
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రకటించిన 90వేల రైల్వే ఉద్యోగాలకుగాను ఏకంగా 2.37 కోట్లకుపైగా దరఖాస్తులు వచ్చాయని రైల్వేశాఖ పేర్కొంది. 89,409 ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 3, 10 తేదీల్లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) రెండు నోటిఫికేషన్లు విడుదలచేయడం తెల్సిందే.
26,502 లోకో–పైలట్లు, టెక్నీషియన్ పోస్టులకు 47.56 లక్షల దరఖాస్తులు, 62,907 లెవల్–1(గ్రూప్–డి కేటగిరీ) పోస్టులకుగాను 1.90కోట్ల దరఖాస్తులు వచ్చాయి. దశలవారీగా రెండు నెలల కాలవ్యవధిలో పరీక్షలు నిర్వహిస్తామని ఆర్‌ఆర్‌బీ తెలిపింది. ఇంతమంది అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణతో దాదాపు 10 లక్షల చెట్ల కాగితపు కలప ఆదా అయినట్లేనని ఆర్‌ఆర్‌బీ అభిప్రాయపడింది.
ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు లేవని, పరీక్ష విధానంలో పారదర్శకత పెంచేందుకు ‘ఆన్సర్ కీ’ల అప్‌లోడింగ్ విధానం తెచ్చామని రైల్వేశాఖ స్పష్టంచేసింది. ‘కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)లో ప్రశ్నపత్రం, ఆన్సర్ బుక్‌లెట్, ‘ఆన్సర్ కీ’లను ఉంచుతాం. ఎలాంటి సందేహాన్ని అయినా అభ్యర్థులు నివృత్తి చేసుకునే అవకాశమిస్తాం’ అని రైల్వేశాఖ తెలిపింది.