బేస్తవారిపేట, న్యూస్‌లైన్ : రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి మోసం చేసినట్లు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై బి.రమేశ్‌బాబు కథనం ప్రకారం.. పూసలపాడుకు చెందిన మోక్షగుండం అంకయ్య మార్కాపురం పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 మంది వద్ద రైల్వేశాఖలో క్లర్క్, హెల్పర్స్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షలు వరకు వసూలు చేశాడు.
పరీక్ష రాయకుండానే నేరుగా మెడికల్ టెస్ట్‌కు తీసుకెళ్లి ఉద్యోగంలో చేర్పిస్తానని నిరుద్యోగులను నమ్మించాడు. ఈ నేపథ్యంలో ఆ ఘనుడు కొందరికి కాల్ లెటర్లు కూడా పంపాడు. గత నెలలో వైద్య పరీక్షలకు తీసుకెళ్లాల్సి ఉన్నా నేడు రేపు అంటూ తిప్పుకుంటున్నాడు. మోసపోయినట్లు గ్రహించిన నిరుద్యోగులు పోలీస్‌లను ఆశ్రయించడంతో అంకయ్య గుట్టురట్టయింది. చిన్న ఓబినేనిపల్లెకు చెందిన దేశబోయిన నారాయణ అనే జిరాక్స్ షాపు యజమాని వద్ద రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అంకయ్య మే నెలలో రూ. 80 వేలు, అక్టోంబర్‌లో రూ. లక్ష తీసుకున్నాడు. ఉద్యోగం గురించి అడిగితే సరైన సమాధానం చెప్పకుండా తిప్పుతుండటంతో బాధితుడు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రైల్వే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా
Published Fri, Dec 6 2013 5:17 AM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM
Advertisement
Advertisement