విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు తెలుపుతున్న డీఎస్పీ
ఆదిలాబాద్‌రూరల్: ‘ఉద్యోగాల పేరిట వసూళ్లు’ శీర్షికన గతేడాది నవంబర్ 5న ‘సాక్షి’ జిల్లా పేజీలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆదిలాబాద్ మండలంలోని తంతోలి రోడ్డు మార్గంలో ఉన్న ఓ మినీ ఫంక్షన్ హాల్‌లో ఉద్యోగాలిప్పిస్తామని ప్రలోభపెట్టి డబ్బులు వసూలు చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు శుక్రవారం దాడి చేసి పట్టుకున్నారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను విలేకరుల ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింహరెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సయ్యద్ హైమద్, ఏంఎ ఆజీమ్, బిర్కుర్‌వార్ రాకేశ్, ఏంఎ ఆజీజ్, ఏంఎ మోఖిత్ ఫోర్‌సేవ్‌కర్ వీరంతా ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన ప్రతినిధులు. గత ఐదారు నెలల నుంచి ఉమ్మడి జిల్లాలో తిరుగుతూ పదో తరగతి ఉత్తీర్ణులై, కంప్యూటర్ అవగాహన ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పోస్టాఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కరి నుంచి రూ. 10వేల నుంచి రూ. 75వేల వరకు వసూలు చేశారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సుమారు 500 మంది
నిరుద్యోగుల నుంచి సుమారు రూ. 55 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారు. అందులో నుంచి కంపెనీ ఏండీకి రూ. 50 లక్షలు అందజేయగా, అందులో నుంచి రూ. 5 లక్షలు ప్రతినిధులు ఉంచుకున్నారు. కంపెనీ ఏండీని పట్టుకోవడానికి హైదరాబాద్‌కు పోలీసు బృందాలను త్వరలో పంపించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సంబంధత కంపెనీ ఎండీని కలిస్తే పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు ఇచ్చిన వారు ఉంటే పోలీసులను సంప్రదించాలని వారు పేర్కొన్నారు. అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నిందితుల నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా నమ్మబలికి డబ్బులు అడిగితే తమకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత జాగ్రత్త ఉండాలన్నారు. ఇందులో ఆదిలాబాద్ రూరల్, టూ టౌన్ సీఐ ప్రదీప్‌కుమార్, స్వామి, ఆదిలాబాద్‌రూరల్, టూ టౌన్ ఎస్సైలు తిరుపతి, ఎల్‌వీ.రమణారావు, కానిస్టేబుళ్లు రాఘవేందర్, సురేశ్, వెంకటరమణ, విజయ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment