యోధులు సైన్యంలో ఉండొచ్చు. కుస్తీగోదాలలో ఉండొచ్చు. మార్షల్ ఆర్ట్స్ బరిలో ఉండొచ్చు. కండలు పెంచే జిమ్‌లలో ఉండొచ్చు. కాని వీరి కంటే గొప్ప యోధులు, చిన్నారి యోధులు హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు. వీరు నయం కాని వ్యాధులతో అలుపెరగక పోరాడుతుంటారు.
సిరంజీలు, సెలైన్ బాటిల్స్ చుట్టుముట్టినాఒక్క చిరునవ్వుతో వాటిని ఓడించాలని చూస్తారు. వీరిని పలకరించడం, ఉత్సాహ పరచడం సాయ పడటం ఏ మనిషికైనా పరమ కర్తవ్యం. హైదరాబాద్‌లో ఇలాంటి పిల్లలు ‘స్పర్శ్ హాస్పీస్ అండ్ పాలియేటి కేర్ సెంటర్’లో ఉన్నారు. వారిని ‘సాక్షి’ కలిసింది. చైల్డ్ సెలబ్రిటీలను కలిపింది. పోరాడే నవ్వులను పకపకలాడించింది.
ప్రపంచంలోని ఏ చిన్నపిల్లలకు కూడా ‘స్పర్శ్’ వంటి సెంటర్‌ల చిరునామా ఎప్పటికీ తెలియకూడదు. అక్కడకు రావాల్సిన అవసరం ఎప్పటికీ రాకూడదు. కాని దురదృష్టవశాత్తు కొందరు అక్కడికి వస్తారు. నయం కాని వ్యాధులతో పోరాడుతూ అక్కడ సాంత్వన పొందుతారు. సహాయం పొందుతారు. జీవించి ఉండే కాంక్ష చల్లారిపోనీకుండా చూసుకుంటారు. అలాంటి పిల్లలకు ‘స్పర్శ్ హాస్పీస్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్’లో ఉచితంగా ఉపశమన సేవలను అందిస్తుంది.
జబ్బు నయం కానప్పటికీ వారు కాసింత సాంత్వన పొందడానికి పాలియేటివ్ కేర్ అందిస్తుంది. రానున్న నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ సందర్భంగా ఇక్కడ సేవలు పొందుతున్న పసి హృదయాలలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. వెండి తెరపై చైల్డ్ ఆర్టిస్టులగా రాణిస్తున్న కార్తికేయ దేవ్, ఫర్జానాలను ఈ చిన్నారులతో కలిసి ముచ్చటించేలా చూసింది. చైల్డ్ సెలబ్రిటీలతో ఆ పిల్లలు తమ ఇబ్బందులు, ఇష్టాలు, కష్టాలను మనసారా పంచుకున్నారు.
ఆ పిల్లల ఆత్మీయత పంచుకున్న చైల్డ్ సెలబ్రిటీలు స్పర్శ్ సేవల్లో తామూ భాగమవుతామని మాటిచ్చారు. ‘సలార్’, ‘గుడ్ బ్యాడ్ అగీ’్ల వంటి సినిమాల్లో గుర్తింపు పొంది త్వరలో రాబోతున్న వరుణ్‌తేజ్ ‘మట్కా’లో మెరవనున్న కార్తికేయదేవ్, ‘ఓరి దేవుడా’లో నటించిన ఫర్జానా ఈ పిల్లల కోసం సరదా సరదా డాన్సులు చేశారు. అల్లరి ఆటలు ఆడారు. ఆ పిల్లలు కూడా వారి అవస్థలు కొద్దిసేపు మర్చిపోయి అడిగి మరీ డైలాగ్స్ చెప్పించుకున్నారు. షూటింగ్ ఎలా ఉంటుంది అని అడిగి తెలుసుకున్నారు. నేనూ పాడతాను., వింటావా అంటూ ఆ ఆర్టిస్టుల ముందు ఆనందంగా పాటలు పాడారు. ‘స్పర్శ్’లో ఊరట పొందుతున్న పిల్లలు సెలబ్రిటీలతో తమ ఆరోగ్య సమస్య ఏమిటో పంచుకున్నారు.
చిన్నారులకు ఆత్మీయ సాంత్వన
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, చికిత్స అందించినా నయం కాని జబ్బులతో అవస్థలు పడుతున్న వారికి ఉచితంగా పాలియేటివ్ కేర్ సేవలు అందించాలనే లక్ష్యంతో 2011లో ‘స్పర్శ్ హాస్పీస్ అండ్ పాలియాటీవ్ కేర్ సెంటర్’ను ప్రారంభించాం. దీనిని రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ప్రారంభించి, నిరంతరం విరాళాలు సేకరిస్తూ ఈ సేవలు కొనసాగిస్తున్నాం. 82 బెడ్ల సామర్థ్యంతో అన్ని వయసుల వారికీ ఇక్కడ ఉచితంగా సేవలు అందిస్తున్నాం. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా వార్డ్ ఏర్పాటు చేశాం. ఈ పీడియాట్రిక్ వార్డ్‌లో చిన్నారుల కోసం ప్రత్యేకమైన బెడ్లు, ఆహారం, న్యూట్రిషన్, ప్లేస్టేషన్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశాం.
ఇక్కడ వైద్యపరమైన ఉపశమన సేవలతో పాటు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా సాంత్వన చేకూర్చుతాం. దీని కోసం ప్రత్యేకంగా పాలియాటివ్ కేర్ ఫిజీషియన్‌లు, నర్సులు, సైకాలజిస్టులు, కౌన్సిలర్లు, సోషల్ వర్కర్లు, వాలంటీర్లు, వార్డ్ బాయ్స్, ఆయాలు...ఇలా 130 మందికి పైగా ఉన్నారు. విభిన్న కారణాలతో ఈ సెంటర్‌కు రాలేని వారికి ఈ సేవలు అందేలా.. స్పర్శ్ టీమ్ పేషెంట్ల ఇంటికే వెళతారు. స్పర్శ్ నుంచి 60 కిలోమీటర్ల లోపు అందించే ఈ హోం కేర్ సేవల కోసం ప్రత్యేకంగా 6 వ్యాన్లను సైతం ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి పేషెంట్లు మా వద్దకు వస్తుంటారు.
– శారద, కౌన్సెలింగ్ ఇన్‌ఛార్జ్, సైకాలజిస్ట్
చాలా హ్యాపీగా ఉంది
ఇంట్లో చాలా నొప్పులతో ఏడ్చేవాడిని. ఇక్కడ మాత్రం ఏ ఇబ్బంది వచ్చినా డాక్టర్లు మందులు ఇస్తారు, మంచిగా మాట్లాడతారు, ఆటలు ఆడతారు. కార్తికేయ అన్న నా కోసం ‘నీకెప్పుడు అవసరమున్నా నేనొస్తాననే’ డైలాగ్ చెప్పాడు. నేను తన కోసం పాట పాడాను. సెల్ఫీలు దిగాం ఇద్దరం. కార్తికేయ అన్న ప్రభాస్ సినిమాలో చేశాడంటా. నా కోసం రావడం హ్యపీగా ఉంది.
– అబ్దుల్ అర్ఫత్, పదేళ్ల వయసు, కేన్సర్ బాధితుడు
ఇలాంటి పిల్లలకు సాయం అందాలి
సాక్షి మీడియా ద్వారా స్పర్శ్ సెంటర్‌లో ఉన్న పిల్లలను కలిసిన చైల్డ్ సెలబ్రిటీలు కారికేయ, ఫర్జానా ఎంతో కదిలిపోయారు. ‘మాకు, ఇక్కడి చిన్నారులకు వయసులో పెద్దగా వ్యత్యాసం లేదు కానీ జీవితాల్లో చాలా తేడా ఉంది. దేశవ్యాప్తంగా ఇలాంటి చిన్నారులు ఎందరో ఉన్నారని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. మేమెంత మంచి జీవితాన్ని అనుభవిస్తున్నామో తెలిసింది. వారికి ఆనందాలు పంచుదామని వచ్చి ఆరోగ్యం ఎంత విలువైనదో తెలుసుకుని వెళుతున్నాను’ అని కార్తికేయ దేవ్ అంటే ‘రోజూ అమ్మతో హాయిగా ఆడుకునే నాకు ఈ చిన్నారులను చూస్తుంటే చాలా బాధేసింది. వారికి సంతోషాలు పంచాలని పాటలు పాడాను. వారితో ఆడుకున్నాను. తదుపరి నా షూటింగ్‌కు కూడా తీసుకెళతానని చెప్పాను. భవిష్యత్‌లో స్పర్శ్ సేవల్లో భాగం పంచుకోవాలని ఉంది’ అని ఫర్జానా అంది.
ఈ పిల్లలు చిరంజీవులు కావాలి
‘స్పర్శ్’లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న తమ పిల్లలు చిర ఆయువును పొందాలని కన్నీటి ప్రార్థనలు చేస్తారు. తమ పిల్లలు చిన్న చిరునవ్వు నవ్వితే, సరిగ్గా ఏదైనా తింటే అదే పది వేలుగా మురిసిపోతారు. కాని వారి గుండెల్లో బడబాలనం ఉంది. వారిని అడిగితే – ‘మా బాబుకు ఆ మాయదారి రోగం ఎందుకొచ్చిందో తెలియదు. కేన్సర్ అంట. నాలుగో స్టేజ్‌లో ఉంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చికిత్స అందించాం.
జ్యూస్ సెంటర్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నాను. ఈ స్పర్శ్ హాస్పిటల్ గురించి తెలిసాక ఇక్కడి సేవలు పొందుతున్నాం. పూర్తిగా నయం చేయలేం కానీ., మీ బాబుకు ఎలాంటి అవస్థలు లేకుండా చూసుకుంటాం అని భరోసా ఇచ్చారు.. ఎంతో ఊరటగా ఉంది’ అని చార్మినార్‌కు చెందిన షేక్ ఇర్ఫాన్ అంటే ‘నాకిద్దరు కొడుకులు., అందులో ఒక అబ్బాయి టకాయసు ఆర్టిటైటిస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ వ్యాధి నయమయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. కానీ అంత ఖరీదైన చికిత్స అందించే స్థోమత మాకు లేదు.
కనీసం తన నొప్పులు, అవస్థలైనా తగ్గించాలని స్పర్శ్‌లో చేర్చాం. ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంటున్నారు. తనను చూసుకోవడం కోసం నా మరో అబ్బాయి కూడా చదువులకు దూరమయ్యాడు. మా ఆయన ఒక్కడు పని చేస్తే మా అందరికీ రోజు గడుస్తుంది’ అని మౌలాలికి చెందిన శైలజ అన్నారు. ‘పుట్టుకతోనే వచ్చే కంజెనిటల్ హార్ట్ డిసీజ్‌తో మా పాప బాధపడుతోంది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం... కానీ లాభం లేకుండాపోయింది. ఈ సమయంలో స్పర్శ్ సైకాలజిస్టులు అందించిన మానసిక సాంత్వన కొంత కుదుట పడేలా చేసింది. ఏ పిల్లలకూ ఇలాంటి పరిస్థితులు రావొద్దని ఆశిస్తున్నాను. అందరు పిల్లలు చిరంజీవులుగా నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాను. అని సఫిల్‌గూడకు చెందిన శారద అన్నారు.
వన్స్‌మోర్ కొట్టాను
అప్పుడప్పుడు నాకేం అవుతుందో నాకే అర్థం కాదు. ఇబ్బందిగా ఉంటుంది, బాధ అనిపిస్తుంది. కానీ అమ్మ ఏడుస్తుందని బయటకు చూపించను. నా కోసం అమ్మా నాన్న అన్నీ కోల్పోయారు. అన్న చదువులు మానేసి నన్నే చూసుకుంటున్నాడు. తన చదువులకు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితికి చేరుకున్నాం. ఇలాంటి సమయంలో మా కష్టాలను మర్చిపోయేలా ఈ స్పర్శ్ చూసుకుంటోంది. ఇక్కడ ఉన్నంత సేపు ఏ బాధలు గుర్తు రావు. ఫర్జానా నా కోసం పాట పాడటం, కార్తికేయ కల్కి సినిమా పాటకు డ్యాన్స్ వేయడం ఎప్పటికీ మర్చిపోను. వన్స్‌మోర్ అంటూ మళ్లీ డ్యాన్స్ చేయించుకున్నాను.
– మానిక్‌రాజ్
– డి.జి. భవాని
– హనుమాద్రి శ్రీకాంత్
ఫొటోలు: నోముల రాజేష్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment