పదివేల రైల్వే జాబ్స్‌ | Indian Railway Issued Notification Released For 10 Thousand Jobs | Sakshi
Sakshi News home page

పదివేల రైల్వే జాబ్స్‌

Published Wed, May 23 2018 8:24 AM | Last Updated on Wed, May 23 2018 12:43 PM

Indian Railway Issued Notification Released For 10 Thousand Jobs - Sakshi

రైల్వే భద్రతా బలగాల్లో ఉద్యోగాల సైరన్‌ మోగింది. చాలా రోజుల తర్వాత రైల్వేలో యూనిఫాం ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)ల్లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి భారత రైల్వేశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతో పోల్చుకుంటే చాలా తక్కువ శ్రమతో ఈ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌లలో రాణిస్తే చాలు నెలకు రూ.35 వేలకు పైగా వేతనంతో ఎస్‌ఐ కొలువు వరిస్తుంది. అదే విధంగా కేవలం పదో తరగతి ఉత్తీర్ణతతోనే కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని చేజిక్కించుకునే సువర్ణావకాశం అభ్యర్థులకు లభించింది. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 21,700 జీతం అందుతుంది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, సిలబస్, సన్నద్ధత వ్యూహాలపై ఫోకస్‌..

నోటిఫికేషన్‌ వివరాలు
విద్యార్హత: కానిస్టేబుల్‌కు పదో తరగతి; ఎస్‌ఐకు గ్రాడ్యుయేషన్‌.
వయసు: 2018, జూలై 1 నాటికి 18– 25 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో బీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు సడలింపు ఉంటుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేయడానికి అర్హులు.
దరఖాస్తు రుసుం : రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు, మైనార్టీలు, ఈబీసీ అభ్యర్థులకు రూ.250
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ : 2018, జూన్‌ 1 నుంచి జూన్‌ 30.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: 2018, సెప్టెంబర్‌/అక్టోబర్‌.
వెబ్‌సైట్‌: www.indianrailways.gov.in

ఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎస్‌ఎఫ్‌
కానిస్టేబుల్‌ ఖాళీలు: 8619 (పురుషులకు 4403, మహిళలకు 4216.
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాళీలు: 1120 (పురుషులకు 819, మహిళలకు 301.

సిలబస్‌ ఒకటే..
కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణత అర్హత కాగా, ఎస్‌ఐ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ రెండు పరీక్షలకు నిర్వహించే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)కు ఒకే సిలబస్‌ పేర్కొనడంతో అభ్యర్థులకు ప్రిపరేషన్‌ సులువు కానుంది. పరీక్షలో ప్రశ్నల కాఠిన్యత స్థాయిలో మాత్రం వ్యత్యాసం తప్పనిసరిగా ఉంటుంది. కానిస్టేబుల్‌ పరీక్ష పేపర్‌ పదో తరగతి స్థాయిలో, ఎస్‌ఐ పేపర్‌ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. దీన్ని గుర్తించి సన్నద్ధత వ్యూహాన్ని రూపొందించుకోవాలి.

సన్నద్ధత సులువు..
కానిస్టేబుల్, ఎస్‌ఐ సీబీటీలో పేర్కొన్న సిలబస్‌లో మూడు అంశాలు ఉన్నాయి. అవి.. జనరల్‌ అవేర్‌నెస్, అర్థమెటిక్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఉన్నాయి. వీటిలో జనరల్‌ అవేర్‌నెస్‌ సెక్షన్‌కు ఎక్కువ వెయిటేజీ ఇచ్చారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు మొత్తం 120 మార్కులు (120 ప్రశ్నలు) కేటాయిస్తే వీటిలో 50 మార్కులను జనరల్‌ అవేర్‌నెస్‌కు కేటాయించారు. అర్థమెటిక్, రీజనింగ్‌ విభాగాలకు 35 మార్కుల చొప్పున ఇచ్చారు. మొత్తం 90 నిమిషాల వ్యవధిలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం కనీసం 35 శాతం అర్హత మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీల అభ్యర్థులు కనీసం 30  శాతం మార్కులు సాధించాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మెరిట్‌ జాబితా ప్రకారం కేటగిరీల వారీగా పదిరెట్ల మందికి ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ)లకు పిలుపు అందుతుంది.

జనరల్‌ అవేర్‌నెస్‌
మొత్తం 120 ప్రశ్నల్లో జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 50 ప్రశ్నలు ఉండటంతో ఈ విభాగం విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. రుణాత్మక మార్కులు ఉండడం, ప్రతి తప్పు సమాధానానికి 1/3   మార్కులు కోత విధిస్తుండటంతో జనరల్‌ అవేర్‌నెస్‌ సెక్షన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తంగా పరీక్షకు 90 నిమిషాల సమయం మాత్రమే ఇవ్వడంతో అభ్యర్థులకు టైం మేనేజ్‌మెంట్‌ కీలకం కానుంది. జనరల్‌ అవేర్‌నెస్‌ సెక్షన్‌లోని ప్రశ్నలకు తక్కువ సమయంలోనే సమాధానాలు గుర్తించేందుకు వీలుంటుంది. దీనివల్ల మిగిలిన అర్థమెటిక్, రీజనింగ్‌ విభాగాలకు ఎక్కువ సమయం కేటాయించడానికి అవకాశం లభిస్తుంది.

జనరల్‌ అవేర్‌నెస్‌ సెక్షన్‌లో మన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అభ్యర్థులకు ఉన్న అవగాహనతో పాటు చరిత్ర, రాజ్యాంగం, పరిపాలన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, భౌగోళిక స్థితిగతులు, సైన్స్, సంస్కృతి తదితర  అంశాలపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇక సమకాలీన అంశాలపై కూడా అభ్యర్థులు ఎక్కువగా దృష్టిసారించాలి. వివిధ దేశాల అధ్యక్షులు, అంతర్జాతీయ సంబంధాలు, దేశాల కరెన్సీలు, వార్తల్లోని వ్యక్తులు తదితర సమకాలీన అంశాలు తెలుసుకోవాలి. వీటితో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో చోటుచేసుకున్న సంఘటనలు, డిఫెన్స్‌ టెక్నాలజీ, సైనిక విన్యాసాలు, తాజాగా క్రీడల్లో చెప్పుకోదగిన పరిణామాలు, బడ్జెట్‌ ముఖ్య అంశాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు వాటి లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవాలి.

సెప్టెంబర్‌ – అక్టోబర్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి – మార్చి నుంచి కరెంట్‌ అఫైర్స్‌ చదువుకోవాలి. ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాలను ఉపయోగించుకోవాలి. రోజూ ఏదైనా ఒక ప్రామాణిక పేపర్‌ చదువుతూ సొంతంగా నోట్స్‌ రాసుకోవాలి.
రిఫరెన్స్‌: ప్రామాణిక దినపత్రిక, మ్యాగజైన్‌. www.sakshieducation.com

అర్థమెటిక్‌
35 ప్రశ్నలు ఉండే ఈ విభాగంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న మ్యాథమెటిక్స్‌ పుస్తకాల్లోని అర్థమెటిక్‌ చాప్టర్లలోని ప్రాథమిక భావనలు, సమస్యలను అధ్యయనం చేయాలి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, కసాగు, గసాభా, నిష్పత్తి–అనుపాతం, శాతాలు, మెన్సురేషన్, కాలం–పని, కాలం–దూరం, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, ఆల్జీబ్రా తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.   అభ్యర్థులు సంఖ్యా వ్యవస్థపై పట్టు సాధించడం తప్పనిసరి. కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారాలు, శాతాలు వంటి ప్రాథమిక అర్థమెటిక్‌ అంశాలకు సంబంధించిన సమస్యలకు వేగంగా, కచ్చితమైన సమాధానాలు ఇచ్చేలా ప్రాక్టీస్‌ చేయాలి. ఎక్కాలు, వర్గాలు – వర్గమూలాలు, ఘనమూలాలపై పట్టు సాధించడం ద్వారా సమస్యలను వేగంగా సాధించొచ్చు.
రిఫరెన్స్‌: ఆర్‌ఎస్‌ అగర్వాల్, అరిహంత్‌ పబ్లికేషన్స్, కిరణ్‌ పబ్లికేషన్స్‌ పుస్తకాలు ఉపయోగపడతాయి. వీటితో పాటు ‘ఇండియాబిక్స్‌’ వెబ్‌సైట్‌ను ప్రాక్టీస్‌కు ఉపయోగించుకోవచ్చు.

జనరల్‌ ఇంటెలిజెన్స్, రీజనింగ్‌
సులువైన సెక్షన్‌ ఇది. అభ్యర్థులు తమ ఆలోచనలపై స్పష్టంగా ఉంటూ సమస్య పరిష్కారానికి తార్కికంగా ఆలోచించగలరా లేదా అని తెలుసుకోవడానికి, మేధస్సును అంచనా వేయడానికి రీజనింగ్‌ ఉపయోగపడుతుంది. తార్కికంగా ఆలోచించే వారికి సులువైన విభాగమిదే. అనాలజీస్‌; సిమిలారిటీస్, డిఫరెన్సెస్‌; స్పేషియల్‌ విజువలైజేషన్, స్పేషియల్‌ ఓరియెంటేషన్, ప్రాబ్లం సాల్వింగ్‌ అనాలిసిస్, కోడింగ్‌–డీకోడింగ్, అర్థమెటికల్‌ రీజనింగ్, రిలేషన్స్, ఆడ్‌మాన్‌ అవుట్, సింబల్స్, నొటేషన్స్, వెన్‌ చిత్రాలు, బ్లడ్‌ రిలేషన్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్‌–కన్‌క్లూజన్, డెసిషన్‌ మేకింగ్, సిలాయిజం తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
రిఫరెన్స్‌: ఆర్‌ఎస్‌ అగర్వాల్‌.

ప్రాక్టీస్‌ ప్రధానం
90 నిమిషాల్లో 120 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి కాబట్టి విజయంలో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు గుర్తించాలంటే ప్రాక్టీస్‌కు మించిన మార్గం మరొకటి లేదు. రైల్వే పరీక్షల్లో గత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలు చాలా వరకు పునరావృతమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రీవియస్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేయాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో ప్రధానంగా జనరల్‌ సైన్స్, ఆధునిక భారతదేశ చరిత్ర, పాలిటీ బేసిక్స్‌పై దృష్టిసారించాలి. 90 శాతం ప్రశ్నలు బేసిక్‌గా, యావరేజ్‌గా, లాజిక్‌గా వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, తొలుత బేసిక్‌ కాన్సెప్టులపై పట్టు సాధించాలి. ఆ తర్వాతే అందుబాటులో  ఉన్న సమయాన్ని బట్టి లోతుగా అధ్యయనం చేయాలి. అర్థమెటిక్‌లో సంఖ్యా వ్యవస్థ, సింప్లిఫికేషన్స్, శాతాలు, నిష్పత్తులు, వడ్డీ అంశాలు ముఖ్యమైనవి. రీజనింగ్‌లో సీటింగ్‌ అరేంజ్‌మెంట్, ఆల్ఫాబెటికల్‌ టెస్ట్, కోడింగ్‌–డీకోడింగ్, బ్లడ్‌రిలేషన్స్, ర్యాంకింగ్స్‌ తదితర అంశాలు ముఖ్యమైనవి.

– ఎ.సత్యనారాయణ, డైరెక్టర్, గ్రేట్‌ ఇన్‌స్టిట్యూట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement