డెంగీ డేంజర్‌ బెల్‌ | Dengue Danger Bell | Sakshi
Sakshi News home page

డెంగీ డేంజర్‌ బెల్‌

Published Thu, Sep 28 2017 3:31 AM | Last Updated on Thu, Sep 28 2017 8:28 AM

Dengue Danger Bell

చిత్తూరు అర్బన్‌/ సాక్షి అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. వేలాది మంది మంచం పట్టారు. ఈ ఏడాది మలేరియా కంటే డెంగీనే ఎక్కువగా భయపెడుతోంది. ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్న చిన్న ఆసుపత్రుల్లో ఈ వ్యాధి నిర్ధరణ కిట్స్‌ లేకపో వడంతో జనం పెద్దాసుపత్రులకు క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200కు పైగానే డెంగీ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రభుత్వ దృష్టికి రానివి, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 1000 మంది వరకు డెంగీ బాధితులు ఉండవచ్చని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 35 మంది డెంగీతో మృతి చెందగా, ప్రభుత్వం మాత్రం సరైన లెక్కలు చెప్పడం లేదు. మంగళ, బుధవారాల్లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఆరుగురు డెంగీతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వరదయ్యపాలెం, సత్యవేడు, పాలసముద్రం, నాగలాపురం, పిచ్చాటూరు మండలాలకు చెందిన అశోక్‌ (19), డానియల్‌ (9), జ్యోషిత (3), రమణమ్మ (75), అంకమ్మ (40), సువర్ణ (14)లు మృత్యువాత పడ్డారు.

ఈ జిల్లాలో ఏకంగా 26 వేల మందికి పైగా ప్రజలు విష జ్వరాల బారిన పడినట్లు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. వరదయ్యపాలెం మండలంలోని కారిపాకం, బత్తలవల్లం, తొండూరు సొసైటీ కాలనీ, తొండూరు, రాదకండ్రి, రాచర్ల గ్రామాల్లో ప్రస్తుతం 400 మందికి పైగా ప్రజలు విష జ్వరాలతో మంచానపడ్డారు. మండల పరిధిలోని చిన్నపాండూరు, వరదయ్యపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోజుకు సగటున 150 మంది జ్వర పీడితులు వస్తున్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు 700 మంది జ్వరాలతో వస్తుంటే, తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ సంఖ్య 1200కు చేరింది. తిరుపతి డివిజన్‌లో 7200 మందికి విష జ్వరాలు సోకితే 110 మంది, చిత్తూరులో 6800 మందికి విష జ్వరాలు వస్తే 38 మంది, మదనపల్లెలో 12,185 విష జ్వరాల కేసుల్లో 73 మంది డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వారం వ్యవధిలోనే జిల్లాలోని ములకలచెరువు, మదనపల్లె, పెద్దపంజాణి, చౌడేపల్లె, ముడిబాపనపల్లె, నిమ్మనపల్లె, ఎర్రావారిపాలెం, నెరబైలు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కండ్రిగ, సత్యవేడు, తిరుపతి ప్రాంతాల్లో 18 డెంగీ కేసులు నమోదయ్యాయి. నిండ్ర, గారంపల్లె, మాదిరెడ్డిపల్లె, తంబళ్లపల్లె, పెద్దతిప్పసముద్రం, చిన్నగొట్టిగల్లు, పూతలపట్టు, తొట్టంబేడు ప్రాంతాల్లో 9 మలేరియా కేసులు నమోదయ్యాయి.  

గ్రామాల్లో పరిస్థితి అధ్వానం
విష జ్వరాలు కోరలు చాస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఇంకా నిద్రమత్తు వీడలేదు. గ్రామాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఇంటికొకరు చొప్పున విష జ్వరాల బారిన పడటంతో వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు అడపాదడపా వర్షం కురుస్తుండటంతో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారయ్యింది. ఇదే అదనుగా డెంగీ కోరలు చాచడంతో జనం పిట్లల్లా రాలిపోతున్నారు. డెంగీ నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవంగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొరియా నుంచి వేలాది దోమ తెరలు తెప్పించి పంపిణీ చేస్తామని చెబుతున్న మాటలు ఆచరణకు నోచుకోలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధరణ పరీక్షలు చేయడానికి అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు సమీపంలోని నగరాలు, పట్టణాలకు పరుగులుదీస్తున్నారు. మరోవైపు బోధనాసుపత్రుల్లో సైతం రోగులకు తగినన్ని మందులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

పాడేరు, శీతంపేట, రంపచోడవరం, శ్రీశైలం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు మలేరియాతో మంచం పట్టారు. సుమారు 1500 మందికి పైగా జ్వరాలబారిన పడినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఆయా తండాలకు రవాణా సదుపాయం లేనందున సత్వర రీతిలో గిరిజనులకు వైద్యం అందడం లేదు. ఫోన్లు చేసినా సకాలంలో 108 అంబులెన్స్‌లు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రన్న సంచార వైద్యం (104 వాహనాలు) ఏమైందో తెలియడం లేదంటున్నారు. ఈ పరిస్థితిలో తప్పని పరిస్థితితో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లినా పడకలు ఖాళీ ఉండటం లేదు. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు చికిత్స పొందాల్సిన దుస్థితి నెలకొంది. 

మంచం పట్టిన ‘ప్రకాశం’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:‘ఒక్కో గ్రామంలో 250 మందికి జ్వరాలున్నాయి. డెంగీ, మలేరియా ఎక్కువగా ఉంది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. డాక్టర్లు సరిపడా లేరు.. సరైన మందుల్లేవ్‌.. రిమ్స్‌తో సహా ఎక్కడా ప్లేట్‌లెట్‌ మిషన్‌ లేదు’ అని ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో వైద్యాధికారుల సమీక్షలో సాక్షాత్తు మంత్రి శిద్దా రాఘవరావు అన్నారంటే జిల్లాలో జ్వరాల తీవ్రత ఎలా ఉందో స్పష్టమవుతోంది. ప్రభుత్వ వైద్యం అందడం లేదనేందుకు మంత్రి మాటలే అద్దం పడుతున్నాయి. జిల్లాలో చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు జ్వరాల బారినపడి అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లాలో 95,524 మంది జ్వర పీడితులున్నారు. ఇందులో మలేరియాతో 106 మంది, డెంగీ లక్షణాలతో 268 మంది, డయేరియాతో 20,819 మంది, టైఫాయిడ్‌తో 11,015 మంది ఉన్నారు.

జిల్లాలో జ్వరాల వల్ల మరణాల్లేవని వైద్యారోగ్య శాఖ చెబుతుండగా, పది రోజుల్లో సుమారు 55 మంది మృతి చెందినట్లు సమాచారం. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సక్రమంగా వైద్యం అందకపోవడంతో ప్రజలు ఆర్థిక భారమైనా కార్పొరేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 ఏరియా ఆస్పత్రులు, ఒక మాతాశిశు వైద్యశాల, 8 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లతోపాటు జిల్లా కేంద్రంలో రిమ్స్‌ ఆస్పత్రి ఉంది. 193 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా దాదాపు 30 డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 173 మంది సాఫ్ట్‌ నర్సులకుగాను 30 వరకు ఖాళీలున్నాయి. ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అన్ని విభాగాల్లోనూ సిబ్బంది కొరత ఉంది. మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement