కర్నూలు : అసలు నోట్లకు మూడింతలు నకిలీ నోట్లు ఇస్తామంటూ సినీ ఫక్కీలో మోసానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న చీటింగ్ గ్యాంగ్‌ను కర్నూలు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. అదనపు ఎస్పీ శివకోటిబాబురావు, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరాతో కలిసి గురువారం మధ్యాహ్నం స్థానిక వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ఇందుకు సంబంధించి వివరాలను విలేకరులకు వెల్లడించారు. కర్నూలు ధర్మపేటకు చెందిన ఆరెకంటి కుమార్, పాతబస్తీకి చెందిన షేక్ సలీం, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బెస్తవారిపేట అంబేద్కర్ కాలనీ ఏబీఎం కాంపౌండ్‌కు చెంది న గంటెపోగు కృపాకర్ ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు.
కర్నూలు ఎ.క్యాంప్‌కు చెందిన రఘుబాబు నాయుడికి రెండున్నర నెలల క్రితం షేక్ సలీంతో పరిచయం ఏర్పడింది. రఘుబాబు ఆర్థిక కష్టాల గురించి ఆరా తీసిన సలీం అవి తీరాలంటే లక్షకు మూడింతలు దొంగ నోట్లు ఇస్తారంటూ కుమార్‌ను పరిచయం చేయించాడు. ముందుగా నకిలీవంటూ అసలు నోట్లు రెండు ఇవ్వగా రఘుబాబు వాటిని మార్చుకుని అసలు మాదిరిగా ఉన్నాయంటూ ఆశ పడ్డాడు. మూడింతల నకిలీ నోట్ల కోసం రూ.5 లక్షలు అసలు నోట్టిచ్చేందుకు అంగీకరించాడు. గత నెల 26న డబ్బు సర్ధుకుని మిత్రుడు శివకుమార్‌తో కలిసి రాజ్‌విహార్ దగ్గర ఉన్న జ్యోతి డార్మెటరీ వద్ద సలీంను కలిశాడు. అప్పటికే తెల్ల పేపర్ కట్టలపై కొన్ని అసలు నోట్లు పేర్చి బ్యాగుతో సిద్ధంగా ఉన్న సలీం, కుమార్ వాటిని రఘుబాబుకు ఇచ్చారు. ఇదేసమయంలో పోలీసు వేషంలో ఉన్న ముఠాలోని మరో ఇద్దరు సభ్యులు పథకం ప్రకారం అక్కడికి చేరుకుని కేసులు పెడతామంటూ హడావుడి చేయగా రఘుబాబు, అతని మిత్రుడు డబ్బు వదిలేసి పారిపోయారు. అనంతరం ముఠా సభ్యులు డబ్బులను పంచుకున్నారు. సలీమ్, కుమార్ ముఠా సభ్యులు ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారని ఆలస్యంగా గ్రహించిన రఘుబాబు తన బావ రమేష్ నాయుడు సూచన మేరకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులవేషంలో వచ్చిన రాజగోపాల్, మోసే రాజు పరారీలో ఉ న్నారని, త్వరలో పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు. చీటింగ్ గ్యాంగ్‌ని పట్టుకున్న సీసీఎస్ ఏఎస్‌ఐ రవూఫ్, హెడ్ కానిస్టేబుల్ మస్తాన్, రెండవ పట్టణ హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుళ్లు సుదర్శన్, సమీర్, నాగరాజు, కిషోర్ తదితరులను ఎస్పీ అభినందించారు.
బాధితులుంటే పోలీసులను కలవండి..
ఇలాంటి తరహా మోసాలకు గురైనవారుంటే ముందుకు రావాలని ఎస్పీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సగం ధరకే బంగారం, పెద్ద మొత్తంలో లాటరీ తగిలింది.. సర్వీస్ చార్జిలు అకౌంట్‌లో జమ చేయండి, ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను సెల్‌ఫోన్‌లోనే ఇంటర్వ్యూలు చేసి ప్రాసెసింగ్ చార్జీల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేయడం తదితర మూడు రకాల ముఠాలు జిల్లాలో సంచరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.
ఇందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తనకు ఫోన్(94407 95500) చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండవ పట్టణ సీఐ ములకన్న, సీసీఎస్ సీఐ పవన్‌కిషోర్, ఎస్‌ఐలు శ్రీహరి, నయాబ్ రసూల్, రాకేష్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
చీటింగ్ ముఠా అరెస్ట్..
Published Fri, Jul 3 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement
Advertisement