వణికిస్తున్న జ్వరాలు.. 16 లక్షల మందికి డెంగీ పరీక్షలు | Rise in Viral Fever And Dengue Cases in Hyderabad Telangana | Sakshi
Sakshi News home page

ఇంటికొకరు!

Published Thu, Sep 5 2019 3:35 AM | Last Updated on Thu, Sep 5 2019 12:13 PM

Rise in Viral Fever And Dengue Cases in Hyderabad Telangana - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్‌ : ఒక జిల్లా రెవెన్యూ అధికారి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. మరో ప్రాంతీయ రవాణా అధికారి కూడా వారం నుంచి ఇదే పరిస్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో జ్వరాల కారణంగా రోజువారీగా 20–25% మంది కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారు. ఒక పని కోసం మండల స్థాయి నాయకుడు ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తే తన మనవడికి జ్వరం వచ్చినందున ఆసుపత్రిలో ఉన్నానని, తాను ఇప్పుడు కలవలేనని చెప్పాడు. అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా జ్వరాల బారిన పడ్డారు. సచివాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది జ్వరాలబారిన పడడంతో కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. 

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ జ్వరాల కారణంగా సిబ్బంది విధులకు రావడంలేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులయితే ఆఫీసులకు రానవసరం లేదని, జ్వరం వస్తే విధులకు హాజరయినట్టే పరిగణిస్తామని ఆయా సంస్థలు సమాచారం ఇచ్చేశాయి. ఇదీ పడకేసిన తెలంగాణ తాజా పరిస్థితి. జ్వరపీడితులతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. డెంగీ పాజిటివ్‌ వస్తేనే బెడ్‌ ఇస్తామంటూ ఆసుపత్రులు తేల్చేశాయి. అది కూడా నాలుగైదు రోజుల నిరీక్షణ తర్వాతే. విధిలేని పరిస్థితుల్లో ఒక్కో పడకపై ఇద్దరిని పడుకోబెట్టి చికిత్సనందిస్తున్నాయి. సందర్శకులుండే రిసెప్షన్‌ సెంటర్లు కూడా రోగులతో నిండిపోతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.25 కోట్ల మంది జ్వరాలతో బాధపడుతున్నారని అంచనా. నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రిలో సోమవారం వచ్చిన ఔట్‌పేషంట్ల సంఖ్య 2వేల పైమాటే. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 16లక్షల మంది డెంగీ పరీక్షలు చేయించుకున్నారంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. 

ఎటు చూసినా రోగులే! 
రాష్ట్రంలోని ఆసుపత్రులు జ్వరబాధితులతో కిటకిటలాడుతున్నాయి. మండల, జిల్లా కేంద్రాల్లో ఉండే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో జ్వరం పేరుతో వచ్చిన వారందరికీ పరీక్షలు చేయాల్సి వస్తోంది. పరీక్షల అనంతరం డెంగీయా? మలేరియానా? అని తేలిన తర్వాతే ఆసుపత్రుల్లోనే ఉంచి చికిత్సనందిచాల్సి వస్తోంది. దీంతో ఆసుపత్రుల్లో పడకలకు కూడా కొరత ఏర్పడింది. తీవ్రజ్వరంతో వచ్చిన రోగికి పడక కావాలంటే నాలుగైదు రోజులు పడుతోందని, రోగుల సంఖ్యకు అనుగుణంగా ఎక్కడా బెడ్‌లు లేకపోవడంతో ఈ పరిస్థితి తప్పడం లేదని బాధితుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇదే అదనుగా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. జ్వరమనగానే అన్ని రకాల పరీక్షలు రాస్తుండడం, వాటికి వీలున్నంత ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అవసరమున్నా లేకపోయినా ఎడాపెడా మందులు రాస్తూ భారీగా దండుకుంటున్నాయి.
 
12 జిల్లాల్లో హైరిస్క్‌ 
రాష్ట్రంలో పరిస్థితిని బట్టి మొత్తం 12 జిల్లాలను ప్రభుత్వం హైరిస్క్‌ జిల్లాలుగా గుర్తించింది. ఇందులో హైదరాబాద్, భద్రాద్రి జిల్లాల్లో మరింత ప్రమాదకర పరిస్థితులున్నాయని, ఆయాప్రాంతాల్లో తగిన చర్యలు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించింది. ఒక్క హైదరాబాద్‌లోనే 309 డెంగీ హైరిస్క్, 151 మలేరియా హైరిస్క్‌ ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఫాగింగ్, యాంటీ–లార్వా ఆపరేషన్లు, నాలాలు, మురుగు కాల్వల్లో డ్రోన్‌ల ద్వారా స్ప్రేయింగ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఈ నివారణ చర్యలేవీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. గ్రేటర్‌లో వర్షాల కారణంగా మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయినా పట్టించుకున్న అధికారుల్లేరు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. క్లోరినేషన్‌ చేయకపోవడంతో మంచినీటిని ముట్టుకునే పరిస్థితి లేదు. తాగునీరు కూడా జ్వరాలకు కారణమవుతోందనే ఆందోళన నగర ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే హైదరాబాద్‌ నగర పరిధిలో ఎటుచూసినా అపరిశుభ్రతే దర్శనమిస్తోంది. 

24 గంటల ఓపీలేవీ 
రాష్ట్రంలో జ్వర తీవ్రత దృష్ట్యా జిల్లా కేంద్ర ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో 24 గంటల పాటు ఓపీ సేవలు అందించాలని ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి. కానీ, ఎక్కడా ఈ సేవలు కనిపించడం లేదని జ్వర పీడితులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ ఆసుపత్రులకెళ్తే పట్టించుకునే వారే లేరంటున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినా అక్కడా ప్రయోజనం ఉండటం లేదని బాధితులు, వారి కుటుంబసభ్యులు వాపోతున్నారు. చేతి చమురు వదిలించుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండటం లేదంటున్నారు. 
 
విద్యార్థులకే ఎక్కువ 
జ్వర పీడితుల్లో అన్ని వయసులు వారున్నా అందులో విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ జ్వరం వల్ల చనిపోతున్న వారిలోనూ ఎక్కువ మంది చిన్నారులే ఉండడం బాధాకరం. దీంతో తల్లిదండ్రులు.. పాఠశాలలు, విద్యాసంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో పరిశుభ్ర వాతావరణం లేకపోవడం, కొన్ని పాఠశాలల్లో కనీసం వెంటిలేషన్‌ కూడా లేకపోవడంతో విద్యార్థుల్లో ఎక్కువగా జ్వరాలు ప్రబలుతున్నాయని మండిపడుతున్నారు. చాలాచోట్ల వాటర్‌ ప్యూరిఫయర్లు కూడా లేకపోవడం, ఫాగింగ్‌ అసలే జరగకపోవడంతో పాఠశాలల్లోనే జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి. 
 
అన్ని చోట్లా ఇదే పరిస్థితి 
ఒక్క పాఠశాలల్లోనే కాదు. రాష్ట్రంలోని అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, సినిమాథియేటర్లు, షాపింగ్‌మాల్స్‌.. ఇలా ప్రతిచోటా.. పనిచేసే సిబ్బంది జ్వరం బారిన పడుతుండటతో ఆయా ప్రాంగణాలు బోసిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది పలుచబడటంతో పౌరసేవల్లో జాప్యం జరుగుతోంది. అయితే, గత మూడేళ్లతో పోలిస్తే రాష్ట్రంలో డెంగీ కేసులు పెరగ్గా, మలేరియా కేసులు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. జూన్‌–ఆగస్టు మాసాల్లో 2017లో సగటున 135 డెంగీ కేసులు నమోదు కాగా, 2019లో అది 149కి పెరిగింది. అదే మలేరియా విషయానికి వస్తే 2017లో 206 కేసులు నమోదు కాగా, 2019లో 47కు తగ్గిపోవడం గమనార్హం.
 
ముందు జాగ్రత్తలివే!
డెంగీ, మలేరియా, విష జ్వరాలొచ్చేముందు తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. ఒల్లు కదిపితే నొప్పెడుతుంది. చర్మంపై దద్దుర్లు కనిపించడం, కండరాలు, కీళ్లనొప్పులు ఉంటాయి. అధిక దాహం, రక్తపోటు పడిపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. డెంగీతో పాటు మలేరియా ఇతర జ్వరాల నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్‌లెట్‌ కౌంట్, డెంగీ స్ట్రిప్‌ టెస్ట్, సీరమ్‌ టెస్ట్‌ వంటి వాటితో నిర్ధారించడానికి శాస్త్రీయత లేదని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. తప్పనిసరిగా ఐజీఎం పరీక్ష చేయించాలి.

ప్లేట్‌లెట్లు 20వేలలోపు పడిపోతే అది ప్రమాదకరం. 15వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎలక్ట్రాల్‌ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వరతీవ్రత తగ్గి ప్లేట్‌లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. దోమలు కుట్టకుండా రోజూ జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. స్కూల్‌ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. కాచి వడబోసిన నీటిని తాగాలి. వైరల్‌ ఫీవర్‌ వస్తే మంచినీరు ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్‌లెట్లు పడిపోకుండా జాగ్రత్తపడవచ్చు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement