చివరి మజిలీకి.. కేరళ అనువైన ప్లేస్
తిరువనంతపురం: కేరళ పేరు వినగానే ప్రకృతి సౌందర్యం, అందమైన బీచ్లు, బోటింగ్ గుర్తుకొస్తాయి. దేశ, విదేశాల నుంచి లక్షలాదిమంది టూరిస్టుల రాకతో కేరళ నిత్యం కళకళలాడుతుంటుంది. కేరళ విహార యాత్రకే గాక మరణించడానికి కూడా దేశంలో అత్యుత్తమ స్థలం. కేన్సర్ సహా ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కేరళ ఆపన్నహస్తం అందిస్తోంది.
కేరళలో పాలియేటివ్ కేర్ (ఉపశమనం కలిగించే వైద్యశాల)ను ఓ ఉద్యమంలా విస్తరిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే రోగులకు ఉపశమనం కలిగించడం పాలియేటివ్ కేర్ లక్ష్యం. అవసానదశలో ఉన్న రోగుల్లో శారీరక అలసట, మానసిక ఒత్తిడి తగ్గించి జీవన ప్రమాణాలను పెంపొందించడం ఈ థెరఫీ ప్రత్యేకత. వైద్య నిపుణులు, నర్సులు, వాలంటీర్లతో కలసి చికిత్స అందిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, వైద్య నిపుణులు, పౌర సమాజ ఉద్యమకర్తలు సహకారం అందిస్తున్నారు. పాలియేటివ్ కేర్లో భారత్లో కేరళ అగ్రస్థానంలో ఉంది.
పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సొసైటీ డైరెక్టర్ ఏసీ కురియన్ మాట్లాడుతూ.. ఈ థెరఫీ విజయవంతం కావడంలో టీమ్ వర్క్, ప్రాథమిక సదుపాయాలే కారణమని వివరించారు. నలుగురు డాక్టర్లను, 10 మంది నర్సులను, వాలంటీర్లను, ఓ వార్డును ఉచితంగా కేటాయించినట్టు తెలిపారు. నయంకాని రోగాలతో బాధపడే పేదలకు చికిత్స అందిస్తున్నారు. ఎవరైనా రోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు సాయం చేస్తారు. కేరళలో ఇలాంటి పాలియేటివ్ కేర్లు చాలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించడానికి కృషి చేస్తున్నారు.