ఉద్రిక్తంగా మారిన ఇంటర్వ్యూలు
జగిత్యాల క్రైం: గల్ఫ్‌లో ఉద్యోగాల కోసం జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలు ఉద్రిక్తంగా మారాయి. అనుమతి పత్రాలు ఉన్నాయని ఏజెంట్లు చూపించినా... డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఇంటర్వ్యూను అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులు ఫర్నీచర్ ధ్వంసం చేసేందుకు యత్నించగా ఉత్కంఠకు దారితీసింది. షార్జా బల్దియాలో 170 ఉద్యోగాలు ఉన్నాయని ఏజెంట్లు స్థానికంగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందు కోసం జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఏజెంట్ జగిత్యాల పట్టణం సమీపంలో ధరూర్ శివారులోని రెడ్డి కల్యాణ మండపంలో శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల నుంచి సుమారు 2 వేల మంది నిరుద్యోగులు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు గల్ఫ్ ఏజెంట్‌ను పిలిపించి అనుమతులు కోరగా.. సంబంధిత పత్రాలు చూపించడంతో సమస్య సద్దుమణిగింది.
ప్రక్రియ సజావుగా సాగుతుం డగా, ఇంటర్వ్యూల పేరిట ఒక్కో వ్యక్తి నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారని ఎస్పీ అనంత శర్మకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. దీంతో ఆయన ఇంటర్వ్యూలు నిలిపివేయాలని సీఐ ప్రకాశ్‌ను ఆదేశించారు. సీఐతోపాటు రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చి వారి అనుమతి పత్రాలను, ఇంటర్వ్యూలకు వచ్చిన నిరుద్యోగుల వివరాలు సేకరించారు. పోలీసులు సూచన మేరకు నిర్వాహ కులు ఇంటర్వ్యూలు నిలిపివేస్తున్నట్లు ప్రకటిం చారు. దీంతో నిరుద్యోగులు ఒక్కసారిగా కల్యాణ మండపంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తతత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని నిరుద్యోగులను శాంతింపజే శారు. త్వరలో మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని నిర్వాహకులు హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు.