చెంబు కావాలా నాయనా!, పంచ్‌లు..సెటైర్లు | Rice pulling gang arrest and 34lakh recovery | Sakshi
Sakshi News home page

చెంబు కావాలా నాయనా!

Published Fri, Dec 22 2017 8:26 AM | Last Updated on Fri, Sep 7 2018 4:28 PM

Rice pulling gang arrest and 34lakh recovery - Sakshi

‘ఈ ఇత్తడి చెంబును చూశారా.. దీనికి శక్తులున్నాయట. ఈ విషయం ఇక్కడ కనిపిస్తున్నారే వీరు చెప్పేదాకా నాకూ తెలీదు.. వీరంతా రైస్‌ పుల్లర్స్‌ చెంబులు అమ్ముతుంటారు.. ఒక్కసారి వీరితో మాట్లాడారంటే విలేకర్లు అన్న సంగతి కూడా మరిచిపోయి మీరూ కొనేస్తారు. వీరిలో ఒకడు నిట్‌లో ఎంటెక్‌ చేశాడు. ఆ విషయం చెబుతుంటే ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు’.. ఇదేదో ఆషామాషీ వ్యక్తి అన్న ఛలోక్తులు కాదు.. కమిషనర్‌ స్థాయి అధికారి విసిరిన హాస్యోక్తులు. నగర ఇన్‌చార్జి కొత్వాల్‌ వీవీ శ్రీనివాసరావు రైస్‌ పుల్లింగ్‌ గ్యాంగ్‌కు సంబంధించి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఆద్యంతం ఛలోక్తులతో నింపేశారు.

సాక్షి,సిటీబ్యూరో: బియ్యాన్ని ఆకర్షించడం తో పాటు అతీంద్రియ శక్తులు ఉన్నాయంటూ కొన్ని నాణాలను చూపించి మోసాలు చేసే ముఠాలను ఇప్పటి వరకు చూశాం. అయితే నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్న గ్యాంగ్‌ మాత్రం నాణాల స్థానంలో బిందెలను వినియోగించింది. ‘రైస్‌ పుల్లర్‌’ గా పిలిచే వీటిని అంతర్జాతీయ మార్కెట్‌ లో కోట్ల ధర ఉంటుందని, ఇవి దగ్గర ఉంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మించి రూ.లక్షల్లో దండుకుంది. ఈ ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నట్లు ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 

భారీ హంగులతో కార్యాలయం...
ప్రకాశం జిల్లా బోదనపాడుకు చెందిన ఆంజనేయులు వృత్తిరీత్యా రియల్‌ ఎస్టేట్‌ దళారి. ఇతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ‘రైస్‌ పుల్లర్ల’ వ్యాపారం ప్రారంభించాడు. వరంగల్‌లో ఎన్‌ఐటీ నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ పూర్తి చేసి, ప్రస్తుతం జీడిమెట్లలో ఉంటూ సివిల్‌ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న మహ్మద్‌ ఫజలుద్దీన్, రెడీమేడ్‌ షాపులో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న గౌలిగూడకు చెందిన బాబుల్, ఇంజిన్‌ ఆయిల్‌ సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న బాబూరావులతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఆంజనేయులు కస్టమర్లను తేలిగ్గా బుట్టలో వేసుకునేందుకు సికింద్రాబాద్‌ ఎస్డీ రోడ్‌లోని సూర్య టవర్స్‌లో కార్పొరేట్‌ హంగులతో ఓ కార్యాలయం ఏర్పాటు చేశాడు. వీరంతా వివిధ మార్గాల్లో బాధితులను అక్కడికి రప్పించి వారితో సమావేశం కావడం, ‘డెమోలు’ చూపించడం కోసం ఈ ఆఫీస్‌ను వాడుకునేవారు. 

ఐదుగురు కారు డ్రైవర్లకు టోకరా...
ఈ గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన బాబూరావు గతేడాది ప్రయాణించిన వాహనానికి బోయిన్‌పల్లికి చెందిన విష్ణుమూర్తి డ్రైవర్‌గా వ్యవహరించారు. అతడితో తాను డీఆర్‌డీఓ సంస్థలో శాస్త్రవేత్తగా పరిచయం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘రైస్‌పుల్లర్స్‌’ విషయం ప్రస్తావనకు తెచ్చిన అతను, ఇక్కడ కేవలం రూ.లక్షల ఖరీదు చేసే ఆ పాత్రలకు అతీతశక్తులు ఉన్నందున విదేశాల్లో రూ.కోట్లకు అమ్ముడుపోతాయని చెప్పాడు. ఓ శాస్త్రవేత్తే ఇలాంటి విషయం చెప్పడంతో నమ్మిన విష్ణుమూర్తి వాటిపై ఆరా తీయగా అతను ఆంజనేయుల్ని రంగంలోకి దింపగా... రైస్‌ పుల్లర్‌ బిందెకు ఉన్న మహిమలకు సంబంధించిన వీడియోలను వాట్సాప్‌లో విష్ణుకు చూపించాడు. ఆపై దాని ఖరీదు రూ.20 లక్షలని చెప్పాడు. అంత మొత్తం విష్ణు ఒక్కడే వెచ్చించలేకపోవడంతో అతడికి పరిచయస్తులైన మరో నలుగురు డ్రైవర్లతో కలిసి డబ్బు సర్దుబాటు చేశాడు. ఇది తీసుకున్న ముఠా వారిని మోసం చేసింది. 

మైన్స్‌ వ్యాపారం పేరుతో మరొకరికి
వేములవాడకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రమేష్‌కు కొన్నాళ్ళ క్రితం వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఆంజనేయులుతో పరిచయమైంది. తాను మైన్స్‌ (ఖనిజాల) వ్యాపారం చేస్తానంటూ చెప్పిన ఆంజనేయులు ఆపై అసలు కథ ప్రారంభించాడు. అతీతశక్తులున్న రైస్‌ పుల్లర్స్‌ ఇప్పిస్తానంటూ నమ్మించి తన కార్యాలయానికి తీసుకువెళ్ళాడు. అక్కడకు కస్టమర్ల మాదిరిగా వచ్చిన బాబుల్, బాబూరావు, ఫజలుద్దీన్‌ గతంలో తాము కూడా రైల్‌ పుల్లర్‌ బిందె కొన్నామని, ఆపై తమ దశ మారిపోయిందని రమేష్‌ను నమ్మించి, ఆయన నుంచి రూ. 33 లక్షలు తీసుకుని అడ్డంగా ముంచేశారు. ఈ ముఠాకు కోల్‌కతాలో బీటా ట్రేడర్స్‌ నిర్వాహకుడు రాహుల్‌ హుడా సైతం సహకరిస్తున్నాడు. ఎవరైనా వినియోగదారుడు ఈ గ్యాంగ్‌ నుంచి రైస్‌పుల్లర్‌ ఖరీదు చేయడానికి ముందుకు వస్తే ఇతడు రంగంలోకి దిగుతాడు. ఆంజనేయులు ఆఫీస్‌కు వచ్చే రాహుల్‌ సదరు బిందెకు రకరకాల పరీక్షలు చేస్తున్నట్లు నటించి చివరకు అది నిజమైన రైస్‌పుల్లర్‌గా సర్టిఫికేషన్‌ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ కేటుగాళ్ళు చేతిలో అనేక మంది మోసపోయినప్పటికీ కేవలం విష్ణుమూర్తి, రమేష్‌ మాత్రమే ఫిర్యాదు చేశారు. 

పోలీసుల అదుపులో నిందితులు, స్వాధీనం చేసుకున్న నగదు
విష్ణు ఇచ్చిన ఆధారాలతో..
ఈ ముఠాపై బోయిన్‌పల్లి, మహంకాళి ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కేఎస్‌ రవి, కె.శ్రీకాంత్‌ దర్యాప్తు చేపట్టారు. ఎస్డీ రోడ్‌లోని కార్యాలయంలో నిందితులు లేకపోవడం, వారి సెల్‌ఫోన్‌లు పని చేయకపోవడం దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించాయి. దీంతో బాధితుల్లో ఒకరైన విష్ణు డ్రైవర్‌ కావడం, గతంలో అతడు బాబూరావును తీసుకుని పలుచోట్లకు వెళ్ళడంతో అతడిచ్చి ఆధారాలతో టాస్క్‌ఫోర్స్‌ గురువారం మొత్తం నలుగురినీ పట్టుకోగలిగింది. వీరి నుంచి రూ.34.19 లక్షల నగదు, ఇన్నోవా వాహనం, రైస్‌ పుల్లర్స్‌గా చెప్పిన మూడు చిన్న బిందెలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుంది. కోల్‌కతాకు చెందిన రాహుల్‌ కోసం గాలిస్తున్నారు.   

పంచ్‌లు..సెటైర్లు
నగర పోలీసులు నిర్వహిం చే విలేకరుల సమావేశాలు సాధారణంగా నేరాలకు సంబంధించే ఉంటాయి. అందునా.. కొత్వాల్‌ స్థాయి అధికారి ప్రెస్‌మీట్‌లో వాతావరణం గంభీరంగా ఉంటుంది. అయితే నగర ఇన్‌చార్జ్‌ కొత్వాల్‌ వీవీ శ్రీనివాసరావు ఈ ‘సంప్రదాయాన్ని’ మార్చారు. రైస్‌ పుల్లింగ్‌ గ్యాంగ్‌కు సంబంధించి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఆద్యంతం చలోక్తులతో నింపేశారు. దీంతో  కమిషనరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నవ్వులతో నిండిపోయింది.  నిందితుల నుంచి పోలీసులు నగదు, రైస్‌ పుల్లర్స్‌గా చెప్పిన బిందెలతో పాటు ఓ ఇన్నోవా కారునూ రికవరీ చేశారు.

సీపీ రికవరీ వస్తువులను చూపుతూ  ‘అన్నీ ఇక్కడ పెట్టాం కానీ, కారు తెచ్చిపెట్టలేకపోయాం’ అన్నారు. నిందితుల్లో ఒకరు వరంగల్‌ ఎన్‌ఐటీలో పీజీ చేశారు. విలేకరుల సమావేశంలో అతను ముఖందాచుకోగా ‘ఈయనే ఎంటెక్‌ చేసింది. ఆ విషయం చెప్తుంటే సిగ్గుపడుతున్నారు’ అన్నారు.  రైస్‌ పుల్లర్స్‌గా చెప్పినవి వాస్తవానికి ఇత్తడి బిందెలు. ఇవి ఖరీదు చేసి మోసపోయిన వారికి ఎందుకు పని చేస్తాయంటూ విలేకరులు ప్రశ్నించగా... ‘కొన్నాక ఏ యూజ్‌ లేకపోతే అన్నం వండుకోవడానికో, మంచినీళ్ళు పట్టుకోవడానికో’ అన్నారు. ‘రైస్‌ పుల్లర్స్‌’ ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన కస్టమర్లను నిందితులు ఎలా నమ్మిస్తారో ప్రత్యక్షంగా చూపాలని విలేకరులు కోరగా, కొత్వాల్‌ స్పందిస్తూ... ‘చూసి మీరు కూడా ట్రై చేస్తారా ఏంటి?’ అంటూ ప్రశ్నించారు.

ఇది టీజరేనంటూ
నగర ఇన్‌చార్జి కొత్వాల్‌గా వీవీ శ్రీనివాసరావు నవంబర్‌ 12న బాధ్యతలు తీసుకున్నారు. ఆపై కేసుకు సంబంధించి ఆయన నిర్వహించిన తొలి విలేకరుల సమావేశం ఇదే. త్వరలో వార్షిక విలేకరుల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది. ఈ విషయాన్నే ఆయన తనదైన శైలిలో ప్రస్తావిస్తూ... ‘యాన్యువల్‌ రిలీజ్‌కు ఇది టీజర్‌ లాంటిది’ అని పేర్కొన్నారు. నిందితులతో మాట్లాడించాలని కోరగా ‘వాళ్ళు కాస్సేపు మాట్లాడితే మీరూ ఓ చెంబు కొంటారు. ఎందుకులే’ అంటూ దాటవేశారు. ఈ సందర్భంగా ఫొటో జర్నలిస్ట్‌ రికవరీ చేసిన కరెన్సీ చూపమని కొత్వాల్‌ను సైగలతో కోరుతూ కరెన్సీ వైపు చేయి చూపించారు. దీనికీ ‘స్పందించిన’ వీవీ శ్రీనివాసరావు ‘ఆ డబ్బు కావాలా... మీకు ఇవ్వలేం’ అంటూ చలోక్తి విసిరారు.

సాధించనిదే వదలడు
సీసీ వీవీ శ్రీనివాసరావుకు విధి నిర్వహణలో తనకు తానే సాటి అని ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఏదైనా ఓ విషయంపై దృష్టి పెడితే ఎంతకష్టమైనా అందులో విజయం సాధిస్తారు. వీవీ శ్రీనివాసరావు కుమార్తె ఓ దశలో ఫ్రెంచ్‌ భాష నేర్చుకోవాలని భావించారు. ఆమెకు ఆ భాష నేర్పడం కోసం ఆయన ఇంటర్‌నెట్‌ను ఆశ్రయించి కొన్నాళ్ళ పాటు అకుంఠిత దీక్షతో  ఫ్రెంచ్‌ భాషను అనర్గళంగా నేర్చుకుని... తన కుమార్తెకూ నేర్పారు. ప్రస్తుతం సీపీ ఆ భాషను మాట్లాడటం, రాయడం, చదవడం చేయగలరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement