ఆన్‌లైన్‌లో పెరిగిన వెతుకులాట.. ‘కన్జూమర్ సెర్చ్ ట్రెండ్స్ డేటా’లో వివిధ అంశాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో డెంగీ వ్యాప్తి అనేది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆందోళనకు కారణమవుతోంది. అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో దోమల పెరుగుదల, పారిశుధ్య నిర్వహణ లోపాలతో డెంగీ వ్యాప్తికి అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఈ కేసులు పెరగగా, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ డెంగీ కేసుల్లో పెరుగుదల నమోదు కావడం ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. దీంతో డెంగీ టెస్టింగ్, దీని ట్రీట్మెంట్‌కు సంబంధించిన సర్వీసులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయనే దానిపై ఆన్‌లైన్‌లో ప్రజలు వెతకడం పెరిగిపోయింది.
ఈ జనవరి–మార్చి నెలల మధ్యలో పోల్చితే ఏప్రిల్– జూన్‌ల మధ్య డెంగీకి చికిత్సలో నిపు ణులైన డాక్టర్లకు 20 శాతం మేర డిమాండ్ పెరిగినట్టు స్పష్టమైంది. భారత్‌లో స్థానిక సెర్చ్ ఇంజిన్ ‘జస్ట్ డయల్’ విడుదల చేసిన ‘కన్జూమర్ సెర్చ్ ట్రెండ్స్ డేటా’లో ఆయా అంశాలు వెల్లడయ్యాయి. అంతేకాదు.. దోమ కాటు నివారణ కోసం దోమ తెరలకు కూడా భారీగా డిమాండ్ పెరిగినట్టు వెల్లడైంది. జాతీయ స్థాయిలో వీటి అమ్మకాలు ఒక్క సారిగా 64 శాతం పెరగగా...ఢిల్లీలో 709 శాతం, పుణెలో 216 శాతం, అహ్మదాబాద్‌లో 160 శాతం, బెంగళూరులో 122 శాతం, కోల్‌కతాలో 96 శాతం, ముంబైలో 31 శాతం, హైదరాబాద్‌లో 27 శాతం పెరుగుదల నమోదైనట్టుగా తెలుస్తోంది.
దోమల సమస్య నియంత్రణకు ‘పెస్ట్‌కంట్రోల్ సర్వీసెస్’ను కూడా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఆశ్రయిస్తున్నారు. మొత్తంగా చూస్తే... దేశవ్యాప్తంగా పెస్ట్ కంట్రోల్ కేటగిరీలో ఆన్‌లైన్‌లో సెర్చింగ్ 24 శాతం పెరగగా, మెట్రోనగరాల్లో 25 శాతం, నాన్ మెట్రోనగరాల్లో 24 శాతం వృద్ధి నమోదైంది.ఈ విషయంలో ఢిల్లీ 97 శాతం వృద్ధితో ప్రథమస్థానంలో నిలవగా, కోల్‌కతా 68శాతంతో, అహ్మదాబాద్ 45 శాతంతో, బెంగళూరు 19 శాతం, ముంబై 13 శాతం వృద్ధి సాధించింది.
బల్లులు, నల్లుల నివారణకూ ఆన్‌లైన్ సెర్చింగ్
దోమలతో పాటు బల్లులు, తేనెటీగలు, నల్లులు, పాము లు వంటి వాటి నియంత్రణకు అవసరమైన సర్వీసుల గురించి కూడా ఆన్‌లైన్ సెర్చింగ్ పెరిగింది. డెంగీ కేసుల వృద్ధి నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత, దోమలు రాకుండా రెపెల్లెంట్‌ల వినియోగం, వేగంగా వైద్యసహాయం తీసుకోవడం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో అవగా హన వంటి వాటికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment