గుంటూరుకు చెందిన రాజేష్ మంగళవారం శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చాడు. అతన్ని కొందరు మాటల్లోకి దింపారు. అందమైన అమ్మాయి ఉంది.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. తక్కువ రేటుకు మంచి రూము ఇప్పిస్తాను అని చెప్పి నమ్మించారు. ఆకర్షితుడైన రాజేష్ వారివెంట వెళ్లాడు. బస్టాండు సమీపంలోని ఓ హోటల్ రూములోకి తీసుకెళ్లాడు. అప్పటికే గదిలో అమ్మాయి ఉంది. ఆమె రాజేష్‌ను లోనికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ ఇచ్చింది. అది తాగిన కొద్ది సేపటికే అతను నిద్రలోకి జారుకున్నాడు. గంట తరువాత మెళకువ వచ్చి చూడగా అక్కడ ఎవరూ లేరు. తన జేబులో ఉన్న రూ.14 వేలు, బంగారు ఉంగరం కనిపించలేదు. హోటల్ వారిని అడిగినా సమాధానం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందనుకున్నాడు. జేబులో ఉన్న రూ.5లతో కాయిన్ బాక్స్ నుంచి తన స్నేహితుడి ఫోన్‌చేసి జరిగిన మోసాన్ని వివరించాడు. అతని ద్వారా రేణిగుంట సమీపంలోని గాజులమండ్యం పారిశ్రామికవాడలో పనిచేస్తున్న స్నేహితుని వద్ద రూ.వెయ్యి తీసుకుని తిరిగి గుంటూరు బస్సు ఎక్కాడు.
లీలామహల్ సమీపంలోని సత్యనారాయణపురం వద్ద మంగళవారం రాత్రి ఓ పది మంది మద్యం సేవించి మహిళలను తీసుకుని కేకలు వేస్తూ చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడ వారి కేకలు విన్న స్థానికులు షీటీంకు సమాచారం ఇచ్చారు. స్పందించిన షీ టీం సత్యనారాయణపురంలో రాత్రంతా గాలించారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న పోకిరీ బ్యాచ్ గుట్టుచప్పుడు కాకుండా తప్పించుకున్నారు. ఈ రెండు సంఘటనలే కాదు. తిరుపతి నగరం ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
సాక్షి, తిరుపతి: ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన తిరుపతికి నిత్యం వేలాది మంది దేశ విదేశాల నుంచి భక్తులు చేరుకుంటుంటారు. యాత్రికుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు కొందరు పురుషులు, మహిళలు ముఠాగా ఏర్పడి తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, గ్రూపు థియేటర్ పరిసరాలను అడ్డాగా చేసుకున్నారు. యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు.
రెట్‌లైట్ ఏరియాను తలపిస్తున్న తిరునగరి
తిరుపతిలో పెచ్చుమీరిన వ్యభిచారాన్ని నియంత్రించేందుకు పోలీసులు తరచూ దాడులు చేస్తున్నారు. వ్యభిచార ముఠాలను కటకటాలకు పంపిస్తున్నారు. వారికి సహకరిస్తున్న లాడ్జీల యజమానులను సైతం అరెస్టు చేస్తున్నారు. ఈ ముఠా సభ్యులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటూ ముందుకు సాగిస్తున్నారు. తరచూ ఆర్టీసీ బస్టాండు ఏరియాలో మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని యాత్రికులను ఆకర్షించి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. మరికొంత మంది నివాసాల్లోనే యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలకు తెరతీస్తున్నారు. తమిళనాడు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా రెగ్యులర్ కస్టమర్లకు వారి ఫొటోలను వాట్సప్‌ల ద్వారా పంపుతూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం దాడులు చేస్తున్నా ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
అత్యంత వేగంగా ఎయిడ్స్ వ్యాప్తి
జిల్లాలో ఎయిడ్స్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని అధికారిక గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అధికారిక సమాచారం మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 23,343 మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. ఈ ఏడాదిలోనే 3,200 మంది ఎయిడ్స్ వ్యాధిన పడినట్లు తేలింది. తిరుపతితో పాటు రేణిగుంట, సత్యవేడు, మదనపల్లి, కుప్పం తదితర ప్రాంతాల్లో ఎయిడ్స్ రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్లు హెచ్చరించారు. జిల్లాలో ఎయిడ్స్ వేగంగా వ్యాప్తి చెందడానికి పైన ప్రస్తావించిన సంఘటనలే నిదర్శనం. సంబంధిత అధికారులు స్పందించి వ్యభిచార ముఠాకు అడ్డుకట్ట వేయకపోతే మరింత మంది ఎయిడ్స్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment