saradha
-
శారదకు అండగా ‘టిటా’
సాక్షి, హైదరాబాద్ : కరోనా మూలంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శారదకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల శనివారం శారదకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ను అందచేశారు. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, కృత్రిమ మేథస్సు (ఏఐ) టెక్నాలజీపై శారదకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ భాగస్వామ్యంతో టిటా చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉచిత శిక్షణ పొందేందుకు అవసరమైన పత్రాలను శారదకు అందించారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శారద కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న విషయం తెలిసిందే. (‘సాఫ్ట్వేర్ శారద’కు సోనూసూద్ జాబ్) -
‘సాఫ్ట్వేర్ శారద’ దుకాణంలో చోరీ
జూబ్లీహిల్స్: కోవిడ్ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయినా మనోస్థైర్యం కోల్పోకుండా శ్రీనగర్‌కాలనీలో ఫుట్‌పాత్‌పై కూరగాయలు విక్రయిస్తూ ‘ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ’కు ప్రతీకగా నిలుస్తున్న శారద దుకాణంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి ఆమె దుకాణం మూసివేసి మిగిలిన కూరగాలను అక్కడే బండిపై ఉంచి కవర్‌తో కప్పి యధావిధిగా ఇంటికి వెళ్లిపోయారు . (శారదకు జాబ్ లెటర్: సోనూసూద్) ఉదయం వచ్చి చూసేసరికి మొత్తం కూరగాయలు మాయయ్యాయని, ఖాళీ బండి మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.5 వేల విలువైన కూరగాయలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపింది. తన తండ్రి హయాం నుంచి రాత్రి సమయంలో మిగిలిన కూరగాయలను అక్కడే బండిపై పెట్టి ప్యాక్ చేసి ఇంటికి వెళతామని, ఇప్పటివరకు ఎప్పుడూ దొంగతనం జరగలేదని ఆమె పేర్కొన్నారు. (జీవితం పచ్చగా ఉంది) -
నలభై ఏళ్లకు బాకీ తీరింది!
ఎర్నాకులం టౌన్‌హాల్, కేరళ. చేతిలో ఓ కవర్‌తో సీనియర్ నిర్మాత వీవీ ఆంటోని ఓపికగా ఎదురుచూస్తున్నారు. ఆ మీటింగ్ కోసం సుమారు నలభై ఏళ్ల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు ఆంటోని. పాత బాకీ తీర్చడం కోసం, తన మాట నిలబెట్టుకోవడం కోసం. 1979లో ‘పుష్యరాగం’ అనే మలయాళ సినిమాను నిర్మించారు ఆంటోని. మధు, జయన్, శారద, శ్రీవిద్య ముఖ్య పాత్రల్లో నటించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల శారదకు పూర్తి పారితోషికం ఇవ్వలేకపోయారు ఆంటోని. ఆ తర్వాత మరో రెండు సినిమాలకు భాగస్వామ్యం వహించినా లాభాలు చూడలేకపోయారాయన. కాలం ఫాస్ట్‌ఫార్వాడ్‌లో 40 ఏళ్లు గిర్రున తిరిగింది. ఆంటోని ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. కానీ శారదకు ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా ఇవ్వలేదనే ఆలోచన మాత్రం తనని నిలబడనివ్వడం లేదు. శారదను కలసి మిగిలిన పారితోషికాన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్న సమయంలో శారదే ఓ ఈవెంట్ కోసం కేరళ వస్తున్నారని తెలుసుకున్నారు ఆంటోని. ‘ఆది మక్కళ్’ అనే సినిమా 50 సంవత్సరాల వేడుక కోసం ముఖ్య అతిథిగా హాజరయ్యారు శారద. అక్కడే శారదను కలిశారు ఆంటోని. తనతో సినిమా నిర్మించిన నిర్మాతను గుర్తుపట్టి యోగక్షేమాలు మాట్లాడారు శారద. మాటల మధ్యలో మిగిలిన పారితోషికాన్ని అందజేశారు ఆంటోని. మిగిలిన పారితోషికం అందించడానికే ఆయన వచ్చారని తెలిసి శారద ఆశ్చర్యపోయారు. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాక ఆంటోని కుదుటపడ్డారు. అలా నలభై ఏళ్లకు ఆంటోని తన బాకీ తీర్చుకున్నారు. ‘నిర్మాత నా పారితోషికం ఎగ్గొట్టారు’ అని నటీనటులు వాపోతున్న సందర్భాలు చూశాం. అయితే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఇవ్వాల్సిన బాకీని చెల్లించిన ఆంటొనీలాంటి నిర్మాతలు అరుదుగా ఉంటారు. -
పాటలే పాఠాలుగా...
బోధనలో ఒక్కో ఉపాధ్యాయుడిది ఒక్కో శైలి. అయితే ఈ విషయంలో అందరి లక్ష్యమూ ఒక్కటే. పిల్లలను ఆకట్టుకుని పాఠం వాళ్ల మెదళ్లలో నిక్షిప్తమై పోయేలా చేయడమే. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయురాలు అందరికంటే భిన్నం. ఈ టీచర్ నైతిక విలువలతో కూడిన పాఠాలు చెప్పడమే కాకుండా పిల్లలకు విద్య గొప్పతనాన్ని తెలియజేయడం కోసం పాటలు రాశారు. వాటికి బాణీ కట్టారు. ఆలపించారు. పిల్లల నుంచి మంచి ఫలితాలను రాబట్టారు. మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న శారద గాయని కూడా. వృత్తి బోధన అయితే ప్రవృత్తి పాటలు రాయడం, బాణీలు కట్టడం, పాడడం. శారద పాడే పాటలన్నీ సమాజ హితాన్ని కాంక్షించేవే. భావిభారత పౌరుల భవితకు బంగారు బాటలు వేసేవే. అలా ఇప్పటివరకూ 800 కుపైగా పాటలు పాడారు. ‘‘చెట్టమ్మా చెట్టమ్మా చెట్టమ్మా... నీ పుట్టుక ఎంత గొప్పదమ్మా..నీవు లేని లోకాన్ని ఊహించలేనమ్మా.. మానవ మనుగడకే నీవు తొలి మెట్టమ్మా’’ అనేది శారద గళం నుంచి వచ్చిన పాటల్లో మచ్చుకు ఒకటి. ’బడి బయట ఏముందిరా.. బడిలో భవిత ఉంది... రా.. బడిలో ఆట ఉందిరా.. చిన్నా బడిలోనూ పాట ఉందిరా.. బడిలో చదువుకో’’.. అంటూ పాడిన పాట పిల్లలతోపాటు పెద్దలను కూడా ఆలోచింపజేస్తుంది. బాల్యం నుంచే శారదకు పాటలంటే ఇష్టం. చిన్నప్పుడు బడి సెలవురోజుల్లో అమ్మతోపాటు పొలం వెళ్లేది. పొలంలో పనిచేసే సమయంలో ఆ కష్టం తెలియకుండా ఉండడం కోసం, కూలీలను ఉత్సాహవంతంగా ఉంచడంకోసం శారద తల్లి లక్ష్మి పాటలు పాడుతుండేది. తల్లి శ్రావ్యమైన గానం శారదను కట్టిపడేసింది. చదువు పూర్తయ్యాక టీచర్‌గా విధుల్లో చేరిన శారద ఆ వృత్తిలో కొనసాగుతూనే తీరిక సమయంలో రాగాలు తీయడం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలంపాటు ఓ గురువు వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత పాడడం ప్రారంభించారు. అక్కడి నుంచి పాటలు రాయడం, పాడడం ప్రారంభించారు. అలా ఇప్పటిదాకా 800 పాటలు పాడారు. స్వరాంజలి మ్యూజిక్ అకాడమీకి చెందిన వేంకటేశ్ స్వరకల్పన, సంగీతం, రచనలో బడి బయట ఏముందిరా అనే పాటలతో పాటు, చెట్టుమ్మా పాటలు ఆడియో పూర్తయ్యాయి. ఇది విన్న వారంతా కొన్ని దృశ్యాలు జతచేసి వీడియో రూపంలో తీసుకువస్తే బాగుంటుందని శారదకు çసూచించారు. ఈ సలహా... శారదను ఆ దిశగా నడిపించింది. ఈ నేపథ్యంలో పాటలు పాడడమే కాకుండా నటించారు కూడా. వసతుల కల్పన... విలువల బోధన 2002లో స్కూల్ అసిస్టెంట్‌గా చేరిన శారద... ఏడేళ్లలోనే ప్రధానోపాధ్యాయురాలిగా పదోన్నతి పొందారు. 2009లో బెల్లంపల్లి పాఠశాలలో చేరిన సమయంలో 200 మంది పిల్లలు ఉండగా ఆ తర్వాత ఆ సంఖ్య 850కి చేరుకుంది. పిల్లలను ఆకట్టుకునేలా బోధించడంలో వైవిధ్యమే ఇందుకు తోడ్పడింది. ఆశాజ్యోతి సంస్థ సహకారంతో పిల్లలకు ఉచితంగా బ్యాగులు అందేలా చేశారు. పాఠశాలలో అనేక మౌలిక వసతులు కల్పించారు. ప్రస్తుతం శారద హెచ్.ఎం.గా విధులు నిర్వర్తిస్తున్న పాఠశాల ఫలితాల్లో జిల్లాస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 92 శాతం ఫలితాలు వచ్చాయి. పాఠాలే కాదు, ఈ బడిలో రోజుకు ఒకటి లేదా రెండు క్లాసులు తీసుకుని కేవలం నైతిక విలువలు బోధిస్తారు. దానికే అత్యధిక ప్రాధాన్యమిస్తారు. గతేడాది ఈ పాఠశాల విద్యార్థినులు జాతీయస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనగా ఈ ఏడాది యోగా పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది.– కొల్లూరి సత్యనారాయణసాక్షి, స్కూల్ ఎడిషన్ ఆత్మరక్షణ విద్యలు నేర్పుతాం ’’పాఠాలతోపాటు నైతిక విలువలను ఎక్కువగా చెబుతుంటా. ఆడపిల్లలకు కర్రసాము, కత్తిసాము వంటి ఆత్మరక్షణ విద్యలను బడి సమయం తర్వాత ప్రత్యేకంగా నేర్పిస్తాం. ఏ పోటీలు పెట్టినా మా బడి పిల్లలే ముందుంటారు. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ప్రోగ్రాంలో మా బడి పిల్లలు పాల్గొన్నారు. ఇది ఎంతో ఆనందం కలిగించే విషయం. గతేడాది 100 శాతం మార్కులు సాధించిన పిల్లలందరికీ నా చేత్తో అన్నం తినిపించా. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తరచూ వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నాం. ఆశాజ్యోతి ఫౌండేషన్ సహకారంతో మా బడి పిల్లలకు బ్యాగు, పుస్తకాలు ఇప్పించాం.– శారద, ప్రధానోపాధ్యాయురాలు -
మంచి మాటల వెన్నముద్ద
మజ్జిగ చిలికితేనే కదా వెన్న వచ్చేది.73 ఏళ్ల జీవితాన్ని వడగడితేనే కదా సూక్ష్మం తెలిసేది.ఎండ ఆవిరిని పుట్టిస్తేనే కదా మేఘం కురిసేది.చలి కొరికితేనే కదా జీవితం రుచి తెలిసేది. ఇంత చూసిన శారద... మంచి మాటల వెన్నముద్ద. బర్త్‌డే సందర్భంగా మీ గురించి మాత్రమే కాదు.. మీతో సొసైటీకి ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెప్పించాలనుకుంటున్నాం శారదగారూ.. ముందుగా మీకిది ఎన్నో బర్త్డేనో చెబుతారా? 73 క్రాస్ చేశాను. నేను పుట్టింది 25–06–45. కానీ ఎవరికి వాళ్లు వాళ్లకు నచ్చిన డేట్ వేసుకుంటున్నారు. ఒక్క ఫోన్ చేసి అడిగితే కరెక్ట్ డేట్ చెబుతాను కదా. నేను ఒక్క భాషలో కాదు.. మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ.. ఇలా ఎన్నో భాషల్లో సినిమాలు చేశాను. ఇష్టం వచ్చిన డేట్ వేయడం వల్ల బోలెడన్ని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు. చేసేవాళ్లకు, నాకు టైమ్ వేస్ట్. అందుకే ఈ ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తున్నా. నా బర్త్‌డే జూన్ 25న. చిన్నప్పుడు బర్త్‌డేలు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు ? మా అమ్మగారు సత్యవతికి భక్తి ఎక్కువ. అమ్మమ్మ పేరు కనకమ్మ. తండ్రి వెంకటేశ్వర్లు. పేర్లు ఎందుకు చెబుతున్నానంటే ఇప్పటికీ మా అమ్మ పేరు కనకమ్మ అని రాస్తున్నారు. నా పుట్టినరోజుకి ఇంట్లో మా అమ్మగారు గణపతి హోమం, సుదర్శన హోమం చేయించేవారు. ఆకలితో ఉన్నవారికి భోజనాలు పెట్టించేవారు. ఆడంబరాలు ఉండేవి కావు. ఉన్నదల్లా ఇతరులకు ఉపయోగపడే పనులు చేయాలనే ఆలోచన తప్ప. నాక్కూడా అలంకారాలు ఇష్టం ఉండదు. పువ్వులు, లైట్లు కోసం డబ్బులు వేస్ట్ చేసే బదులు మంచి పనికి ఉపయోగించాలనుకుంటా. మీ అమ్మమ్మగారు స్ట్రిక్ట్‌గా ఉండేవారట. నటనే అయి నా హీరోలను మిమ్మల్ని తాకనిచ్చేవారు కాదట? అవును. మా అమ్మమ్మగారు భయంకరమైన స్ట్రిక్ట్ (నవ్వుతూ). నేను కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నాను. నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి, ‘మా భూమి’ అనే కమ్యూనిస్ట్ నాటకంలో చెల్లెలిగా చేయమని అడిగారు. మా అమ్మమ్మగారు ఎలాగో ఒప్పుకున్నారు. రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు అక్కడే కుర్చీ వేసుకుని కూర్చునేవారు. మగవాళ్లను దూరంగా నిలబడి డైలాగులు చెప్పమనేవారు. నా మీద చేయి వేస్తారేమోనని ఆమె భయం. ఆ రోజుల్లో అమ్మమ్మ అంత స్ట్రిక్ట్‌గా ఉండబట్టే మేం క్రమశిక్షణగా పెరిగాం. అంత స్ట్రిక్ట్‌గా ఉన్న అమ్మమ్మ మిమ్మల్ని సినిమా హీరోయిన్ని చేయడానికి ఎలా ఒప్పుకున్నారు? అమ్మమ్మ ఇంటి వరకే. పైగా వయసు మీద పడేకొద్దీ పెద్దవాళ్లు వెనకబడిపోతారు. మనం ప్రపంచంతో పాటు ముందుకెళతాం కదా. నిజానికి నేను సినిమాల్లోకి రావాలన్నది మా అమ్మగారి ఆశ. ‘నా కూతురిలో ఏదో ఉంది’ అన్నది అమ్మ నమ్మకం. అందుకే మా నాన్నగారిని ఒప్పించారు. ఒకానొక దశలో మిమ్మల్ని మలయాళీ అమ్మాయి అనుకున్నారట. అంతగా మలయాళంలో పేరు తెచ్చుకోవడం, అక్కడ ‘ఊర్వశి’ అవార్డు అందుకోవడం పట్ల మీ అనుభూతి? నేను తమిళంలో ఓ సినిమా చేస్తున్నప్పుడు మలయాళ దర్శక–నిర్మాత కుంచకోగారు ‘ఇన్ప్రావుగళ్’ అనే సినిమా ప్లాన్ చేస్తున్నారు. తమిళ సినిమాకి చేసిన సౌండ్ ఇంజనీర్ కన్నన్గారు ‘శారద అనే అమ్మాయి బాగా యాక్ట్ చేస్తుంది’ అని నా గురించి చెబితే, కుంచకోగారు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ కంటిన్యూస్‌గా సినిమాలొచ్చాయి. అందుకే మలయాళీ అమ్మాయిని అని చాలామంది అనుకున్నారు. మలయాళంలో చేసిన ‘తులాభారం’ నాకు నేషనల్ అవార్డ్ కూడా తెచ్చింది. అదే సినిమాని తెలుగులో ‘మనుషులు మారాలి’గా తీశారు. ఆ సినిమాకి జెమినీ వాసన్‌గారు నిర్మాత. ‘ఆ అమ్మాయి ఏం చేస్తుంది?’ అని చాలామంది అంటే, ఎవరి మాటా వినకుండా వాసన్‌గారు నన్ను తీసుకున్నారు. ‘నేను తమిళ అమ్మాయిని అనుకుని తెలుగు నేర్పించండి. ఈ సినిమా ఆ అమ్మాయే చేయాలి’ అన్నారు. ‘ప్రతిధ్వని’ సినిమాలో రామానాయుడుగారు నన్ను పోలీసాఫీసర్ క్యారెక్టర్‌కి తీసుకున్నప్పుడు కూడా ‘చీర కట్టుకునే శారద పోలీస్ యూనిఫామ్లోనా’ అన్నవాళ్లూ ఉన్నారు. ఆయన నన్ను నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాను. అలాగే ‘అనసూయమ్మగారి అల్లుడు’లో నాది కామెడీ వేషం. పరుచూరి బ్రదర్స్ రాశారు. వాళ్లిద్దరూ నాకు సొంత అన్నదమ్ముల్లా. ‘తులాభారం’ తమిళ, హిందీ రీమేక్స్‌లోనూ నేనే చేశా. నాకు తెలిసి ఒకే సినిమాని నాలుగు భాషల్లో చేసే అవకాశం నాకే దక్కిందేమో. మీ అమ్మమ్మ గురించి మాట్లాడుతూ ఆవిడ స్ట్రిక్ట్‌గా ఉండటంవల్లే క్రమశిక్షణగా పెరిగామన్నారు. ఈ తరం పిల్లలను ఎలా పెంచాలి? భక్తి నేర్పించాలి. చిన్నప్పుడు పిల్లలకు దేవుడికి దండం పెట్టాలని నేర్పితే అది అలవాటవుతుంది. స్కూల్‌కి వెళ్ళేటప్పుడు, ఏదైనా మంచి పని చేసే ముందు దండం పెట్టుకో అని చెప్పాలి. అది పాజిటివ్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఏదో ఫోర్స్ ఉందని తప్పు చేయడానికి భయపడతారు. అంటే... భక్తిని పిల్లల మీద రుద్దుతున్నట్లు కాదా? కాదు. మంచి చెప్పే పద్ధతుల్లో ఇదొకటి. అది తప్పు, ఇది రైట్ అని తెలియజేయడం కోసం చిన్నప్పుడు అలాంటివి పాటించాలి. పెద్దయ్యాక మంచీ చెడూ తెలుసుకుంటారు కాబట్టి, దేవుణ్ణి ఫాలో అవ్వాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ల నిర్ణయాన్ని మనం ఆమోదించాలి. మనం కన్న పిల్లలే కదా అని మన పంతం నెగ్గించుకోవాలనుకోకూడదు. ఇప్పుడు పిల్లలు చాలా సెన్సిటివ్‌గా ఉంటున్నారనిపిస్తోంది.. సీట్ దొరకలేదని ఆ మధ్య ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఏమనిపిస్తుంది? టీవీలో చూసినప్పుడు బాధ అనిపించింది. ఆ పాప మనసులో ఏం ఉందో? ‘ఇంత కష్టపడి నన్ను మా ఇంట్లో చదివించారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను’ అని బాధపడిందేమో. లేదంటే పేరెంట్స్ బాగా స్ట్రిక్ట్ అయితే ‘నన్ను కొడతారు.. తిడతారు’ అని భయపడిందేమో. తన మనసులో ఏం ఉందో మనకు తెలియదు కదా. మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే పిల్లలను బలహీనులుగా పెంచకూడదు. అలాగే పిల్లల మీద ప్రెషర్ పెట్టడం తప్పు. తల్లిదండ్రులు ఇద్దరూ డబ్బు సంపాదనలో పడిపోయి బిజీ అయిపోతున్నారు. వాళ్లకు పిల్లలతో మాట్లాడే ఖాళీ ఎక్కడుంటుంది? పిల్లలకు ఏం నేర్పుతారు? పిల్లల పెంపకంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భావితరం వాళ్లే కదా. మరోలా అనుకోకండి.. మీకు పిల్లలు లేరు కదా.. పిల్లల పెంపకం గురించి ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నారు? నా తమ్ముడికి ఇద్దరు కూతుళ్లు. కంటేనే పిల్లలవుతారా? తోడబుట్టినవాళ్ల పిల్లలు పిల్లలు కాదా? మీరు ఒంటరిగా ఉంటారేమో అనుకున్నాం? తమ్ముడు ఫ్యామిలీతో ఉంటున్నాను. నా మరదలు మంచిది. నా మేనకోడళ్లను పెంచాను. వాళ్లు నన్ను బాగా చూసుకుంటారు. ఓ మేనకోడలు పేరు హేమా సుబ్రహ్మణ్యం. తనకి గొప్ప పేరుంది. తను యూట్యూబ్‌లో ఫేమస్. అల్లుళ్లు మంచివాళ్లు. నేను హ్యాపీగా ఉన్నాను. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. రోజూ పూజించేటప్పుడు ‘లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు’ అని ప్రార్థిస్తుంటా. మీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అనిపిస్తోంది. ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్లకైనా ఏదైనా కష్టం వస్తే సపోర్ట్ కోరుకుంటారు. మరి మీకు సపోర్ట్? నా మనసు. మనిషి బాగుండటానికి, బాగాలేకపోవడానికి మనసే కారణం. మనసు దృఢంగా లేకపోతే వీక్ అవుతాం. ఫిజికల్లీ కూడా హెల్దీగా ఉన్నారనిపిస్తోంది... కొంత కాలం క్రితం ఓ డాక్టర్గారిని కలిస్తే, ఆయన కొన్ని టెస్టులు చేశారు. నాకు బీపీ లేదు. షుగర్ లేదు. కొలెస్ట్రాల్ లేదు. ‘నాన్‌వెజ్ తినకపోవడం వల్లే ఇంత హెల్దీగా ఉన్నారు’ అన్నారా డాక్టర్. ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు నేను వీలైనంత ప్రశాంతంగా ఉంటాను. అంటే.. ఎప్పుడూ నాన్‌వెజ్ తినలేదా? బేసిక్‌గా నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినదాన్ని. నాన్‌వెజ్‌కి దూరం. అయితే ఇంటి నుంచి బయటికొచ్చాక చుట్టుపక్కల ఉన్నవాళ్లతో కలిసినప్పుడు అలవాటైంది. లైట్‌గా తినేదాన్ని. తినేటప్పుడు కూడా పిల్లలకు అన్యాయం చేస్తున్నామా? అనే బాధ ఉండేది. మనం దేన్నయితే తింటున్నామో అది దాని పిల్లలకు ఆహారం సేకరించడం కోసం బయటకు వచ్చి ఉంటుందేమో. మనం దీన్ని తినేయడంవల్ల అక్కడ పిల్లలు ఆకలితో అలమటించిపోతా రనే బాధ ఉండేది. మానేశాక హాయిగా అనిపిస్తోంది. ఆ ఫీలింగ్‌తోనే మానేశారా? ఓ కారణం అది. హైదరాబాద్ నుంచి కర్ణాటక మధ్యలో గుల్బర్గాలో ధ్యానబొంది అని ఉంది. అక్కడ ‘మాణిక్యేశ్వరీ దేవి’ అని ఉంటారు. ఆమె ఒక గదిలో ఉంటారు. ఆహారం తీసుకోరు. గది నుంచి ఎప్పుడో కానీ బయటకు రారు. «ధ్యానం చేస్తుంటారు. నా కజిన్ ద్వారా ఆమె గురించి విని, వెళ్లాను. నా అదృష్టం కొద్దీ నేను వెళ్లిన రోజున ఆమె గది నుంచి బయటికొచ్చారు. ఆడవాళ్లను ‘ఏమే’ అని మగవాళ్లను ‘ఏరా’ అని అంటారు. నన్ను చూడగానే ‘ఏమే నీచు తింటున్నావా? నీకేం అధికారం ఉందని వాటిని చంపి తిన్నావు? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చనిపోతే శవం అంటాం. మైలు అని పాటిస్తాం. ఆ ప్రాణిని చంపినప్పుడు అది శవం కాదా? మైలు కాదా? దాన్ని ఎలా తింటున్నావు?’ అని అడిగేసరికి సిగ్గుపడిపోయా. అప్పటినుంచి తినడం మానేశాను. ఇక్కడ మీకో విషయం గురించి చెప్పాలి. తినేవాళ్లను నేను విమర్శించడంలేదు. నాకు కలిగిన ఫీలింగ్‌ని మాత్రమే చెప్పాను. మనం ఒక విషయాన్ని ఇష్టపడకపోతే మిగతావాళ్లకూ నచ్చకూడదనుకుంటే అది మన ‘పిచ్చి’ అవుతుంది. ఆ పిచ్చి ప్రవర్తన నాకు లేదు. సినిమాలు తగ్గించారు. ఎలా స్పెండ్ చేస్తున్నారు ? రిలాక్స్ అవ్వడంలేదు. బిజీ. నాకు బోలెడన్ని ఫంక్షన్స్. ఫ్రెండ్స్ ఎక్కువ. సినిమా ఇండస్ట్రీలో అందరితో బాగుంటాను. కానీ బయట ఫ్రెండ్సే ఎక్కువ. నాకు రిలాక్స్డ్గా తిని కూర్చోవడం ఇష్టం ఉండదు. ప్రకృతిని ప్రేమిస్తుంటా. దైవం కంటికి కనిపించడు కాబట్టి కంటికి కనిపించే ప్రకృతిని దైవం అనుకుంటా. చెట్లంటే చాలా ఇష్టం. చెట్లు నాటడం వల్ల పర్యావరణానికి మంచిది. చాలామందికి ఉంటుంది చెట్లు నాటాలని. కానీ దాన్ని కార్యాచరణలో పెట్టేలా మోటివేట్ చేయాలి. పొల్యూషన్ తగ్గించొచ్చు. తులసి చెట్టుని తీసుకోండి. 24 గంటలూ తులసి చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది. దాని చుట్టూ తిరగడం ఆరోగ్యానికి మంచిది. పెద్దలు ఏదీ ఊరికే చెప్పరు. అదే పెద్దలు పాత రోజుల్లో సతీసహగమనం అనీ, భర్త చనిపోగానే భార్య తెల్లచీర కట్టుకోవాలనీ అన్నారు కదా... వాటి గురించి ఏమంటారు? ప్రాణంతో ఉన్న మనిషిని నిప్పుల్లోకి నెట్టడమా? భర్త చనిపోతే అతనితో పాటే భార్య చనిపోవాలా? అది కాకపోతే అప్పట్లో పదీ పదకొండు పన్నెండేళ్లకే పెళ్లిళ్లు చేసేసేవాళ్లు. పెళ్లయిన ఏడాదికే భర్త చనిపోతే ఆ పిల్లకు గుండు కొట్టిస్తారు. జీవితాంతం తెల్ల చీరలే కట్టుకోవాలి. ఎంత బాధ? నేను ఆచార వ్యవహారాల గురించి ఏమీ మాట్లాడటంలేదు. అయితే ఆ నిబంధనలు తప్పా? కరెక్టా? అనడిగితే పర్సనల్‌గా నాకు ఇష్టం లేదని చెబుతాను. మనిషిని ఇబ్బందిపెట్టే ఆచారాలు ఎందుకు? కానీ ఏ పెద్దలైతే ఇలాంటి కట్టుబాట్లు విధించారో.. వాటిని ఎదిరించడానికి వేరే పెద్దలు ఉండేవారు. తప్పు మాట్లాడేది పెద్దలే. వాటిని ఖండించేది వాళ్లే. అలా ఉండబట్టే కదా.. కాలక్రమేణా అవి లేకుండాపోయాయి. ఆర్టిస్ట్‌గా ఏదైనా డ్రీమ్ రోల్? ఒకటి ఉంది. మలయాళంలో ఉంటుంది. నాది లీడ్ రోల్. ఇద్దరు హీరోలు చేస్తారు. మీ జీవిత చరిత్రతో ఎవరైనా సినిమా తీస్తానంటే? బయోపిక్‌కి జీవిత చరిత్ర కావాలి. నా దాంట్లో చరిత్రే లేదు (నవ్వుతూ). ఫైనల్లీ సరస్వతీదేవి నుంచి శారదగా.. ‘ఊర్వశి’ శారదగా ఎదిగినందుకు మీ ఫీలింగ్? మా అమ్మానాన్న తర్వాత నాకు కళ అంటే ఇష్టం. కళను దైవం అనుకున్నాను. ఆ దైవం తర్వాత నాకు ఇండస్ట్రీ అంటే అభిమానం. ఆ తర్వాత ప్రేక్షకులు. వాళ్లు చూపించిన అభిమానం మరచిపోలేనేది. ఇప్పుడు నా ఆశయం ప్రకృతిని కాపాడుకోవడానికి ఏదైనా చేయడమే. స్వతహాగా ఎవరికీ హాని చేయకూడదనే మనస్తత్వం ఉన్న మనిషిని. అలాగని నేనొక్కదాన్నే మంచిదాన్ని అని ఎప్పుడూ అనుకోను. మంచి చేయడానికి మాత్రం ప్రయత్నిస్తాను. మీ తరంతో పోల్చుకుంటే నేటి తరం హీరోయిన్ల గురించి మీ ఒపీనియన్? అప్పట్లో స్టోరీలు బాగుండేవి. మాకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి కాబట్టి, ప్రూవ్ చేసుకున్నాం. ఈ జనరేషన్ హీరోయిన్లను తక్కువ చేయలేం. వాళ్లూ బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నారు. అయితే మాకున్నంత స్కోప్ లేదు. సినిమా ఇండస్ట్రీలో ‘హెరాస్మెంట్’ అని కొందరు హీరోయిన్లు బాహాటంగానే చెబుతున్నారు. అప్పట్లోనూ అలా ఉండేదా? ఉండేది. కానీ మీడియా ఇంత లేదు కాబట్టి బయటకు రాలేదు. అయితే అప్పట్లో మగవాళ్లకు కొంచెం భయం ఉండేది. ఎలా పడితే అలా వ్యవహరించడానికి కాస్త సంశయించేవారు. ఇప్పుడు సినిమా పరిశ్రమలోనే కాదు.. సమాజ ధోరణి మారిపోయింది. అందరిలోనూ ఓ తెగువ వచ్చేసింది. ఆ తెగువతో ఏదేదో చేస్తున్నారు. మీ బర్త్‌డే గురించి చెబుతున్నప్పుడు ఆడంబరాల పేరుతో డబ్బుని వేస్ట్ చేయడం నచ్చదనీ, ఇతరులకు ఉపయోగిస్తే మంచిదనీ అన్నారు. దాన్నిబట్టి మీలో సేవాగుణం ఉందేమో అనిపిస్తోంది? చేసే సేవ గురించి చెప్పుకోకూడదు. మా నాన్నగారు నాకు చెప్పిన ఓ విషయం ఎప్పటికీ గుర్తుంటుంది. చిన్నప్పుడు కంచంలో నుంచి ఒక్క మెతుకు కింద పడినా.. ఆ మెతుకు కోసం ఎంతమంది ఆరాటపడతారో తెలుసా? అనేవారు. ‘నీకెంత కావాలో అంతే పెట్టుకో.. వృథా చేయొద్దు’ అనేవారు. ఏ ఫంక్షన్‌కి వెళ్లినా ఆ మాటలు గుర్తొస్తాయి. కంచం నిండా పెట్టుకుంటారు. సగమే తింటారు. మిగతా సగం చెత్తకుప్పలోకి. ఎంత బాధగా ఉంటుందో. మనం విసిరేసిన విస్తరిలో మిగిలింది తిని, ఆకలి తీర్చుకునేవాళ్లు ఉంటారు. కానీ విసిరేసే విస్తరిలో భోజనం కాకుండా, మనం కావాల్సినదే తిని, మిగిలిన భోజనాన్ని హుందాగా మంచి విస్తరిలో పెట్టొచ్చు. నేను చాలా మటుకు ఫంక్షన్స్‌లో భోజనం చేయడంలేదు. కంచం నిండా పెట్టుకుని, వృథా చేస్తుంటారు. నేను అది చూడలేను. మీ తరం హీరోయిన్లను కలుస్తుంటారా? 3 నెలలకు ఒక్కసారి తప్పకుండా కలుస్తుంటాం. కన్నడ భారతి, జయంతి, మేనక (నటి, కీర్తీ సురేశ్ తల్లి) అందరం తరచూ కలుస్తుంటాం. జయంతి గురించి ఆ మధ్య రాయకూడని వార్త వచ్చింది. ఏంత నీచం? సోషల్ మీడియాని మంచికి ఉపయోగించాలి. ఇక్కడ గజం గజానికి ఒక నీచుడు ఉన్నాడు. వాట్సాప్‌లో నీతులు చెబుతూ ఇంతింత మెసేజ్‌లు రాస్తుంటారు. అది వాళ్లు ఫాలో అయ్యేదీ లేదూ.. చచ్చేది లేదు. నేనెప్పుడూ వెబ్సైట్లు చూడను. సోషల్ మీడియాలో ఉండను. నాకు తెలిసిందల్లా యాక్ట్ చేయడం. ఎవరైనా ఆకలితో ఉన్నాం అంటే అన్నం పెట్టడం. చదువుకోవాలని ఉండీ, స్తోమత లేదంటే ఆసరాగా ఉండటం. అంతే.. – డి.జి. భవాని -
ప్రేమికుడితో పెళ్లి చేస్తారో లేదోనన్న అనుమానంతో..
పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్): ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తారో లేదోనన్న అనుమానంతో ఓ యువతి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని జొన్నలబొగుడలో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముడావత్ శారద(19) నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసింది. ఇదే గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరు గత కొం తకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఐదురోజుల క్రితం ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ విషయమై శారద తండ్రి బాలునాయక్ నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెళ్లి వారిని హైదరాబాద్ నుంచి తీసుకువచ్చారు. పెద్దల సమక్షంలో మాట్లాడి పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. అయితే తల్లిదండ్రులు ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తారో.. లేదోనన్న అనుమానంతో శుక్రవారం తెల్లవారుజామున పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరింది. గమనించిన కుటుంబ సభ్యు లు 108లో నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ మృతిచెందింది. ఈ ఘటనపై శారద తండ్రి బాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడకు చెందిన శారద ప్రేమ విఫలమైందని ఫినాయిల్ తాగి మృతిచెందిన సంఘటనలో కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 9న డిగ్రీ పరీక్షలు రాసి ఇంటికి వెళ్లకుండా అదృశ్యమైందని, దీనిపై తండ్రి బాలునాయక్ 11న నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే పోలీసులు అనుమానం ఉన్న అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రమేష్‌ను విచారించగా తన వద్ద లేదని చెప్పాడు. అనంతరం అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హైదరాబాద్‌లో ఉందని, గురువారం రాత్రి పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఉంచగా శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిందంటూ శుక్రవారం ఉదయం ఏడు గంటలకు చెప్పడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఇన్చార్జ్ బాలాజీ నాయక్, ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణ, సీనియర్ నాయకులు రాముడునాయక్ అనుమానం వ్యక్తం చేస్తూ శుక్రవారం కొల్లాపూర్ సీఐ సైదాబాబుకు తండ్రి బాలునాయక్‌తో కలిసి ఫిర్యాదు చేశారు. తన కూతురికి ఆత్మహత్యకు పాల్పడేంత పిరికితనం లేదని, ప్రేమించిందనే నెపంతోనే చంపించి ఉంటారని, ఆత్మహత్యకు పాల్పడి ఉంటే ఎలాంటి పాయిజన్ స్మెల్ రావాలని, కుడి, ఎడమ చేతులకు గాయాలు ఉన్నట్లు ఆరోపించారు. అయితే మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తీసుకురాగా అక్కడ న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం నిర్వహించేది లేదని ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. పెద్దకొత్తపల్లికి చెందిన వ్యక్తులే ఏదైనా చేసి ఉంటారని అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. -
కావ్యగౌరవం తెచ్చిన పాట...
చిత్రం: కార్తీక దీపం రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి సంగీతం: సత్యం గానం: పి.సుశీల, ఎస్.జానకి తెలుగు సినిమా పాటకు కావ్యగౌరవం కలిగించిన రచయితల్లో దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి కూడా ఒకరు. ఆయన రాసిన ప్రతి పాటా ప్రేక్షక శ్రోతల్ని అలరించింది, ఆలోచింపచేసింది. ‘కార్తీక దీపం’ చిత్రం కోసం దేవులపల్లి వారు రచించిన ‘ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం...’ పాట – 1979లో ఈ చిత్రం విడుదలైనప్పుడు ఇంటింటి పాట అయింది, దేశమంతటా మార్మోగిపోయింది. ఈ చిత్ర కథను అనుసరించి, కార్తీక మాసం స్ఫూర్తితో ఇద్దరు హీరోయిన్ల మీద చిత్రించటానికి అనువుగా రూపొందించిన పాట ఇది. ఒక మగవానికి ఒక భార్య సహజం. పరిస్థితుల ప్రభావంతో, ప్రియురాల్ని రెండో భార్యగా వివాహం చేసుకోగా, ఒకరికి తెలియకుండా ఒకరు... వారిద్దరూ కార్తీకదీపాలు వెలిగించి, కోనేటిలో వదులుతూ పాడతారు. చిక్కని సాహిత్యానికి అమరిన చక్కని బాణీ ఈ పాటలో వినిపిస్తుంది– ఆరనీకుమా ఈ దీపం–కార్తీక దీపం / చేరనీ నీ పాద పీఠం–కర్పూర దీపం / ఇదే సుమా నీ కుంకుమ తిలకం / ఇదే సుమా నా మంగళ సూత్రం... అంటూ మొదలై... ఇద్దరు స్త్రీల మనోభావాల్నీ అద్దం పట్టి చూపిస్తుంది. భర్తను చేరాల్సిన కర్పూర దీపం భార్యదైతే–భర్తను చేరాల్సిన ప్రాణ దీపం రెండో భార్యదన్న మాట. ఈ పాట మొత్తానికి కవితాత్మకమైన వాక్యాలు రెండే రెండు ఉన్నాయి. ఆకాశాన ఆ మణిదీపాలేముల్తైదువులుంచారో..ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారో... ఈ రెండు వాక్యాలలో కవి అద్భుతమైన ఊహను వ్యక్తపరిచిన పదాలు, శ్రోతలను మైమరపింప చేస్తాయి. మిగిలిన పాటంతా తెలివైన, చాకచక్యం గల కవి అల్లిన అందాల పదబంధాలే– ఆకాశంలో చుక్కల్ని కార్తీక దీపాలుగా ఊహించి, ఇక్కడి కోనేటిలోని కార్తీక దీపాల్ని ఆకాశంలో ముల్తైదువులు చుక్కలను కుంటారు అనుకోవడంలో కవిత్వం ఉంది. ఆ భావాన్ని అటూఇటుగా అందమైన మాటలతో, కథాంశంతో ముడిపెట్టి రక్తి కట్టించారు. కృష్ణశాస్త్రికి వేరెవ్వరూ సాటి రారు అని స్వయంగా నిరూపించుకున్నారు. చివర– నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం– అని ఒకరు– నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశాదీపం– అని మరొకరు పలుకుతారు– ఒకరిది కల్యాణ దీపం–మరొకరిది ప్రాణ దీపం ఇలాంటి పాట విన్నప్పుడు సినిమా పాటను తక్కువగా అంచనా వేయకూడదని ఎవరికైనా అనిపిస్తుంది. – సంభాషణ: డా. వైజయంతి -
శారదా, నారదా, రోజ్ వ్యాలీల కథ ఇది
నారదా స్టింగ్ ఆపరేషన్‌పై సీబీఐ విచారణ చేయాలంటూ శుక్రవారం పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో మూడు అతిపెద్ద అవినీతి కేసులు తృణమూల్ కాంగ్రెస్‌ను కుదిపేస్తున్నాయి. ఈ మూడు కేసుల్లోనూ మమతకు సన్నిహితులే నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం శారదా చిట్స్ ఫండ్స్ కుంభకోణంపై ఆదేశాలు జారీ అయ్యాయి. రోజ్ వ్యాలీ స్కాం.. మమత అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బయటపడిన అతిపెద్ద కుంభకోణం. దాదాపు రూ.17 వేల కోట్ల రూపాయల అవినీతి ఇందులో జరిగినట్లు భావిస్తున్నారు. వేల కోట్లలో కుంభకోణాలు జరిగిన వీటి గురించి ఓ సారి చూద్దాం. శారదా కుంభకోణం చిట్స్ ఫండ్స్ పేరుతో వేల మంది సామాన్యులకు కుచ్చుటోపి పెట్టింది శారదా చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీని బాధితులు కేవలం బెంగాల్లోనే కాకుండా ఒడిశా, జార్ఖండ్, అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. దాదాపు రూ.2,500 కోట్లతో ఉడాయించిన శారదా చైర్మన్ సుదీప్త సేన్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డెబ్జానీ ముఖర్జీలను పోలీసులు కశ్మీర్లో పట్టుకున్నారు. శారదా కుంభకోణం కారణంగా బెంగాల్లో వందల మంది సామాన్య ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. కోల్‌కతా మహానగరం నుంచి చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ఏజెంట్లు, డిపాజిటర్లు బలవన్మరణం చెందారు. శారదా చిట్‌ఫండ్స్ నడిపిన వారే తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్నా 2013 గ్రామీణ ఎన్నికల్లో ఆ పార్టీ జయకేతనం ఎగరేసింది. 2014 మే నెలలో శారదా కేసును విచారించాలని సీబీఐను సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఒక్కసారిగా తృణమూల్ కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభమైంది. వారు అనుకున్నట్లే రాష్ట్ర క్రీడా, రవాణా శాఖల మంత్రి మదన్ మిత్రాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 21 నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలైయ్యారు. తృణమూల్‌కే చెందిన ఎంపీ శ్రీనిజాయ్ బోస్, ఉపాధ్యక్షుడు రజత్ మజుందార్ మరికొందరు పార్టీ నాయకులు ఈ కేసులో అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. రోజ్ వ్యాలీ కుంభకోణం చిట్‌ఫండ్స్ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్లో వెలుగులోకి వచ్చిన మరో స్కాం.. రోజ్ వ్యాలీ. ఈ కుంభకోణంలో రోజ్ వ్యాలీ గ్రూప్ రూ.17 వేల కోట్లతో బోర్డు తిప్పేసింది. దీంతో మరోసారి బెంగాల్ ప్రజలు రోడ్డున పడ్డారు. తృణమూల్ పార్టీకి చెందిన ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, తాపస్ పాల్లు ఈ కేసులో అరెస్టు అయ్యారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ మరికొంత మంది తృణమూల్ లీడర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం ఈ కేసులో బసుదేబ్ బగ్చీ, అవిక్ బగ్చీలను అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్లో ఫిల్మ్‌సిటీ కలిగివున్న ప్రముఖ ప్రయోగ్ గ్రూప్(రూ.12,500కోట్ల విలువైనది) వీరిదే. నారదా కుంభకోణం నారదా కుంభకోణంలో చేతులు మారిన డబ్బు విలువ రూ. 5 లక్షలే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కొందరు నేతలు డబ్బులు తీసుకుంటున్న వీడియోను 'నారదా న్యూస్.కామ్' విడుదల చేసింది. అంతే ఒక్కసారిగా రాష్ట్రంలోని వార్తా చానెళ్లు అన్నీ ఆ వీడియోను ప్రసారం చేశాయి. తృణమూల్‌కు చెందిన నేతలు స్వయంగా ఈ వీడియోలో కనిపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శుక్రవారం నారదా స్కాంపై ప్రాథమిక విచారణ జరిపి 72 గంటల్లో రిపోర్టు ఇవ్వాలని సీబీఐను పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశించింది. శారదా, రోజ్ వ్యాలీ కుంభకోణాల కంటే ఎక్కువ మంది నారదా స్కాంలో సంబంధాలు కలిగివున్నట్లు తెలిసింది. -
ప్రధాన పాత్ర ఇస్తే మళ్లీ నటిస్తా
ఊర్వశి శారద కొత్తపేట : ‘శారద’గా ఆమె కనుకొలకుల నుంచి కరుణరసం కురిపించారు. అవే కళ్ల నుంచి విధ్యుక్తధర్మ నిర్వహణకు కట్టుబడ్డ పోలీసు ధీరత్వం ఉట్టిపడింది. ఏ పాత్ర ధరించినా దానిలోకి పరకాయ ప్రవేశం చేసే ఆ నటవిశారదే ‘ఊర్వశి’ శారద. తెలుగు సినీ పరిశ్రమలో బాలనటిగా, హీరోయినుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపుతో పాటు ప్రతిష్టాత్మక ’ఊర్వశి’ అవార్డును మూడు సార్లు సాధించిన ఆమె సొంతం. గత కొన్నేళ్ళుగా నట జీవితానికి దూరంగా ఉన్న ఆమె గురువారం శనీశ్వర దర్శనం నిమిత్తం మందపల్లి క్షేత్రానికి వచ్చారు. ఆ సందర్భంగా ఆమె తనను కలిసిన ‘సాక్షి’కి తన సినీ జీవిత అనుభవాలు వివరించారు. సాక్షి : మీ అసలు పేరు? సినీ రంగ ప్రవేశం? శారద : సరస్వతి. పదేళ్ళ వయసులో రామారావు హీరోగా నటించిన ‘కన్యాశుల్కం’ సినిమాలో బాల నటిగా నటించాను. తరువాత యుక్త వయసులో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో ఆయన చెల్లెలిగా నటించాను. సాక్షి : హీరోయినుగా మీ తొలి సినిమా? ఎన్ని చిత్రాల్లో నటించారు? శారద : కాంతారావు హీరోగా నటించిన ‘శ్రీమతి’. ఐదు భాషల్లో సుమారు 350 సినిమాల్లో నటించాను. సాక్షి : మీకు గుర్తింపు తెచ్చిన సినిమాలేమిటి? శారద : దాదాపు అన్ని సినిమాలూ గుర్తింపు తెచ్చాయి. ప్రధానంగా ‘మనుషులు మారాలి, కార్తీకదీపం, శారద, బలిపీఠం, ప్రతిధ్వని, చండశాసనుడు’ ఇలా ఎన్నో సినిమాలున్నాయి. ఒకే పాత్ర.. నాలుగు భాషల్లో, నలుగురు హీరోలతో.. సాక్షి : మీకు తీపి జ్ఞాపకంగా మిగిలిన అత్యుత్తమ సినిమా? మీకు ఎన్ని అవార్డులు వచ్చాయి? వాటిలో ప్రధానమైనవి? శారద : ‘మనుషులు మారాలి’. ఆ సినిమాను నాలుగు భాషల్లో నలుగురు హీరోలతో చేశాను. తెలుగులో శోభనుబాబుతో, మళయాళంలో ప్రేమ్‌నజీర్‌తో, తమిళంలో ఏవీఎం రాజనుతో, హిందీలో పరీక్షిత్ సహానీతో నటించాను. నాలుగు భాషల్లోనూ ఆ సినిమా హిట్టయ్యింది. చాలా అవార్డులు వచ్చాయి. అయితే నేషనల్ అవార్డు ‘ఊర్వశి’ గొప్పది. ఆ అవార్డు మూడు సార్లు ఇచ్చారు. సాక్షి : ఏ హీరోలతో ఎక్కువగా నటించారు? మీ అభిమాన హీరో,హీరోయిను ఎవరు? శారద : శోభనుబాబు, ప్రేమ్‌నజీర్, చిరంజీవి, బాలకృష్ణలతో ఎక్కువ సినిమాలు చేశాను. రామారావు తెలుగు జాతి గర్వించదగ్గ మహాపురుషుడు. ఆయన హీరోయే కాదు, గొప్ప దర్శకుడు కూడా.ఆయన దర్శకత్వం వహించి, నటించిన సినిమాల్లో ఎదుటి క్యారెక్టర్‌కు కూడా మంచి గుర్తింపు ఇచ్చేవారు. అలా ‘చండశాసనుడు’ సినిమాలో నాది ఎనుటీఆర్ను డామినేట్ చేసే చెల్లెలి పాత్ర. ఇక హీరోయిను నర్గీస్ నా అభిమాన నటి. సాక్షి : నటనకు ఫుల్స్టాప్ పెట్టేశారా? మీ తరానికి, నేటి తరానికి నటనలో వ్యత్యాసంపై మీ అభిప్రాయం? శారద : లేదు. ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమాలో నటించనున్నాను. భవిష్యత్‌లో కూడా మెయినుక్యారెక్టర్ వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. గత కొన్నేళ్ళుగా వెస్ట్రను స్టైల్ నడిచింది. ప్రస్తుతం మారుతోంది. అలాగే పెద్ద సినిమాలకే కాక చిన్నకారు, సన్నకారు సినిమాలకు అవకాశాలు బాగున్నాయి. -
బ్లేడుతో భార్యపై భర్త దాడి
కాగజ్‌నగర్ రూరల్ : భార్యపై భర్త బ్లేడ్‌తో దాడిచేసి గాయపర్చిన సంఘటన కాగజ్‌నగర్‌లోని డీఎస్పీ కార్యాలయం ఎదుట శనివారం జరిగింది. బా ధితులు, పోలీసుల కథనం ప్రకారం.. బెజ్జూర్ మండలం ఖర్జెల్లి గ్రామానికి చెందిన రాచకొండ లచ్చన్న వివాహం 1999లో మంచిర్యాలకు చెందిన శారదతో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు మణికంఠ, రామకృష్ణ. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో 2011 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. లచ్చన్న బల్లార్షాలో ఉంటుండగా.. శారద పిల్లలతో కలిసి వరంగల్‌లో ఉంటూ మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఖర్జెల్లిలోని లచ్చన్నకు చెందిన ఆస్తి విషయమై శారద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా వీరు వినకపోవడంతో కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు వద్దకు కౌన్సెలింగ్ నిమిత్తం పంపించారు. శనివారం వీరిద్దరికి డీఎస్పీ తన కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పిల్లలు ఉన్నందున కలిసి ఉండాలని డీఎస్పీ సూచించారు. మధ్యాహ్నం వరకు ఆలోచించి నిర్ణయం చెప్పాలని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయం నుంచి బయటకు రాగానే అప్పటికే తన వద్ద ఉన్న బ్లేడ్‌తో శారద మెడపై లచ్చన్న దాడి చేశాడు. శారద తన చేయి అడ్డుపెట్టగా చేతికీ తీవ్ర గాయమైంది. అక్కడే ఉన్న కాగజ్‌నగర్ రూరల్ సీఐ రవీందర్ లచ్చన్నను అదుపులోకి తీసుకుని శారదను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నామని టౌన్ ఎస్‌హెచ్‌వో రవికుమార్ తెలిపారు.