Railway jobs
-
ల్యాండ్ ఫర్ జాబ్ : లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో ఎదురు దెబ్బ
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూపై సీబీఐ మరో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్లో లాలూతో పాటు మరో 71 మందిని చేర్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే ఆ ఛార్జ్ షీట్లపై విచారణ చేపట్టాలా? వద్దా? అనే అంశంపై న్యాయమూర్తి జులై 6న తేల్చనున్నారు.గత మే 29న ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి సీబీఐని నిలదీశారు. ఛార్జిషీటు దాఖలు చేసేందుకు ప్రతి తేదీకి మరింత సమయం కావాలని సీబీఐ కోరడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 7లోగా తుది నివేదికను దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించారు. ఢిల్లీ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాజాగా కోర్టు ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది.ఉద్యోగాలే లేవు.. అయినప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వేమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో జోనల్ రైల్వేలలో ఉద్యోగాలపై అధికారిక నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ పాట్నా, ముంబై, జబల్పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్‌లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేలలో లాలూ ప్రసాద్ యాదవ్ నియమించారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, సహచరుల పేరుతో భూములను తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి.కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ అంటే?ఒక వ్యక్తికు సంబంధించిన ఏదైనా కేసును దర్యాప్తు సంస్థలు పూర్తి విచారణ చేపట్టిన అనంతరం.. సదరు వ్యక్తి నేరం చేశారని నిర్ధారిస్తూ అభియోగాలు మోపుతూ కోర్టు దాఖలు చేసే దానిని కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ అంటారు. -
లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: తాను రైల్వేమంత్రిగా ఉన్న కాలంలో భూములు రాయించుకుని కొందరికి రైల్వేలో గ్రూప్–డీ ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కూ సమన్లు పంపింది. ఈనెల 22వ తేదీన ఢిల్లీ ఆఫీస్‌కు రావాలని తేజస్వీని, డిసెంబర్ 27న రావాలని లాలూకు ఈడీ సూచించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో వీరిద్దరి నుంచి అధికారులు వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఈడీ ఇప్పటికే ఇదే కేసులో ఏప్రిల్‌లో ఎనిమిది గంటలపాటు తేజస్వీని విచారించింది. లాలూ ప్రసాద్‌కు ఈ కేసులో సమన్లు పంపడం ఇదే తొలిసారి. గత నెలలో లాలూ కుటుంబానికి ఆప్తుడైన అమిత్ కాత్యాల్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన నేపథ్యంలో వీరికి సమన్లు జారీకావడం గమనార్హం. -
రైల్వేలో ఖాళీల సంఖ్య 2.74 లక్షలు
న్యూఢిల్లీ: రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ఇందులో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఖాళీలే 1.75 లక్షల వరకు ఉన్నాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నలకు రైల్వే శాఖ వివరంగా సమాధానమిచి్చంది. రైల్వే శాఖలో మొత్తంగా 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. ఇందులో భద్రత కేటగిరీకి సంబంధించిన ఖాళీలు 1,77,924గా ఉన్నాయి. జూన్ 1 తేదీ నాటికి నాన్ గెజిటెడ్ గ్రూప్ సిలో 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రైల్వే శాఖ చెప్పింది. ఇక రైల్వేల భద్రతకు సంబంధించి 9.82 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 8.04 లక్షల భర్తీ చేసినట్టు వివరించింది. భద్రత కేటగిరీలో లోకో పైలెట్లు, ట్రాక్ తనిఖీలు చేసే వ్యక్తులు, పాయింట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, టికెట్ కలెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఒడిశాలో బాలాసోర్ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఐ కింద పోస్టుల ఖాళీలపై ఆర్టీఐ కింద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
జాబ్ ఫర్ ల్యాండ్ కేసు.. లాలూ సన్నిహితుడి అరెస్టు
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేక అధికారిగా పనిచేసిన భోళా యాదవ్‌ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. జాబ్ ఫర్ ల్యాండ్ కుంభకోణం కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా పట్నా, దర్భంగాలోని మొత్తం నాలుగు ప్రదేశాల్లో సీబీఐ ముమ్ముర తనిఖీలు నిర్వహించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు(2004-09) రైల్వే శాఖలో ఉద్యోగాలు పొందిన కొందరు లాలూకు, ఆయన కుటుంబసభ్యులకు భూమిని తక్కువ ధరకే విక్రయించడం లేదా గిఫ్ట్‌గా ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఈ ఏడాది మేలో కొత్త కేసు నమోదు చేసింది. లాలూ, ఆయన సతీమణి రబ్రీ దేవి, కుమార్తెలు మిషా భారతి, హేమా యాదవ్‌లతో పాటు 12మందిపై అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి లాలూ నివాసం సహా బిహార్, ఢిల్లీలో మొత్తం 17 చోట్ల సీబీఐ తనిఖీలు నిర్వహించింది. 2021 నుంచి దీనిపై దర్యాప్తు చేస్తోంది. అయితే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే లాలూపై దాడులు చేస్తున్నారని ఆర్జేడీ విమర్శిస్తోంది. ఒకప్పుడు రైల్వే శాఖకు వేల కోట్లు లాభాలు తెచ్చిపెట్టి దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న లాలూను.. ఇప్పుడు దేశాన్ని అమ్మేస్తున్న ఓ గ్రూప్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని లాలూ కుమార్తె రోహిణి యావద్ తీవ్ర ఆరోపణలు చేశారు. చదవండి: త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు -
భర్త కానిస్టేబుల్, భార్య కిలాడీ.. ఇద్దరు కలిసి..
సాక్షి, ఖమ్మం: రైల్వే శాఖలో గెజిటెడ్ ఆఫీసర్నని ఆర్భాటం చేయడమే కాక అదే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తానంటూ రూ.కోట్లలో వసూలు చేసిన మహిళను శనివారం ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ చిట్టిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన దాసరి సరిత, ఆమె భర్త తల్లాడ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ముద్దం శ్రీకాంత్ (2009 బ్యాచ్) నగరంలోని సుగ్గల వారి తోటలో నివసిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు సరిత రైల్వే శాఖలో గెజిటెడ్ ఆఫీసర్‌గా తన భర్త సాయంతో నకిలీ గుర్తింపు కార్డు రూపొందించింది. ఈ కార్డు ద్వారా బంధువులు, స్నేహితులు, ఇతరులను నమ్మబలుకుతూ రైల్వే మంత్రి, ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నందున ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 12మంది నుంచి రూ.1,88,95,000 వసూలు చేశారు. అలాగే, మరి కొందరికి రైల్వే శాఖలో కాంట్రాక్టులు ఇప్పిస్తానని కూడా మోసం చేశారు. ఈ డబ్బుతో విలాసాలు చేస్తున్న దంపతులు కొన్ని చోట్ల స్థిర, చరాస్తులు కొనుగోలు చేశారు. అయితే, ఎంతకూ ఉద్యోగాలు రాకపోవడం, డబ్బు తీసుకున్న సరిత, శ్రీకాంత్ ముఖం చాటేయడంతో చెరువు బజార్‌కు చెందిన పాలవెల్లి తులసి, డౌలే సునీత ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అడిషనల్ డీసీపీ గౌస్ ఆలం ద్వారా విచారణ చేయించగా దంపతుల వ్యవహారం బయటపడడంతో ఇద్దరి ని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. కాగా, కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై చర్యల కోసం ఉన్నతాధికారులకు సీపీ సిఫారసు చేశారని సీఐ వెల్లడించారు. -
రైల్వే ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
చిత్తూరు అర్బన్: రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.1.27 కోట్లు వసూలు చేసి.. ఇళ్లు, పొలాలు కొనుగోలు చేసి దర్జాగా జీవిస్తున్న ఘరానా మోసగాడిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను డీఎస్పీ సుధాకర్‌రెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు. తవణంపల్లె మండలం అరగొండ పైపాకంకు చెందిన ముట్టుకూరు హేమంత్‌కుమార్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇతని తండ్రి రైల్వేలో ట్రాక్‌మెన్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగం చేసే సమయంలో కొందరు అధికారులతో హేమంత్ పరిచయాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి చిత్తూరుకు చెందిన జ్ఞానరాజ్ నుంచి రూ.4.50 లక్షలు, ప్రొటోకాల్ అటెండర్ పోస్టు ఇప్పిస్తానని చెప్పి సత్యనారాయణపురానికి చెందిన నేతాజీ నుంచి రూ.14 లక్షలు వసూలు చేశాడు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ పత్రిక జనవరి 29న హేమంత్ మోసాలపై ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై డీఎస్పీ సుధాకర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. వన్‌టౌన్ సీఐ నరసింహరాజు నేతృత్వంలో ఎస్ఐలు శ్రీనివాసరావు, పద్మావతి దర్యాప్తు చేశారు. విచారణలో హేమంత్ మొత్తంగా రూ.1.27 కోట్లు నిరుద్యోగులను మోసగించి వసూలు చేసినట్లు తేలింది. నిందితుడు గురువారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో తిరుగుతుండగా పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. -
రూ. 23,100కే రైల్వే జాబ్!
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో రైల్వే ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి, సంప్రదించిన వారితో షైన్.కామ్‌లో రిజిస్టర్ చేయించి, వివిధ చార్జీల పేరుతో రూ. 23,100 వరకు వసూలు చేసి, మోసం చేసే ముఠా సూత్రధారిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితుడి ద్వారా నిందితుడిని కోల్‌కతాలో పట్టుకున్న అధికారులు పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన అనంతరం కోర్టు అనుమతితో బుధవారం సైబర్ కాప్స్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా చేతిలో దేశ వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది మోసపోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్యే 20 మంది వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురి ఫిర్యాదులతో కేసులు నమోదు కాగా... మరో 12 మందిని గుర్తించామని, మిగిలిన ఐదుగురి కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ⇔ కోల్‌కతా, హుగ్లీలోని చందన్నగర్కు చెందిన హర్ష బర్దన్ మిశ్రా బీసీఏ పూర్తి చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన ఇతగాడు ప్రస్తుతం అక్కడి నరూ రోయ్‌పర ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ ఐటీ టెక్నాలజీ గ్రూప్ అండ్ ఏఎస్ ఇన్ఫోసాల్వ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ⇔ పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన బినిత పాల్, రిచ, అనితలను ఉద్యోగులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఐదుగురూ కలిసి ఆన్లైన్ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక మందిని ఉద్యోగాల పేరుతో ఎర వేసి మోసం చేస్తున్నారు. ⇔ ఓఎల్ఎక్స్లో రైల్వేతో పాటు డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చే వీరు అందులో తమ ఫోన్ నంబర్లను పొందుపరుస్తున్నారు. వీటిని చూసి ఎవరైనా కాల్ చేస్తే.. వారి వివరాలను షైన్.కామ్ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచిస్తున్నారు. ⇔ ఆ తర్వాత రెండు రోజుల్లో నిందితులు బాధితులకు ‘హెచ్ఆర్ రిచ’, ‘హెచ్ఆర్ జాస్మిన్’ పేర్లతో బల్క్ మెసేజ్‌లో పంపుతున్నారు. ఉద్యోగార్థుల్లో అత్యధికులు రైల్వే ఉద్యోగాలే కోరుతుండటంతో ఆ డిపార్ట్మెంట్లో సైట్ సూపరింటెండెంట్ పోస్టులకు అర్హులయ్యారంటూ చెబున్నారు. మరికొందరితో ప్యాంటరీకార్స్లో పోస్టుల పేరు చెప్తున్నారు. ⇔ నెలకు రూ.13,500 నుంచి రూ.15,500 వరకు ప్రారంభ వేతనం ఉంటుందని, ఉద్యోగస్తుడితో పాటు అతడి కుటుంబానికీ రైల్వేలో ఉచిత ప్రయాణం సహా ఇతర సౌకర్యాలు ఉంటాయంటూ నమ్మబలుకుతున్నారు. ఇలా తమ వల్లోపడిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పేరుతో ప్రాథమికంగా రూ.1000 వసూలు చేస్తున్నారు. ⇔ ఆపై ప్రాసెసింగ్, యూనిఫాం చార్జీల పేర్లు చెప్పి రూ. 23,100 వరకు వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించిన వారు ఎవరైనా ఫోన్లు చేస్తే త్వరలోనే రైల్వే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్, నియామక ఉత్తర్వులు అందుతాయంటూ దాట వేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎవరైనా పదేపదే కాల్స్ చేసి ఉద్యోగం విషయం ప్రశ్నిస్తే కొత్త కథ అల్లుతున్నారు. ⇔ అయితే 95 శాతం మంది రూ. 23,100 కోల్పోయిన తర్వాత వీరికి దూరంగా ఉంటున్నారు. మిగిలిన వారు మాత్రం అదనపు మొత్తం చెల్లించడానికి సిద్ధమంటుంటే... వారి నుంచి మరో రూ.6,900 వరకు వసూలు చేసి వారి నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ⇔ ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వాళ్లల్లో అత్యధికులు పోలీసుల వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. నగరానికి చెందిన ముగ్గురు మాత్రం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించి మోసపోయారు. వీరంతా సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ⇔ వీటిని సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలోని బృందం ప్రధాన నిందితుడు హర్ష కోల్‌కతా సమీపంలోని డమ్‌డమ్‌లో ఉన్నట్లు గుర్తించింది. అక్కడికి వెళ్లే సరికి తన మకాం మార్చేశాడని తేలింది. అయితే అతడు ఓ వ్యక్తితో పదేపదే ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించిన స్పెషల్ టీమ్ అతడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో తాను కూడా హర్షకు రూ.30 వేలు చెల్లించి మోసపోయిన కోల్‌కతా వాసినంటూ చెప్పాడు. ⇔ అతగాడికి నరూ రోయ్‌పర ప్రాంతంలో ఓ కార్యాలయం ఉందని చెప్పి పోలీసులను తీసుకెళ్లి చూపించాడు. దీంతో హర్షను అరెస్టు చేసిన అధికారులు అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
సాక్షి, శంషాబాద్: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నఅంతర్ రాష్ట్ర ముఠాను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలోని నలుగురు సభ్యుల్లో సర్వేష్ సాహు, అబ్ధుల్ మాజిద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు మిశ్రా, దినేష్‌లు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఆరు లక్షల నగదు, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్, ఐడి కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా సంప్రదిస్తే వారిని నమ్మొద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. కాగా, నిందితులు కేంద్ర రైల్వే సర్వీసెస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వందలాది మంది నిరుద్యోగుల నుండి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. బాధితులకు ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నమ్మించిన నిందితులు.. ఫేక్ మెడికల్ టెస్ట్ సైతం నిర్వహించారు. రైల్వే డిపార్ట్మెంట్ నుండి మెయిల్ వచ్చినట్లు ఫేక్ ఐడితో మెయిల్స్ పంపి, ఢిల్లీ, బెంగాల్‌లలో ట్రైనింగ్ క్లాసులంటూ నమ్మించారు. నార్త్ సెంట్రల్ రైల్వే పేరుతో బాధితుల పేరిట ఫేక్ ఐడి కార్డులను సృష్టించారు. ఉద్యోగం కోసం బాధితులు రైల్వే కార్యాలయాన్ని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
మోసగాడు.. ఇలా దొరికాడు
ఆ మోసగాడు సొమ్ములు ఎగ్గొట్టి.. ఖాతాదారుల కళ్లు గప్పాడు. పోలీసులనూ మాయచేసి సామగ్రిని తరలించేశాడు. ఈ వ్యవహారంపై సాక్షిలో ప్రచురితమైన కథనంతో మాయాలోడు బయటికొచ్చాడు. ‘సాక్షి’ రిపోర్టర్‌ను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారు. రిపోర్టర్ చాకచక్యంగా వ్యవహరించి సాక్షి కార్యాలయానికి వస్తే మాట్లాడుకుందామని నిందితుడికి చెప్పడమే కాకుండా మరోవైపు మోసగాడు వస్తున్న విషయాన్ని బాధితులకు చేరవేశారు. దీంతో సాక్షి కార్యాలయం వద్ద మాటువేసిన బాధిత బృందం వలలో ఆ నేరగాడు చిక్కాడు. అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రయత్నంలో ‘సాక్షి’ సాహసానికి బాధితులు అభినందనలు తెలిపారు. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: రైల్వే ఉద్యోగాల పేరిట మోసం చేసి పరారీలో ఉన్న సాయిసంతోష్ అనే ఘరానా వ్యక్తి సాక్షి రిపోర్టర్ చొరవతో బాధితులకు దొరికిపోయాడు. ఆదివారం సాక్షిలో ‘రూ.కోటితో ఉడాయింపు’ అనే శీర్షికతో టాబ్లాయిడ్లో ప్రముఖంగా ప్రచురితమైన కథనం చూసి నిందితుడు ఉదయమే అక్కయ్యపాలెంలోని సాక్షి కార్యాలయానికి వచ్చాడు. ఈ వార్త రాసిన రిపోర్టర్ ఫోన్ నెంబర్ కావాలని అక్కడి సెక్యురిటీని అడిగి తీసుకున్నాడు. రిపోర్టర్‌కు ఫోన్‌చేసి డబ్బుతో ప్రలోభపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వార్త రాసిన రిపోర్టర్ చాకచక్యంతో బాధితులకు, పోలీసులకు సమాచారం అందించి సాక్షి కార్యాలయంలో చాటుగా వేచి ఉండమని సలహా ఇచ్చాడు. రైల్వే ఉద్యోగాల పేరిట డబ్బులు పోగొట్టుకున్న బాధితులంతా సాక్షి ఆఫీస్‌కు వచ్చి పార్కింగ్ వద్ద వేచి ఉన్నారు. అదే సమయంలో సాక్షి రిపోర్టర్ నిందితుడు సాయి సంతోష్‌కు ఫోన్ చేసి తను ఆఫీస్‌కు వచ్చానని, త్వరగా రావాలని లేదంటే బయటకి వెళ్లిపోతానని చెప్పాడు. దీంతో వెంటనే నిందితుడు ఆఫీస్‌కు వచ్చాడు. ఇదే అదునుగా బాధితులు అతన్ని పట్టుకుని ఉద్యోగాల పేరిట తమను మోసంచేసి పరారైపోతావా...తమ డబ్బులు తమకివ్వాలని నిలదీశారు. ‘మీకు డబ్బులిచ్చేది లేదు.. తాను ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాను.. ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.. కోర్టులోనే తేల్చుకుందాం’ అని నిందితుడు బుకాయించడానికి ప్రయత్నించాడు. బాధితులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఫోర్త్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మూడు గంటల పాటు ఉంచారు. నిందితుడి తరుపు లాయర్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకు వచ్చి ఎస్ఐకి చూపించి తీసుకెళ్లిపోయారు. బాధితులకు త్వరలో డబ్బులు ఇస్తానని ఎస్ఐ సమక్షంలో నిందితుడు హామీ ఇచ్చాడు. చార్జిషీట్ వేస్తాం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు సాయిసంతోష్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చాం. అయితే అతను ముందస్తు బెయిల్ తీసుకురావడంతో అరెస్టు చేయలేకపోయాం. 41 నోటీస్ ఇచ్చాం. దీనిపై విచారణ జరుగుతుంది. పూర్తి విచారణ చేసి చార్జిషీటు వేస్తాం. – వై.రవి, ఫోర్తు టౌన్ సీఐ -
నిరుద్యోగులే టార్గెట్.. రూ.కోటితో ఉడాయింపు!
సాక్షి, విశాఖపట్నం: నిరుద్యోగులే టార్గెట్... ఉద్యోగం కోసం ఆశగా నిరీక్షిస్తున్న వారు కనిపించగానే అక్కడ వాలిపోయాడు... డీఆర్ఎం ఆఫీసులో తను పనిచేస్తున్నానని, ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి రూ.కోటికిపైగా వసూలు చేసేశాడు... అనంతరం అదుగో ఉద్యోగాలు.. ఇదిగో ఉద్యోగాలు.. అంటూ కాలం గడిపేశాడు.. చివరకు బండారం బయటపడుతుందని అనుమానం రాగానే నగరం నుంచి ఉడాయించేశాడు. దీంతో మోసపోయిన 30 మందికిపైగా బాధితులు నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నమ్మించి టోకరా నగరంలోని అక్కయ్యపాలెంలో ‘వైజాగ్ హోమ్స్’ పేరిట ఎయిర్ కూలర్ సర్వీస్ సెంటర్‌ను శ్రీకాకుళం పట్టణానికి చెందిన మురహరి సాయి సంతోష్ నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడంతో తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వాటి నుంచి గట్టెక్కేందుకు సులువుగా డబ్బులు సంపాదించాలని భావించాడు. అనుకున్నదే తడువుగా నిరుద్యోగులను తన టార్గెట్‌గా పెట్టుకున్నాడు. గత ఏప్రిల్ నెలలో రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు నమ్మించాడు. వారు తెలియనప్పటికీ సంతోష్ నేరుగా వెళ్లి పరిచయం చేసుకునేవాడు. డీఆర్ఎం కార్యాలయంలో హెచ్ఆర్ విభాగంలో రిక్రూట్మెంట్ అధికారిగా పనిచేస్తున్నాను... రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేవాడు. అనంతరం అతని భార్య మురహరి సుజాతని రంగంలోకి దింపేవాడు. ఆమె చాకచక్యంగా మాట్లాడుతూ నిరుద్యోగులను అక్కయ్యపాలెం పరిధి లలితానగర్‌లోని ఎంకే కైలాస్ టవర్స్‌లో అద్దెకు ఉంటున్న తమ నివాసానికి తీసుకొచ్చి నమ్మకం కలిగించేది. మరికొందరిని డీఆర్ఎం కార్యలయానికి రమ్మని అక్కడి పరిచయాలతో నమ్మకం కలిగించేవాడు. పూర్తిగా నిరుద్యోగులను నమ్మించిన తర్వాత డబ్బులు అకౌంట్లో వేయాలని చెప్పేవాడు. ఇలా మొత్తం ఐదు అకౌంట్లలో బాధితుల నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నాడు. అలా సుమారు 30 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షలు చొప్పున రూ.కోటికి పైగా వసూలు చేశాడు. సెంటర్లోని ఫర్నీచర్ తరలింపు బాధితుల నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వారిని నమ్మించేందుకు భువనేశ్వర్‌కు వెళ్లేందుకు రైలు రిజర్వేషన్ చేయించుకోమనేవాడు. ఈ క్రమంలో వారు సిద్ధమైతే వాయిదా వేసేవాడు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు అప్పట్లోనే నగరంలోని నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతని ఇల్లు, వైజాగ్ హోమ్స్ సర్వీసు సెంటర్‌పై పోలీసులు నిఘా పెట్టారు. అయినప్పటికీ వారి కళ్లుగప్పి గురువారం రాత్రి అందులోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర విలువైన సామగ్రిని మురహరి సాయి సంతోష్ తరలించుకుపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితులు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సంతోష్‌ను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదేవిషయాన్ని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సూర్యనారాయణ వద్ద ప్రస్తావించగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 30 మందికిపైగా బాధితులు మురహరి సంతోష్ బాధితులు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో 30 మందికిపైగా ఉన్నారు. వారిలో శ్రీనివాస్, నక్కరాజు వెంకట సింహాద్రి, నక్కరాజు శివ, కర్రి సత్యారావు, గరికిన స్వర్ణ, గుర్రం అనిల్‌కుమార్, నక్కా రమణ, గెడ్ల మోహన్‌రెడ్డి, జి.వెంకట సతీష్, వళ్లు సూర్యనారాయణ, ఎల్లా త్రీనాథమ్మ, రేగిడి పద్మలతో కలిసి 30 మందికి పైగా బాధితులున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశాను రైల్వేలో ఏసీ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.4 లక్షల వరకు ఇవ్వాలని సంతోష్ చెప్పాడు. కొటాక్ మహీంద్ర బ్యాంక్ అక్కయ్యపాలెం బ్రాంచిలో అకౌంట్ నెంబర్ 7112098185లో డబ్బులు డిపాజిట్ చేయమనడంతో రూ.70 వేలు అకౌంట్లో వేశాను. అనంతరం అతని ఫోన్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చింది. ఇంతలో స్నేహితుల ద్వారా అసలు విషయం తెలిసింది. తనలాగే మరో 30 మందిని ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేశాడని తెలిసింది. తనతో పాటు మోసపోయిన బాధితులతో కలిసి ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. – పి.పద్మ, నిరుద్యోగి రూ.2 లక్షలు తీసుకున్నాడు 8 నెలల క్రితం విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న నన్ను పరిచయం చేసుకున్నాడు. తాను విశాఖ రైల్వే డీఆర్ఎం కార్యలయంలో హెచ్ఆర్ విభాగంలో రిక్రూట్మెంట్ అధికారిని అని చెప్పాడు. రైల్వేలో ఉద్యోగం కావాలంటే రూ.4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని.., ఇష్టమైతే ఫోన్ చేయమని చెప్పాడు. అయితే అనుమానంతో డీఆర్ఎం ఆఫీస్‌కి వెళ్తే అక్కడ సాయి సంతోష్, అతని భార్య మురహరి సుజాత ఎన్నారు. త్వరగా డబ్బులు రెడీ చేసుకో... లేదంటే ఉద్యోగం వేరొకరికి ఇచ్చేస్తామని అన్నారు. వెంటనే ఆర్ఆర్బీ అప్పికేషన్ ఇచ్చేసి నింపమన్నారు. తర్వాత కొటాక్ మహీంద్ర బ్యాంక్ అక్కయ్యపాలెం బ్రాంచిలో అకౌంట్ నెంబర్ 7112098185లో డబ్బులు డిపాజిట్ చేయమనడంతో మూడు విడతల్లో రూ.2లక్షలు ఇచ్చేశాను. – నరేష్, రైల్వే న్యూకాలనీ కఠినంగా శిక్షించాలి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన సాయి సంతోష్ దంపతులను కఠినంగా శిక్షించాలి. మాలాంటి నిరుద్యోగులెందరినో మోసం చేస్తున్న అలాంటి వారిని జైలుకి పంపించాలి. నా దగ్గర రూ.2 లక్షలు తీసుకున్నాడు. మూడు విడతల్లో డబ్బులిచ్చాను. ఫిబ్రవరి 10న భువనేశ్వర్ వెళ్లాలని చెప్పి రైలు రిజర్వేషన్ చేయించుకోమన్నాడు. తీరా వెళ్లాల్సిన రోజున మధ్యాహ్నం ఫోన్ చేసి వాయిదా పడిందన్నాడు. ఫిబ్రవరి 25న బయలుదేరమని మళ్లీ చెప్పాడు. తీరా రిజర్వేషన్ చేయించుకుని రైలు ఎక్కిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాం. – కైలాస్, విజయనగరం -
బయటపడిన రైల్వే ఉద్యోగాల మోసం
సాక్షి, విజయవాడ : రైల్వే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను బోల్తా కొట్టించిన ఓ ముఠా బాగోతం బుధవారం బయటపడింది. ముంబైకి చెందిన మిత్రా, నాగూర్, వరుణ్ యశ్వంత్ సోలంకి విజయవాడ కేంద్రంగా ఈ మోసానికి తెరలేపారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.8 లక్షలకు అమ్ముతామంటూ బేరం పెట్టిన కేటుగాళ్లు.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో ఫేక్ ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. ఈ తతంగంపై అనుమానం వచ్చిన చిరంజీవి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇంటర్వ్యూల సందర్భంగా నిరుద్యోగుల నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసేందుకు ముఠా సభ్యులు యత్నించినట్టు తెలిసింది. -
‘రైల్వే నియామకాల పేరుతో మరో టోకరా’
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేల్లో నాలుగు లక్షల ఉద్యోగాల భర్తీపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం పెదవివిరిచారు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వ మరో మోసపు ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులపై రైల్వే మంత్రిత్వ శాఖ హఠాత్తుగా మేలుకొందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లుగా రైల్వేల్లో 2,82,976 పోస్టులు ఖాళీ ఉంటే కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా ఈ పోస్టులు భర్తీ చేస్తామని మరో మోసంతో ముందుకొస్తోందని చిదంబరం ట్వీట్ చేశారు. ప్రభుత్వ శాఖలన్నింటిలో ఇదే పరిస్ధితి ఉందని, ఓవైపు ఖాళీ పోస్టులుంటే, మరోవైపు నిరుద్యోగ యువత నిరాశలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా 2021 నాటికి రైల్వేలు నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. రానున్న రెండేళ్లలో 2.3 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. -
ప్రభుత్వ ఉద్యోగాలకు భోజన వసతితో కూడిన ఉచిత శిక్షణ
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : నేడు దేశంలో పెరుగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వాలు ఎటువంటి జవాబుదారీతనం వహించట్లేదు. అడపాదడపా నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ సరైన శిక్షణ లేక యువత నిరుద్యోగులుగానే మిగిలి పోతున్నారు. ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 22వ తేదీన, ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 24న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ కాలేజ్ వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు. -
ఒక్క రూపాయి..
నంద్యాల(ఎడ్యుకేషన్) : ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన పది మంది యువకులు చాలు నాకు. దేశాన్ని పునర్నిర్మించటానికి, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటానికి. తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు స్వామి వివేకానంద. దేన్నీ అపాత్రాధానం చేయకూడదని, వాటి విలువ పుచ్చుకునేవారికి తెలియాలనే ఉద్ధేశ్యంతో విద్యాదానమైనా, అన్నదానమైనా ఒక్క రూపాయి మాత్రమే తీసుకోవాలని తన శిష్యులకు ఉపదేశించారు. మరి వారి ఆశయాలను నెరవేర్చే శిష్యులు ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ, ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రం వివేకానందుల వారి ఆలోచనలకు ప్రాణం పోస్తుంది. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఆ శిక్షణలో రాటుదేలిన పలువురు నేడు అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించారు. నంద్యాలలోని నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 6న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం టెట్, డీఎస్సీ తరగతులను జూలై 8న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు. -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణా తరగతులు
ప్రతి పేద విద్యార్థి కల ప్రభుత్వ ఉద్యోగం సాధించటం. అందుకోసం అప్పుచేసి వేలకు వేలు కోచింగ్ సెంటర్లకు ఫీజుగా చెల్లిస్తూ, అరకొర వసతులతో, పస్తులతో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు యువత. వీరందరికీ ఒక మంచి భవిష్యత్తును నిర్మించాలనుకుని నడుం కట్టింది ఓ స్వచ్ఛంద సంస్థ. వీరికి ఉచిత తరగతులు నిర్వహిస్తూ, వసతితో కూడిన భోజన సౌకర్యం కల్పిస్తూ తమ సేవలందిస్తుంది. ఇప్పటిదాకా వంద మంది యువతీ, యువకులు వీరి శిక్షణను ఉపయోగించుకొని ఉద్యోగాలను సాధించారు. సాక్షి, నంద్యాల : నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడునని, కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూన్ 15వ తేదీ తరగతులు నిర్వహిస్తామని, ఉపాధ్యాయ పరీక్షల కోసం టెట్, డీఎస్సీ తరగతులను జూన్ 21వ తేదీన తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడునని, అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహిస్తామని, శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కొరకు 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు. -
పదివేల రైల్వే జాబ్స్
రైల్వే భద్రతా బలగాల్లో ఉద్యోగాల సైరన్ మోగింది. చాలా రోజుల తర్వాత రైల్వేలో యూనిఫాం ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్)ల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారత రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతో పోల్చుకుంటే చాలా తక్కువ శ్రమతో ఈ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్‌లలో రాణిస్తే చాలు నెలకు రూ.35 వేలకు పైగా వేతనంతో ఎస్ఐ కొలువు వరిస్తుంది. అదే విధంగా కేవలం పదో తరగతి ఉత్తీర్ణతతోనే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని చేజిక్కించుకునే సువర్ణావకాశం అభ్యర్థులకు లభించింది. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 21,700 జీతం అందుతుంది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, సిలబస్, సన్నద్ధత వ్యూహాలపై ఫోకస్.. నోటిఫికేషన్ వివరాలు విద్యార్హత: కానిస్టేబుల్‌కు పదో తరగతి; ఎస్ఐకు గ్రాడ్యుయేషన్. వయసు: 2018, జూలై 1 నాటికి 18– 25 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో బీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు సడలింపు ఉంటుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తు రుసుం : రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు, మైనార్టీలు, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ : 2018, జూన్ 1 నుంచి జూన్ 30. కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 2018, సెప్టెంబర్/అక్టోబర్. వెబ్సైట్: www.indianrailways.gov.in ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఖాళీలు: 8619 (పురుషులకు 4403, మహిళలకు 4216. సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీలు: 1120 (పురుషులకు 819, మహిళలకు 301. సిలబస్ ఒకటే.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణత అర్హత కాగా, ఎస్ఐ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ రెండు పరీక్షలకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)కు ఒకే సిలబస్ పేర్కొనడంతో అభ్యర్థులకు ప్రిపరేషన్ సులువు కానుంది. పరీక్షలో ప్రశ్నల కాఠిన్యత స్థాయిలో మాత్రం వ్యత్యాసం తప్పనిసరిగా ఉంటుంది. కానిస్టేబుల్ పరీక్ష పేపర్ పదో తరగతి స్థాయిలో, ఎస్ఐ పేపర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. దీన్ని గుర్తించి సన్నద్ధత వ్యూహాన్ని రూపొందించుకోవాలి. సన్నద్ధత సులువు.. కానిస్టేబుల్, ఎస్ఐ సీబీటీలో పేర్కొన్న సిలబస్‌లో మూడు అంశాలు ఉన్నాయి. అవి.. జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉన్నాయి. వీటిలో జనరల్ అవేర్నెస్ సెక్షన్‌కు ఎక్కువ వెయిటేజీ ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మొత్తం 120 మార్కులు (120 ప్రశ్నలు) కేటాయిస్తే వీటిలో 50 మార్కులను జనరల్ అవేర్‌నెస్‌కు కేటాయించారు. అర్థమెటిక్, రీజనింగ్ విభాగాలకు 35 మార్కుల చొప్పున ఇచ్చారు. మొత్తం 90 నిమిషాల వ్యవధిలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం కనీసం 35 శాతం అర్హత మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ జాబితా ప్రకారం కేటగిరీల వారీగా పదిరెట్ల మందికి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ)లకు పిలుపు అందుతుంది. జనరల్ అవేర్నెస్ మొత్తం 120 ప్రశ్నల్లో జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు ఉండటంతో ఈ విభాగం విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. రుణాత్మక మార్కులు ఉండడం, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తుండటంతో జనరల్ అవేర్నెస్ సెక్షన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తంగా పరీక్షకు 90 నిమిషాల సమయం మాత్రమే ఇవ్వడంతో అభ్యర్థులకు టైం మేనేజ్మెంట్ కీలకం కానుంది. జనరల్ అవేర్నెస్ సెక్షన్‌లోని ప్రశ్నలకు తక్కువ సమయంలోనే సమాధానాలు గుర్తించేందుకు వీలుంటుంది. దీనివల్ల మిగిలిన అర్థమెటిక్, రీజనింగ్ విభాగాలకు ఎక్కువ సమయం కేటాయించడానికి అవకాశం లభిస్తుంది. జనరల్ అవేర్నెస్ సెక్షన్లో మన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అభ్యర్థులకు ఉన్న అవగాహనతో పాటు చరిత్ర, రాజ్యాంగం, పరిపాలన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, భౌగోళిక స్థితిగతులు, సైన్స్, సంస్కృతి తదితర అంశాలపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇక సమకాలీన అంశాలపై కూడా అభ్యర్థులు ఎక్కువగా దృష్టిసారించాలి. వివిధ దేశాల అధ్యక్షులు, అంతర్జాతీయ సంబంధాలు, దేశాల కరెన్సీలు, వార్తల్లోని వ్యక్తులు తదితర సమకాలీన అంశాలు తెలుసుకోవాలి. వీటితో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో చోటుచేసుకున్న సంఘటనలు, డిఫెన్స్ టెక్నాలజీ, సైనిక విన్యాసాలు, తాజాగా క్రీడల్లో చెప్పుకోదగిన పరిణామాలు, బడ్జెట్ ముఖ్య అంశాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు వాటి లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ – అక్టోబర్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి – మార్చి నుంచి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాలను ఉపయోగించుకోవాలి. రోజూ ఏదైనా ఒక ప్రామాణిక పేపర్ చదువుతూ సొంతంగా నోట్స్ రాసుకోవాలి. రిఫరెన్స్: ప్రామాణిక దినపత్రిక, మ్యాగజైన్. www.sakshieducation.com అర్థమెటిక్ 35 ప్రశ్నలు ఉండే ఈ విభాగంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న మ్యాథమెటిక్స్ పుస్తకాల్లోని అర్థమెటిక్ చాప్టర్లలోని ప్రాథమిక భావనలు, సమస్యలను అధ్యయనం చేయాలి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, కసాగు, గసాభా, నిష్పత్తి–అనుపాతం, శాతాలు, మెన్సురేషన్, కాలం–పని, కాలం–దూరం, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, ఆల్జీబ్రా తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు సంఖ్యా వ్యవస్థపై పట్టు సాధించడం తప్పనిసరి. కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారాలు, శాతాలు వంటి ప్రాథమిక అర్థమెటిక్ అంశాలకు సంబంధించిన సమస్యలకు వేగంగా, కచ్చితమైన సమాధానాలు ఇచ్చేలా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కాలు, వర్గాలు – వర్గమూలాలు, ఘనమూలాలపై పట్టు సాధించడం ద్వారా సమస్యలను వేగంగా సాధించొచ్చు. రిఫరెన్స్: ఆర్ఎస్ అగర్వాల్, అరిహంత్ పబ్లికేషన్స్, కిరణ్ పబ్లికేషన్స్ పుస్తకాలు ఉపయోగపడతాయి. వీటితో పాటు ‘ఇండియాబిక్స్’ వెబ్‌సైట్‌ను ప్రాక్టీస్‌కు ఉపయోగించుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సులువైన సెక్షన్ ఇది. అభ్యర్థులు తమ ఆలోచనలపై స్పష్టంగా ఉంటూ సమస్య పరిష్కారానికి తార్కికంగా ఆలోచించగలరా లేదా అని తెలుసుకోవడానికి, మేధస్సును అంచనా వేయడానికి రీజనింగ్ ఉపయోగపడుతుంది. తార్కికంగా ఆలోచించే వారికి సులువైన విభాగమిదే. అనాలజీస్; సిమిలారిటీస్, డిఫరెన్సెస్; స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియెంటేషన్, ప్రాబ్లం సాల్వింగ్ అనాలిసిస్, కోడింగ్–డీకోడింగ్, అర్థమెటికల్ రీజనింగ్, రిలేషన్స్, ఆడ్‌మాన్ అవుట్, సింబల్స్, నొటేషన్స్, వెన్ చిత్రాలు, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, డైరెక్షన్స్, స్టేట్మెంట్–కన్‌క్లూజన్, డెసిషన్ మేకింగ్, సిలాయిజం తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రిఫరెన్స్: ఆర్ఎస్ అగర్వాల్. ప్రాక్టీస్ ప్రధానం 90 నిమిషాల్లో 120 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి కాబట్టి విజయంలో టైమ్ మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు గుర్తించాలంటే ప్రాక్టీస్‌కు మించిన మార్గం మరొకటి లేదు. రైల్వే పరీక్షల్లో గత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలు చాలా వరకు పునరావృతమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌లో ప్రధానంగా జనరల్ సైన్స్, ఆధునిక భారతదేశ చరిత్ర, పాలిటీ బేసిక్స్‌పై దృష్టిసారించాలి. 90 శాతం ప్రశ్నలు బేసిక్‌గా, యావరేజ్‌గా, లాజిక్‌గా వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, తొలుత బేసిక్ కాన్సెప్టులపై పట్టు సాధించాలి. ఆ తర్వాతే అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి లోతుగా అధ్యయనం చేయాలి. అర్థమెటిక్‌లో సంఖ్యా వ్యవస్థ, సింప్లిఫికేషన్స్, శాతాలు, నిష్పత్తులు, వడ్డీ అంశాలు ముఖ్యమైనవి. రీజనింగ్‌లో సీటింగ్ అరేంజ్మెంట్, ఆల్ఫాబెటికల్ టెస్ట్, కోడింగ్–డీకోడింగ్, బ్లడ్‌రిలేషన్స్, ర్యాంకింగ్స్ తదితర అంశాలు ముఖ్యమైనవి. – ఎ.సత్యనారాయణ, డైరెక్టర్, గ్రేట్ ఇన్స్టిట్యూట్. -
రైల్వేలో ఉద్యోగాల పేరిట మోసం
కాజీపేట అర్బన్ : రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి ఓ వ్యక్తి రూ.40 లక్షలతో ఫరారీ అయిన ఘటనలో శుక్రవారం సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై గురువారం ‘సాక్షి’ ప్రచురితమైన కథనం అక్షర సత్యమైంది. సుబేదారి ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. హన్మకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట హన్మకొండకు చెందిన ఎండీ.రఫీక్ టీస్టాల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. హన్మకొండ భవానీనగర్‌కు చెందిన తిరుపతిరెడ్డి తరచూ రఫిక్ టీస్టాల్ వద్ద వస్తుండే వాడు. ఈ క్రమంలో తిరుపతిరెడ్డి కుమారుడు వినిత్‌రెడ్డి తన స్నేహితులు వాసుదేవరెడ్డి, రాజు తదితురలు రఫీక్ టీస్టాల్ వద్ద కలుసుకునేవారు. టీ తాగుతున్న తరుణంలో బిటెక్ పూర్తి చేసిన తమను నిరుద్యోగం వేదిస్తుందని, రైల్వే లాంటి శాఖలో ఉద్యోగం లభిస్తే బాగుండు అనే అభిరుచులను పంచుకునేవారు. దీనిని గమనించి టీస్టాల్ యజమాని రఫీక్ తనకు రైల్వే శాఖలో ఉన్నతాధికారులు చాలా మంది పరిచయం ఉన్నారంటూ తమ బంధువులు సైతం ఉన్నతాధికారులుగా కొనసాగుతున్నారని నమ్మించాడు. అలా 2015 ఆ యువకుల నుంచి దశల వారీగా సుమారు రూ.40 లక్షలను వసూలు చేసి చాయ్‌వాలా చేతివాటాన్ని చూపాడు. రోజులు గడుస్తున్నా.. ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గమనించిన నిరుద్యోగులు రఫీక్‌ను నిలదీశారు. దీంతో రఫీక్ రాత్రికిరాత్రే మకాం మార్చేశాడు. శుక్రవారం బాధితుడు తిరుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ముకుల్ రాయ్ బావమరిది అరెస్ట్
సాక్షి, కోల్‌కతా : రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన బీజేపీ నేత ముకుల్ రాయ్ బావమరిది సృజన్ రాయ్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆదివారం ఢిల్లీలో అరెస్ట్ చేశారు. సృజన్ రాయ్‌ను ఉత్తర 24 పరగణాల జిల్లా బిజ్పూర్ పీఎస్‌కు చెందిన పోలీసు బృందం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసింది. ఆరేళ్ల కింద బాధితులు ఇచ్ని ఫిర్యాదుపై ఆయనను అరెస్ట్ చేశామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. మోసం, నేరపూరిత కుట్ర వంటి పలు సెక్షన్ల కింద రాయ్‌పై కేసునమోదైందని చెప్పారు. జిల్లా కోర్టులో నిందితుడిని హాజరుపరచగా, 12 రోజుల పోలీసు కస్టడీకి మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారని చెప్పారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ, 2012లో కేంద్ర రైల్వే మంత్రిగా వ్యవహరించిన ముకుల్ రాయ్ దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించారు. తన బావమరిదిపై కేసులు నమోదు చేసినా పాలకులు తనను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. తనపై, తన కుటుంబ సభ్యులపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కత్తిగట్టినట్టు వ్యవహరిస్తూ కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. బీజేపీ ఎదుగుదలతో భయపడుతున్నందకే మమతా బెనర్జీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.రాజకీయంగానే ఇలాంటి కుట్రలను ఎదుర్కొంటానని ముకుల్ రాయ్ పేర్కొన్నారు. -
90వేల రైల్వే పోస్టులకు 2.3కోట్ల దరఖాస్తులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రకటించిన 90వేల రైల్వే ఉద్యోగాలకుగాను ఏకంగా 2.37 కోట్లకుపైగా దరఖాస్తులు వచ్చాయని రైల్వేశాఖ పేర్కొంది. 89,409 ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 3, 10 తేదీల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) రెండు నోటిఫికేషన్లు విడుదలచేయడం తెల్సిందే. 26,502 లోకో–పైలట్లు, టెక్నీషియన్ పోస్టులకు 47.56 లక్షల దరఖాస్తులు, 62,907 లెవల్–1(గ్రూప్–డి కేటగిరీ) పోస్టులకుగాను 1.90కోట్ల దరఖాస్తులు వచ్చాయి. దశలవారీగా రెండు నెలల కాలవ్యవధిలో పరీక్షలు నిర్వహిస్తామని ఆర్ఆర్బీ తెలిపింది. ఇంతమంది అభ్యర్థులకు ఆన్లైన్లో పరీక్షల నిర్వహణతో దాదాపు 10 లక్షల చెట్ల కాగితపు కలప ఆదా అయినట్లేనని ఆర్ఆర్బీ అభిప్రాయపడింది. ఆర్ఆర్బీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు లేవని, పరీక్ష విధానంలో పారదర్శకత పెంచేందుకు ‘ఆన్సర్ కీ’ల అప్లోడింగ్ విధానం తెచ్చామని రైల్వేశాఖ స్పష్టంచేసింది. ‘కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)లో ప్రశ్నపత్రం, ఆన్సర్ బుక్లెట్, ‘ఆన్సర్ కీ’లను ఉంచుతాం. ఎలాంటి సందేహాన్ని అయినా అభ్యర్థులు నివృత్తి చేసుకునే అవకాశమిస్తాం’ అని రైల్వేశాఖ తెలిపింది. -
ఆ ఉద్యోగాలకు ఏకంగా 2కోట్ల దరఖాస్తులు!
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. చదివిన చదువులకు కొలువులు దొరకక, ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి వెళ్తోంది. ఏ చిన్న ఉద్యోగానికైనా లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. తాజాగా రైల్వేలో వెలువడిన 90,000 ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి వెల్లువెత్తిన దరఖాస్తులను చూసి రైల్వే అధికారులే ఆశ్చర్యపోయారు. రైల్వేశాఖలో గ్రూప్ సీ, డీ పోస్టులకుగాను రెండుకోట్లకుపైగా దరఖాస్తుల వచ్చినట్టు రైల్వే అధికారులు అధికారికంగా తెలిపారు. ఇంకా చివరి తేదికి గడువు ఉన్నందున్న దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇంతమందికి ఒకేసారి పరీక్షలు నిర్వహించడం, ఎంపిక చేయటం రైల్వే శాఖకి కష్టం కలిగించేదే.. -
రైల్వే ఉద్యోగాలపై రచ్చ
సాక్షి, విజయనగరం : రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసిన గ్రూప్ డి నోటిఫికేషన్‌పై విద్యార్ధులు, నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. పదో తరగతి చదివిన వారితోపాటు అదనంగా ఐటీఐ, టెక్నికల్ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. విజయనగరం కోట జంక్షన్ నుంచి రైల్వేస్టేషన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి ర్యాలీని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. పెద్ద ఎత్తున విద్యార్ధులు తరలి రావడంతో పోలీసులకు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. పలువురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
రైల్వే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా
-
రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం
హైదరాబాద్: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసగించి లక్షలాది రూపాయలు దండుకున్న ఇద్దరు వ్యక్తులను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిరుద్యోగులను మోసం చేసి సుమారు 20 లక్షల రూపాయల వరకు దండుకున్న వెంకట్ రెడ్డి, రాజేష్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అదుపు చేశారు. శివ అనే మరో నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఉద్యోగాల పేరిట మోసం చేసిన ఇద్దరి అరెస్టు
సీతంపేట : రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని గిరిజన నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయిలు వసూలు చేసి టోకరా పెట్టిన ఇద్దరు మోసగాళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి ఒక బైక్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ, కొత్తూరు సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్ఐ వి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు...రైల్వేలో క్లరికల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కర్ణాటక రాష్ట్రంలోని బల్లార్పూర్ జిల్లా రామలింగాపురానికి చెందిన ఆర్.ఎన్.రామనుజనప్ప ఆయన తండ్రి నారాయణస్వామిలు సీతంపేట, కొత్తూరు, భామిని మండలాలకు చెందిన తొమ్మిది మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.16 లక్షలు దపదఫాలుగా వసూలు చేశారని తెలిపారు. సీతంపేట మండలం ఎర్రన్నగూడ గ్రామానికి చెందిన ఎస్.మల్లేశ్వరరావు బీటెక్ పూర్తి చేసి స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ కోసం బల్లార్పూర్ వెళ్లాడు. అక్కడ పరిచయమైన రామానుజనప్ప రైల్వేలో క్లరికల్ కేడర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మీ స్నేహితులు ఎవరైనా ఉంటే చూడాలని చెప్పడంతో మల్లేశ్వరరావుతో పాటు సీతంపేట మండలంలో ఆరుగురు, భామిని, కొత్తూరు మండలాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం రూ.16 లక్షలు దపదఫాలుగా ఇచ్చేశారు. కొన్నాళ్ల తరువాత ఉద్యోగం సంగతేంటని ప్రశ్నించేసరికి తప్పుడు ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా మళ్లీ డబ్బులు చాలవని తేవాలని చెప్పడంతో అనుమానం వచ్చిన మోసపోయిన నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వలపన్ని నిందితులను పట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. సీతంపేట, బత్తిలి, కొత్తూరు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశామని చెప్పారు. -
రైల్వే ఉద్యోగాల పేరిట టోకరా!
సీతంపేట : రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగ గిరిజనులను మోసం చేసిన ఓ బెంగళూరు వాసి వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గిరిజన నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు కాజేసి మోసం చేసి పరారయ్యాడు. సీతంపేట ఏజెన్సీలోని పలు గ్రామాలకు చెందిన డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులు ఉద్యోగం ఇప్పిస్తానంటే గుడ్డిగా నమ్మి బెంగళూరుకు చెందిన రామానుజిప్ప అనే వ్యక్తి చేతిలో మోసపోయినట్టు చెప్పారు. చేసేదిలేక చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం..ఎర్రన్నగూడకు చెందిన ఎస్.మల్లేషుకు బెంగళూరుకు చెందిన రామానుజిప్ప అనే వ్యక్తితో కొన్నాళ్ల కిందట పరిచయమైంది. రైల్వే క్లరికల్(యూడీసీ, ఎల్డీసీ) పోస్టులు ఇప్పిస్తానని..ఇందుకు ఒకొక్కరికి రూ.3లక్షలు వరకు ఖర్చవుతుందని నమ్మబలికాడు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో మండలంలోని గెడ్డగూడ, కారిమానుగూడ, అడ్డంగి, కోతాం, కుశిమి, అక్కన్నగూడ, ఎర్రన్నగూడ తదితర గ్రామాలకు చెందిన తొమ్మిది మంది నిరుద్యోగ యువకులు రామానుజిప్పకు ఒకొక్కరు రూ.3లక్షల చొప్పున కొద్ది నెలల కిందట ఇచ్చేశారు. మెుత్తంగా రూ.27లక్షల వరకు మోసగాడికి ఇచ్చినట్టు వారు తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించి శిక్షణ కోసం ఢిల్లీ, ముంబాయి, విశాఖపట్నం, బెంగళూరులో ఉంటుందని ఉద్యోగాల ఆర్డర్లు వచ్చాయ్...ఇస్తానని బెంగళూరు రావాలని చెప్పడంతో ఇటీవల యువకులు ఎంతో ఆశతో బెంగళూరు వెళ్లారు. తీరా అక్కడకు నిరుద్యోగులు వెళ్లిన తరువాత ఇచ్చిన ఆర్డర్ తప్పుడిది అని తేలింది. ఇదేమని ప్రశ్నించగా మరో రూ.12వేలు చొప్పున తీసుకు రావాలని చెప్పడంతో, ఇది మోసమని గ్రహించిన నిరుద్యోగులు గత నెల 31న పాలకొండ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వలపన్ని బెంగళూరు వెళ్లి రామానుజిప్పను పట్టుకున్నారు. ఈ విషయమై ఎస్ఐ వి.శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
రూ.కోటికి పైగా ‘ఐపీ’
రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన మహిళ ఒక్కొక్కరి నుంచి రూ.5-6 లక్షలు వసూలు నోటీసులు అందుకొని లబోదిబోమంటున్న బాధితులు లింగాలఘణపురం : మండలంలోని కళ్లెం గ్రామానికి చెందిన ఓ సాధారణ మహిళ రూ.కోటికి పైగా ఐపీ పెట్టి ఉడాయించిన సంఘటన జరిగింది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసి, గత మూడేళ్లుగా నమ్మబలుకుతూ చివరి ఐపీ నోటీసులు పంపించింది. నోటీసులు అందుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఓ మహిళ రైల్వేలో టికెట్ మాస్టర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కళ్లెం, సంగెం, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్‌కు చెందిన 22 మంది వద్ద మూడేళ్ల క్రితం డబ్బు వసూలు చేసింది. ఆ మహిళ సోదరుడు కాజీపేటలో ఉంటూ ఈ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చిన వారు ఆ మహిళను ఉద్యోగాల కోసం అడుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కొంత మందిని ఢిల్లీ, ముంబాయి, పుణె, కర్నాటక తదితర ప్రాంతాల్లో కొద్ది రోజుల క్రితం అక్కడక్కడ ఉంచినట్లు తెలిసింది. ఏదో విధంగా నమ్మిస్తూ మూడేళ్లుగా కాలయాపన చేస్తోంది. కాగా, ఆ మహిళ సోదరుడు కాజీపేటలో ఉండడంతో బాధితులు అక్కడికి కూడా వెళ్లి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ తతంగం జరుగుతున్న తరుణంలో మూడు రోజుల క్రితం మహిళ గ్రామం నుంచి కనిపించకుండా పోయి డబ్బులు తీసుకున్న వారికి ఐపీ నోటీసులు పంపించింది. అవి చూసిన బాధితులు లబోదిబోమంటూ ఎక్కడా చెప్పుకోలేక నలిగిపోతున్నారు. కాగా, ఇటీవల లింగాలఘణపురం మండలం నెల్లుట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా ఐపీ పెట్టి వె ళ్లాడు. ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేసుకొని వ్యాపారంలో అప్పుల పాలయ్యాయమంటూ తప్పుడు లెక్కలతో నమ్మిన వారిని మోసగించడం పరిపాటిగా మారింది. -
నిందితులను పట్టుకొచ్చిన బాధితులు
బాలానగర్ (హైదరాబాద్) : రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ రైల్వే ఉద్యోగిని, అతడి తమ్ముడిని బాలానగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాసరావు అనే వ్యక్తి విజయవాడ రైల్వే స్టేషన్లో టీటీఈగా పని చేస్తుంటాడు. శ్రీనివాసరావు తమ్ముడైన బాబూరావు హైదరాబాద్ బాలానగర్‌లోని సాయినగర్‌లో నివాసం ఉంటాడు. కాగా వీరిద్దరూ కూడబలుక్కుని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నారు. ఆ విధంగా తమ ప్రాంతంలోనే ఉండే అజయ్‌కుమార్ నుంచి రూ.రెండు లక్షలు గుంజారు. అశోక్, వెంకటేశ్వర్లు, పాపయ్య, కిరణ్ అనే మరో నలుగురు యువకులు కూడా వారికి రూ.8 లక్షలు ముట్టజెప్పారు. రోజులు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో అనుమానించిన బాధితులు ఓసారి బాబూరావు, శ్రీనివాసరావులను నిలదీశారు. గత ఏడాది బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఇటీవల వారం రోజుల క్రితం బాబూరావు రాత్రికిరాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. దీంతో బాధితులు నేరుగా విజయవాడ వెళ్లి శ్రీనివాసరావు, బాబూరావులను పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో మోసం నిర్ధారణ అవడంతో ఇద్దరినీ మంగళవారం రిమాండ్‌కు తరలించారు. -
రైల్వే ఉద్యోగాల పేరిట దగా
అత్తాపూర్: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు దండుకొని మోసం చేస్తున్న ఓ ముఠాలోని ఇద్దరిని రాజేంద్రనగర్, ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఏసీపీ ముత్యంరెడ్డి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... రైల్వేలో పని చేస్తూ డిస్మిస్ అయిన అత్తాపూర్ హుడా కాలనీ నివాసి ఎ.ప్రశాంత్(39), ప్రైవేట్ ఉద్యోగి కందుల గోపాల్(29), ఖమ్మం జిల్లాకు చెందిన తేజ(30) స్నేహితులు. గత కొంతకాలంగా వీరు రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి, డబ్బు వసూలు చేసి మోసం చేస్తున్నారు. డబ్బు తిరిగి చెల్లించమని అడిగిన వారిని చంపుతామని బెదిరిస్తున్నారు. ఉద్యోగాలే కాకుండా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని ప్లాట్లు, భూమి డాక్యుమెంట్లను తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన వెంకట్రాజు కందుల గోపాల్ ద్వారా ప్రశాంత్‌కు ఉద్యోగం కోసం రూ.12.65 లక్షలు చెల్లించాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బు తిరిగి ఇచ్చేయమని కోరిన వెంకట్రాజును నాటు తుపాకీతో చంపుతానని ప్రశాంత్ బెదిరిస్తున్నాడు. దీంతో బాధితుడు కొద్దిరోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్ఓటీ పోలీసుల సహాయంతో సోమవారం ఉదయం హుడాకాలనీలోని ప్రశాంత్ ఇంటిపై దాడి చేశారు. అతనితో పాటు మరో నిందితుడు గోపాల్‌ను కూడా పట్టుకున్నారు. పోలీసుల విచారణలో దాదాపు 10 మంది నిరుద్యోగుల వద్ద మొత్తం రూ. 40 లక్షలు తీసుకొని మోసం చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరినీ అరెస్టు చేసి, మంగళవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి కంట్రిమేడ్ పిస్టల్, రివాల్వర్లతో పాటు మూడు రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తి, సఫారీ వాహనం స్వాధీనం చేసుకున్నారు. బాధితుల్లో శ్రావణ్ అనే ఎన్ఆర్ఐ కూడా ఉన్నాడని ఏసీపీ తెలిపారు. ముఠాలోని మరో నిందితుడు తేజ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని ఏసీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సీహెచ్ కుశాల్కర్, ఎస్ఓటీ ఏసీపీ అశోక్‌కుమార్, ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఎస్సైలు సైదేశ్వర్, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నిరుద్యోగుల నుంచి దండుకున్న డబ్బుతో తన చెల్లెళ్ల పెళ్లి చేశానని ప్రధాన నిందితుడు ప్రశాంత్ పోలీసులకు తెలిపాడు. పెళ్లిళ్లు చేసే స్తోమత లేకపోవడంతోనే మోసాలకు పాల్పడ్డానన్నాడు. -
భారతీయ రైల్వే.. భారీ కొలువులు
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డులు ఎప్పటికప్పుడు భారీ నోటిఫికేషన్లతో యువత ముందుకొచ్చి, క్రేజీ కొలువులకు రాచబాట వేస్తున్నాయి. తాజాగా 26,570 అసిస్టెంట లోకో పైలట్ టెక్నీషియన్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో విజయ వ్యూహాలపై స్పెషల్ ఫోకస్... ఆర్ఆర్బీ సంయుక్త నోటిఫికేషన్ ద్వారా 15,059 అసిస్టెంట్ లోకో పైలట్, 11,511 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు- సికింద్రాబాద్ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్ రైల్వేకు చెందిన పోస్టులున్నాయి. అర్హత: అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఉన్నత స్థాయి కోర్సులు పూర్తిచేసిన వారు కూడా అర్హులు. టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్-3, టెలీకమ్యూనికేషన్ మెయింటైనర్ గ్రేడ్-3 పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ ఉండాలి. లేదా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత అవసరం. లేదా డిప్లొమా ఉండాలి. ఇతర టెక్నీషియన్ పోస్టులకు పదో తరగతితో పాటు ఆయా విభాగాల్లో ఐటీఐ పూర్తిచేసుండాలి. వయసు: 2014, జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులకు ఉమ్మడి రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అన్ని ఆర్ఆర్బీలు ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తాయి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న బోర్డు పరిధిలో పరీక్ష రాయొచ్చు. పరీక్షలో 100 నుంచి 120 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రంలో జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ టెక్నికల్ ఎబిలిటీకి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, స్థానిక భాషలో ఉంటుంది. ఎంపిక విధానం: అసిస్టెంట్ లోకో పైలట్‌కు మొత్తం మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష, తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్, చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. టెక్నీషియన్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు జరుపుతారు. ప్రిపరేషన్ ప్రణాళిక అర్థమెటిక్: ఈ విభాగంలోని ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలను వేగంగా చేయగల నేర్పును సాధించాలి. కసాగు, గసాభా, శాతాలు, లాభ- నష్టాలు, సగటు, కాలం-పని, కాలం-వేగం-దూరం, నిష్పత్తులు, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, వైశాల్యం-చుట్టుకొలత, క్యాలెండర్, గడియారం వంటి అంశాలకు సంబంధించిన సమస్యలపై పట్టు సాధించాలి. బీజ గణితం, సమితులు, త్రికోణమితి, ప్రమేయాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలి. రీజనింగ్: అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగమిది. సాధారణంగా ఆర్ఆర్బీ పరీక్షలలో వెర్బల్ సెక్షన్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. నాన్ వెర్బల్ నుంచి తక్కువగా వస్తున్నాయి. రీజనింగ్ విభాగంలో సిరీస్(లెటర్/నెంబర్/సింబల్), అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్-డీకోడింగ్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, పజిల్ టెస్ట్, ర్యాంకింగ్ అండ్ అరేంజ్మెంట్, లాజికల్ డయాగ్రామ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, మిస్సింగ్ నెంబర్స్, అర్థమెటికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. చిట్కాల ద్వారా ప్రతిరోజూ సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేయడం అవసరం. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. A నుంచి Z వరకు, Z నుంచి A వరకు వేగంగా చదవగలగాలి. A నుంచి Z వరకు వాటి స్థాన విలువలు (A-1, B-2, C-3, ......, Z-26) తెలిసుండాలి. A నుంచి Z వరకు తిరోగమన స్థాన విలువలు (A-26, B-25,....., Z-1) నేర్చుకోవాలి. జనరల్ అవేర్నెస్: హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. చరిత్రలో భారతదేశ చరిత్ర (ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగం).. ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమంపై ప్రశ్నలు వస్తాయి. జాగ్రఫీకి సంబంధించి విశ్వం, భూమి, ఖండాలు, మహాసముద్రాలు, నదులు, ఖనిజాలు, రవాణా వ్యవస్థ, జనాభా, వ్యవసాయం తదితర అంశాలపై పట్టు సాధించాలి. పాలిటీ విభాగంలో భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, వివిధ కమిషన్ల చైర్మన్ల పేర్లను తెలుసుకోవాలి. జనరల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంశాలను చదవాలి. రక్షణ, అంతరిక్ష, అణుశక్తి వంటి విభాగాలపైనా దృష్టి సారించడం మంచిది. ఎకానమీలో.. జాతీయాదాయం, నిరుద్యోగం, పేదరికం, ప్రభుత్వ పథకాలు, పన్నుల వ్యవస్థ, ఫైనాన్స్ కమిషన్ వంటి అంశాలను చదవాలి. స్టాక్ జనరల్ నాలెడ్జ్: ఈ విభాగంలో రైల్వే వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలతోపాటు.. జాతీయ చిహ్నాలు, అంతర్జాతీయ సరిహద్దులు, ఐక్యరాజ్యసమితి, పరిశోధన సంస్థలు, క్రీడలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు, ప్రపంచం/ఇండియాలో తొలి, ఎత్తై, పొడవైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. కరెంట్ అఫైర్స్: పరీక్ష జరిగే తేదీకి ముందు ఏడాది కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలను (సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు, వ్యక్తులు, విజయాలు, అవార్డులు వంటివి) తెలుసుకోవాలి. దీనికోసం రోజూ దినపత్రికలు, మేగజీన్లను చదవాలి. టెక్నికల్ సబ్జెక్ట్: ఈ విభాగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. మెకానికల్ ఇంజనీరింగ్‌లో మెకానిక్స్, డిజైన్, ప్రొడక్షన్ టెక్నాలజీ, థర్మోడైనమిక్స్, ఐ.సి.ఇంజిన్స్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెషినరీ వంటి అంశాలు ముఖ్యమైనవి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: అటామిక్ స్ట్రక్చర్, కరెంట్, రెసిస్టెన్స్, ఓమ్ నియమం, కెపాసిటర్స్, సిరీస్-ప్యారలల్ కనెక్షన్స్, మ్యాగ్నటిజం, ప్రిన్సిపుల్స్ ఆఫ్ మోటార్, ట్రాన్స్ఫార్మర్స్, జనరేటర్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎలక్ట్రానిక్స్: ఈ విభాగంలో రాణించడానికి.. కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రాన్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. రిఫరెన్స్: అర్థమెటిక్, రీజనింగ్- ఆర్ఎస్ అగర్వాల్. లూసెంట్ పబ్లికేషన్స్. ప్రాక్టీస్‌తోనే సక్సెస్ మెరుగైన ప్రాక్టీస్‌తోనే రాత పరీక్షలో విజయం సాధించగలం. వీలైనన్ని మోడల్, ప్రీవియస్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. నిపుణులైన ఫ్యాకల్టీ సహాయంతో తప్పులను సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏఎల్పీ, టెక్నీషియన్స్ పోస్టులకు ఉమ్మడిగా నిర్వహించే రాతపరీక్షలో టెక్నికల్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు బేసిక్ స్థాయిలో ఉన్నప్పటికీ, స్టాండర్డ్‌గా ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఉద్యోగంలో చేరుతూనే ఆకర్షణీయ జీతభత్యాలతో అసిస్టెంట్ లోకో పైలట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వారు తర్వాత సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా, లోకో పైలట్ స్థాయికి చేరుకోవచ్చు. - ఎ.సత్యనారాయణరెడ్డి, డెరైక్టర్, గ్రేట్ ఇన్స్టిట్యూట్,సికింద్రాబాద్. నోటిఫికేషన్ వివరాలు ఫీజు వివరాలు: జనరల్/ఓబీసీ పురుష అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.40 డీడీ లేదా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా ఫీజు చెల్లించాలి. దరఖాస్తు విధానం: దరఖాస్తులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా నిర్దేశిత నమూనాలో అ4 సైజు పేపర్‌పై పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను, డీడీ/ఐపీఓ జతచేయాలి. డీడీ/ఐపీఓ వెనుక నోటిఫికేషన్ నెంబర్, దరఖాస్తు చేసిన పోస్టు, పేరు, చిరునామా వివరాలను పొందుపరచాలి. అభ్యర్థులు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్య తేదీలు: దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2014. పరీక్ష తేదీ: జూన్ 15, 2014. వెబ్సైట్: www.rrbsecunderabad.nic.in -
రైల్వే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా
బేస్తవారిపేట, న్యూస్‌లైన్ : రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి మోసం చేసినట్లు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై బి.రమేశ్‌బాబు కథనం ప్రకారం.. పూసలపాడుకు చెందిన మోక్షగుండం అంకయ్య మార్కాపురం పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 మంది వద్ద రైల్వేశాఖలో క్లర్క్, హెల్పర్స్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షలు వరకు వసూలు చేశాడు. పరీక్ష రాయకుండానే నేరుగా మెడికల్ టెస్ట్‌కు తీసుకెళ్లి ఉద్యోగంలో చేర్పిస్తానని నిరుద్యోగులను నమ్మించాడు. ఈ నేపథ్యంలో ఆ ఘనుడు కొందరికి కాల్ లెటర్లు కూడా పంపాడు. గత నెలలో వైద్య పరీక్షలకు తీసుకెళ్లాల్సి ఉన్నా నేడు రేపు అంటూ తిప్పుకుంటున్నాడు. మోసపోయినట్లు గ్రహించిన నిరుద్యోగులు పోలీస్‌లను ఆశ్రయించడంతో అంకయ్య గుట్టురట్టయింది. చిన్న ఓబినేనిపల్లెకు చెందిన దేశబోయిన నారాయణ అనే జిరాక్స్ షాపు యజమాని వద్ద రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అంకయ్య మే నెలలో రూ. 80 వేలు, అక్టోంబర్లో రూ. లక్ష తీసుకున్నాడు. ఉద్యోగం గురించి అడిగితే సరైన సమాధానం చెప్పకుండా తిప్పుతుండటంతో బాధితుడు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పదోతరగతితో రైల్వే ఉద్యోగం
వరుస నోటిఫికేషన్లతో రెగ్యులర్ రిక్రూట్మెంట్ బోర్డుగా మారిన రైల్వే శాఖ.. మరో సారి భారీ స్థాయిలో కొలువుల జాతరకు తెరతీసింది.. దాదాపు 2వేలకు పైగా గ్రూప్-డి కేటగిరీ పోస్టుల భర్తీ కోసం దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే)-రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.. కేవలం పదో తరగతి అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.. కాసింత శ్రమిస్తే ఐదంకెల వేతనంతో కెరీర్‌ను ప్రారంభించవచ్చు.. ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్ విధానం, ప్రిపరేషన్ ప్లాన్, తదితర అంశాలపై ఫోకస్.. తాజా నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేసే పోస్టుల సంఖ్య వేలల్లో ఉన్నప్పటికీ.. పదో తరగతి అర్హత కావడంతో పోటీ పడే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది. కాబట్టి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగిస్తేనే విజయం సాధ్యమవుతుంది. భర్తీ చేసే పోస్టుల సంఖ్య: పోస్టులు ఖాళీలు ట్రాక్‌మెన్ 1,979 హెల్పర్-2: 440 అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్: 382 మొత్తం 2,801 ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియలో మొత్తం మూడు దశలు ఉంటాయి. అవి.. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), మెడికల్ టెస్ట్. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశ.. పీఈటీ, మెడికల్ టెస్ట్‌లకు హాజరు కావాల్సి ఉంటుంది. రాత పరీక్ష: రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానం(మల్టిపుల్ చాయిస్)లో నిర్వ హిస్తారు. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒక్కొ క్క మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయించారు. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. ప్రశ్నలన్నీ పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. ఈ క్రమంలో జనరల్ స్టడీస్, అర్థమెటిక్-రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. విభాగాల వారీగా-జనరల్ స్టడీస్: ఈ విభాగం నుంచి 80 ప్రశ్నలు వస్తాయి. వీటికి 80 మార్కులు కేటాయించారు. ఇందులో స్టాక్ జనరల్ నాలెడ్జ్ (జీకే), కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, క్రీడారంగం తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి కచ్చితంగా ఇన్ని ప్రశ్నలు వస్తాయని చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రశ్నల విభజన (డివిజన్) మారుతుంటుంది. ఇందులో చక్కని స్కోర్ చేయాలంటే దృష్టి సారించాల్సిన అంశాలు: దేశాలు- రాజధానులు- కరెన్సీ-భాషలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థలు, జాతీయ పార్కులు, అబ్రివేషన్స్, అంతరిక్ష పరిశోధనలు, భారత రక్షణ వ్యవస్థ, సమాచార రంగం, రవాణా వ్యవస్థ, భారతదేశం- రాజ్యాంగం, భారతదేశ చరిత్ర- ముఖ్యాంశాలు, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, జనరల్ సైన్స్, వివిధ పరిశోధనలు- శాస్త్రవేత్తలు, శాస్త్రీయ పరికరాలు, ఆవిష్కరణలు- ఆవిష్కర్తలు, ఆంధ్రప్రదేశ్- ముఖ్యాంశాలు, దేశాలు- వైమానిక సంస్థలు, పితామహులు, పూర్వపు పేర్లు-మారు పేర్లు, సరిహద్దు రేఖలు, అవార్డులు, క్రీడలు, విశ్వం- పుట్టుక, భౌగోళికంగా పేర్లు, రోజుల ప్రాధాన్యత, తొలి వ్యక్తులు, బిరుదులు, నాట్యాలు- నృత్యాలు- పండగ లు, ప్రముఖ రచయితలు- రచనలు, నదీ తీర నగరాలు, జాతీయ చిహ్నాలు, దేశాలు- చిహ్నాలు, వివిధ సంస్థలు- నెలకొల్పిన ప్రదేశాలు, ప్రముఖుల నినాదాలు మొదలైనవి. రిఫరెన్స్ బుక్స్: జనరల్ అవేర్నెస్- అరిహంత్ పబ్లికేషన్స్, ఇతర స్టాండర్డ్ పుస్తకాలు, మనోరమ ఇయర్ బుక్, ఇండియా ఇయర్ (ఇయర్ బుక్ నుంచే ఎక్కువ శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది), 8,9,10 తరగతులకు సంబంధించి సైన్స్, సోషల్ పుస్తకాలు. ఇందులో అడిగే ప్రశ్నల సరళి: 1.సున్నపు తేటను పాలలా మార్చే వాయువు? ఎ) CO2 బి) O2 సి) H2 డి) SO2 జవాబు: ఎ 2.దేశంలో అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న రాష్ట్రం? ఎ) ఆంధ్రప్రదేశ్ బి) ఒడిశా సి) మధ్యప్రదేశ్ డి) పశ్చిమ బెంగాల్ జవాబు: సి 3.కర్ణాటక ముఖ్యమంత్రి? ఎ) సిద్ధరామయ్య బి) యడ్యూరప్ప సి) కుమారస్వామి డి) ఎవరూ కాదు జవాబు: ఎ అర్థమెటిక్: అభ్యర్థుల గణిత సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించిన విభాగమిది. ఇందులో సంఖ్యలు, గ.సా.భా-క.సా.గు, దశాంశ భిన్నాలు, వర్గమూలాలు-ఘన మూలాలు, సూక్ష్మీకరణ, సరాసరి (సగటు), వయసు, నిష్పత్తి-అనుపాతం, భాగస్వామ్యం, శాతాలు, లాభ- నష్టాలు, సరళ వడ్డీ, చక్ర వడ్డీ, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యం, ఘనపరిమాణం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రిఫరెన్స్ బుక్స్: అర్థమెటిక్ బై ఆర్ ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ బై గులాటి ఇందులో అడిగే ప్రశ్నల సరళి: 1.ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఆఫీస్‌కు గంటకు 30 కిలో మీటర్ల వేగంతో, ఆఫీస్ నుంచి ఇంటికి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. మొత్తం ప్రయాణానికి 30 నిమిషాల సమయం పడితే ఇంటి నుంచి ఆఫీస్‌కు ఎంత దూరం? ఎ) 24 కి.మీ. బి) 12 కి.మీ. సి) 6 కి.మీ. డి) 3 కి.మీ జవాబు: సి 2.ఒక త్రిభుజ వైశాల్యం 300 చదరపు మీటర్లు. దాని భూమి 20 మీటర్లు. అయితే ఎత్తు ఎంత? ఎ) 15 మీటర్లు బి) 30 మీటర్లు సి) 45 మీటర్లు డి) 60 మీటర్లు జవాబు: బి 3.సంవత్సరానికి 8 శాతం బారువడ్డీ చొప్పున రూ. 20,000 అసలు మొత్తం కొంత కాలానికి రూ. 23, 200 అయితే ఆ కాలాన్ని కనుక్కోండి? ఎ) ఒక సంవత్సరం బి) రెండు సంవత్సరాలు సి) నాలుగు సంవత్సరాలు డి) 12 సంవత్సరాలు జవాబు: బి రీజనింగ్: ఈ విభాగంలో వరుస క్రమ పరీక్ష, పోలికలు, భిన్నంగా ఉన్న వాటిని గుర్తించడం, కోడింగ్-డికోడింగ్, రక్త సంబంధాలు (బ్లడ్ రిలేషన్స్), దిశలు-దూరం, మిశ్రమ భిన్నాలు, గడియారం, క్యాలెండర్, వెన్ చిత్రాలు, లాజికల్-వెన్ చిత్రాలు, ర్యాంకింగ్ పరీక్ష, నంబర్/ఆల్ఫాబెట్ పరీక్ష, గణిత గుర్తులు, పాచికల పరీక్ష, సీటింగ్ అరేంజ్మెంట్స్, లాజికల్ రీజనింగ్, నాన్-వెర్బల్ రీజనింగ్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రిఫరెన్స్ బుక్స్: వెర్బల్ రీజనింగ్ బై ఆర్ఎస్ అగర్వాల్ బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రముఖ ప్రచురణ సంస్థలు వెలువరించే లాజికల్ రీజనింగ్ బుక్స్. 1. ఒక పరిభాషలో CBD అనే పదాన్ని FEG అని రాస్తే SRT అనే పదాన్ని ఏ విధంగా రాయాలి? ఎ) UVW బి) WVU సి) VUW డి) VUX 2.4, 8, 24, 94, --? ఎ) 376 బి) 470 సి) 420 డి) 620 జవాబు: బి 3.రాజు ఫొటోలో ఉన్న ఒక అమ్మాయిని పరిచయం చేస్తూ.. ‘ఆ అమ్మాయి తండ్రి, మా నాన్నకు ఏకైక కొడుకు’ అని చెప్పాడు. రాజుకు ఆ అమ్మాయి ఏమవుతుంది? ఎ) సోదరి బి) తల్లి సి) కూతురు డి) అత్త జవాబు: సి ప్రిపరేషన్: అర్థమెటిక్, రీజనింగ్ విభాగాలకు 70 మార్కులు కేటాయించారు. వీటిల్లో 70 ప్రశ్నలు ఇస్తారు. ఈ విభాగాల్లో అడిగే ప్రశ్నల క్లిష్టత 7వ తరగతి స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా సంబంధిత విభాగాల్లోని ప్రాథమిక భావనల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు సులభంగానే సాధించే విధంగా ఉంటాయి. 7వ తరగతి స్థాయి కాబట్టి నాన్- మ్యాథ్స్ అభ్యర్థులు కూడా ఈ విభాగాన్ని సులభంగానే చేయవచ్చు. కొద్దిపాటి ఆలోచనతో జవాబులను కనుక్కోవచ్చు. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇందులో చక్కని స్కోర్ సాధించవచ్చు. తెలుగులో కూడా: రాత పరీక్షను ఇంగ్లిష్, హిందీతోపాటు స్థానిక భాషలైన ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీలలో కూడా నిర్వహిస్తారు. కాబట్టి మన రాష్ట్ర అభ్యర్థులు తెలుగు భాషలో కూడా పరీక్షకు హాజరు కావచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో భాష ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని పేర్కొనాలి. ఫిజికల్ టెస్ట్: రాత పరీక్ష తర్వాత నిర్వహించే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ట్ పురుష, మహిళా అభ్యర్థులకు వేర్వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో 1:3 నిష్పత్తిలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పురుష అభ్యర్థులు 1,000 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థులకు 400 మీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి 3 నిమిషాల 10 సెకన్లు కేటాయించారు. ఈ దశలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సాధన ఇలా: ఫిజికల్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం రెండు నెలల పాటు రోజుకు మూడు కిలోమీటర్ల దూరం పరుగెత్తాలి. మొదటి నెల రోజులు పరుగెత్తడం అలవాటుగా చేసుకోవాలి. ఆ తర్వాత నెల రోజులు ఎంత సమయంలో పరుగెత్తుతున్నారో చూసుకోవాలి. 1 కి.మీ. (1,000 మీటర్లు) దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తేలా సిద్ధపడాలి. ఉదయం, సాయంత్రం ఇలా ఏ వేళల్లో పరుగెత్తినప్పటికీ నిర్దేశిత సమయంలో పరుగెత్తడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఫిజికల్ టెస్ట్ ఉదయమే నిర్వహిస్తారని గ్యారంటీ ఏమీలేదు. ఆర్ఆర్సీ గ్రూప్-డి సమాచారం వేతనం: రూ. 5,200-20,200 గ్రేడ్ పే రూ.1,800 అర్హత: పదోతరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత వయోపరిమితి: 18-33 ఏళ్లు (జనవరి 1, 2014 నాటికి) దరఖాస్తు: వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్‌లో హైదరాబాద్/ సికింద్రాబాద్‌లలో చెల్లేలా తీసిన రూ.100 (దరఖాస్తు రుసుం, ఎస్సీ/ఎస్టీ, మహిళ, మైనార్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (వార్షిక ఆదాయం రూ.50 వేలలోపు ఉన్న వారు)కు ఫీజు నుంచి మినహాయింపు). డీడీ/ ఇండియన్ పోస్టల్ ఆర్డర్(ఐపీఓ)ను జత చేయాలి. డీడీ/ఐపీఓను ‘అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్(రిక్రూట్మెంట్), రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సికింద్రాబాద్’ పేరిట తీయాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2013 పూర్తి చేసిన దరఖాస్తులను పోస్ట్ లేదా స్వయంగా కింద పేర్కొన్న చిరునామాలో అందజేయాలి (స్పీడ్/రిజిస్టర్ పోస్ట్ అంగీకరించరు). అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, సౌత్ సెంట్రల్ రైల్వే, రిటెన్ ఎగ్జామినేషన్ కంట్రోల్ సెంటర్, రైల్వే బంగ్లా నంబర్ 100, సెయింట్ ఆంథోనిస్ చర్చి ఎదురుగా, మెట్టుగూడ బస్టాప్ పక్కన, సౌత్ లాలాగూడ, సికింద్రాబాద్-500017. వివరాలకు: www.scr.indianrailways.gov.in స్పోర్ట్ కోటాలో.. గ్రూప్-సి కేటగిరీ 21 పోస్టులు, గ్రూప్-డి కేటగిరీలో 40 పోస్టుల భర్తీకి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 23, 2013. ఇతర నోటిఫికేషన్లు నార్త్ ఈస్టర్న్ రైల్వే: గ్రూప్-డి కేటగిరీ 1,422 పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2013 వివరాలకు:www.ner.indianrailways.gov.in ఈస్ట్ సెంట్రల్ రైల్వే: ట్రైన్స్ క్లర్క్, గూడ్స్ గార్డ్, ట్రాఫిక్ అప్రెంటీస్ విభాగాల్లో 132 పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2013 వివరాలకు: www.ecr.indianrailways.gov.in సెంట్రల్ రైల్వే: అప్రెంటీస్ ట్రైనింగ్ 74 పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 20, 2013 వివరాలకు: www.cr.indianrailways.gov.in