బనశంకరి: రాష్ట్రంలో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో రోగకారకమైన ఈడీస్ దోమల ఉత్పత్తి పెరిగింది. దీంతో రాష్ట్రంలో డెంగీ, చికెన్‌గున్యా కేసులు హెచ్చుమీరుతున్నాయి. జ్వరాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బాధితులతో ఆస్పత్రులు కిక్కిరిస్తున్నాయి. డెంగీ కేసుల సంఖ్య 10 వేలకు సమీపిస్తుండగా చికెన్‌గున్యా కేసులు వెయ్యికి దగ్గరలో ఉంది. ఇప్పటివరకు 68 వేల మందికిపైగా డెంగీ అనుమానితుల రక్త నమూనాలు సేకరించగా 9,559 మందిలో డెంగీ కేసులు వెలుగుచూశాయి. 22 వేల మందికి పైగా చికెన్‌గున్యా అనుమానితుల రక్త నమూనా సేకరించి పరీక్షించగా 982 మంది వ్యాధి బారినపడినట్లు తెలిసింది.
డెంగీ లక్షణాలు
విపరీతమైన జ్వరం, కంటి కిం నొప్పి, తీవ్రమైన తలనొప్పి, చేతులు కాళ్లు, కీళ్లు నొప్పులు, వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, నోరు, ముక్కులో రక్తస్రావం, చర్మంపై ఎరుపురంగులో గుల్లలు ఏర్పడటం, రక్తస్రావం గుర్తులు, ఎరువు రంగులో మలవిసర్జన, విపరీతమైన దాహం, స్పృహకోల్పోవడం, బీపీ పెరగడం.
డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు
బెంగళూరు నగరంలో 5,511, మైసూరులో 454, ఉడుపిలో 429 డెంగీ కేసులు నమోదయ్యాయి. శివమొగ్గ 232, కలబురిగి 219, దక్షిణకన్నడ 210, విజయపుర 188, చిత్రదుర్గ 167, బెళగావి 154, దావణగెరె 152, హాసన 145, చిక్కమగళూరు 143, తుమకూరు 136, కొడగు 119, ధారవాడ 115, చామరాజనగర 113, మండ్య 108, కోలారులో 106 డెంగీ కేసులు నమోదయ్యాయి.
ఉచిత చికిత్స...
ఎలాంటి జ్వరం బారినపడినప్పటికీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో చికిత్స లభిస్తుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితరక్తపరీక్షలు, చికిత్స పొందవచ్చు.
ఆరోగ్యశాఖ సూచన
కేంద్రమార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ముందుజాగ్రత్తచర్యలు తీసుకోవడం, ప్రజల్లో డెంగీ, చికెన్‌గున్యా గురించి అవగాహన కల్పించాలని ఆరోగ్యశాఖఅధికారులకు సూచిస్తూ ఆరోగ్యశాఖ కమిషనర్ డీ.రందీప్ ఆదేశాలు జారీచేశారు.
చికెన్‌గున్యా లక్షణాలు
ఇది కూడా ఈడీస్ జాతీయ దోమ కాటుతో ఒకరినుంచి మరొకరికి ప్రభలుతుంది. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కానీ ఇది మరణాంతకం కాదు. జ్వరం, కీళ్లలో తీవ్రమైన నొప్పులు, వాపు కనబడుతుంది. రోగలక్షణాలు కనబడిన తక్షణమే డాక్టర్లును సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment