నిరుద్యోగులే టార్గెట్‌.. రూ.కోటితో ఉడాయింపు! | The Owner Of The Vizag Homes Service Center Who Has Been Defrauded In The Name Of Railway Jobs | Sakshi
Sakshi News home page

రూ.కోటితో ఉడాయింపు!

Published Sun, Jul 21 2019 1:05 PM | Last Updated on Mon, Jul 22 2019 1:23 PM

The Owner Of The Vizag Homes Service Center Who Has Been Defrauded In The Name Of Railway Jobs - Sakshi

మురహరి సాయి సంతోష్‌

సాక్షి, విశాఖపట్నం: నిరుద్యోగులే టార్గెట్‌... ఉద్యోగం కోసం ఆశగా నిరీక్షిస్తున్న వారు కనిపించగానే అక్కడ వాలిపోయాడు... డీఆర్‌ఎం ఆఫీసులో తను పనిచేస్తున్నానని, ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి రూ.కోటికిపైగా వసూలు చేసేశాడు... అనంతరం అదుగో ఉద్యోగాలు.. ఇదిగో ఉద్యోగాలు.. అంటూ కాలం గడిపేశాడు.. చివరకు బండారం బయటపడుతుందని అనుమానం రాగానే నగరం నుంచి ఉడాయించేశాడు. దీంతో మోసపోయిన 30 మందికిపైగా బాధితులు నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... 

నమ్మించి టోకరా 
నగరంలోని అక్కయ్యపాలెంలో ‘వైజాగ్‌ హోమ్స్‌’ పేరిట ఎయిర్‌ కూలర్‌ సర్వీస్‌ సెంటర్‌ను శ్రీకాకుళం పట్టణానికి చెందిన మురహరి సాయి సంతోష్‌ నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడంతో తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వాటి నుంచి గట్టెక్కేందుకు సులువుగా డబ్బులు సంపాదించాలని భావించాడు. అనుకున్నదే తడువుగా నిరుద్యోగులను తన టార్గెట్‌గా పెట్టుకున్నాడు. గత ఏప్రిల్‌ నెలలో రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు నమ్మించాడు. వారు తెలియనప్పటికీ సంతోష్‌ నేరుగా వెళ్లి పరిచయం చేసుకునేవాడు. డీఆర్‌ఎం కార్యాలయంలో హెచ్‌ఆర్‌ విభాగంలో రిక్రూట్‌మెంట్‌ అధికారిగా పనిచేస్తున్నాను... రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేవాడు.

అనంతరం అతని భార్య మురహరి సుజాతని రంగంలోకి దింపేవాడు. ఆమె చాకచక్యంగా మాట్లాడుతూ నిరుద్యోగులను అక్కయ్యపాలెం పరిధి లలితానగర్‌లోని ఎంకే కైలాస్‌ టవర్స్‌లో అద్దెకు ఉంటున్న తమ నివాసానికి తీసుకొచ్చి నమ్మకం కలిగించేది. మరికొందరిని డీఆర్‌ఎం కార్యలయానికి రమ్మని అక్కడి పరిచయాలతో నమ్మకం కలిగించేవాడు. పూర్తిగా నిరుద్యోగులను నమ్మించిన తర్వాత డబ్బులు అకౌంట్‌లో వేయాలని చెప్పేవాడు. ఇలా మొత్తం ఐదు అకౌంట్‌లలో బాధితుల నుంచి డబ్బులు డిపాజిట్‌ చేయించుకున్నాడు. అలా సుమారు 30 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షలు చొప్పున రూ.కోటికి పైగా వసూలు చేశాడు. 

సెంటర్‌లోని ఫర్నీచర్‌ తరలింపు 
బాధితుల నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వారిని నమ్మించేందుకు భువనేశ్వర్‌కు వెళ్లేందుకు రైలు రిజర్వేషన్‌ చేయించుకోమనేవాడు. ఈ క్రమంలో వారు సిద్ధమైతే వాయిదా వేసేవాడు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేశాడు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు అప్పట్లోనే నగరంలోని నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతని ఇల్లు, వైజాగ్‌ హోమ్స్‌ సర్వీసు సెంటర్‌పై పోలీసులు నిఘా పెట్టారు. అయినప్పటికీ వారి కళ్లుగప్పి గురువారం రాత్రి అందులోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర విలువైన సామగ్రిని మురహరి సాయి సంతోష్‌ తరలించుకుపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితులు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సంతోష్‌ను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదేవిషయాన్ని నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ సూర్యనారాయణ వద్ద ప్రస్తావించగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 

30 మందికిపైగా బాధితులు 
మురహరి సంతోష్‌ బాధితులు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో 30 మందికిపైగా ఉన్నారు. వారిలో శ్రీనివాస్, నక్కరాజు వెంకట సింహాద్రి, నక్కరాజు శివ, కర్రి సత్యారావు, గరికిన స్వర్ణ, గుర్రం అనిల్‌కుమార్, నక్కా రమణ, గెడ్ల మోహన్‌రెడ్డి, జి.వెంకట సతీష్, వళ్లు సూర్యనారాయణ, ఎల్లా త్రీనాథమ్మ, రేగిడి పద్మలతో కలిసి 30 మందికి పైగా బాధితులున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేశాను 
రైల్వేలో ఏసీ టెక్నీషియన్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.4 లక్షల వరకు ఇవ్వాలని సంతోష్‌ చెప్పాడు. కొటాక్‌ మహీంద్ర బ్యాంక్‌ అక్కయ్యపాలెం బ్రాంచిలో అకౌంట్‌ నెంబర్‌ 7112098185లో డబ్బులు డిపాజిట్‌ చేయమనడంతో రూ.70 వేలు అకౌంట్‌లో వేశాను. అనంతరం అతని ఫోన్‌ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చింది. ఇంతలో స్నేహితుల ద్వారా అసలు విషయం తెలిసింది. తనలాగే మరో 30 మందిని ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేశాడని తెలిసింది. తనతో పాటు మోసపోయిన బాధితులతో కలిసి ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.  – పి.పద్మ, నిరుద్యోగి

రూ.2 లక్షలు తీసుకున్నాడు 
8 నెలల క్రితం విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న నన్ను పరిచయం చేసుకున్నాడు. తాను విశాఖ రైల్వే డీఆర్‌ఎం కార్యలయంలో హెచ్‌ఆర్‌ విభాగంలో రిక్రూట్‌మెంట్‌ అధికారిని అని చెప్పాడు. రైల్వేలో ఉద్యోగం కావాలంటే రూ.4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని.., ఇష్టమైతే ఫోన్‌ చేయమని చెప్పాడు. అయితే అనుమానంతో డీఆర్‌ఎం ఆఫీస్‌కి వెళ్తే అక్కడ సాయి సంతోష్, అతని భార్య మురహరి సుజాత ఎన్నారు. త్వరగా డబ్బులు రెడీ చేసుకో... లేదంటే ఉద్యోగం వేరొకరికి ఇచ్చేస్తామని అన్నారు. వెంటనే ఆర్‌ఆర్‌బీ అప్పికేషన్‌ ఇచ్చేసి నింపమన్నారు. తర్వాత కొటాక్‌ మహీంద్ర బ్యాంక్‌ అక్కయ్యపాలెం బ్రాంచిలో అకౌంట్‌ నెంబర్‌ 7112098185లో డబ్బులు డిపాజిట్‌ చేయమనడంతో మూడు విడతల్లో రూ.2లక్షలు ఇచ్చేశాను.  – నరేష్, రైల్వే న్యూకాలనీ 

కఠినంగా శిక్షించాలి 
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన సాయి సంతోష్‌ దంపతులను కఠినంగా శిక్షించాలి. మాలాంటి నిరుద్యోగులెందరినో మోసం చేస్తున్న అలాంటి వారిని జైలుకి పంపించాలి. నా దగ్గర రూ.2 లక్షలు తీసుకున్నాడు. మూడు విడతల్లో డబ్బులిచ్చాను. ఫిబ్రవరి 10న భువనేశ్వర్‌ వెళ్లాలని చెప్పి రైలు రిజర్వేషన్‌ చేయించుకోమన్నాడు. తీరా వెళ్లాల్సిన రోజున మధ్యాహ్నం ఫోన్‌ చేసి వాయిదా పడిందన్నాడు. ఫిబ్రవరి 25న బయలుదేరమని మళ్లీ చెప్పాడు. తీరా రిజర్వేషన్‌ చేయించుకుని రైలు ఎక్కిన తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాం.            – కైలాస్, విజయనగరం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement