సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేల్లో నాలుగు లక్షల ఉద్యోగాల భర్తీపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం పెదవివిరిచారు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వ మరో మోసపు ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులపై రైల్వే మంత్రిత్వ శాఖ హఠాత్తుగా మేలుకొందని ఎద్దేవా చేశారు.
గత ఐదేళ్లుగా రైల్వేల్లో 2,82,976 పోస్టులు ఖాళీ ఉంటే కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా ఈ పోస్టులు భర్తీ చేస్తామని మరో మోసంతో ముందుకొస్తోందని చిదంబరం ట్వీట్ చేశారు. ప్రభుత్వ శాఖలన్నింటిలో ఇదే పరిస్ధితి ఉందని, ఓవైపు ఖాళీ పోస్టులుంటే, మరోవైపు నిరుద్యోగ యువత నిరాశలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా 2021 నాటికి రైల్వేలు నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. రానున్న రెండేళ్లలో 2.3 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment