cheating gang
-
జడ్జినే బురిడీ కొట్టించబోయి.. బుక్కయ్యారు!
సాక్షి, కావలి: నకిలీ పత్రాలతో జడ్జినే బురిడీ కొట్టించబోయి నకిలీ జామీన్‌దారులు అడ్డంగా దొరికిపోయారు. న్యాయమూర్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు ముఠా సభ్యులను గురువారం అరెస్ట్ చేశారు.శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ డి.ప్రసాద్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జలదంకి మండలం బ్రాహ్మణక్రాక పంచాయతీ హనుమకొండపాళెం చెందిన కర్రా బాలరాజు కన్నకూతురిపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో తండ్రిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో ఈ ఏడాది జూలై 31వ తేదీ నుంచి కావలి సబ్‌జైలులో రిమాండ్ అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో జిల్లా కోర్టు బాలరాజుకు బెయిల్ మంజూరు చేసి, కావలి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో జామీనులను హాజరుపరచాలని ఆదేశించింది. అయితే బాలరాజుకు జామీన్ ఇచ్చేందుకు స్వగ్రామస్తులను అతని తండ్రి వెంకటయ్య కోరితే ఈసడించుకొన్నారు. న్యాయవాది సహకారంతో.. తన కుమారుడికి జామీన్ ఇచ్చేందుకు వెంకటయ్య కావలిలోని బంధువైన రమణమ్మను సంప్రదించాడు. ఆమె సూచన మేరకు రహమాన్ అనే న్యాయవాదిని కలిశాడు. ఆయన రూ.20 వేలు ఫీజు అవుతుందని, అవసరమైన జామీనుదారుల కోసం కావలికే చెందిన యాకోబును కలవమని సూచించాడు. వెంకటయ్య యాకోబును కలిస్తే తాను ఇప్పుడు అలాంటి పనులు చేయడం లేదని, నెల్లూరులోని మీరామొహిద్దీన్ను కలవమని చెప్పి పంపాడు. అతన్ని వెంకటయ్య సంప్రదించగా రూ.10 వేలు ఖర్చు అవుతుందని చెప్పి నెల్లూరు నగరంలోని పడారుపల్లి జగ్జీవన్‌రామ్‌నగర్‌కు చెందిన కాకుముడి సుబ్బరామయ్య అలియాస్ చిన్నాతో డీల్ కుదిర్చాడు. చిన్నా నకిలీ రబ్బర్ స్టాంప్‌లు తయారు చేశాడు. స్వాధీనం చేసుకొన్న నకిలీ రబ్బర్ స్టాంపులు అదే ప్రాంతానికి మందా విద్యాసాగర్, తాటిపర్తి శివలను జామీన్‌దారులుగా సిద్ధం చేశాడు. అక్కుర్తి సుమన్ జామీన్‌దారులకు సంబంధించిన నకిలీ ప్రాపర్టీ ఫాంలను ఇందుకూరుపేట మండలం ఎంపీడీఓ, అదే మండలం మైపాడు పంచాయతీ కార్యదర్శి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ జామీన్ పత్రాలు సృష్టించారు. న్యాయమూర్తి అప్రమత్తతతో.. ఈ నెల 16వ తేదీ కర్రా బాలరాజు బెయిల్‌కు సంబంధించిన జామీన్‌దారులుగా మందా విద్యాసాగర్, తాటిపర్తి శివలను కావలిలోని అడిషనల్ మేజిస్ట్రేట్ పి.చైతన్య ముందు నాయ్యవాది రహమాన్ హాజరుపరిచారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే కేసు కావడంతో మేజిస్ట్రేట్ చైతన్య జామీన్దారుల్లో మందా విద్యాసాగర్‌ను నిందితుడు నీకు ఏమవుతాడని ప్రశ్నించారు. బాలరాజు తన చెల్లెలు భర్త అని చెప్పడంతో, మీ చెల్లెలు పేరేమిటని ప్రశ్నించడంతో తెల్లముఖం పెట్టేశాడు. దీంతో మేజిస్ట్రేట్ చైతన్యకు అనుమానం వచ్చి మళ్లీ విచారిస్తానని ఫైల్ పక్కన పెట్టారు. కోర్టులో మేజిస్ట్రేట్ ప్రశ్నలు అడుగుతుండగానే నకిలీ పత్రాలు సృష్టించి, వారితో పాటు వచ్చి కోర్టు బయటనే ఉన్న అక్కుర్తి సుమన్ పరారీ అయ్యాడు. జామీన్‌దారులుగా వచ్చిన మందా విద్యాసాగర్, తాటిపర్తి శివ కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి అదృశ్యయ్యారు. ఈ విషయంపై కావలి వన్ టౌన్ పోలీసులకు మేజిస్ట్రేట్ చైతన్య ఫిర్యాదు చేయడంతో సీఐ ఎం.రోశయ్య దర్యాప్తు చేపట్టారు. ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలోని సభ్యులైన కాకుమూడి సుబ్బరామయ్య, అలియాస్ చిన్నా, అక్కుర్తి సుమన్, మందా విద్యాసాగర్, తాటిపర్తి శివలను అరెస్ట్ చేశారు. కావలిలోని న్యాయవాది రహమాన్ ప్రోద్భలంతో నకిలీ షూరిటీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లుగా అంగీకరించారు. వారి వద్ద నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ముఠాలో ఇంకా సభ్యులను అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ డి.ప్రసాద్ చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ ఎం.రోశయ్య, ఎస్సై సీహెచ్ కొండయ్య పాల్గొన్నారు. -
పత్రికల్లో వచ్చిన కథనాలతో.. ముఠా చీటింగ్
విశాఖపట్నం : ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు డీసీపీ రవీంద్ర తెలిపారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా అవినీతి అధికారుల సమాచారాన్ని ముఠా సేకరించేందన్నారు. శ్రద్ధా ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత డాక్టర్ రవీంద్ర వర్మను ముఠా సంప్రదించిందని డీసీపీ రవీంద్ర చెప్పారు. హెల్త్ సెక్రెటరీ పీఏగా పరిచయం చేసుకుని కిడ్నీ కేసు నుంచి తప్పించేందుకు రూ.10లక్షలు ముఠా డిమాండ్ చేసిందన్నారు. ఈ వ్యవహారంలో వెంకట నారాయణ, వెంకట సురేశ్, మహాలక్ష్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకట నారాయణపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కేంద్రంగా ముఠా పనిచేస్తోంది. నాలుగు సెల్ ఫోన్లు, లక్ష50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
హనీట్రాప్ ఆటకట్టు
అమాయక యువకులతో తీయగా మాటలు కలపడం, ప్రేమ, దోమ పేరుతో షికార్లకు తీసుకెళ్లడం ఆమె పని. చివర్లో దుండగులు ఊడిపడి యువకులను కొట్టి దోచుకెళ్లడం. ఫేస్బుక్ ద్వారా కూడా యువకులకు వల వేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న హనీ ట్రాప్ ముఠా పాపం పండి కటకటాలు లెక్కిస్తోంది. కర్ణాటక, బనశంకరి: ఫేస్బుక్ ద్వారా యువకులను పరిచ యం చేసుకుని హనీ ట్రాప్ ద్వారా దోపిడీకి పాల్ప డుతున్న కిలాడీ లేడీతో పాటు ఐదుగురిని బుధవారం హాసన్ జిల్లా అరసికెరె పోలీసులు అరెస్ట్ చేశారు. అర్పిత, పవన్, కిరణ్, దొరె, హమేశ్ అనే ఐదుగురు ముఠాగా ఏర్పడి అమాయకులకు అమ్మాయిని ఎరవేసి దోచుకునేవారు. వీరందరిదీ బెంగళూరే కావడం గమనార్హం. గుడికి వెళ్తున్న యువకుణ్ని లిఫ్ట్ అడిగి డిసెంబరు 22వ తేదీన దిలీప్ అనే యువకుడు జేనకల్ కొండలో పూజల కోసమని బైకుపై బయలుదేరాడు. ఈ సమయంలో కిలాడీ లేడీ అర్పిత, దిలీప్‌ను డ్రాప్ కావాలని అడిగింది. ఆమె బైక్ మీద కూర్చోగానే అరసికెరె వైపు నుంచి కారులో వచ్చిన నలుగురు దుండగులు, బైకును అడ్డుకున్నారు. యువకుణ్ని కొట్టి అతడి వద్ద ఉన్న నగదు, ఏటీఎం కార్డు, మొబైల్‌ఫోన్ ఇతర వస్తువులను దోచుకుని ఉడాయించారు. ఫిర్యాదుతో కదిలిన డొంక దాడిలో గాయపడిన దిలీప్‌ను తల్లిదండ్రులు హాసన్ ప్రభుత్వాసుపత్రిలో చేర్చించి, గండసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ.. అరసికెరె డీఎస్పీ సదానంద తిప్పణ్ణ నేతృత్వంలో మూడు ప్రత్యేక పోలీస్‌బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు పలుకోణాల్లో గాలింపుచర్యలు చేపట్టి బుధవారం అర్పితను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ చేపట్టగా ఆ దాడికి పాల్పడింది తమ ముఠానేనని అంగీకరించింది. ఆమె అందించిన సమాచారం ఆధారంగా బుధవారం సాయంత్రం మిగతా నలుగురినీ అరెస్ట్ చేశారు. ఫేస్బుక్ ద్వారా వల అర్పిత ఫేస్బుక్లో యువకులను ఎంచుకుని వారితో పరిచయం పెంచుకునేది. నిత్యం వారితో చాట్ చేసేది. డబ్బున్న యువకులతో కలసి విందులు, షికార్లకువెళ్లేది. తీసుకెళ్లి తిరుగుప్రయాణంలో బెంగళూరుకు వచ్చే సమయంలో తన గ్యాంగ్ కు సమాచారం అందించి వారితో యువకుల ను బెదిరించి కొట్టి నగదు, బంగారు ఆభరణాలు దోచుకుని ఉడాయిస్తున్నట్లు పోలీసు ల విచారణలో వెలుగుచూసింది. హనీ ట్రాప్ ద్వారా యువకులను వలలోకి పడేస్తున్న నేరాలపై అర్పితతో పాటు గ్యాంగ్‌పై అరసికెరె, నోణవినకెరె పోలీస్‌స్టేషన్లులో గతంలో రెండుకేసులు నమోదై ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే రచ్చ అవుతుందనే భయంలో పలువురు బాధితులు మిన్నకుండిపోయారు. -
కార్లు అద్దెకు తీసుకుని అమ్మేస్తాడు
నాంపల్లి: కార్లు అద్దెకు తీసుకుని అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును నాంపల్లి పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు సభ్యుల ముఠాలో ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, నాంపల్లి ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్రబోస్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. నాంపల్లి ఏ బ్యాటరీ లేన్‌కు చెందిన మహ్మద్ అఫ్జల్, మహ్మద్ ఇద్రీస్ ఖలీమ్, సయ్యద్ ఇమ్రాన్ స్నేహితులు. జల్సాలకు అలవాటుపడిన వీరు మోసాలకు తెరలేపారు. ఇందులో భాగంగా కార్లను అద్దెకు తీసుకుని అవి తమవేనంటూ నమ్మించి ఇతరులకు విక్రయిస్తున్నారు. కార్వాన్ సబ్సిమండికి చెందిన మహ్మద్ ఖలీమ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నాంపల్లి పోలీసులు ఆధారాలు సేకరించారు. మహ్మద్ అఫ్జల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మహ్మద్ ఇద్రీస్ ఖలీమ్, సయ్యద్ ఇమ్రాన్‌ల కోసం గాలింపు చేపట్టారు. సమావేశంలో అడిషనల్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఎస్సైలు సైదా, ప్రమోద్ రెడ్డి, పెంటయ్య గౌడ్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
ఫ్రీ కూపన్లతో కోట్లు కొల్లకొట్టిన గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్ : అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ముఠాకు హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ ఎస్టేట్స్ పేరుతో ఓ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను మోసం చేయడంలో ఈ ముఠా ఓ పధకాన్ని అమలు చేస్తుంది. ముఠా సభ్యులు షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమాలకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని ఫ్రీ గిప్ట్ కూపన్ల పేరుతో గాలం వేస్తారు. ఆపై క్లబ్ మెంబర్షిప్, హాలిడే ప్యాకేజీ, హెల్త్‌కార్డు, వెండి నాణేలు ఇస్తామంటారు. ఆ తరువాత ఓపెన్ ఫ్లాట్లు, వెంచర్లు తక్కువ ధరకే ఇస్తామంటూ అమాయకులకు ఎరవేసి లక్షలు శఠగోపం పెడతారు. ఇలా వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలను అక్రమంగా వసూలు చేశారు. అయితే ఎన్నిరోజులైనా నిర్వాహకులు చెప్పినవి రాకపోవడంతో బాధితులు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ క్లబ్ నడుపుతున్న షేక్ ఖాదర్ బాష, విజయ్ కుమార్‌లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 8లక్షల నగదు, గిప్ట్ కూపన్లు, వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. -
పరీక్షలో ఛీటింగ్.. 16 మంది అరెస్ట్
లక్నో: కానిస్టేబుల్ పరీక్షలో చీటింగ్‌కు పాల్పడుతున్న 16 మంది వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. యూపీలో రెండు రోజుల పాటు జరుగనున్న కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో అభ్యర్ధులకు బ్లూటూత్‌ల ద్వారా సమాధానం చేప్పేందుకు వారిని నుంచి డబ్బులు తీసుకున్నారన్న సమాచారంతో స్పెషల్ టాస్క్ పోర్స్ ( ఎస్టీఎఫ్) పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పరీక్ష రాస్తున్న అభ్యర్ధులకు సమాధానాలు చేరవేసేందుకు అభ్యర్ధుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న సమాచారంతో ఇర్ఫాన్ అహ్మద్, సతేంద్ర సింగ్, ఇమ్రాన్, కుషాల్, పవన్ సింగ్ అనే యువకులు అరెస్ట్ చేశామని అలహాబాద్ ఐజీ అమితాబ్ యాశ్ తెలిపారు. వారి నుంచి మూడు ఫోన్లు, బ్లూటూట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధినం చేసుకున్నామన్నారు. పటిష్టమైన భద్రత నడుమ పరీక్షలను నిర్వహిస్తున్నామని, అభ్యర్ధులు ప్రత్యేక యూనిఫాన్తో పరిక్షకు రావాలని, బూట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష హాల్లో అనుమతించట్లేదని నిర్వాహకులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 41,520 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల కాగా 23 లక్షల మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. -
కొలువు ఆశజూపిన మోసగాళ్ల అరెస్ట్
ఆదిలాబాద్‌రూరల్: ‘ఉద్యోగాల పేరిట వసూళ్లు’ శీర్షికన గతేడాది నవంబర్ 5న ‘సాక్షి’ జిల్లా పేజీలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆదిలాబాద్ మండలంలోని తంతోలి రోడ్డు మార్గంలో ఉన్న ఓ మినీ ఫంక్షన్ హాల్లో ఉద్యోగాలిప్పిస్తామని ప్రలోభపెట్టి డబ్బులు వసూలు చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు శుక్రవారం దాడి చేసి పట్టుకున్నారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను విలేకరుల ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింహరెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సయ్యద్ హైమద్, ఏంఎ ఆజీమ్, బిర్కుర్వార్ రాకేశ్, ఏంఎ ఆజీజ్, ఏంఎ మోఖిత్ ఫోర్సేవ్కర్ వీరంతా ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన ప్రతినిధులు. గత ఐదారు నెలల నుంచి ఉమ్మడి జిల్లాలో తిరుగుతూ పదో తరగతి ఉత్తీర్ణులై, కంప్యూటర్ అవగాహన ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పోస్టాఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కరి నుంచి రూ. 10వేల నుంచి రూ. 75వేల వరకు వసూలు చేశారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సుమారు 500 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ. 55 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారు. అందులో నుంచి కంపెనీ ఏండీకి రూ. 50 లక్షలు అందజేయగా, అందులో నుంచి రూ. 5 లక్షలు ప్రతినిధులు ఉంచుకున్నారు. కంపెనీ ఏండీని పట్టుకోవడానికి హైదరాబాద్‌కు పోలీసు బృందాలను త్వరలో పంపించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సంబంధత కంపెనీ ఎండీని కలిస్తే పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు ఇచ్చిన వారు ఉంటే పోలీసులను సంప్రదించాలని వారు పేర్కొన్నారు. అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నిందితుల నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా నమ్మబలికి డబ్బులు అడిగితే తమకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత జాగ్రత్త ఉండాలన్నారు. ఇందులో ఆదిలాబాద్ రూరల్, టూ టౌన్ సీఐ ప్రదీప్‌కుమార్, స్వామి, ఆదిలాబాద్‌రూరల్, టూ టౌన్ ఎస్సైలు తిరుపతి, ఎల్వీ.రమణారావు, కానిస్టేబుళ్లు రాఘవేందర్, సురేశ్, వెంకటరమణ, విజయ్ ఉన్నారు. -
మెట్రోలో ఉద్యోగాలంటూ టోకరా
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలులో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసగించిన నలుగురు సభ్యుల ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితులు టి.అనిత, జి.విజితరెడ్డి, భార్యభర్తలు పి.రవిచంద్ర, అమృతల నుంచి రూ.14,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...పదో తరగతి వరకు చదివిన కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ గ్రామవాసి టి.అనిత 1989లో మెదక్‌జిల్లా కౌడపల్లికి చెందిన ఓంప్రకాశ్‌ను వివాహం చేసుకొని 15 ఏళ్ల క్రితం ఉప్పల్‌లోని చిలుకానగర్‌కు వచ్చి స్థిరపడింది. భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో అనిత గృహిణిగా ఉంటూ తన ముగ్గురు పిల్లల బాగోగులను చూసుకునేది. బోడుప్పల్లో ఉంటూ ఘట్కేసర్లోని మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విజితరెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరు డబ్బులు సంపాదించాలనే ఆశతో మెట్రో రైలులో టికెట్ జారీ అధికారులు, ట్రాక్ ఇంజినీర్లు, ఇంటిగ్రేటెడ్ అసిస్టెంట్ మేనేజర్లు, అసోసియేట్ మేనేజర్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగించాలని పథకం వేశారు. అప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న విజితరెడ్డి రవిచంద్ర, అమృత దంపతులను సంప్రదించింది. అమీర్‌పేటలో ఆసియన్ బ్రైట్ కెరీర్ (ఏబీసీ) కన్సల్టెన్సీని ప్రారంభించి కమ్యూనికేషన్ స్కిల్స్, కెరీర్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ తదితర కోర్సులను ఆఫర్ చేస్తున్న వారిని కలిసి మెట్రో అధికారులతో తమకు మంచి పరిచయాలున్నాయని, అభ్యర్థులను చూపిస్తే కమీషన్ ఇస్తామని చెప్పారు. ఒక్కో అభ్యర్థికి రూ.1,20,000 తీసుకుంటామని చెప్పడంతో వీరు ఇన్స్టిట్యూట్లోని ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వేల నుంచి రూ.3,50,000 చొప్పున దాదాపు 1,27,20,000 వసూలు చేశారు. ఇందులో తమ వాటా తీసుకుని మిగతా మొత్తాన్ని టి.అనిత, విజితరెడ్డి అందజేశారు. అనిత మెట్రో రైలు హెచ్ఆర్ మేనేజర్లుగా కొత్త ప్రకాశ్, శివ ప్రసాద్ పేర్లపై నకిలీ నియామక పత్రాలు సృష్టించి విజితరెడ్డికి ఇవ్వడంతో ఆమె రవిచంద్ర, అమృతలకు ఇవ్వగా అభ్యర్థులకు ఇచ్చారు. అభ్యర్థులు మెట్రోరైలు అధికారులను అభ్యర్థులు కలవగా అవి నకిలీవని తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం నిందితులను అరెస్టు చేసి రూ.14,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. -
చెంబు కావాలా నాయనా!, పంచ్‌లు..సెటైర్లు
‘ఈ ఇత్తడి చెంబును చూశారా.. దీనికి శక్తులున్నాయట. ఈ విషయం ఇక్కడ కనిపిస్తున్నారే వీరు చెప్పేదాకా నాకూ తెలీదు.. వీరంతా రైస్ పుల్లర్స్ చెంబులు అమ్ముతుంటారు.. ఒక్కసారి వీరితో మాట్లాడారంటే విలేకర్లు అన్న సంగతి కూడా మరిచిపోయి మీరూ కొనేస్తారు. వీరిలో ఒకడు నిట్‌లో ఎంటెక్ చేశాడు. ఆ విషయం చెబుతుంటే ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు’.. ఇదేదో ఆషామాషీ వ్యక్తి అన్న ఛలోక్తులు కాదు.. కమిషనర్ స్థాయి అధికారి విసిరిన హాస్యోక్తులు. నగర ఇన్చార్జి కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌కు సంబంధించి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఆద్యంతం ఛలోక్తులతో నింపేశారు. సాక్షి,సిటీబ్యూరో: బియ్యాన్ని ఆకర్షించడం తో పాటు అతీంద్రియ శక్తులు ఉన్నాయంటూ కొన్ని నాణాలను చూపించి మోసాలు చేసే ముఠాలను ఇప్పటి వరకు చూశాం. అయితే నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న గ్యాంగ్ మాత్రం నాణాల స్థానంలో బిందెలను వినియోగించింది. ‘రైస్ పుల్లర్’ గా పిలిచే వీటిని అంతర్జాతీయ మార్కెట్ లో కోట్ల ధర ఉంటుందని, ఇవి దగ్గర ఉంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మించి రూ.లక్షల్లో దండుకుంది. ఈ ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నట్లు ఇన్చార్జి పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. భారీ హంగులతో కార్యాలయం... ప్రకాశం జిల్లా బోదనపాడుకు చెందిన ఆంజనేయులు వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ దళారి. ఇతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ‘రైస్ పుల్లర్ల’ వ్యాపారం ప్రారంభించాడు. వరంగల్‌లో ఎన్ఐటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేసి, ప్రస్తుతం జీడిమెట్లలో ఉంటూ సివిల్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న మహ్మద్ ఫజలుద్దీన్, రెడీమేడ్ షాపులో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న గౌలిగూడకు చెందిన బాబుల్, ఇంజిన్ ఆయిల్ సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న బాబూరావులతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఆంజనేయులు కస్టమర్లను తేలిగ్గా బుట్టలో వేసుకునేందుకు సికింద్రాబాద్ ఎస్డీ రోడ్‌లోని సూర్య టవర్స్‌లో కార్పొరేట్ హంగులతో ఓ కార్యాలయం ఏర్పాటు చేశాడు. వీరంతా వివిధ మార్గాల్లో బాధితులను అక్కడికి రప్పించి వారితో సమావేశం కావడం, ‘డెమోలు’ చూపించడం కోసం ఈ ఆఫీస్‌ను వాడుకునేవారు. ఐదుగురు కారు డ్రైవర్లకు టోకరా... ఈ గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన బాబూరావు గతేడాది ప్రయాణించిన వాహనానికి బోయిన్‌పల్లికి చెందిన విష్ణుమూర్తి డ్రైవర్‌గా వ్యవహరించారు. అతడితో తాను డీఆర్డీఓ సంస్థలో శాస్త్రవేత్తగా పరిచయం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘రైస్‌పుల్లర్స్’ విషయం ప్రస్తావనకు తెచ్చిన అతను, ఇక్కడ కేవలం రూ.లక్షల ఖరీదు చేసే ఆ పాత్రలకు అతీతశక్తులు ఉన్నందున విదేశాల్లో రూ.కోట్లకు అమ్ముడుపోతాయని చెప్పాడు. ఓ శాస్త్రవేత్తే ఇలాంటి విషయం చెప్పడంతో నమ్మిన విష్ణుమూర్తి వాటిపై ఆరా తీయగా అతను ఆంజనేయుల్ని రంగంలోకి దింపగా... రైస్ పుల్లర్ బిందెకు ఉన్న మహిమలకు సంబంధించిన వీడియోలను వాట్సాప్‌లో విష్ణుకు చూపించాడు. ఆపై దాని ఖరీదు రూ.20 లక్షలని చెప్పాడు. అంత మొత్తం విష్ణు ఒక్కడే వెచ్చించలేకపోవడంతో అతడికి పరిచయస్తులైన మరో నలుగురు డ్రైవర్లతో కలిసి డబ్బు సర్దుబాటు చేశాడు. ఇది తీసుకున్న ముఠా వారిని మోసం చేసింది. మైన్స్ వ్యాపారం పేరుతో మరొకరికి వేములవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్‌కు కొన్నాళ్ళ క్రితం వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఆంజనేయులుతో పరిచయమైంది. తాను మైన్స్ (ఖనిజాల) వ్యాపారం చేస్తానంటూ చెప్పిన ఆంజనేయులు ఆపై అసలు కథ ప్రారంభించాడు. అతీతశక్తులున్న రైస్ పుల్లర్స్ ఇప్పిస్తానంటూ నమ్మించి తన కార్యాలయానికి తీసుకువెళ్ళాడు. అక్కడకు కస్టమర్ల మాదిరిగా వచ్చిన బాబుల్, బాబూరావు, ఫజలుద్దీన్ గతంలో తాము కూడా రైల్ పుల్లర్ బిందె కొన్నామని, ఆపై తమ దశ మారిపోయిందని రమేష్‌ను నమ్మించి, ఆయన నుంచి రూ. 33 లక్షలు తీసుకుని అడ్డంగా ముంచేశారు. ఈ ముఠాకు కోల్‌కతాలో బీటా ట్రేడర్స్ నిర్వాహకుడు రాహుల్ హుడా సైతం సహకరిస్తున్నాడు. ఎవరైనా వినియోగదారుడు ఈ గ్యాంగ్ నుంచి రైస్‌పుల్లర్ ఖరీదు చేయడానికి ముందుకు వస్తే ఇతడు రంగంలోకి దిగుతాడు. ఆంజనేయులు ఆఫీస్‌కు వచ్చే రాహుల్ సదరు బిందెకు రకరకాల పరీక్షలు చేస్తున్నట్లు నటించి చివరకు అది నిజమైన రైస్‌పుల్లర్‌గా సర్టిఫికేషన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ కేటుగాళ్ళు చేతిలో అనేక మంది మోసపోయినప్పటికీ కేవలం విష్ణుమూర్తి, రమేష్ మాత్రమే ఫిర్యాదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు, స్వాధీనం చేసుకున్న నగదు విష్ణు ఇచ్చిన ఆధారాలతో.. ఈ ముఠాపై బోయిన్పల్లి, మహంకాళి ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టారు. ఎస్డీ రోడ్‌లోని కార్యాలయంలో నిందితులు లేకపోవడం, వారి సెల్ఫోన్లు పని చేయకపోవడం దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించాయి. దీంతో బాధితుల్లో ఒకరైన విష్ణు డ్రైవర్ కావడం, గతంలో అతడు బాబూరావును తీసుకుని పలుచోట్లకు వెళ్ళడంతో అతడిచ్చి ఆధారాలతో టాస్క్‌ఫోర్స్ గురువారం మొత్తం నలుగురినీ పట్టుకోగలిగింది. వీరి నుంచి రూ.34.19 లక్షల నగదు, ఇన్నోవా వాహనం, రైస్ పుల్లర్స్‌గా చెప్పిన మూడు చిన్న బిందెలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంది. కోల్‌కతాకు చెందిన రాహుల్ కోసం గాలిస్తున్నారు. పంచ్‌లు..సెటైర్లు నగర పోలీసులు నిర్వహిం చే విలేకరుల సమావేశాలు సాధారణంగా నేరాలకు సంబంధించే ఉంటాయి. అందునా.. కొత్వాల్ స్థాయి అధికారి ప్రెస్మీట్లో వాతావరణం గంభీరంగా ఉంటుంది. అయితే నగర ఇన్చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు ఈ ‘సంప్రదాయాన్ని’ మార్చారు. రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌కు సంబంధించి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఆద్యంతం చలోక్తులతో నింపేశారు. దీంతో కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్ నవ్వులతో నిండిపోయింది. నిందితుల నుంచి పోలీసులు నగదు, రైస్ పుల్లర్స్‌గా చెప్పిన బిందెలతో పాటు ఓ ఇన్నోవా కారునూ రికవరీ చేశారు. సీపీ రికవరీ వస్తువులను చూపుతూ ‘అన్నీ ఇక్కడ పెట్టాం కానీ, కారు తెచ్చిపెట్టలేకపోయాం’ అన్నారు. నిందితుల్లో ఒకరు వరంగల్ ఎన్ఐటీలో పీజీ చేశారు. విలేకరుల సమావేశంలో అతను ముఖందాచుకోగా ‘ఈయనే ఎంటెక్ చేసింది. ఆ విషయం చెప్తుంటే సిగ్గుపడుతున్నారు’ అన్నారు. రైస్ పుల్లర్స్‌గా చెప్పినవి వాస్తవానికి ఇత్తడి బిందెలు. ఇవి ఖరీదు చేసి మోసపోయిన వారికి ఎందుకు పని చేస్తాయంటూ విలేకరులు ప్రశ్నించగా... ‘కొన్నాక ఏ యూజ్ లేకపోతే అన్నం వండుకోవడానికో, మంచినీళ్ళు పట్టుకోవడానికో’ అన్నారు. ‘రైస్ పుల్లర్స్’ ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన కస్టమర్లను నిందితులు ఎలా నమ్మిస్తారో ప్రత్యక్షంగా చూపాలని విలేకరులు కోరగా, కొత్వాల్ స్పందిస్తూ... ‘చూసి మీరు కూడా ట్రై చేస్తారా ఏంటి?’ అంటూ ప్రశ్నించారు. ఇది టీజరేనంటూ నగర ఇన్చార్జి కొత్వాల్‌గా వీవీ శ్రీనివాసరావు నవంబర్ 12న బాధ్యతలు తీసుకున్నారు. ఆపై కేసుకు సంబంధించి ఆయన నిర్వహించిన తొలి విలేకరుల సమావేశం ఇదే. త్వరలో వార్షిక విలేకరుల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది. ఈ విషయాన్నే ఆయన తనదైన శైలిలో ప్రస్తావిస్తూ... ‘యాన్యువల్ రిలీజ్‌కు ఇది టీజర్ లాంటిది’ అని పేర్కొన్నారు. నిందితులతో మాట్లాడించాలని కోరగా ‘వాళ్ళు కాస్సేపు మాట్లాడితే మీరూ ఓ చెంబు కొంటారు. ఎందుకులే’ అంటూ దాటవేశారు. ఈ సందర్భంగా ఫొటో జర్నలిస్ట్ రికవరీ చేసిన కరెన్సీ చూపమని కొత్వాల్‌ను సైగలతో కోరుతూ కరెన్సీ వైపు చేయి చూపించారు. దీనికీ ‘స్పందించిన’ వీవీ శ్రీనివాసరావు ‘ఆ డబ్బు కావాలా... మీకు ఇవ్వలేం’ అంటూ చలోక్తి విసిరారు. సాధించనిదే వదలడు సీసీ వీవీ శ్రీనివాసరావుకు విధి నిర్వహణలో తనకు తానే సాటి అని ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఏదైనా ఓ విషయంపై దృష్టి పెడితే ఎంతకష్టమైనా అందులో విజయం సాధిస్తారు. వీవీ శ్రీనివాసరావు కుమార్తె ఓ దశలో ఫ్రెంచ్ భాష నేర్చుకోవాలని భావించారు. ఆమెకు ఆ భాష నేర్పడం కోసం ఆయన ఇంటర్నెట్ను ఆశ్రయించి కొన్నాళ్ళ పాటు అకుంఠిత దీక్షతో ఫ్రెంచ్ భాషను అనర్గళంగా నేర్చుకుని... తన కుమార్తెకూ నేర్పారు. ప్రస్తుతం సీపీ ఆ భాషను మాట్లాడటం, రాయడం, చదవడం చేయగలరు. -
రూము.. అమ్మాయిలంటూ ఎర..
గుంటూరుకు చెందిన రాజేష్ మంగళవారం శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చాడు. అతన్ని కొందరు మాటల్లోకి దింపారు. అందమైన అమ్మాయి ఉంది.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. తక్కువ రేటుకు మంచి రూము ఇప్పిస్తాను అని చెప్పి నమ్మించారు. ఆకర్షితుడైన రాజేష్ వారివెంట వెళ్లాడు. బస్టాండు సమీపంలోని ఓ హోటల్ రూములోకి తీసుకెళ్లాడు. అప్పటికే గదిలో అమ్మాయి ఉంది. ఆమె రాజేష్‌ను లోనికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ ఇచ్చింది. అది తాగిన కొద్ది సేపటికే అతను నిద్రలోకి జారుకున్నాడు. గంట తరువాత మెళకువ వచ్చి చూడగా అక్కడ ఎవరూ లేరు. తన జేబులో ఉన్న రూ.14 వేలు, బంగారు ఉంగరం కనిపించలేదు. హోటల్ వారిని అడిగినా సమాధానం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందనుకున్నాడు. జేబులో ఉన్న రూ.5లతో కాయిన్ బాక్స్ నుంచి తన స్నేహితుడి ఫోన్‌చేసి జరిగిన మోసాన్ని వివరించాడు. అతని ద్వారా రేణిగుంట సమీపంలోని గాజులమండ్యం పారిశ్రామికవాడలో పనిచేస్తున్న స్నేహితుని వద్ద రూ.వెయ్యి తీసుకుని తిరిగి గుంటూరు బస్సు ఎక్కాడు. లీలామహల్ సమీపంలోని సత్యనారాయణపురం వద్ద మంగళవారం రాత్రి ఓ పది మంది మద్యం సేవించి మహిళలను తీసుకుని కేకలు వేస్తూ చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడ వారి కేకలు విన్న స్థానికులు షీటీంకు సమాచారం ఇచ్చారు. స్పందించిన షీ టీం సత్యనారాయణపురంలో రాత్రంతా గాలించారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న పోకిరీ బ్యాచ్ గుట్టుచప్పుడు కాకుండా తప్పించుకున్నారు. ఈ రెండు సంఘటనలే కాదు. తిరుపతి నగరం ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. సాక్షి, తిరుపతి: ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన తిరుపతికి నిత్యం వేలాది మంది దేశ విదేశాల నుంచి భక్తులు చేరుకుంటుంటారు. యాత్రికుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు కొందరు పురుషులు, మహిళలు ముఠాగా ఏర్పడి తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, గ్రూపు థియేటర్ పరిసరాలను అడ్డాగా చేసుకున్నారు. యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రెట్‌లైట్ ఏరియాను తలపిస్తున్న తిరునగరి తిరుపతిలో పెచ్చుమీరిన వ్యభిచారాన్ని నియంత్రించేందుకు పోలీసులు తరచూ దాడులు చేస్తున్నారు. వ్యభిచార ముఠాలను కటకటాలకు పంపిస్తున్నారు. వారికి సహకరిస్తున్న లాడ్జీల యజమానులను సైతం అరెస్టు చేస్తున్నారు. ఈ ముఠా సభ్యులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటూ ముందుకు సాగిస్తున్నారు. తరచూ ఆర్టీసీ బస్టాండు ఏరియాలో మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని యాత్రికులను ఆకర్షించి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. మరికొంత మంది నివాసాల్లోనే యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలకు తెరతీస్తున్నారు. తమిళనాడు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా రెగ్యులర్ కస్టమర్లకు వారి ఫొటోలను వాట్సప్‌ల ద్వారా పంపుతూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం దాడులు చేస్తున్నా ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అత్యంత వేగంగా ఎయిడ్స్ వ్యాప్తి జిల్లాలో ఎయిడ్స్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని అధికారిక గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అధికారిక సమాచారం మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 23,343 మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. ఈ ఏడాదిలోనే 3,200 మంది ఎయిడ్స్ వ్యాధిన పడినట్లు తేలింది. తిరుపతితో పాటు రేణిగుంట, సత్యవేడు, మదనపల్లి, కుప్పం తదితర ప్రాంతాల్లో ఎయిడ్స్ రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్లు హెచ్చరించారు. జిల్లాలో ఎయిడ్స్ వేగంగా వ్యాప్తి చెందడానికి పైన ప్రస్తావించిన సంఘటనలే నిదర్శనం. సంబంధిత అధికారులు స్పందించి వ్యభిచార ముఠాకు అడ్డుకట్ట వేయకపోతే మరింత మంది ఎయిడ్స్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
ఆన్లైన్ చీటింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు
-
మహానగరంలో మాయగాళ్లు
► రెండు చీటింగ్ గ్యాంగ్‌ల ఆటకట్టు ► నిందితుల నుంచి ► రూ. 53 లక్షలు స్వాధీనం పంజగుట్ట : సామాన్యులను ప్రలోభ పెట్టి మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 33లక్షల నగదు, రెండు కార్లు, 15 సెల్ఫోన్లు, ఒక మ్యాజిక్ సూట్‌కేస్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం మురళీనగర్‌కు చెందిన పాతనేరస్థుడు కర్రి కనకరాజు అలియాస్ సుదర్శన్ రెడ్డి (40), తన బంధువు అంబటి సంతోష్‌కుమార్ అలియాస్ శ్రీనివాస్ (32), కలకత్తాకు చెందిన సీతారామ్ (45)తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వారు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2005 కన్నా ముందు కరెన్సీని మార్చుకోవాలని ఇచ్చిన ప్రకటనను ఆసరాగా చేసకుని మోసాలకు పథకం పన్నారు. తమిళనాడు వెళ్లూరు జిల్లా అరక్కువం గ్రామంలో ఓ ట్రస్ట్‌కు సంబందించిన వేల కోట్ల నల్లధనం ఉందని దానిని బ్యాంకులో వేస్తే ఇన్‌కం ట్యాక్స్ సమస్య వస్తుందని అందుకు రూ. 5లక్షలు 2005 తరువాతి నోట్లు తమకు ఇస్తే రెట్టింపు ఇస్తామని కృష్ణాజిల్లాకు చెందిన నాగరాజుకు ఫోన్ చేసి నమ్మించారు. అతడిని నగదు తీసుకొని అమీర్‌పేట్‌లోని బిగ్‌బజార్ వద్దకు రావాల్సిందిగా చెప్పడంతో అతను గత నెల 21న బిగ్‌బజార్ వద్దకు వచ్చాడు. అప్పటికే కారులో సిద్దంగా ఉన్న కనకరాజు ముఠా నాగరాజును కారులో కూర్చోబెట్టుకుని అతడు ఇచ్చిన నగదును తీసుకుని తమ వద్ద సిద్ధంగా ఉన్న రెండువైపుల తెరుచుకునే మ్యాజిక్ సూట్‌కేస్ సహాయంతో తెల్లకాగితాలు ఇచ్చి మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు వారు సికింద్రాబాద్‌లోని భావనీ లాడ్జ్‌లో ఉన్నట్లు గుర్తించి శనివారం అరెస్టు చేశారు. ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్న తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోటకు చెందిన ఏరోతు నాగేశ్వరరావు (36), అనంతపురం జిల్లా హిందూపూర్‌కు చెందిన ఆర్. రవీందర్ రెడ్డి (39), చిత్తూరు జిల్లా రామసముద్రంకు చెందిన షేక్ హైదర్ వలీ అలియాస్ బాషా (46) చిన్నకొత్తపల్లికి చెందిన టీ. హేమంత్ కుమార్ (23)లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరు ఖమ్మం జిల్లా మదిరకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి రూ.5.5లక్షలు, అదే జిల్లాకు చెందిన శ్రీనివాస్ నుంచి రూ.5 లక్షలు, ప్రసాద్ రూ.5 లక్షలు, రామకృష్ణ నుంచి రూ.4.5 లక్షలు మొత్తం 20 లక్షలు తీసుకొని శనివారం అమీర్‌పేట్ ఇమేజ్ ఆసుపత్రి వీధిలో నగదు మార్చుకుంటుండగా పంజగుట్ట పోలీసులు ఆకస్మికదాడులు చేసి పట్టుకున్నారు. కేసును చేధించిన పంజగుట్ట డిఐ లక్ష్మీనారాయణ రెడ్డి, ఇన్స్పెక్టర్ మోహన్‌కుమార్, డి ఎస్ఐ శివకుమార్‌లకు స్పెషల్ రివార్డు అందజేయనున్నట్లు డీసీపీ తెలిపారు. -
చీటింగ్ ముఠా అరెస్ట్..
కర్నూలు : అసలు నోట్లకు మూడింతలు నకిలీ నోట్లు ఇస్తామంటూ సినీ ఫక్కీలో మోసానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న చీటింగ్ గ్యాంగ్‌ను కర్నూలు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. అదనపు ఎస్పీ శివకోటిబాబురావు, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరాతో కలిసి గురువారం మధ్యాహ్నం స్థానిక వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ఇందుకు సంబంధించి వివరాలను విలేకరులకు వెల్లడించారు. కర్నూలు ధర్మపేటకు చెందిన ఆరెకంటి కుమార్, పాతబస్తీకి చెందిన షేక్ సలీం, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బెస్తవారిపేట అంబేద్కర్ కాలనీ ఏబీఎం కాంపౌండ్‌కు చెంది న గంటెపోగు కృపాకర్ ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. కర్నూలు ఎ.క్యాంప్‌కు చెందిన రఘుబాబు నాయుడికి రెండున్నర నెలల క్రితం షేక్ సలీంతో పరిచయం ఏర్పడింది. రఘుబాబు ఆర్థిక కష్టాల గురించి ఆరా తీసిన సలీం అవి తీరాలంటే లక్షకు మూడింతలు దొంగ నోట్లు ఇస్తారంటూ కుమార్‌ను పరిచయం చేయించాడు. ముందుగా నకిలీవంటూ అసలు నోట్లు రెండు ఇవ్వగా రఘుబాబు వాటిని మార్చుకుని అసలు మాదిరిగా ఉన్నాయంటూ ఆశ పడ్డాడు. మూడింతల నకిలీ నోట్ల కోసం రూ.5 లక్షలు అసలు నోట్టిచ్చేందుకు అంగీకరించాడు. గత నెల 26న డబ్బు సర్ధుకుని మిత్రుడు శివకుమార్‌తో కలిసి రాజ్‌విహార్ దగ్గర ఉన్న జ్యోతి డార్మెటరీ వద్ద సలీంను కలిశాడు. అప్పటికే తెల్ల పేపర్ కట్టలపై కొన్ని అసలు నోట్లు పేర్చి బ్యాగుతో సిద్ధంగా ఉన్న సలీం, కుమార్ వాటిని రఘుబాబుకు ఇచ్చారు. ఇదేసమయంలో పోలీసు వేషంలో ఉన్న ముఠాలోని మరో ఇద్దరు సభ్యులు పథకం ప్రకారం అక్కడికి చేరుకుని కేసులు పెడతామంటూ హడావుడి చేయగా రఘుబాబు, అతని మిత్రుడు డబ్బు వదిలేసి పారిపోయారు. అనంతరం ముఠా సభ్యులు డబ్బులను పంచుకున్నారు. సలీమ్, కుమార్ ముఠా సభ్యులు ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారని ఆలస్యంగా గ్రహించిన రఘుబాబు తన బావ రమేష్ నాయుడు సూచన మేరకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులవేషంలో వచ్చిన రాజగోపాల్, మోసే రాజు పరారీలో ఉ న్నారని, త్వరలో పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు. చీటింగ్ గ్యాంగ్‌ని పట్టుకున్న సీసీఎస్ ఏఎస్ఐ రవూఫ్, హెడ్ కానిస్టేబుల్ మస్తాన్, రెండవ పట్టణ హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుళ్లు సుదర్శన్, సమీర్, నాగరాజు, కిషోర్ తదితరులను ఎస్పీ అభినందించారు. బాధితులుంటే పోలీసులను కలవండి.. ఇలాంటి తరహా మోసాలకు గురైనవారుంటే ముందుకు రావాలని ఎస్పీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సగం ధరకే బంగారం, పెద్ద మొత్తంలో లాటరీ తగిలింది.. సర్వీస్ చార్జిలు అకౌంట్లో జమ చేయండి, ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను సెల్ఫోన్లోనే ఇంటర్వ్యూలు చేసి ప్రాసెసింగ్ చార్జీల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేయడం తదితర మూడు రకాల ముఠాలు జిల్లాలో సంచరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. ఇందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తనకు ఫోన్(94407 95500) చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండవ పట్టణ సీఐ ములకన్న, సీసీఎస్ సీఐ పవన్‌కిషోర్, ఎస్ఐలు శ్రీహరి, నయాబ్ రసూల్, రాకేష్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.