ప్రతీకాత్మక చిత్రం
చిత్తూరు అర్బన్: రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.1.27 కోట్లు వసూలు చేసి.. ఇళ్లు, పొలాలు కొనుగోలు చేసి దర్జాగా జీవిస్తున్న ఘరానా మోసగాడిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను డీఎస్పీ సుధాకర్‌రెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు. తవణంపల్లె మండలం అరగొండ పైపాకంకు చెందిన ముట్టుకూరు హేమంత్‌కుమార్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇతని తండ్రి రైల్వేలో ట్రాక్‌మెన్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగం చేసే సమయంలో కొందరు అధికారులతో హేమంత్ పరిచయాలు పెంచుకున్నాడు.
ఈ క్రమంలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి చిత్తూరుకు చెందిన జ్ఞానరాజ్ నుంచి రూ.4.50 లక్షలు, ప్రొటోకాల్ అటెండర్ పోస్టు ఇప్పిస్తానని చెప్పి సత్యనారాయణపురానికి చెందిన నేతాజీ నుంచి రూ.14 లక్షలు వసూలు చేశాడు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ పత్రిక జనవరి 29న హేమంత్ మోసాలపై ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై డీఎస్పీ సుధాకర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. వన్‌టౌన్ సీఐ నరసింహరాజు నేతృత్వంలో ఎస్‌ఐలు శ్రీనివాసరావు, పద్మావతి దర్యాప్తు చేశారు. విచారణలో హేమంత్ మొత్తంగా రూ.1.27 కోట్లు నిరుద్యోగులను మోసగించి వసూలు చేసినట్లు తేలింది. నిందితుడు గురువారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో తిరుగుతుండగా పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment