-
ఊర్వశి శారద
కొత్తపేట : ‘శారద’గా ఆమె కనుకొలకుల నుంచి కరుణరసం కురిపించారు. అవే కళ్ల నుంచి విధ్యుక్తధర్మ నిర్వహణకు కట్టుబడ్డ పోలీసు ధీరత్వం ఉట్టిపడింది. ఏ పాత్ర ధరించినా దానిలోకి పరకాయ ప్రవేశం చేసే ఆ నటవిశారదే ‘ఊర్వశి’ శారద. తెలుగు సినీ పరిశ్రమలో బాలనటిగా, హీరోయినుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపుతో పాటు ప్రతిష్టాత్మక ’ఊర్వశి’ అవార్డును మూడు సార్లు సాధించిన ఆమె సొంతం. గత కొన్నేళ్ళుగా నట జీవితానికి దూరంగా ఉన్న ఆమె గురువారం శనీశ్వర దర్శనం నిమిత్తం మందపల్లి క్షేత్రానికి వచ్చారు. ఆ సందర్భంగా ఆమె తనను కలిసిన ‘సాక్షి’కి తన సినీ జీవిత అనుభవాలు వివరించారు.
సాక్షి : మీ అసలు పేరు? సినీ రంగ ప్రవేశం?
శారద : సరస్వతి. పదేళ్ళ వయసులో రామారావు హీరోగా నటించిన ‘కన్యాశుల్కం’ సినిమాలో బాల నటిగా నటించాను. తరువాత యుక్త వయసులో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో ఆయన చెల్లెలిగా నటించాను.
సాక్షి : హీరోయినుగా మీ తొలి సినిమా?
ఎన్ని చిత్రాల్లో నటించారు?
శారద : కాంతారావు హీరోగా నటించిన ‘శ్రీమతి’.
ఐదు భాషల్లో సుమారు 350 సినిమాల్లో నటించాను.
సాక్షి : మీకు గుర్తింపు తెచ్చిన సినిమాలేమిటి?
శారద : దాదాపు అన్ని సినిమాలూ గుర్తింపు తెచ్చాయి. ప్రధానంగా ‘మనుషులు మారాలి, కార్తీకదీపం, శారద, బలిపీఠం, ప్రతిధ్వని, చండశాసనుడు’ ఇలా ఎన్నో సినిమాలున్నాయి. ఒకే పాత్ర.. నాలుగు భాషల్లో, నలుగురు హీరోలతో..
సాక్షి : మీకు తీపి జ్ఞాపకంగా మిగిలిన అత్యుత్తమ సినిమా? మీకు ఎన్ని అవార్డులు వచ్చాయి? వాటిలో ప్రధానమైనవి?
శారద : ‘మనుషులు మారాలి’. ఆ సినిమాను నాలుగు భాషల్లో నలుగురు హీరోలతో చేశాను. తెలుగులో శోభనుబాబుతో, మళయాళంలో ప్రేమ్‌నజీర్‌తో, తమిళంలో ఏవీఎం రాజనుతో, హిందీలో పరీక్షిత్ సహానీతో నటించాను. నాలుగు భాషల్లోనూ ఆ సినిమా హిట్టయ్యింది. చాలా అవార్డులు వచ్చాయి. అయితే నేషనల్ అవార్డు ‘ఊర్వశి’ గొప్పది. ఆ అవార్డు మూడు సార్లు ఇచ్చారు.
సాక్షి : ఏ హీరోలతో ఎక్కువగా నటించారు?
మీ అభిమాన హీరో,హీరోయిను ఎవరు?
శారద : శోభనుబాబు, ప్రేమ్‌నజీర్, చిరంజీవి, బాలకృష్ణలతో ఎక్కువ సినిమాలు చేశాను. రామారావు తెలుగు జాతి గర్వించదగ్గ మహాపురుషుడు. ఆయన హీరోయే కాదు, గొప్ప దర్శకుడు కూడా.ఆయన దర్శకత్వం వహించి, నటించిన సినిమాల్లో ఎదుటి క్యారెక్టర్‌కు కూడా మంచి గుర్తింపు ఇచ్చేవారు. అలా ‘చండశాసనుడు’ సినిమాలో నాది ఎనుటీఆర్‌ను డామినేట్ చేసే చెల్లెలి పాత్ర. ఇక హీరోయిను నర్గీస్ నా అభిమాన నటి.
సాక్షి : నటనకు ఫుల్‌స్టాప్ పెట్టేశారా?
మీ తరానికి, నేటి తరానికి నటనలో
వ్యత్యాసంపై మీ అభిప్రాయం?
శారద : లేదు. ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమాలో నటించనున్నాను. భవిష్యత్‌లో కూడా మెయినుక్యారెక్టర్ వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. గత కొన్నేళ్ళుగా వెస్ట్రను స్టైల్ నడిచింది. ప్రస్తుతం మారుతోంది. అలాగే పెద్ద సినిమాలకే కాక చిన్నకారు, సన్నకారు సినిమాలకు అవకాశాలు బాగున్నాయి.