
సాక్షి, ఖమ్మం: రైల్వే శాఖలో గెజిటెడ్ ఆఫీసర్‌నని ఆర్భాటం చేయడమే కాక అదే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తానంటూ రూ.కోట్లలో వసూలు చేసిన మహిళను శనివారం ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ చిట్టిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన దాసరి సరిత, ఆమె భర్త తల్లాడ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ముద్దం శ్రీకాంత్ (2009 బ్యాచ్) నగరంలోని సుగ్గల వారి తోటలో నివసిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు సరిత రైల్వే శాఖలో గెజిటెడ్ ఆఫీసర్‌గా తన భర్త సాయంతో నకిలీ గుర్తింపు కార్డు రూపొందించింది.
ఈ కార్డు ద్వారా బంధువులు, స్నేహితులు, ఇతరులను నమ్మబలుకుతూ రైల్వే మంత్రి, ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నందున ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 12మంది నుంచి రూ.1,88,95,000 వసూలు చేశారు. అలాగే, మరి కొందరికి రైల్వే శాఖలో కాంట్రాక్టులు ఇప్పిస్తానని కూడా మోసం చేశారు. ఈ డబ్బుతో విలాసాలు చేస్తున్న దంపతులు కొన్ని చోట్ల స్థిర, చరాస్తులు కొనుగోలు చేశారు. అయితే, ఎంతకూ ఉద్యోగాలు రాకపోవడం, డబ్బు తీసుకున్న సరిత, శ్రీకాంత్ ముఖం చాటేయడంతో చెరువు బజార్‌కు చెందిన పాలవెల్లి తులసి, డౌలే సునీత ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అడిషనల్ డీసీపీ గౌస్ ఆలం ద్వారా విచారణ చేయించగా దంపతుల వ్యవహారం బయటపడడంతో ఇద్దరి ని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. కాగా, కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై చర్యల కోసం ఉన్నతాధికారులకు సీపీ సిఫారసు చేశారని సీఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment