
శ్రద్ధాకపూర్
హీరోయిన్స్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు. తీరక లేకుండా ఒక సినిమా సెట్ నుంచి మరో సెట్‌కు షిఫ్ట్ అవుతుంటారు. ఇలాంటి బిజీ షెడ్యూల్స్‌లో అనారోగ్యం బారిన పడితే? అంతే.. సినిమాలన్నీ ఆగిపోతాయి. ప్రస్తుతం బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు. నెల రోజులుగా శ్రద్ధా డెంగ్యూతో బాధపడ్డారు. ఆమె ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’, సైనా నెహ్వాల్ బయోపిక్ చిత్రాలు చేస్తున్నారు. జ్వరం కారణంగా షూటింగ్‌కి వెళ్లలేకపోయారు. ఈ నెల రోజులు ఇంట్లో ఉండటం వల్ల చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను అంటున్నారు శ్రద్ధా కపూర్.
‘‘నా అనారోగ్యాన్ని అర్థం చేసుకుని సహనంగా ఎదురు చూసిన చిత్రబృందాలకు థ్యాంక్స్. త్వరగా కోలుకోవాలని కోరుకున్న అభిమానులకు, ఆత్మీయులకు కూడా. డెంగ్యూ కారణంగా నెల రోజులు ఇంట్లోనే ఉన్నాను. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే వీలు దొరికింది. మనల్ని ప్రేమించే వాళ్లకు ఎక్కువ టైమ్ కేటాయించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాను. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే అది మనవాళ్లతో టైమ్ స్పెండ్ చేయడమే. నా మీద ఇంత ప్రేమను కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. థియేటర్స్‌లో కలుద్దాం’’ అని పేర్కొన్నారు.