప్రమాదకరమైనది. ఈ పుట్టగొడుగుల వాసన కీటకాలను ఆకర్షిస్తుంది. సాధారణంగా వర్షాల తర్వాత చాలా దేశాలలో పెరుగుతోంది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
Salmonella Outbreak: ఉల్లి ఎంత పని చేసింది?.. 650 మందికి తీవ్ర అస్వస్థత..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని అంటారు.. ఉల్లిలోని ఔషధగుణాలు ఆరోగ్యానికి అంత మేలు చేస్తుందని దానర్థం. కానీ ఈ దేశ ప్రజలు కేవలం ఉల్లి తినడం మూలంగానే వింత వ్యాధి భారీన పడి తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. అమెరికాలో దాదాపు 37 రాష్ట్రాల్లో 650 మందికి పైగా ప్రజలకు సాల్మొనెల్లా అనే వ్యాధి వ్యాపించింది. మెక్సికోలోని చివావా నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలే అందుకు కారణమట. దీంతో ప్యాకింగ్, స్టిక్కర్ లేని ఉల్లిపాయలన్నింటినీ వెంటనే పారవేయాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరికలు జారీ చేసింది. పచ్చి ఉల్లి తిన్న వెంటనే తాము అనారోగ్యబారిన పడ్డట్టు 75% మంది బాధితులు వెల్లడించారు. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! సీడీసీ నివేదిక ప్రకారం ఇప్పటివరకూ 129 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఐతే ఎటువంటి మరణాలు సంభవించలేదని, అత్యధికంగా సాల్మొనెల్లా కేసులు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో నమోదయ్యాయని వెల్లడించింది. టెక్సాస్, ఓక్లహోమా ప్రావిన్స్‌లలో మొదట ఈ వ్యాధి తాలూకుకేసులు నమోదయ్యాయని మీడియాకు తెల్పింది. ఏమిటీ సాల్మొనెల్లా..? సాల్మొనెల్లా లేదా సాల్మొనెల్లోసిస్ అనేది సాధారణ బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి. ఇది పేగులను ప్రభావితం చేసి, జీర్ణసంబంధిత సమస్యలకు కారణమౌతుంది. కొన్ని సందర్భాల్లో టైఫాయిడ్, పారా టైఫాయిడ్ జ్వరాలకు కూడా దారితీస్తుందని సీడీసీ పేర్కొంది. ఐతే సాల్మొనెల్లా బ్యాక్టీరియా సాధారణంగా జంతువుల్లో, మనుషుల పేగుల్లో ఉంటుంది. ఇది మల విసర్జన ద్వారా బయటికి పోతుంది. ఈ వ్యాధి కలుషిత నీరు, ఆహారం తీసుకున్న 6 గంటలకు సాల్మొనెల్లా వ్యాపిస్తుంది. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి వంటివి ఈ వ్యాధి తాలూకు లక్షణాలు. ఈ వ్యాధి 4 నుంచి 7 రోజుల పాటు బాధిస్తుంది. కొన్ని రకాల బాక్టీరియాలు మూత్రం, రక్తం, ఎముకలు, కీళ్ళు లేదా నాడీ వ్యవస్థల్లో తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమౌతాయి కూడా. చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట! -
టైఫాయిడ్ టైంలో ఇవి తినడం చాలా ప్రమాదకరం.. మరేం తినాలి?!
పరిసరాల అపరిశుభ్రత కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్‌గున్యా, కలరా, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటిల్లో టైఫాయిడ్ జ్వరం కొంత ప్రమాదకారనే చెప్పవచ్చు. సాధారణంగా టైఫాయిడ్ జ్వరం కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ సంక్రమిస్తుంది. అయితే నిపుణులు సూచించిన ఈ ఆహార అలవాట్లతో ఏవిధంగా టైఫాయిడ్ నుంచి ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం.. టైఫాయిడ్ లక్షణాలు ఏ వ్యాధినైనా ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత సులువుగా దానిని నయం చేయవచ్చు. టైఫాయిడ్‌ను కూడా తేలికగా గుర్తించవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, నీరసం, వాంతులు, విరేచనాలు లేద మలబద్ధకం, అలసట..వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఆహారం అస్సలు తీసుకోకూడదు.. టైఫాయిడ్ జ్వరం నుంచి త్వరగా తేరుకోవడానికి కొన్ని రకాల ఆహార అలవాట్లు తప్పక పాటించవల్సి ఉంటుంది. ముఖ్యంగా తొక్క తీయకుండా తినగలిగే పండ్లు, కూరగాయాలు, ఘాటుగా ఉండే ఆహారం, నెయ్యి లేదా నూనెతో వండిన పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ కడుపులో మంట లేదా తాపాన్ని పుట్టించే అవకాశం ఉంది. ఇవి కూడా తినకూడదు కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే కొన్ని రకాల కూరగాయలు అంటే.. క్యాబేజీ, బ్రొకోలీ, క్యాలీఫ్లవర్ వంటి వాటిని కూడా తినకపోవడం మంచిది. అలాగే వ్యాధి నివారణకు ఆటంకాలుగా పరిణమించే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి కూడా తినకూడదు. మరేం తినాలి? టైఫాయిడ్‌తో బాధపడే వారికి దివ్యౌషధం ఏంటంటే.. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు. అంటే.. సోయా బీన్స్, వివిధ రకాల గింజలు (నట్స్), భిన్న రకాలైన విత్తనాలు, గుడ్లు.. వంటివి తినాలి. ఆలుగడ్డ వేపుడు, ఉడికించిన అన్నం.. వంటి కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. పాలు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు కూడా తినొచ్చు. అలాగే టైఫాయిడ్ నుంచి కోలుకునే ప్రక్రియలో మరిన్ని నీళ్లు తాగడం మాత్రం మర్చిపోకూడదు. ఈ ఆహారపు అలవాట్లతో మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా కాపాడుకోవచ్చనేది నిపుణుల మాట. చదవండి: Health Tips: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇది తరచుగా తింటే సరి! -
విషమిస్తోంది.. కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో విష జ్వరాలు కమ్ముకుంటున్నాయి. పల్లెలు, ఆదివాసీ గూడేలు మంచం పడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ఊళ్లకు ఊళ్లు నీరసిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వేలాది మంది బాధితులు క్యూ కడుతున్నారు. పలుచోట్ల ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇక చాలా ప్రభుత్వాస్పత్రుల్లో డెంగీ బాధితులకు ప్లేట్లెట్లు ఎక్కించే సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. కొందరు పాత జిల్లా కేంద్రాలకు, హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ముందుగా గుర్తించలేక, సరైన సమయంలో చికిత్స అందక డెంగీ, ఇతర జ్వరాలబారిన పడ్డవారు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా డిప్యూటీ తహసీల్దార్ డెంగీతో, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మరో యువకుడు టైఫాయిడ్‌తో ప్రాణాలు వదిలారు. మూడు ఊళ్లు.. 200 మంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం, ఇల్లందులపాడుతండా, తవిశలగూడెం గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మొదట ఈ నెల 4న ఇల్లందులపాడుతండాలో డెంగీ లక్షణాలతో ఒకరిద్దరు మంచాన పడ్డారు. క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ మూడు గ్రామాల్లో కలిపి 200మందికిపైగా డెంగీ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పటివరకు ఇద్దరు డెంగీ లక్షణాలతో చనిపోయారు. పదుల సంఖ్యలో బాధితులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లారు. ఒకరి వెనుక ఒకరుగా.... మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో విష జ్వరాలు కమ్ముకున్నాయి. గత నాలుగైదు రోజుల్లోనే లైన్‌తండా గ్రామంలో 12 మంది జ్వరాల బారిన పడ్డారు. భూపతిపేట, మచ్చర్ల గ్రామాలు, మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోనూ ఇదే పరిస్థితి. విష జ్వరాల బాధితులతో గూడూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పడకలన్నీ నిండిపోయాయి. ఎక్కడ చూసినా అదే పరిస్థితి ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత నెల వ్యవధిలో విషజ్వరాలు, మలేరియా, డెంగీతో 35 మందికిపైగా చనిపోయారు. అందులో 20 మంది డెంగీ బాధితులే ఉన్నట్టు సమాచారం. అధికారిక లెక్కల ప్రకారమే.. జూలై ఒకటి నుంచి ఇప్పటివరకు 32 వేల మందికిపైగా విషజ్వరాల బారినపడ్డారు. ►ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి జ్వర పీడితులతో నిండిపోయింది. పిల్లల వార్డులోనే వంద మందికిపైగా పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి రోజూ 100 మందికిపైగా విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్య సిబ్బంది చెప్తున్నారు. ►ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డెంగీ, మలే రియా, ఇతర విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గిరిజన తండాలు ఎక్కువున్న దేవరకొండ ప్రాంతంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. మిర్యాలగూడ, సూర్యాపేటలోనూ ఇదే పరిస్థితి. ►నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ఇతర విష జ్వరాల బాధితులతో నిండిపోయాయి. ఒక్కో ఆస్పత్రిలో పది నుంచి ఇరవై మంది డెంగీ, మలేరియా బాధితులున్నట్టు తెలిసింది. నిజామాబాద్ పట్టణంతోపాటు ఆర్మూర్, పోచంపాడ్, బాల్కొండ, భీంగల్, డిచ్పల్లి, సిరికొండ, నందిపేట, నవీపేట ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ►ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే.. 67 డెంగీ కేసులు, 2 చికున్‌గున్యా, 32 మలేరియా కేసులు నమోదయ్యా యి. అనధికారికంగా ఈ సంఖ్య వందల్లో ఉంటుందని స్థానిక అధికారులే చెప్తున్నారు. ►ఖమ్మం జిల్లాలో జూలైలో 42, ఈ నెలలో ఇప్పటివరకు 38 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో విషజ్వరాల బాధితులు కనిపిస్తున్నారు. డెంగీతో నాయబ్ తహసీల్దార్ .. నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో నాయబ్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న కొంతం శ్రీకాంత్(40) మంగళవారం డెంగీ బారినపడి మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని నాయుడివాడకు చెందిన ఆయన.. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలో వివిధస్థాయిల్లో పనిచేశారు. ఇటీవలే కలెక్టరేట్‌కు బదిలీపై వచ్చారు. నాలుగైదు రోజుల క్రితం తీవ్ర జ్వరంరాగా స్థానిక ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు డెంగీగా నిర్ధారించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. మంగళవారం వేకువజామున హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయారు. శ్రీకాంత్‌కు భార్య జ్యోతి, కూతురు(12), కుమారుడు(10) ఉన్నారు. టైఫాయిడ్‌తో యువకుడు మృతి ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు చెందిన అశోక్ (25) వారం కింద టైఫాయిడ్ బారినపడ్డాడు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. మంగళవారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కొమిలిపెంటకు చెందిన ఈ మహిళ పేరు జల్ల ముత్తమ్మ. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ.. స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది. వారమైనా జ్వరం అదుపులోకి రాకపోవడంతో మన్ననూరు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటోంది. అడ్డగోలు వసూళ్లకు దిగిన ఆస్పత్రులు విష జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారు పెరుగుతుండటంతో ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలు వసూళ్ల దందాకు దిగుతున్నాయి. అందులోనూ డెంగీ బారినపడ్డ వారి నుంచి రోజుకు రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. రోగులకు ప్లేట్లెట్లు ఎక్కిస్తూ.. ఒక్కో బ్యాగ్‌కు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. కన్సల్టేషన్, బెడ్, ఇతర చార్జీలు, మందుల పేరిట మరింతగా బిల్లులు వేస్తున్నారని బాధితులు చెప్తున్నారు. -
‘ఆ నలుగురూ’.. స్నేహితులే
కొమరోలు: కరోనా దెబ్బకు బంధాలన్నీ బలహీనమైపోతున్నాయి. కొన్ని రోజుల కిందట వరకు నవ్వుతూ పలకరించిన వారే.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. చుట్టుపక్కల ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే చాలు.. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోతున్నారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం ముందుకు రాలేనంతగా హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా కొందరు ముందుకు వచ్చి సాయం చేస్తూ ‘ఆ నలుగురు’గా నిలుస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెబుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు గాదంశెట్టి గుప్తా(40) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 4 రోజుల కిందట రక్త పరీక్ష చేయించగా టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున జ్వరం అధికమై.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్య సిబ్బంది వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అయినా కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులెవరూ ముందుకురాలేదు. ఆయన కరోనాతోనే చనిపోయి ఉంటాడని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఎవరూ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఇరుగు పొరుగు వాళ్లు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. వృద్ధులైన తల్లిదండ్రులేమో కుమారుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థితిలో లేరు. బిడ్డలు కూడా లేరు. భార్య ఏమీ చేయలేక సాయం కోసం రోజంతా ఎదురుచూసింది. చివరకు స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ మౌలాలి, కొమరోలు, దద్దవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శులు రమణయ్య, సుబ్బారావు, మాజీ పోస్టల్ ఉద్యోగి థామ్సన్, ‘సాక్షి’ రిపోర్టర్ కృష్ణారెడ్డి... సోమవారం సాయంత్రం గాదంశెట్టి గుప్తా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతేకాకుండా ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు.. కొంత నగదు సేకరించి అండగా నిలిచారు. చదవండి: కరోనా విషాదం: వలంటీర్లే ఆ నలుగురై -
డయేరియాకు చెక్
సాక్షి, అమరావతి: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డయేరియా, టైఫాయిడ్ కేసులు భారీగా తగ్గాయి. వర్షాలు ఎక్కువగా కురిసినా కేసులకు అడ్డుకట్టపడింది. 2019తో పోలిస్తే.. డయేరియా కేసులు 50 శాతానికి పైగా తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి 2019 కంటే ఈ ఏడాదే వర్షాలు ఎక్కువగా కురిశాయి. అయితే, సురక్షిత తాగునీరు అందించడం, పారిశుధ్య పనుల నిర్వహణలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో కేసులు తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. టైఫాయిడ్ కేసులు సైతం భారీగా తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సర్కారు ఆదేశాలతో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది వర్షాకాలంలో సాంక్రమిక వ్యాధుల విభాగం (ఎపిడెమిక్ సెల్) అప్రమత్తంగా వ్యవహరించింది. అన్ని స్థాయిల్లోని సిబ్బంది వర్షాకాలంలో 24/7 క్షేత్రస్థాయిలో తగిన చర్యలు చేపట్టారు. సాంక్రమిక వ్యాధుల నివారణ మందులతోపాటు పాముకాటు, కుక్క కాటు మందులనూ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. వర్షాల బారిన పడిన ప్రాంతాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వైద్యారోగ్య శాఖతో కలిసి సురక్షిత తాగునీటిని ప్రజలకు అందేలా చూశారు. ఈ చర్యలన్నీ సత్ఫలితాలివ్వడంతో డయేరియా, టైఫాయిడ్ కేసులు భారీగా తగ్గాయి. 2019లో 4,60,931 డయేరియా కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 1.58 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. టైఫాయిడ్ కేసుల విషయానికి వస్తే 2019లో 28,551 నమోదు కాగా.. ఈ ఏడాది 7,869 మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో అతి తక్కువగా 117 టైఫాయిడ్ కేసులు రాగా.. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1,359 కేసులొచ్చాయి. ఈ ఏడాది చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 23,013 డయేరియా కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశి్చమ గోదావరి జిల్లాలో 3,279 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది అత్యధికంగా 80,854 డయేరియా కేసులు తూర్పు గోదావరి జిల్లాలో నమోదు కాగా.. ఈ ఏడాది కేవలం 6,161 కేసులు మాత్రమే నమోదయ్యాయి. -
తగ్గని సీజనల్ జ్వరాలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాను సీజనల్ జ్వ రాలు వదలడం లేదు. పల్లె, పట్నం అని తేడా లేకుండా జ్వరాలు విజృంభిస్తున్నా యి. వానాకాలం ముగిసి నెలరోజులు గడుస్తున్నా తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. టైఫాయిడ్, డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్లతో ప్రజలు ఆస్పత్రులపాలవుతున్నారు. టెస్టుల పేరుతో బాధితుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్యారోగ్య శాఖ అరకొర వైద్యంతో సరిపెడుతోంది. దీంతో మెరుగైన సేవలకోసం రోగులు పరకాల, హన్మకొండ, వరంగల్ లాంటి ప్రాంతాలకు పరుగుపెడుతున్నారు. వణికిస్తున్న జ్వరాలు.. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల క్రితం తగ్గినట్టు కనిపించిన జ్వరాలు మళ్లీ వణికిస్తున్నాయి. ముఖ్యంగా టైఫాయిడ్, వైరల్ జ్వరాల తీవ్రత అధికమైంది. దీనికితోడు వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పగలు విపరీతమైన ఎండవేడి.. రాత్రి సయంలో చలి పెరిగింది. దీంతో దగ్గు, జలుబులతో జనాలు గోసపడుతున్నారు. మరో వైపు డెంగీ జ్వరాలు కలవరపెడుతున్నాయి. శరీరం ఏమాత్రం వేడిగా అనిపించినా డెంగీ జ్వరమేమో అని అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అపరిశుభ్రతే అసలు సమస్య వర్షాకాలం పారిశుద్ధ సమస్య ఎక్కువగా ఉంటుంది. జ్వరాల తీవ్రత సైతం అధికంగా ఉంటుంది. జిల్లాలో వానలు తగ్గుముఖం పట్టి దాదాపు నెలరోజులు గడిచినా పారిశుద్ధ్య సమస్య అలాగే ఉంది. ఏ పల్లెను చూసినా మురికి గుంతలు, దోమలు, పేరుకుపోయిన చెత్తాచెదారం, పందుల బెడద కనిపిస్తోంది. పంచాయతీల్లో ప్రత్యేక పాలన ప్రారంభమైనప్పటి నుంచి పారిశుద్ధ్య సమస్య అధికమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వచ్చే జ్వరాలకు దోమలే కారణమని వైద్యులు చెబుతున్నారు. పరీక్షలకు తడిసిమోపెడు.. జిల్లాలోని ప్రజలు ఎక్కువ శాతం హన్మకొండ, వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏ జ్వరం వచ్చినా ముందుగా పలు రకాల పరీక్షలు చేయినిదే వైద్యులు మందులు రాసే పరిస్థితి లేదు. ఈ టెస్ట్‌ల ఖర్చే తడిసి మోపెడవుతోంది. జ్వరం రాగానే సీబీపీ, వైడల్, మలేరియా, డెంగీ తదితర పరీక్షలు చేయిస్తున్నారు. ఈ నాలుగు టెస్ట్‌లకు ల్యాబ్‌లలో సుమారు రూ.1200 నుంచి రూ.1500 వరకు ఖర్చవుతోంది. దీనికి పడకల చార్జీలు అదనం. ఆస్పత్రి స్థాయిని బట్టి రోజుకు రూ.400 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. డెంగీ అని తేలితే నిత్యం రక్తకణాల కౌంటింగ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. ఇందుకు రోజులకు రూ.500 వరకు వెచ్చించాల్సి వస్తోంది. నామామాత్రంగా వైద్య శిబిరాలు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉండడంతో పల్లె ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధ్వర్యంలో స్థానిక పీహెచ్‌సీల వైద్య బృందం గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి ముందుస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నామమాత్రంగా నెలలో ఒకటి రెండు సార్లు క్యాంపులు నిర్వహిస్తున్నారు. జ్వర పీడితులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా రెండు మాత్రలు ఇచ్చి సరిపెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దోమల మందు పిచికారీ చేయిస్తాం.. జిల్లాలో విషజ్వరాలు ప్రభలుతున్న గ్రామాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల వైద్యాధికారులను ఆదేశించాం. గుర్తించిన గ్రామాల్లో మెడికల్ క్యాంప్‌లు సైతం నిర్వహిస్తున్నాం. మలేరియా విభాగం అధికారులతో దోమల నివారణకు మందు పిచికారీ చేయాలని ఆదేశాలు జారీ చేశాను. సీజనల్ వ్యాధుల నివారణపై ఆశ వర్కర్లతో ప్రజలకు అవగహన కల్పిస్తాం. ప్రతి శుక్రవారం డ్రైండే పాటించేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సుదార్‌సింగ్, డీఎంహెచ్ఓ -
జిల్లాకు జ్వరమొచ్చింది
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :అవును.. జిల్లాకు జ్వరమొచ్చింది. పట్టణం.. గ్రామీణ ప్రాంతాలనే తేడాలేకుండా ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. ఎవరిని కదిపినా మలేరియూ.. టైఫాయిడ్ జ్వరమనే చెబుతున్నారు. అక్కడక్కడా డెంగీ కేసులు సైతం నమోదవుతున్నాయి. చికున్ గున్యా కేసులైతే లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నాయి. ఆసుపత్రులన్నీ జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో అత్యధికులకు ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం... జిల్లా మలేరియా నివారణ అధికారి ఎ.రామరాజు నవంబర్ 14న తాడేపల్లిగూడెం వచ్చిన సందర్భంలో వెల్లడించిన గణాంకాల ప్రకారం జిల్లాలో అప్పటివరకూ 607 మలేరియూ కేసులు నమోదయ్యూయి. 17 డెంగీ కేసులు సైతం నమోదైనట్టు ఆయన స్పష్టం చేశారు. తాళ్ళముదునూరుపాడులో డెంగీ లక్షణాలతోమృతి చెందిన వెలగల అనంతలక్ష్మి కుటుం బాన్ని ఆయన పరామర్శించారు. ఆమెకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదిక నకళ్లను ఆ సందర్భంలో సేకరించారు. ఆ తరువాత 16 రోజుల్లో వీటి సంఖ్య విపరీతంగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం నమోదైన మలేరియూ, డెంగీ కేసులు ఆందోళన కలిగిస్తుంటే.. అనధికారికంగా ఈ తరహా కేసులు అనేకం ఉన్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. డెంగీ అనుమానాస్పద కేసులు నమోదు అవుతున్నా వైద్యాధికారులు మాత్రం అవేమీ డెంగీ కాదని, సాధారణ జ్వరాలేనని కొట్టిపారేస్తున్నారు. పారిశుధ్య పరిస్థితులు క్షీణించడం వల్ల దోమలు పెరిగిపోరుు సాధారణ జ్వరాలు విజృంభిస్తున్నాయని తేల్చేస్తున్నారు. డెంగీ కేసులు తక్కువేమీ కాదు వైద్య అధికారులు జిల్లాలో డెంగీ జాడలు లేవంటున్నారు. మొన్నటివరకూ 17 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యూయని, ఇదేమీ ఆందోళన కలిగించే విషయం కాదని చేతులు దులిపేసుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారుు. జ్వరాల బారిన పడిన అత్యధికుల్లో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతోంది. తాడేపల్లిగూడెం పరిధిలో డెంగీ అనుమానాస్పద కేసులు 3 ఉన్నట్లు తెలుస్తోంది. తాళ్ళముదునూరుపాడులో రెండు డెంగీ అనుమానాస్పద కేసులు, తాడేపల్లిగూడెంలో ఒకటి ఉన్నాయి. తాడేపల్లిగూడెం, పెదతాడేపల్లి, జువ్వలపాలెం ప్రాంతాల్లో టైఫాయిడ్ విజృంభిస్తోంది. యాగర్లపల్లి, వీకర్స్కాలనీలోనూ ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. నిడదవోలులోనూ డెంగీ అనుమానాస్పద కేసులు రెండు నమోదు అయ్యాయి. ఏలూరు నగరంలో ఇద్దరు వ్యక్తులు డెంగీ బారిన పడినట్లు తెలుస్తోంది. జ్వరాలతో రోజూ కనీసం ఐదారుగురు తగ్గని జ్వరాలతో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య లెక్కకు అందనంత స్థాయిలో ఉంది. వీరిలో ఎక్కువ శాతం మంది టైఫాయిడ్‌తో బాధపడుతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. తణుకు, భీమవరం, చింతలపూడి, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లోనూ విషజ్వరాలు అధికంగా నమోదవుతున్నాయి. ఏజెన్సీ పడకేసింది ఏజెన్సీ గ్రామాలను మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు కుదిపేస్తున్నాయి. ప్రతి గ్రామంలో కనీసం 40నుంచి 50 మంది వరకు జ్వరాలతో మంచాలు పట్టారు. రేకులపాడు, రేపల్లె, చింతపల్లి, చింతకొండ, గుట్టాలరేవు, కన్నారప్పాడు వంటి గ్రామాల్లో మలేరియా జ్వరాలు విజృంభించడంతో గిరిజనులు విలవిల్లాడిపోతున్నారు. అధికారులెవరూ ఆ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేదు.