జ్వరమా..? జేబులో డబ్బుందా? | Dengue deposit is over Rs. 30,000 in hospitals | Sakshi
Sakshi News home page

జ్వరమా..? జేబులో డబ్బుందా?

Published Sun, Oct 8 2017 4:09 AM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM

Dengue deposit is over Rs. 30,000 in hospitals - Sakshi

దర్శికి చెందిన సౌజన్య జ్వరంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వెళ్లింది. డెంగీ అని తేల్చి మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచుకుని రూ. 28 వేల బిల్లు వేశారు. ఆ జ్వరమేంటో తెలియని బాధితురాలు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో అప్పుచేసి మరీ బిల్లు చెల్లించి ఇంటికొచ్చింది.  గుంటూరు జిల్లాకు చెందిన రత్నకుమారి జ్వరంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. రెండ్రోజులకు కూడా జ్వరం తగ్గకపోతే గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పలు రకాల టెస్టులు చేసి, చివరకు మలేరియా అని తేల్చి రూ. 10 వేలు పిండుకున్నారు. ఈ రెండూ ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉన్నాయి.  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ లాంటి ప్రమాదకర జ్వరాలు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పేదలకు వైద్యం తలకు మించిన భారం అవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యం అందక వారు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ వారు వేలు, లక్షల్లో బిల్లులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద రోగుల పరిస్థితి ఇలానే ఉంది. పీహెచ్‌సీల్లో వైద్య పరీక్షల బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ నిర్లక్ష్యం ప్రైవేట్‌ ఆస్పత్రులకు వరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి మూడు ఇళ్లకు ఒక ఇంటిలో జ్వర పీడితులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

పేదలకు అందుబాటులో ఉండాల్సిన పీహెచ్‌సీల్లో కనీస వైద్య పరీక్షలు సకాలంలో చేయకపోవడం, డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడం వంటి సమస్యలు వారిని వేధిస్తున్నాయి. సాధారణ వైరల్‌ జ్వరమొచ్చినా విధిలేని పరిస్థితిలో ప్రైవేట్‌ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. రకరకాల పరీక్షలతో ప్రైవేటు ఆస్పత్రులు పేదల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. మూడు రోజుల్లో తగ్గిపోయే సాధారణ జ్వరానికి కూడా మూడు వేల రూపాయల పైనే గుంజుతున్నారు. గడిచిన రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల నుంచి 60 లక్షల మందికిపైనే వైరల్‌ జ్వరాల బారిన పడినట్టు ప్రభుత్వ అంచనా. వీరిలో చిన్నారులే అధికంగా ఉన్నారు. సీజన్‌ మారినప్పుడు వచ్చే ఈ జ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలకు మనీ సీజన్‌గా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.  

పీహెచ్‌సీల్లో ‘మెడాల్‌’ దారుణాలు 
రాష్ట్రవ్యాప్తంగా 1,157 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఒక్కో పీహెచ్‌సీకి తాజా సీజనల్‌ వ్యాధుల దృష్ట్యా రోజూ 80 నుంచి వంద మంది రోగులు వస్తున్నారు. కానీ కొన్ని వైద్య పరీక్షలు ఇక్కడ జరగకపోవడం, మధ్యాహ్నం 2 గంటల తర్వాత డాక్టర్లు అందుబాటులో  లేకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంతేగాక రెండు వందలకుపైగా పీహెచ్‌సీల్లో డాక్టర్లు లేకపోవడం కూడా ప్రైవేట్‌ ఆస్పత్రులకు కలసివస్తోంది. పీహెచ్‌సీల్లోని వైద్య పరీక్షల్లో డెంగీకి సంబంధించి రాపిడ్‌ టెస్ట్‌కిట్‌ను మెడాల్‌ సంస్థకు అప్పగించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ టెస్టు పీహెచ్‌సీలోనే చేయాలి. రక్త నమూనా తీసుకున్న అరగంటలో రిపోర్టు ఇవ్వాలి. కానీ మెడాల్‌ సంస్థ పీహెచ్‌సీలో ల్యాబొరేటరీ ఏర్పాటు చేయకపోవడంతో రక్తనమూనాలను వేరే చోటకు తీసుకెళ్లి రెండుమూడు రోజుల తర్వాత రిపోర్టు ఇస్తున్నారు.

ఈలోగా బాధితుడికి జ్వర తీవ్రత పెరిగితే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. ఇలా ప్రధానమైన 7 రకాల పరీక్షలు మెడాల్‌ సంస్థకు ఇవ్వడం, ఆ సంస్థ మూడు రోజులకు గానీ రిపోర్టులు ఇవ్వకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు గర్భిణుల విషయంలో అరగంటలో రిపోర్టు ఇవ్వగలిగే ఆర్‌పీఆర్‌ టెస్ట్‌కు కూడా ఆ ప్రైవేట్‌ సంస్థ మూడు రోజుల తర్వాత రిపోర్టు ఇస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అప్పోసొప్పో చేసైనా ప్రాణాలు నిలబెట్టుకోవాలని పేదలు కూడా ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు.  

ప్లేట్‌లెట్స్‌ పేరిట దోపిడీ 
ప్రధానంగా ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ జ్వరం పేరు చెప్పి బాధితులను పిండేస్తున్నాయి. డెంగీ జ్వర లక్షణాలు పూర్తిగా తెలియకముందే ప్లేట్‌లెట్స్‌ (తెల్లరక్త కణాలు) తగ్గిపోయాయని, బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని బెదిరిస్తున్నారు. వాస్తవానికి డెంగీ అని తెలియడానికి రాపిడ్‌ టెస్ట్‌ కిట్‌–ఆర్డీటీ పరీక్ష ఒక్కటే సరిపోదు. ఐజీజీ, ఐజీఎం, ఎలీశా టెస్టులు చేస్తేనే పూర్తి స్థాయిలో ఫలితం తేలుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పరీక్షలన్నీ చేయకుండానే బాధితుడిని ఇన్‌పేషెంటుగా చేర్చుకుంటున్నారు. ప్లేట్‌లెట్స్‌ ఎక్కించి నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంచుకుని రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయా జిల్లాల్లోని బాధితులు ఆర్థికంగా చితికిపోతున్నారు. జ్వరమంటేనే బాధితులు వణికిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఏపీలోని వైద్య పరీక్ష కేంద్రాల్లో గడిచిన నెల రోజుల్లో రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు అయ్యింటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

పెద్దాసుపత్రుల్లో పడకలు లేవు 
జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో పడకలు సరిపోవడం లేదు. కడప రిమ్స్‌ చిన్నపిల్లల వార్డులో 40 మందికి కూడా సరిపడే పడకలు లేవు. అలాంటిది 150 మంది ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు ముగ్గురిని పడుకోబెడుతున్నారు. ఇంకా దారుణం ఏంటంటే మంచాల కొరతతో జ్వరం తగ్గకముందే పేషెంట్లను డిస్‌చార్జి చేస్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొంది. ఏ పెద్దాసుపత్రిలో చూసినా వైరల్‌ జ్వరాలు, డెంగీ జ్వర బాధితులే ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా జ్వరాలు నమోదు అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా డాక్టర్లు కూడా ఆస్పత్రులకు రాలేక పోతుండటంతో గిరిజనుల పరిస్థితి దారుణంగా ఉంది.  

ధరల నియంత్రణపై చర్యలు శూన్యం 
కార్పొరేట్‌ లేదా ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్‌ సెంటర్లు ఇష్టారాజ్యంగా వసూళ్లు చేయడానికి లేదు. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారమే ధరలు వసూలు చేయాలి. వచ్చిన రోగులందరికీ కనిపించేలా ధరల పట్టికను ఉంచాలి. కానీ చాలా ప్రైవేట్‌ ఆస్పత్రులు ఈ నిబంధనలు పాటించడంలేదు. ఆస్పత్రుల్లో ధరలను నియంత్రించాల్సిన అధికారాలు రాజకీయ నేతల బెదిరింపుల నేపథ్యంలో మిన్నకుండిపోతున్నారు. ఎవరైనా డీఎంహెచ్‌వో తనిఖీలకు వెళితే నాలుగు రోజులు కూడా ఆ జిల్లాలో పనిచేయలేరని, అధికార పక్ష నేతలే ఫోన్లు చేసి బెదిరిస్తారని ఓ జిల్లా వైద్యాధికారి వాపోయారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల ధరలను ఎవరూ నియంత్రించే పరిస్థితి లేదని చెబుతున్నారు. 

జిల్లా వైద్యాధికారులదే బాధ్యత 
ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల ధరల నియంత్రణ బాధ్యత ఆయా జిల్లా వైద్యాధికారులదే. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం వాళ్లే తనిఖీలు చేసి ధరలు నియంత్రించాలి. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆర్డీటీ కిట్‌లతో పరీక్షలు చేసి డెంగీ పాజిటివ్‌ అంటున్నారు. ఇది సరికాదు. ఐజీజీ, ఐజీఎంతోనే టెస్టులు చేయాలి. తాజాగా కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, నేను ప్రకాశం జిల్లాకు వెళ్లాం. ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. నిజంగా ప్లేట్‌లెట్స్‌ అవసరమైతే బ్లడ్‌ సెపరేటర్స్‌ ఉన్నాయి. మన బ్లడ్‌బ్యాంకులో లభిస్తాయి. ప్రస్తుతం డెంగీ వ్యాప్తి నిలకడగా ఉంది. ప్రకాశం, చిత్తూరులో కొద్దిగా ఎక్కువగా ఉంది. 
– డా.గీతా ప్రసాదిని, అదనపు సంచాలకులు, ప్రజారోగ్యశాఖ 

ప్లేట్‌లెట్స్‌ ట్రీట్‌మెంట్‌ అనేది తప్పు 
డెంగీ అంటే చాలు ప్లేట్‌లెట్స్‌ అంటూ రోగులను తప్పుదారి పట్టిస్తున్నారు. అసలు డెంగీకి ప్లేట్‌లెట్స్‌ ట్రీట్‌మెంట్‌ కరెక్టు కాదు. చాలామంది రోగులను చూస్తున్నా.. లక్షకు పడిపోయాయి, 80 వేలకు పడిపోయాయి అని చెబుతున్నారు. 25 వేలు ప్లేట్‌లెట్స్‌ ఉన్నా ఏమీ కాదు. కానీ భయభ్రాంతులను చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారు. డెంగీ చికిత్సకు సంబంధించి కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేసింది. దీన్నిబట్టి చికిత్స చేయాలి.     
–డా.ఎన్‌.సుబ్బారావు, వైద్యవిద్యా సంచాలకులు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement