రైల్వే ఉద్యోగాల పేరిట టోకరా!
Published Sun, Sep 4 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
సీతంపేట : రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగ గిరిజనులను మోసం చేసిన ఓ బెంగళూరు వాసి వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గిరిజన నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు కాజేసి మోసం చేసి పరారయ్యాడు. సీతంపేట ఏజెన్సీలోని పలు గ్రామాలకు చెందిన డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులు ఉద్యోగం ఇప్పిస్తానంటే గుడ్డిగా నమ్మి బెంగళూరుకు చెందిన రామానుజిప్ప అనే వ్యక్తి చేతిలో మోసపోయినట్టు చెప్పారు. చేసేదిలేక చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం..ఎర్రన్నగూడకు చెందిన ఎస్.మల్లేషుకు బెంగళూరుకు చెందిన రామానుజిప్ప అనే వ్యక్తితో కొన్నాళ్ల కిందట పరిచయమైంది. రైల్వే క్లరికల్(యూడీసీ, ఎల్‌డీసీ) పోస్టులు ఇప్పిస్తానని..ఇందుకు ఒకొక్కరికి రూ.3లక్షలు వరకు ఖర్చవుతుందని నమ్మబలికాడు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో మండలంలోని గెడ్డగూడ, కారిమానుగూడ, అడ్డంగి, కోతాం, కుశిమి, అక్కన్నగూడ, ఎర్రన్నగూడ తదితర గ్రామాలకు చెందిన తొమ్మిది మంది నిరుద్యోగ యువకులు రామానుజిప్పకు ఒకొక్కరు రూ.3లక్షల చొప్పున కొద్ది నెలల కిందట ఇచ్చేశారు. మెుత్తంగా రూ.27లక్షల వరకు మోసగాడికి ఇచ్చినట్టు వారు తెలిపారు.
ఉద్యోగాలకు సంబంధించి శిక్షణ కోసం ఢిల్లీ, ముంబాయి, విశాఖపట్నం, బెంగళూరులో ఉంటుందని ఉద్యోగాల ఆర్డర్‌లు వచ్చాయ్...ఇస్తానని బెంగళూరు రావాలని చెప్పడంతో ఇటీవల యువకులు ఎంతో ఆశతో బెంగళూరు వెళ్లారు. తీరా అక్కడకు నిరుద్యోగులు వెళ్లిన తరువాత ఇచ్చిన ఆర్డర్ తప్పుడిది అని తేలింది. ఇదేమని ప్రశ్నించగా మరో రూ.12వేలు చొప్పున తీసుకు రావాలని చెప్పడంతో, ఇది మోసమని గ్రహించిన నిరుద్యోగులు గత నెల 31న పాలకొండ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వలపన్ని బెంగళూరు వెళ్లి రామానుజిప్పను పట్టుకున్నారు. ఈ విషయమై ఎస్‌ఐ వి.శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Advertisement
Advertisement