rice pulling gang
-
నిధుల వేటలో.. మోసం లోతుల్లో!
రైస్ పుల్లింగ్.. పూడు పాములు.. అక్షయపాత్ర.. సంజీవని వేరు.. బంగారు నాణేలు.. పేర్లు వేరైనా మోసం ఒక్కటే. ఊరికే డబ్బు వస్తుందంటే చాలు.. నమ్మడం అలవాటైన వాళ్లు మోసగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును వాళ్ల చేతిలో పెట్టి తీరా మోసపోయాక లబోదిబోమంటున్నారు. ఇక గుప్త నిధుల కోసమని అమావాస్య రాత్రిళ్లు.. పౌర్ణమి వెలుగుల్లో అడవిని జల్లెడ పడుతున్నారు. చారిత్రక ఆలయాలు, ప్రాంతాలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీ కుండలు వెక్కిరిస్తున్నా అన్వేషణ మాత్రం కొనసాగుతోంది. గతేడాది పలమనేరు మండలం దేవలంపెంట పురాతన శివాలయం ఎదురుగా ఉన్న నంది విగ్రహంలో కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయంటూ దాన్ని హైదరాబాద్ ముఠా ధ్వంసం చేసింది. ఇది కేవలం మోసమేనని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు కారణమైన వారిని అరెస్టు చేశారు. ఏడాది క్రితం మండలంలోని దొడ్డిపల్లి అడవిలో ఓ ముఠా గుప్తనిధుల తవ్వకాలకు వెళుతూ వేటగాళ్ల కరెంటు ఉచ్చుకు చిక్కి ఇద్దరు గాయపడ్డారు తాజాగా నియోజకవర్గంలో బేలుపల్లి సమీపంలోని శాతపురాళ్ల ఆలయం వద్ద ఓ ముఠా తవ్వకాలు చేపట్టడం కలకలం రేపింది. .. ఇలాంటి ఘటనలు పోలీసుల దృష్టికి వెళితే కానీ విషయాలు వెలుగులోకి రాని పరిస్థితి. పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో తరచుగా తవ్వకాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పలమనేరు: జిల్లాలోని పడమటి మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా గుప్తనిధుల వేట సాగుతోంది. రాత్రివేళల్లో కొన్ని అంతర్ రాష్ట్ర ముఠాలు స్థానికులను ఏజెంట్లుగా నియమించుకొని తమ పని కానిచ్చేస్తున్నాయి. ముఖ్యంగా పురాతన, పాడుబడ్డ ఆలయాల్లో పూర్వీకులు బంగారాన్ని దాచి ఉంటారనే అనుమానంతో ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ కారణంగా ఇప్పటికే పురాతన ప్రాశస్త్యం ఉన్న పలు ఆలయాలు ధ్వంసమయ్యాయి. జిల్లాలోని పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలు ఇటు కర్ణాటక, అటు తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి ఎన్నో అడ్డదారులు ఉన్నాయి. ఎవరైనా, ఎప్పుడైనా సులభంగా వచ్చే వీలుంది. దీంతో గుప్త నిధుల వేటగాళ్లు ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గతంలోనూ నకిలీ బంగారు నాణేలు, రైస్‌పుల్లింగ్, పూడుపాములు, అక్షయపాత్ర, సంజీవిని వేరు లాంటి రకరకాల మోసాలు, ఘటనలు ఈ ప్రాంతంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. దుర్గం కొండపై ఉన్న ప్రాచీన ఆధారాలన్నింటినీ అక్రమార్కులు పెకళించారు. కృష్ణమ్మకొండపై సైతం దేవతా మూర్తులను పెకళించి నిధులకోసం అన్వేషించారు. కుప్పం ప్రాంతంలోని కర్ణాటక సరిహద్దు గ్రామాలు.. పుంగనూరు, సోమల, చౌడేపల్లె్ల, రామసముద్రంలో తవ్వకాలు షరామామూలుగా సాగుతున్నాయి. రాత్రి వేళల్లో గుట్టుగా.. ∙పలమనేరు మండలంలోని చెల్లెమ్మ చెరువులో పురాతన కాలంనాటి ఓ పుష్కరిణి గతంలో బయటపడింది. దీంతో బంగారు నాణేలున్నాయని పలువురు గతంలో తవ్వకాలు చేపట్టారు. ∙జగమర్ల అటవీప్రాంతంలో రంగురాళ్లు, వజ్రాల కోసం రాత్రి పూట కర్ణాటక వ్యక్తుల వేట కొనసాగుతోంది. ∙బైరెడ్డిపల్లె మండలంలోని బాపలనత్తం అడవిలో ఉండే పాండవ గుహల్లో ఇప్పటికే పలుమార్లు తవ్వకాలు చేశారు. అందులో ఏమీ దొరక్కపోయినా తవ్వకాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ∙ఇదే మండలంలోని అటవీప్రాంతంలో ధనబండ వద్ద ధనం ఉందని గతంలో తవ్వకాలు జరిగాయి. ∙వీకోట మండలంలోని దుర్గంకొండ, కృష్ణమ్మ కొండ, క్రిష్ణాపురం, మోట్లపల్లె, గోనుమాకులపల్లె, కోటనక్కనపల్లె గ్రామాల్లోని పాత ఆలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ∙మోట్లపల్లె వద్ద పంటపొలాల్లో బండల కింద గుప్త నిధులు ఉన్నాయని కర్ణాటకకు చెందిన ఓ ముఠా నాటు బాంబులతో ఆ బండలు పగులగొ ట్టింది. రాతి కింద బొగ్గులు ఉన్న కుండలు అక్కడ బయటపడడం గమనార్హం. అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లో అధికం బైరెడ్డిపల్లె మండలంలోని బాపలనత్తం సమీపంలో పాండవ గుహలున్నాయి. సుమారు పదెకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతంలో గతంలో పాండవులు నివసించారని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ ఓ ప్రత్యేకమైన చంద్రాకారంలో బండలతో నిర్మించిన గుడులున్నాయి. అయితే వీటి కింద నిధి నిక్షేపాలు ఉన్నాయని పలు ముఠాలు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేశాయి. ఈ ప్రాంతం అడవిలో ఉండడంతో స్థానికులు సైతం గుర్తించేందుకు వీలుకాని పరిస్థితి. ఈతంతు అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లోనే సాగుతోంది. కొన్ని ఆలయాల వద్ద బండలపై చెక్కిన లిపిని పరిశీలించి బంగారం ఉంటుందని కొందరు ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ముఠాల మాటలను నమ్మి ఈ ప్రాంతవాసులే కాకుండా చుట్టుపక్క రాష్ట్రాలకు చెందిన వారు సైతం లక్షలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని ఘటనలో మినహా చాలా వరకు పోలీసుల దృష్టికి కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. అమాయకంగా నమ్మకండి గుప్తనిధులు, రైస్‌పుల్లింగ్ లాంటి మో సాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. చాలా వరకు అరెస్టులు కూడా చేశాం. పత్రికల్లోనూ వెలుగులోకి వస్తున్నా అమాయకంగా నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ముఠాల కదలికలపై నిఘా ఉంచాం. ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులను ఆశ్రయిస్తే వారి ఆటకట్టిస్తాం. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు -
రైస్‌పుల్లింగ్: రాగిపాత్రకు రంగుపూసి..
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): రైస్‌పుల్లింగ్ ముఠా సభ్యులు 13 మందిని మదనపల్లె రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మూదు కార్లు, ద్విచక్ర వాహనం, రూ. 20 వేలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ దిలీప్‌కుమార్ కథనం మేరకు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఓ ముఠా రైస్‌పుల్లింగ్ పేరుతో మోసం చేస్తోందని సమాచారం అందింది. బుధవారం సాయంత్రం మదనపల్లె రూరల్ మండలంలో మదనపల్లె–పుంగనూరు మార్గంలోని బసినికొండ వై–జంక్షన్ వద్ద మూడు వాహనాల్లో వచ్చిన కొంతమంది రాగిపాత్రను పరిశీలిస్తున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లడాన్ని చూసి పరారయ్యేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. రాగిపాత్రకు రంగుపూసి టార్చిలైట్ వేస్తే కొంత సేపటికి లైటింగ్ ఆగిపోతుందని, తరువాత ఆ పాత్ర మహిమ కలిగిన రైస్ ఫుల్లింగ్(అక్షయపాత్ర)గా మారిపోతుందని నమ్మిస్తున్నారు. ఆ పాత్రను రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు విక్రయించేందుకు యత్నిస్తున్నారు. నిందితులను అరెస్టు చేశారు. మూడు కార్లు, ద్విచక్రవాహనం రూ.20,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో తిరుపతి ఎన్జీవో కాలనీకి చెందిన శాంతిలాల్(37), రామచంద్రాపురం మండలం చుట్టగుంట గ్రామానికి చెందిన జె.శ్రీనివాసులు(45), దుర్గసముద్రం ప్రాంతానికి చెందిన ఎన్.శివశంకరయ్య(48), మదనపల్లె రూరల్ మండలం బసినికొండకు చెందిన జి.శ్రీనివాసులు(35) వైఎస్ఆర్ జిల్లా చిప్పిడిరాళ్ల గ్రామానికి చెందిన కె.మధుసూదన్‌రెడ్డి(32), కర్ణాటకలోని ఎలహంకకు చెందిన కె.ఎం.మునీష్(27), చిక్బళ్లాపూర్కు చెందిన వి.నాగరాజు(25), అనంతపురం జిల్లా బండార్లపల్లెకు చెందిన న్యాయవాది డి.చెన్నారెడ్డి(55), తాడిపత్రిలోని సుంకులమ్మ కాలనీకి చెందిన పి.నాగరాజు(40), నంద్యాల రోడ్డు సీపీఐ కాలనీకి చెందిన పి.చంద్రహాస్(21), ఎర్రంకలవారిపల్లెకు చెందిన బి.ప్రేమానందరెడ్డి(42) తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా వెంకటాపూర్‌కు చెందిన డి.రాజేంద్రప్రసాద్(33), కూకుట్‌పల్లెలోని నీలాద్రీ టవర్స్‌కు చెందిన ఎస్.అశోక్‌రెడ్డి(42) ఉన్నారు. చదవండి: యువతి బ్లాక్మెయిల్: డబ్బులు పంపించు.. లేదంటే.. ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఊహించని షాకిచ్చిన భర్త -
వైద్యం ఓడింది మూడత్వం గెలిచింది!
-
రైస్ 'కిల్లింగ్'!
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: బియ్యాన్ని ఆకర్షించే మహిమ కలిగిన అద్భుత యంత్రం ఇంట్లో ఉంటే మహర్దశ పడుతుందనే మూఢ నమ్మకం నిండు కుటుంబాలను బలి తీసుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్ పెన్మెత్స రామకృష్ణంరాజు కుటుంబ ఆత్మహత్యకు రైస్ పుల్లర్ మోసమే కారణమని పోలీసులు నిర్ధారించారు. రైస్ పుల్లర్ పేరుతో రూ.5 కోట్లు కాజేసి వైద్యుడి కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన వరికూటి వెంకట వేణుధరప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు అమలాపురం పోలీసులు మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రసాద్ మరో ముగ్గురితో కలసి ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు రామకృష్ణంరాజు నుంచి రూ.5 కోట్లకుపైగా వసూలు చేశాడు. అప్పుల పాలైన రామకృష్ణంరాజు (55), భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు డాక్టర్ కృష్ణసందీప్ (25) నాలుగు రోజుల క్రితం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడటం తెలిసిందే. అతీత శక్తుల పేరుతో మోసాలు.. బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహాన్ని రైస్ పుల్లర్‌గా పరిగణిస్తారు. అత్యంత అరుదైన, ఖరీదైన ఇరీడియం లోహాన్ని కలిగి వుండే వీటిని చూపించి మోసగిస్తున్నారు. అతీత శక్తుల పేరుతో వీటిని విక్రయించడం భారతీయ శిక్షాస్మృతి 415, 420 ప్రకారం నేరం. తేలికగా డబ్బులు సంపాదించేందుకు కొందరు ముఠాలుగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో రేడియేషన్ ఆర్టికల్ అమ్మకాలతో మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి దివ్య శక్తులు ఉంటాయని, ఇది ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని నమ్మించి మోసగిస్తున్నారు. రాగి లోహంతో చేసిన గ్లాసులు, గిన్నెలు, బిందెలు, మూతలు, విగ్రహాలు, నగలు, పాతకాలం నాణేలు లాంటివి రైస్ పుల్లర్ పరికరాలుగా చలామణి అవుతున్నాయి. నల్ల పసుపు, ఎర్ర ఉల్లిపాయ, ఎర్ర కలబంద లాంటి మొక్కల్లో కూడా రైస్ పుల్లర్ లక్షణాలున్నాయని నమ్మబలుకుతున్న ముఠాలు కూడా ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్న ఏడుగురితో కూడిన ముఠాను ఈ ఏడాది జూలైలో మచిలీపట్నం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసగిస్తున్న ముఠాను ఇటీవల తిరువనంతపురంలో అరెస్టు చేశారు. రైస్ పుల్లింగ్ అంటే...? రైస్ అంటే బియ్యం... పుల్లింగ్ అంటే లాక్కోవడం. సాధారణంగా ఓ వస్తువుకు కొద్ది గంటలపాటు అయస్కాంతాన్ని రాపిడి చేస్తే కొద్దిసేపు ఆకర్షణ గుణాన్ని పొందుతుంది. రైస్ పుల్లింగ్‌లో దీన్ని అద్భుత శక్తిగా నమ్మిస్తారు. పురాతన లోహ విగ్రహాలు, పాత్రలు, నాణేలను రైస్ పుల్లింగ్ ముఠా తమ మోసాలకు ముడి సరుకుగా వాడుతుంది. వీటికి అయస్కాంతాన్ని రుద్దడం ద్వారా బియ్యపు గింజలను ఆకర్షించి ప్రజలను మోసగిస్తున్నారు. పురాతన వస్తువుల పేరుతో రూ.కోట్లు కాజేస్తున్నారు. -
డాక్టర్ కుటుంబం ఆత్మహత్యకు ఈ ముఠానే కారణం!
సాక్షి, అమలాపురం(తూర్పు గోదావరి) : అమలాపురంలో డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్యహత్య చేసుకున్న ఘటనలో లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చేస్తున్న దర్యాప్తులో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ కేంద్రంగా నలుగురు వ్యక్తులతో కూడిన ఈ ముఠా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని ఈ రైసు పుల్లింగ్ ఊబిలోకి లాగి రూ.కోట్లు కాజేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలో సభ్యుడైన కృష్ణా జిల్లా కోడూరు గ్రామానికి చెందిన వరికూటి వెంకటవేణుధర ప్రసాద్‌ను అమలాపురం పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రోజే అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా ఆదేశాలతో నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ముఠా సభ్యుడైన వేణుధర ప్రసాద్‌ను అమలాపురం బస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పట్టణ సీఐ బి.సురేష్‌బాబు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ ముఠా సూత్ర, పాత్రధారి అయిన హైదరాబాద్‌కు చెందిన షావలిన్, ముఠాలోని మిగిలిన సభ్యులు అనంతరామ్, శ్రీనివాసరావులను అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ బాషా తెలిపారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్రంలో తమ పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని చెప్పారు. మన రాష్ట్రంలోనూ వీరి కోసం పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. డాక్టర్ కుటుంబం నుంచి రూ.ఐదు కోట్లు గుంజుకున్న ముఠా ముఠా సభ్యుడైన వెంకట వేణుధర ప్రసాద్‌ను అరెస్ట్ అనంతరం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ బాషా మంగళవారం ఉదయం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అమలాపురం పట్టణ, రూరల్, ముమ్మిడివరం సీఐలు బి.సురేష్‌బాబు, ఆర్.భీమరాజు, రాజశేఖర్‌లతో కలిసి ముఠా వివరాలను వెల్లడించారు. ఏడాది నుంచి డాక్టర్ రామకృష్ణంరాజు ఈ ముఠా మాయమాటల్లో పడినట్టు చెప్పారు. తొలుత వేణుధరప్రసాద్ డాక్టర్‌కు పరిచయమై రైస్ పుల్లింగ్ ఆశ పుట్టించాడు. తర్వాత డాక్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రధాన నిందితుడు షావలిన్‌కు పరిచయం చేశాడు. దైవాంశ సంభూతమైన పురాతన విగ్రహాలు, నాణేలు, పాత్రల గురించి డాక్టర్‌కు వివరించి వాటి వల్ల రుణ విముక్తి కావడమే కాకుండా అష్టైశ్వర్యాలు ఎలా ప్రాప్తిస్తాయో తన ముఠాలోని సభ్యులతో ఆయనకు చెప్పించి నమ్మించాడు. రైస్‌పుల్లింగ్‌లో ఇవ్వబోయే పురాతన వస్తువు విలువ రూ.కోట్లలో ఉంటుందని మానసికంగా సిద్ధం చేశారు. మీ కోసం రైస్ పుల్లింగ్ వస్తువు తయారవుతోందని డాక్టర్ కుటుంబం నుంచి ముఠా దఫదఫాలుగా నగదు రూపంలో, బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకుంది. ఇందు కోసం డాక్టర్ అధిక మొత్తాలను అధిక వడ్డీలకు అప్పు చేసి రూ.ఐదు కోట్లు ముఠాకు అతికష్టంగా సరిపెట్టారు. చివరకు ఈ ముఠా చేసిన మోసాలకు బలి అయ్యానని డాక్టర్ కుటుంబం గ్రహించి ఇటీవల హైదరాబాద్ వెళ్లి రెండు వారాలు ఉండి పొగొట్టుకున్న రూ.ఐదు కోట్లను ఏలాగైనా రాబట్టుకోవాలని విశ్వప్రయత్నం చేసి విఫలమైంది. ఇంతటి ఘోరమైన మోసానికి గురైన డాక్టర్ కుటుంబం చివరకు తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్యకు ఒడిగట్టిందని డీఎస్పీ బాషా తెలిపారు. డాక్టర్ పెద్ద కుమారుడు, మృతుడు డాక్టర్ కృష్ణ సందీప్ సూసైడ్ నోట్, డాక్టర్ చిన్న కుమారుడు కృష్ణ వంశీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ ఆదేశాల మేరకు రైస్ పుల్లింగ్ మోసాలు, ముఠాపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వివరించారు. -
రైస్ పుల్లింగ్ మిషన్ పేరిట ఘరానా మోసం
గచ్చిబౌలి: రైస్ పుల్లింగ్ యంత్రం ద్వారా రూ. వంద కోట్లు సొంతం చేసుకోవచ్చని ఆశ చూపి ఘరానా మోసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వర్ రావు తెలిపారు. బుధవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ముంబైలోని బాంద్రాకు చెందిన స్టీల్ వ్యాపారిజితేష్ శాంతిలాల్ సోలంకి, అదే ప్రాంతానికి చెందిన సమీర్ రాయ్‌లు స్నేహితులు. బంద్రాలో ఉండే కోల్‌కతాకు చెందిన మరో స్నేహితుడు రాజ్‌ఖాన్ తన వద్ద రైస్ పుల్లింగ్ మిషన్ ఉందని జితేష్‌కు చెబుతుండే వాడు. జమీర్ రాయ్ తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షల కోసం జితేష్‌ను కలువగా రైస్ పుల్లింగ్ యంత్రం చేతికి వస్తుందని ఇప్పటికే రూ. 30 లక్షలు వచ్చాయని, ఇంకా రూ. 300 కోట్లు త్వరలోనే వస్తాయని, త్వరలోనే నీ అప్పు తీర్చతానని చెప్పాడు. తన స్నేహితుడైన రాజ్‌ఖాన్ వద్ద ఉన్న రైస్ పుల్లింగ్ యంత్రం ఉందని అమ్మి పెట్టాలని సూచించాడు. బెంగళూర్‌లో స్నేహితుడి ద్వారా పరిచయం అయిన విశాఖపట్టణం, కళింగనగర్‌కు చెందిన సింగంపల్లి వాసు అలియాస్ దేవా(35) సైంటిస్టు అని అది నిజమైన రైస్‌పుల్లింగ్ యంత్రం అవునో కాదో అతను చెప్పగలడని జితెందర్ను నమ్మించాడు. ఈ క్రమంలోనే గత జనవరి 16న గోవాలోని వివెంట హోటల్లో దేవా, జితేష్, సమీర్ రాయ్, రాజ్‌ఖాన్‌లు కలిశారు. విలుఐన వెండి డ్రెస్సులో ఆర్ అండ్ డీలో రైస్‌పుల్లింగ్ యంత్రం టెస్ట్ చేసేందుకు రూ. 3.26 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పాడు. దేవా రూ. 1.63 కోట్లు, రాజ్‌ఖాన్ రూ. 1.10 కోట్లు, జితేష్ రూ. 52 లక్షలు పెట్టుబడిగా పెట్టేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో ఈ నెల 6న గచ్చిబౌలిలోని ఆదిత్య ఇన్‌లో నలుగురు కలిశారు. స్టీల్ వ్యాపారి అయిన జితేష్ రూ.32 లక్షలు దేవాకు ఇచ్చాడు. కొద్ది రోజుల్లోనే మిషన్ తీసుకొస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లారు. మిషన్ తీసుకొస్తే మిగిలిన డబ్బు ఇస్తానని రాజ్‌పై ఒత్తిడి తేవడంతో అతను చెప్పే సమాదానంపై అనుమానం కల్గింది. దీంతో జితేష్ ఈ నెల 6న గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిగిలిన బ్యాలెన్స్ ఇస్తానని జితేష్ ద్వారా రప్పించి నిందితుడు దేవాను అరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి రూ. 18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌ఖాన్, సమీర్ శర్మలను అరెస్ట్ చేయాల్సి ఉందని డీసీపీ పేర్కొన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, గచ్చిబౌలిసీఐ శ్రీనివాస్, డీఐ సత్యనారాయణ తదితరులున్నారు. మిషన్ లేకుండానే మోసం రాజ్‌ఖాన్ తన వద్ద రైస్ పుల్లింగ్ యంత్రం ఉందని చెప్పడం, సమీర్ రైస్ పుల్లింగ్ యంత్రం వస్తుందని అది వస్తే ఇరిడీయం ద్వారా రూ. 300 కోట్లు ఆర్జించ వచ్చని జితేష్‌ను ముగ్గులోకి దింపారు. స్నేహితుడు సమీర్ రాయ్ రైస్ పుల్లింగ్ మిషన్ విక్రయిస్తే వందల కోట్లు వస్తాయని చెప్పక ముందే రాజ్ ఖాన్ తన వద్ద రైస్ పుల్లింగ్ యంత్రం ఉందని పథకం ప్రకారం మోసానికి పాల్పడ్డారు. దేవాను కలిసిన తరువాత యూ ట్యూబ్‌లో రైస్ పుల్లింగ్ మిషన్, వెండి డ్రెస్‌తో ఆర్ అండ్ డీలో పరీక్షలు చేస్తారని చూపించి మోసానికి పాల్పడ్డారు. ముగ్గురు కలిసి వ్యూహం పన్ని జతీష్ నుంచి అందిన కాడికి దండుకోవాలని భావించారు. ప్రధాన నిందితుడు కటాకటాల పాలవడంతో వ్యూహం బెడిసికొట్టినట్లైంది. -
గుంటూరు జిల్లాలో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ అరెస్ట్
-
సిగరేట్ రేపర్‌పై చీటీ రాసి.. ముఠా చెర నుంచి..
సాక్షి, తాడేపల్లిగూడెం రూరల్ : గుర్తు తెలియని వ్యక్తులు 70 రోజులుగా తనను భవనంలో బందీగా ఉంచారని.. ఇక్కడి నుంచి విముక్తుడిని చేయాలని ఓ వృద్ధుడు సిగరెట్ పాకెట్ రేపర్‌పై రాసి ఆటో డ్రైవర్‌కు అందించిన లేఖ తాడేపల్లిగూడెంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ శివారులోని ఒక భవనాన్ని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆగస్టులో అద్దెకు తీసుకున్నారు. భవనం మొదటి అంతస్తులో ఒక వృద్ధుడిని బంధించి కాపలా ఏర్పాటు చేశారు. జనసంచారం లేని సమయంలో భవనంలో తవ్వకాలు చేపడుతున్నారు. స్పీకర్ కోడెల తాలూకా అంటూ.. భవనంలో ఉంటున్న వారిపై స్థానికులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారు. తాము పోలవరం ప్రాజెక్టు వర్కర్లమని.. పంగిడి, ఆరుగొలనులోని క్వారీల్లో కాంట్రాక్ట్‌లు చేస్తుంటామని.. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తాలూకా అంటూ సమాధానాలు చెప్పారు. తీరా వారిని గుర్తింపు కార్డులు ఇవ్వాలంటూ స్థానికులు నిలదీయడంతో తీసుకొస్తామంటూ వారు అక్కడ నుంచి ఉడాయించారు. వీరు మొత్తం 12 నుంచి 15 మంది వరకు ఉన్నారు. వారు వేసుకువచ్చిన స్విఫ్ట్ డిజైర్‌కు కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబరు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. వృద్ధుడి సందేశంతో బయల్పడిన ఉదంతం భవనంలో బందీగా ఉన్న వృద్ధుడు శుక్రవారం ఉదయం సిగరెట్ పెట్టెలోని రేపర్‌పై ‘సార్, మాది నరసరావుపేట. నా పేరు వెంకటేశ్వర్లు. ఈ ఇంట్లో ఉండే వాళ్లు నన్ను 70 రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. మీ కాళ్లు పట్టుకుంటాను. దయచేసి ఈ విషయం జిల్లా ఎస్పీకి చెప్పి నా ప్రాణాలు కాపాడండి. ఈ విషయం బయట చెప్పొద్దు. వీరికి తెలిస్తే నన్ను చంపుతారు ప్లీజ్’అని రాసి, రిమోట్ బ్యాటరీకి ఆ కాగితాన్ని చుట్టి రోడ్డుపై వెళ్తున్న ఆటోడ్రైవర్ పైకి విసిరాడు. దీంతో ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావుకు తెలియడంతో ఆయన సూచనతో శుక్రవారం రాత్రి 11 గంటలకు పోలీసులు ఆ భవనం వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ బందీగా ఉన్న వృద్ధునితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి ఫిర్యాదు అందలేదు హౌసింగ్ బోర్డు శివారులోని భవంతిలో చోటుచేసుకున్న పరిణామాలపై మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. –ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి, తాడేపల్లిగూడెం పట్టణ సీఐ -
రైస్ పుల్లింగ్ ముఠా అరెస్టు
గుంటూరు, తెనాలి రూరల్: పురాతన ఆలయాల గాలి గోపురాలపై కలశాలను అపహరించేందుకు పథకాలు రచిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కలశాలకు రసాయనిక చర్య వల్ల బియ్యాన్ని లాగే శక్తి వస్తుందని అమాయకుల్ని నమ్మిస్తూ కోట్లాది రూపాయిలకు అమ్ముతుంటారు. ఇటీవల చుండూరు మండలం చినపరిమిలోని గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థాన గాలి గోపురంపై కలశాలను అపహరించేందుకు ప్రయత్నించిన బృందంలోని సభ్యుడు మృతి చెందడంతో వీరి గుట్టుంతా బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మిగిలిన సభ్యులను అరెస్ట్ చేశారు. తెనాలి టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఎం.స్నేహిత వివరాలు వెల్లడించారు. పట్టణంలోని జయప్రకాష్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మీసాల ఫణీంద్ర, చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన ఓ యువకుడు, యడ్ల లింగయ్య కాలనీకి చెందిన మరో ముగ్గురు యువకులకు నంద్యాలకు చెందిన ఐదుగురు, గతంలో నంద్యాలలో నివసించి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న మరో వ్యక్తి పరిచయమయ్యారు. పురాతన ఆలయాలపై ఉండే కలశాలకు రైస్ పుల్లింగ్ శక్తి వచ్చిందో లేదో పరీక్షించి, శక్తి వచ్చి ఉంటే, కలశాలను అపహరించి అమ్ముకుంటే కోట్లాది రూపాయిలు సొమ్ము చేసుకోవచ్చని పథకం పన్నారు. ఇందు కోసం చినపరిమిలోని శివాలయ గాలి గోపురం పైన కలశాలను పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 15న ఆలయం వద్దకు వచ్చారు. గాలి గోపురం ఎత్తుగా ఉండడంతో ఎక్కేందుకు ఎవరూ సాహసించలేదు. మరుసటి రోజు అర్ధరాత్రి దాటాక వచ్చి, ఫణీంద్రను ఎక్కించారు. చిన్న కర్రకు బియ్యం మూట కట్టుకుని పైకి ఎక్కిన అతను ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తెనాలి–గుంటూరు లైనులో పట్టాలపై తెనాలి రైల్వే నార్త్ క్యాబిన్ సమీపంలో పడేశారు. ఫణీంద్ర ఆటోను ఎక్కడయితే పెడతాడో అక్కడే వదిలేసి వెళ్లారు. పట్టాలపై మృతదేహాన్ని గమనించిన తెనాలి–దొనకొండ పాసింజరు రైలు డ్రైవరు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని తెచ్చి పట్టాలపై పడేశారని తేలడం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదై ఉండడంతో టూ టౌన్ పోలీసులకు బదిలీ చేశారు. కేసును డీఎస్పీ స్వయంగా దర్యాప్తు చేయగా రైస్ పుల్లింగ్ వ్యవహారం బయటపడింది. ముఠా సభ్యుల కోసం తీవ్రంగా గాలించగా తెనాలి, నంద్యాల, హైదరాబాద్, శావల్యాపురానికి 10 మంది (మృతుడు ఫణీంద్రతో కలిపి 11 మంది) నిందితులుగా తేలినట్టు డీఎస్పీ వివరించారు. చినపరిమి శివాలయంలో మరలా కలశాన్ని అపహరించాలని ప్రయత్నిస్తుండగా అంగలకుదురు కొత్త కాల్వ వంతెన సమీపంలో వీరిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని, యడ్లలింగయ్య కాలనీకి చెందిన నిందితుడొకరు పరారీలో ఉన్నట్టు ఆమె తెలిపారు. వారి నుంచి ఆరు సెల్ఫోన్లు, కలశాలను పరీక్షించేందుకు వినియోగించిన బియ్యం, ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. టూ టౌన్ సీఐ బి. కల్యాణ్‌రాజు, ఎస్ఐ పి. సురేష్, క్రైం సిబ్బంది సీహెచ్.వి.శివయ్య, ఎం. కార్తీక్ దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. రైస్ పుల్లింగ్ శక్తి వస్తుందన్నది అపోహమాత్రమేనని, వీరంతా కోట్లాది రూపాయలు వస్తాయని చెప్పి మోసాలకు పాల్పడుతుంటారని డీఎస్పీ స్నేహిత తెలిపారు. -
పారని ‘చెంబు’ ప్లాన్
సాక్షి, సిటీబ్యూరో: ఓ ప్లాస్టిక్ టేబుల్... దాని కింద మైక్రోవేవ్ ఓవెన్... ఇది కనిపించకుండా వస్త్రాలతో సెట్టింగ్... బల్ల పైన ‘అతీంద్రియశక్తులున్న చెంబు’... దాని వైపు టార్చ్ లైట్ ఫోకస్ చేస్తే చాలా టప్పున మాడిపోయే బల్బు... ఇలాంటి సెటప్ ఏర్పాటు చేసిన ఓ ముఠా భారీ స్థాయిలో టోకరాలు వేయాలని ప్రయత్నించింది. అయితే ఓ నగరవాసి నుంచి రూ.20 వేలు స్వాహా చేయడంతోనే విషయం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ చేసింది. ఫలితంగా గ్యాంగ్‌కు చెందిన నలుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. నగరంలోని కొంపల్లి ప్రాంతానికి చెందిన సురేష్ యాదవ్ గత 20 ఏళ్లుగా వాల్ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడికి మహేష్ (రెంటల్ ఏజెంట్), ఎస్ఎస్ హుస్సేన్ (రియల్ ఎస్టేట్ వ్యాపారి), విశ్వనాథ్‌లతో (రియల్టర్) పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల క్రితం సురేష్ రైస్ పుల్లింగ్ వస్తువులు పేరుతో బిందెలు, చెంబుల క్రయవిక్రయాలు చేస్తూ కొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్న విషయం గుర్తించాడు. తానూ అదే పం«థాలో టోకరాలు వేయాలని నిర్ణయించుకున్న సురేష్ మిగిలిన ముగ్గురికీ విషయం చెప్పాడు. వారూ అంగీకరించడంతో ముఠా కట్టిన ఇతగాడు ఓ వినూత్న ఆలోచన చేశాడు. ప్లాస్టిక్ టేబుల్ కింది భాగంలో మైక్రోవేవ్ ఓవెన్ ఏర్పాటు చేసి, అది కనిపించకుండా వస్త్రాలు కప్పి దాని వేడి టేబుల్‌కు ప్రసారమయ్యేలా సెట్ చేశాడు. ఈ టేబుల్ పైన కొన్ని చెంబులు ఉంచి వాటికి అతీంద్రియశక్తులు ఉన్నాయని, రైస్ పుల్లర్స్ అయిన వీటిని తమ దగ్గర ఉంచుకుంటే ఎన్నో శక్తులు వస్తాయంటూ ప్రచారం చేశారు. ఈ రైస్ పుల్లర్ చెంబులకు ఉన్న శక్తుల నేపథ్యంలో వాటిపై టార్చ్ లైట్ వేస్తే వెంటనే లైట్‌లోని బల్బు మాడిపోతుందంటూ అనేక మందిని నమ్మించాడు. దీనిని ప్రాక్టికల్‌గా చూపించేందుకు అదే టేబుల్‌పై టార్చ్ లైట్ ఉంచేవాడు. టేబుల్ నుంచి ఈ లైట్, అందులోని బ్యాటరీలు వేడిని సంగ్రహించేవి. ఇలా వేడెక్కిన టార్చ్‌ను ఆన్ చేసిన వెంటనే దాని బల్బు మాడిపోతుంది. ఆన్ చేసే ముందు వెలుగు చెంబుపై పడేలా చేసే ముఠా దానికి ఉన్న శక్తి కారణంగానే బల్బు మాడిందంటూ నమ్మించేది. ఈ డెమోను అనేక మందికి చూపిన ఈ నలుగురూ సదరు రైస్ పుల్లింగ్ చెంబు ఖరీదు అంతర్జాతీయ మార్కెట్లో రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటుందంటూ ప్రచారం చేశారు. వీటిని విక్రయిస్తామంటూ అడ్వాన్సులు తీసుకోవడం ప్రారంభించారు. భారీ మొత్తం కాజేయాలని స్కెచ్ చేసినప్పటికీ... సక్సెస్ కాలేదు. మహ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తి నుంచి రూ.20 వేలు కాజేశారు. ఈలోగా విషయం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌కు తెలియడంతో ఇన్స్పెక్టర్ గట్టుమల్లు నేతృత్వంలో రంగంలోకి దిగిన ఎస్సైలు ప్రభాకర్‌రెడ్డి, మల్లికార్జున్, వి.కిషోర్, ఎల్.భాస్కర్‌రెడ్డి వలపన్ని బుధవారం నలుగురినీ అరెస్టు చేశారు. వీరి నుంచి చెంబులతో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుని కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. -
మాయచేస్తారు... నిండా ముంచేస్తారు...
సీసా దగ్గరుంటే అదృష్టం వరిస్తుందట.. రాగి చెంబు ఇంట్లో పెట్టుకుంటే సిరులు నట్టింట్లో నాట్యం చేస్తాయట.. కాయిన్లు ఇస్తే లక్ష రూపాయలు మీవేనట.. అబ్బో ఇలా ఒకటేమిటి నమ్మాలేగానీ పచ్చగడ్డిని, బండ రాయిని కూడా అద్భత మూలికనో... అరుదైన శిల అనో... అంటగట్టేస్తారు. ప్రజల అమాయకత్వాన్ని... మూఢనమ్మకాన్ని... సొమ్ము చేసుకునే జనం ఎక్కువయ్యారు. నిరక్షరాస్యులే గాదు... అక్షరాస్యులు సైతం వీటిని గుర్తించలేక మోసగాళ్ల వలలో పడి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. రూ.కోట్లు, రూ.లక్షల్లో సొమ్ములు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. మోసగాళ్లను పట్టుకుందామని ప్రయత్నిస్తే పోలీసులనైనా ఎదిరిస్తున్నారు మరి. సాక్షిప్రతినిధి, విజయనగరం: రామభద్రపురం కేంద్రంగా మహిమ గల రాగి చెంబు ఉందని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బురిడీ కొట్టించి ఏకంగా రూ.1.13కోట్లు కొట్టేసిన వైనం జిల్లా వాసులను అవాక్కయ్యేలా చేసింది. ఆరు నెలల పాటు బొబ్బిలి, కొమరాడ, విశాఖపట్నంకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఇలా మహిమ గల మర చెంబు అంటూ జనాన్ని మాయ చేశారు. చివరికి బాధితుడి ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయారు. అల్లా ఉద్దీన్ అద్భుత దీపం లాంటి పురాతన సీసా మీ వద్ద ఉంటే మీరిక అదృష్టవంతులేనని నమ్మబలికే ముఠా పార్వతీపురం ఏజెన్సీలో తిరుగుతోంది. ఈ సీసాను రూ.లక్ష చెల్లించి జనం కొనుగోలు చేస్తున్నారు. పురాతన సీసాలు, మహిమ గల సీసాలు అంటూ కొన్ని ముఠాలు గ్రామాల్లో తిరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం ఇలాంటి వారిని పట్టుకుని కేసు నమోదు చేశారు. దేవుడి పేరుతో...: సీతారామ లక్ష్మణులు, ఆం జనేయ స్వామి బొమ్మలుండే పాత రూపాయి వెండి, రాగి నాణేలు దొరికితే రూ.లక్ష చెల్లిస్తామని నమ్మబలుకుతున్న కొన్ని ముఠాలు జిల్లాలో తిరుగుతున్నాయి. పార్వతీపురం, బొబ్బిలి, సా లూరు, ఎస్ కోట, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాల్లో ఈ తరహా ప్రచారాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పాత నాణెం వేటకు సంబంధిం చి జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముందుగా రూ.20 వేలిస్తామని, అనంతరం రూ.50 వేలనీ, ఆ తరువాత రూ.లక్ష ఇస్తామని ప్రచారం జోరుగా సాగిస్తారు. కొంద రు అమాయకులు రూ. లక్ష అంటున్నారు కదా నని ఎంతో కొంత లాభం వస్తుందని ఇతరుల వద్ద రూ.50వేల వరకూ కొనుగోలు చేసి అమ్మకానికి ప్రయత్నిస్తే కొంటామన్న వారు కనిపించట్లేదు. ఈ రకంగా అమాయకులు కొనుగోలు చేసిన ఆ నాణేలను కూడా ముఠా సభ్యులే ఏర్పా టు చేసి సొమ్ము ముట్టాక పరారవుతున్నారు. కొన్నేళ్ల కిందట కురుపాంలోని పురాతనమైన నీల కంఠేశ్వర స్వామి విగ్రహం చోరీఅయింది. మహిమ గల నాణేల కోసం కలియ తిరుగుతున్న వ్యక్తులే దీనిని అపహరించారని భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినా నేటికీ విగ్రహం లభ్యం కాలేదు. రైస్ పుల్లింగ్ బ్యాచ్: బ్రిటిష్ కాలం నాటి రైస్ పుల్లింగ్ కాయిన్ చాలా మంచిదని, ఆ కాయిన్ మన వద్ద ఉంటే ధనం నట్టింట తాండవిస్తుందని నమ్మబలికే ముఠా పోలీసులకు పట్టుబడ్డారు. 1847లో ముద్రించిన కాయిన్‌కు ఇరీడియం అనే మెటల్ ఉంటే బియ్యాన్ని ఆకర్షిస్తుంది. ఈ తర హా నాణేన్ని తీసుకువచ్చి వారి ఎదురుగా బి య్యాన్ని ఉంచితే ఆ నాణెం ఆకర్షించడంతో పలు వురు నమ్మి పెద్ద ఎత్తున నమ్మకం కలిగి లక్షలు పోసి కొనుగోలు చేసేవారు. ఆ నేరం చేసి పట్టుబడ్డ 52 మంది మీద బైండోవర్ కేసులను నమో దు చేశారు. గతేడాది మేలో రైస్‌పుల్లింగ్ కేసులో విశాఖకు చెందిన ఓ రైల్వే ఉద్యోగి సస్పెండయ్యా రు. అలాగే సాలూరుకు చెందిన ఇద్దరు, గుమ్మలక్ష్మీపురానికి చెందిన మరో ఇద్దరు అరెస్టయ్యారు. పార్వతీపురం, కురుపాంలో పాత నాణేల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సైనే నెట్టివేసిన ముఠా: పార్వతీపురం వెంకంపేట గోరీల వద్ద సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా ఓ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా పాత నాణేల ముఠా సభ్యుడు దొరికాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్సై రాజేష్ ఆరు నెలల క్రితం మరో నిందితుడి కోసం బొండపల్లి వెళ్లగా నిందితులు బొలేరో వాహనంలో పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకోవడానికి వెళ్లిన ఎస్సైను నిందితులు నెట్టేయడంతో ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యేక టీమ్ వేశాం: మహిమగల చెంబులు, కాయిన్లు, సీసాలు అంటూ ప్రజలను మోసం చేసే ముఠాలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. ఆ ముఠా సభ్యులను పట్టుకోవడానికి ఆరుగురు పోలీసులతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశాం. స్థానికులతో పాటు ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ముఠా సభ్యుల్లో విద్యాధికులు కూడా ఉంటున్నారు. రామభద్రపురం రాగిచెంబు గ్యాంగ్‌లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా ఉన్నాడు. ఇలాంటి వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ తరహా నేరాలపైనా అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. – ఎమ్.దీపికా పాటిల్, ఏఎస్పీ, పార్వతీపురం -
రైస్ పుల్లర్ పేరుతో టోకరా
కొందుర్గు: సంపాదనకు ఓ రాజ మార్గం ఉందని, రూ.10 లక్షల పెట్టుబడి పెడితే వారం రోజుల్లో కోటి రూపాయలు సంపాదించవచ్చని కొందరు వ్యక్తుల మాయమాటలు నమ్మి ఇద్దరు రైతులు అప్పుల పాలై ఉన్న భూమినీ తాకట్టు పెట్టిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే సరైన దిగుబడులు రాక అప్పుల పాలయ్యారు. వీరి పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు రూ.10 లక్షలు ఖర్చు పెడితే వారం రోజుల్లో కోటి రూపాయలు సంపాదించవచ్చని మాయమాటలు చెప్పి నమ్మించారు. రైస్ పుల్లర్ ఖనిజం పేరు చెప్పి.. భూమిలో రైస్ పుల్లర్ అనే ఖనిజం ఉంటుందని, ఇది కనిపెడితే కోట్లు సంపాదించవచ్చని షాద్‌నగర్‌కు చెందిన కొందరు వ్యక్తులు నమ్మించారు. దీనిని కనిపెట్టడానికి ఓ మిషన్ ఉంటుందని, దాని విలువ రూ. కోటి అని చెప్పారు. దీనిని కొన్నవారిలో వరంగల్, హైదరాబాద్‌లో మంత్రులు, ఐఏఎస్ అధికారుల వంటి ప్రముఖులు ఉన్నారని, షాద్‌నగర్‌లోనూ ప్రముఖ వ్యాపారులు ఇందులో పెట్టుబడులు పెట్టి ఇలాంటి మిషన్లు కొనుగోలు చేసి కోట్లు సంపాదించారని చెప్పారు. ప్రస్తుతం నూతన మిషన్ కోసం ఇప్పటికే సగానికి పైగా డబ్బులు జమచేయడం జరిగిందని, పెట్టుబడి ప్రకారం సంపాదనలోనూ వాటాలు పంచుకోవాల్సి ఉంటుదని వీరిని నమ్మించారు. మిగతా సగం పెట్టుబడి పెడితే మిషన్ కొనుగోలు చేసి కోట్లు సంపాదించవచ్చన్నారు. ఇందుకు ఆశపడిన వెంకటేశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి కలిసి తమ భూములను తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారు. వారం రోజుల్లో తిరిగి ఇస్తామని, వడ్డీ కూడా ఎక్కువగానే ఇస్తామని చెప్పి అప్పులు చేశారు. హసీప్ ఖాతాలో జమ.. అప్పులు చేసిన మొత్తన్ని వరంగల్‌కు చెందిన హసీప్ ఖాతాలో జమచేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం డబ్బులు జమచేసినా పైసా సంపాదన లేక.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఈ రైతులకు అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా మిషన్ కొనుగోలుకు పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. కాగా అప్పుల విషయంలో గొడవలు వచ్చి వెంకటేశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి పంచాయతి ఏసీపీ వద్దకు చేరుకుంది. -
కస్టమర్లు ప్రాక్టికల్స్ కోరుకుంటారు..
సాక్షి, సిటీబ్యూరో: అదో సాధారణ బిందె... దాన్నే అతీంద్రియశక్తులున్న రైస్‌పుల్లర్‌గా మోసగాళ్లు చెప్తుంటారు... వీళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కొందరు ‘కస్టమర్లు’ మాత్రం ‘ప్రాక్టికల్స్’ కోరుకుంటారు... తమ ముందే ఆ బిందె బియ్యాన్ని ఆకర్షించాలని, అప్పుడే ఖరీదు చేస్తామని షరతులు పెడతారు... ఇలాంటి వారిని బుట్టలో వేసుకునేందుకు మోసగాళ్ళు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారు... ఈ చీటర్స్ సాధారణ బిందెను ‘రైస్‌పుల్లర్’గా మార్చడానికి ‘కుకింగ్’ చేస్తుంటారు... నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ఘరానా గ్యాంగ్ విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అసలు కారణం ఇనుప రజను... రైస్‌పుల్లింగ్ బియ్యాన్ని ఆకర్షించడం అని అర్థం. ఇలాంటి శక్తులున్న పాత్రలు, బిందెలు, చెంబుల పేరు చెప్పి మోసగాళ్ళు అందినకాడికి దండుకుంటుంటారు. సాధారణంగా వీళ్ళు కస్టమర్లకు రైస్‌పుల్లింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మాత్రమే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో తాము విక్రయిస్తున్న ‘విలువైన పాత్రనూ’ చూసే అవకాశం ఖరీదు చేసుకునే వారికి ఇవ్వరు. అయితే ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమల్ని ప్రత్యక్షంగా చూపించమని కోరవచ్చనని ముందే గ్రహించే ఇలాంటి ముఠాలు తమదైన శైలితో అన్నం వండి సిద్ధంగా ఉంచుకుంటారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా ఉండేలా అన్నం వండుతారు. దీన్ని ఎంట బెట్టడం ద్వారా మళ్ళీ బియ్యం మాదిరిగా కనిపించేలా చేస్తారు. ఇలా తయారైన ‘సెకండ్ హ్యాండ్ బియ్యం’లో ఇనుప రజను కూడా ఉంటుంది. మోసగాళ్ళు రైస్‌పుల్లర్‌గా చెప్తున్న పాత్రలో అంతర్భాగంగా అయిస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో తయారైన ‘బియ్యం’ వస్తే అవి దానికి అతుక్కుంటాయి. ఇలాంటి షోలు చూపించే ఈ మోసగాళ్ళు జనాలను బుట్టలో వేసుకుంటుంటారు. బాధితుడిగా మారి అధ్యయనం కోసం... సాధారణంగా ఇలాంటి ముఠాలకు చెందిన వారిలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారే అని పోలీసులు చెప్తున్నారు. తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి అదే మార్గంలో సంపాదించాలనో, అసలు ఈ రైస్‌పుల్లర్లు ఉన్నాయా? లేవా? అనే అధ్యయనం కోసమో అలాంటి ముఠాలతో జత కడుతున్నారు. ఒకసారి తేలిగ్గా డబ్బు వచ్చిపడిన తర్వాత అదే దందా కొనసాగించేస్తున్నారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన నలుగురిలో మహ్మద్ ఫజలుద్దీన్ అలియాస్ ఫైజల్ ఒకరు. జీడిమెట్లలోని ప్రకాశం పంతులు నగర్‌కు చెందిన ఈ సివిల్ కాంట్రాక్టర్ నాలుగేళ్ళ క్రితం ఇలాంటి ముఠా చేతిలోనే పడి రూ.లక్షల్లో మోసపోయాడు. దీంతో రైస్‌పుల్లర్స్ కోసం అధ్యయనం ప్రారంభించి ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సంచరించాడు. ఈ నేపథ్యంలోనే ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వి.ఆంజనేయులుతో పరిచయమైంది. మాటకారి అయిన అతడితోనే జట్టుకట్టి రైస్ పుల్లింగ్ మోసాలు మొదలుపెట్టాడు. రాహుల్ నగరవాసేనా? ఈ ముఠాకు సహకరించిన వారిలో కోల్‌కతాలో నివసిస్తున్న రాహుల్ హుడా ఒకరు. ఈ గ్యాంగ్ తమ వల్లోపడిన వారితో వారు ఖరీదు చేయబోయే రైస్పుల్లర్లను తనిఖీ చేయించి, సర్టిఫికేషన్ తర్వాతే అందిస్తామని చెప్తుండేవాడు. ఇలా తనిఖీలు చేసే నిపుణుడిగా రాహుల్ నటించాడు. కోల్‌కతాలోని చంద్రారోడ్లో బీటా ట్రేడర్స్ పేరుతో ఓ కార్యాలయం నిర్వహిస్తున్న ఇతగాడు ఈ ముఠా పిలుపు మేరకు రెండుమూడుసార్లు సిటీకి వచ్చాడు. వస్తూ తన వెంట ఇద్దరు ముగ్గురు అనుచరులు, కొన్ని అంతుచిక్కని ఉపకరణాలను తీసుకువచ్చాడు. ఎస్డీ రోడ్లో ఉన్న ఆంజనేయులకు చెందిన కార్యాలయం కేంద్రంగానే ఈ ఉపకరణాలతో ఆయా రైస్‌పుల్లర్స్‌ను పరీక్షించినట్లు నటిస్తూ, వాటికి సర్టిఫికేషన్ ఇచ్చేవాడు. దీనికోసం బాధితులే ఇతడితో పాటు మందీమార్బలానికి అవసరమైన ఫ్లైట్ టిక్కెట్లు, బస ఖర్చులు భరించేవారు. వీటికి అదనంగా రాహుల్ కొంతమొత్తం ఫీజుగానూ వసూలు చేసేవాడు. గురువారం చిక్కిన గ్యాంగ్ చెప్పిన వివరాల ప్రకారం ఇతగాడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తేనని, పేరు మార్చుకుని ఏళ్ళుగా కోల్‌కతాలో నివసిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అరెస్టు చేయడానికి ఓ ప్రత్యేక బృందం త్వరలో అక్కడకి వెళ్ళనుంది. పరువు కోసం ఫిర్యాదులు చేయకుండా... టాస్క్‌ఫోర్స్ అరెస్టు చేసిన ఈ నలుగురి పైనా ప్రస్తుతానికి బోయిన్పల్లి, మహంకాళి ఠాణాల్లోనే కేసులు నమోదై ఉన్నాయి. అయితే వీరి చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. బాధితుల్లో అనేక మంది విద్యాధికులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వానే కావడంతో ఈ విషయం బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. తమకు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావిçస్తూ మిన్నకుండిపోతున్నారు. గురువారం చిక్కిన ఆంజనేయులు, ఫజలుద్దీన్, బాబుల్, బాబూరావు చేతిలో నగరానికి చెందిన ఓ పెద్దింటి మహిళ సైతం రూ.10 లక్షల మేర మోసపోయారు. దీంతో ఫిర్యాదు చేయమంటూ పోలీసులు కోరగా.. ఆమె నిరాకరించారు. ఈ నలుగురు నిందితులను శుక్రవారం మహంకాళి పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
చెంబు కావాలా నాయనా!, పంచ్‌లు..సెటైర్లు
‘ఈ ఇత్తడి చెంబును చూశారా.. దీనికి శక్తులున్నాయట. ఈ విషయం ఇక్కడ కనిపిస్తున్నారే వీరు చెప్పేదాకా నాకూ తెలీదు.. వీరంతా రైస్ పుల్లర్స్ చెంబులు అమ్ముతుంటారు.. ఒక్కసారి వీరితో మాట్లాడారంటే విలేకర్లు అన్న సంగతి కూడా మరిచిపోయి మీరూ కొనేస్తారు. వీరిలో ఒకడు నిట్‌లో ఎంటెక్ చేశాడు. ఆ విషయం చెబుతుంటే ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు’.. ఇదేదో ఆషామాషీ వ్యక్తి అన్న ఛలోక్తులు కాదు.. కమిషనర్ స్థాయి అధికారి విసిరిన హాస్యోక్తులు. నగర ఇన్చార్జి కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌కు సంబంధించి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఆద్యంతం ఛలోక్తులతో నింపేశారు. సాక్షి,సిటీబ్యూరో: బియ్యాన్ని ఆకర్షించడం తో పాటు అతీంద్రియ శక్తులు ఉన్నాయంటూ కొన్ని నాణాలను చూపించి మోసాలు చేసే ముఠాలను ఇప్పటి వరకు చూశాం. అయితే నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న గ్యాంగ్ మాత్రం నాణాల స్థానంలో బిందెలను వినియోగించింది. ‘రైస్ పుల్లర్’ గా పిలిచే వీటిని అంతర్జాతీయ మార్కెట్ లో కోట్ల ధర ఉంటుందని, ఇవి దగ్గర ఉంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మించి రూ.లక్షల్లో దండుకుంది. ఈ ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నట్లు ఇన్చార్జి పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. భారీ హంగులతో కార్యాలయం... ప్రకాశం జిల్లా బోదనపాడుకు చెందిన ఆంజనేయులు వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ దళారి. ఇతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ‘రైస్ పుల్లర్ల’ వ్యాపారం ప్రారంభించాడు. వరంగల్‌లో ఎన్ఐటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేసి, ప్రస్తుతం జీడిమెట్లలో ఉంటూ సివిల్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న మహ్మద్ ఫజలుద్దీన్, రెడీమేడ్ షాపులో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న గౌలిగూడకు చెందిన బాబుల్, ఇంజిన్ ఆయిల్ సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న బాబూరావులతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఆంజనేయులు కస్టమర్లను తేలిగ్గా బుట్టలో వేసుకునేందుకు సికింద్రాబాద్ ఎస్డీ రోడ్‌లోని సూర్య టవర్స్‌లో కార్పొరేట్ హంగులతో ఓ కార్యాలయం ఏర్పాటు చేశాడు. వీరంతా వివిధ మార్గాల్లో బాధితులను అక్కడికి రప్పించి వారితో సమావేశం కావడం, ‘డెమోలు’ చూపించడం కోసం ఈ ఆఫీస్‌ను వాడుకునేవారు. ఐదుగురు కారు డ్రైవర్లకు టోకరా... ఈ గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన బాబూరావు గతేడాది ప్రయాణించిన వాహనానికి బోయిన్‌పల్లికి చెందిన విష్ణుమూర్తి డ్రైవర్‌గా వ్యవహరించారు. అతడితో తాను డీఆర్డీఓ సంస్థలో శాస్త్రవేత్తగా పరిచయం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘రైస్‌పుల్లర్స్’ విషయం ప్రస్తావనకు తెచ్చిన అతను, ఇక్కడ కేవలం రూ.లక్షల ఖరీదు చేసే ఆ పాత్రలకు అతీతశక్తులు ఉన్నందున విదేశాల్లో రూ.కోట్లకు అమ్ముడుపోతాయని చెప్పాడు. ఓ శాస్త్రవేత్తే ఇలాంటి విషయం చెప్పడంతో నమ్మిన విష్ణుమూర్తి వాటిపై ఆరా తీయగా అతను ఆంజనేయుల్ని రంగంలోకి దింపగా... రైస్ పుల్లర్ బిందెకు ఉన్న మహిమలకు సంబంధించిన వీడియోలను వాట్సాప్‌లో విష్ణుకు చూపించాడు. ఆపై దాని ఖరీదు రూ.20 లక్షలని చెప్పాడు. అంత మొత్తం విష్ణు ఒక్కడే వెచ్చించలేకపోవడంతో అతడికి పరిచయస్తులైన మరో నలుగురు డ్రైవర్లతో కలిసి డబ్బు సర్దుబాటు చేశాడు. ఇది తీసుకున్న ముఠా వారిని మోసం చేసింది. మైన్స్ వ్యాపారం పేరుతో మరొకరికి వేములవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్‌కు కొన్నాళ్ళ క్రితం వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఆంజనేయులుతో పరిచయమైంది. తాను మైన్స్ (ఖనిజాల) వ్యాపారం చేస్తానంటూ చెప్పిన ఆంజనేయులు ఆపై అసలు కథ ప్రారంభించాడు. అతీతశక్తులున్న రైస్ పుల్లర్స్ ఇప్పిస్తానంటూ నమ్మించి తన కార్యాలయానికి తీసుకువెళ్ళాడు. అక్కడకు కస్టమర్ల మాదిరిగా వచ్చిన బాబుల్, బాబూరావు, ఫజలుద్దీన్ గతంలో తాము కూడా రైల్ పుల్లర్ బిందె కొన్నామని, ఆపై తమ దశ మారిపోయిందని రమేష్‌ను నమ్మించి, ఆయన నుంచి రూ. 33 లక్షలు తీసుకుని అడ్డంగా ముంచేశారు. ఈ ముఠాకు కోల్‌కతాలో బీటా ట్రేడర్స్ నిర్వాహకుడు రాహుల్ హుడా సైతం సహకరిస్తున్నాడు. ఎవరైనా వినియోగదారుడు ఈ గ్యాంగ్ నుంచి రైస్‌పుల్లర్ ఖరీదు చేయడానికి ముందుకు వస్తే ఇతడు రంగంలోకి దిగుతాడు. ఆంజనేయులు ఆఫీస్‌కు వచ్చే రాహుల్ సదరు బిందెకు రకరకాల పరీక్షలు చేస్తున్నట్లు నటించి చివరకు అది నిజమైన రైస్‌పుల్లర్‌గా సర్టిఫికేషన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ కేటుగాళ్ళు చేతిలో అనేక మంది మోసపోయినప్పటికీ కేవలం విష్ణుమూర్తి, రమేష్ మాత్రమే ఫిర్యాదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు, స్వాధీనం చేసుకున్న నగదు విష్ణు ఇచ్చిన ఆధారాలతో.. ఈ ముఠాపై బోయిన్పల్లి, మహంకాళి ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టారు. ఎస్డీ రోడ్‌లోని కార్యాలయంలో నిందితులు లేకపోవడం, వారి సెల్ఫోన్లు పని చేయకపోవడం దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించాయి. దీంతో బాధితుల్లో ఒకరైన విష్ణు డ్రైవర్ కావడం, గతంలో అతడు బాబూరావును తీసుకుని పలుచోట్లకు వెళ్ళడంతో అతడిచ్చి ఆధారాలతో టాస్క్‌ఫోర్స్ గురువారం మొత్తం నలుగురినీ పట్టుకోగలిగింది. వీరి నుంచి రూ.34.19 లక్షల నగదు, ఇన్నోవా వాహనం, రైస్ పుల్లర్స్‌గా చెప్పిన మూడు చిన్న బిందెలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంది. కోల్‌కతాకు చెందిన రాహుల్ కోసం గాలిస్తున్నారు. పంచ్‌లు..సెటైర్లు నగర పోలీసులు నిర్వహిం చే విలేకరుల సమావేశాలు సాధారణంగా నేరాలకు సంబంధించే ఉంటాయి. అందునా.. కొత్వాల్ స్థాయి అధికారి ప్రెస్మీట్లో వాతావరణం గంభీరంగా ఉంటుంది. అయితే నగర ఇన్చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు ఈ ‘సంప్రదాయాన్ని’ మార్చారు. రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌కు సంబంధించి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఆద్యంతం చలోక్తులతో నింపేశారు. దీంతో కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్ నవ్వులతో నిండిపోయింది. నిందితుల నుంచి పోలీసులు నగదు, రైస్ పుల్లర్స్‌గా చెప్పిన బిందెలతో పాటు ఓ ఇన్నోవా కారునూ రికవరీ చేశారు. సీపీ రికవరీ వస్తువులను చూపుతూ ‘అన్నీ ఇక్కడ పెట్టాం కానీ, కారు తెచ్చిపెట్టలేకపోయాం’ అన్నారు. నిందితుల్లో ఒకరు వరంగల్ ఎన్ఐటీలో పీజీ చేశారు. విలేకరుల సమావేశంలో అతను ముఖందాచుకోగా ‘ఈయనే ఎంటెక్ చేసింది. ఆ విషయం చెప్తుంటే సిగ్గుపడుతున్నారు’ అన్నారు. రైస్ పుల్లర్స్‌గా చెప్పినవి వాస్తవానికి ఇత్తడి బిందెలు. ఇవి ఖరీదు చేసి మోసపోయిన వారికి ఎందుకు పని చేస్తాయంటూ విలేకరులు ప్రశ్నించగా... ‘కొన్నాక ఏ యూజ్ లేకపోతే అన్నం వండుకోవడానికో, మంచినీళ్ళు పట్టుకోవడానికో’ అన్నారు. ‘రైస్ పుల్లర్స్’ ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన కస్టమర్లను నిందితులు ఎలా నమ్మిస్తారో ప్రత్యక్షంగా చూపాలని విలేకరులు కోరగా, కొత్వాల్ స్పందిస్తూ... ‘చూసి మీరు కూడా ట్రై చేస్తారా ఏంటి?’ అంటూ ప్రశ్నించారు. ఇది టీజరేనంటూ నగర ఇన్చార్జి కొత్వాల్‌గా వీవీ శ్రీనివాసరావు నవంబర్ 12న బాధ్యతలు తీసుకున్నారు. ఆపై కేసుకు సంబంధించి ఆయన నిర్వహించిన తొలి విలేకరుల సమావేశం ఇదే. త్వరలో వార్షిక విలేకరుల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది. ఈ విషయాన్నే ఆయన తనదైన శైలిలో ప్రస్తావిస్తూ... ‘యాన్యువల్ రిలీజ్‌కు ఇది టీజర్ లాంటిది’ అని పేర్కొన్నారు. నిందితులతో మాట్లాడించాలని కోరగా ‘వాళ్ళు కాస్సేపు మాట్లాడితే మీరూ ఓ చెంబు కొంటారు. ఎందుకులే’ అంటూ దాటవేశారు. ఈ సందర్భంగా ఫొటో జర్నలిస్ట్ రికవరీ చేసిన కరెన్సీ చూపమని కొత్వాల్‌ను సైగలతో కోరుతూ కరెన్సీ వైపు చేయి చూపించారు. దీనికీ ‘స్పందించిన’ వీవీ శ్రీనివాసరావు ‘ఆ డబ్బు కావాలా... మీకు ఇవ్వలేం’ అంటూ చలోక్తి విసిరారు. సాధించనిదే వదలడు సీసీ వీవీ శ్రీనివాసరావుకు విధి నిర్వహణలో తనకు తానే సాటి అని ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఏదైనా ఓ విషయంపై దృష్టి పెడితే ఎంతకష్టమైనా అందులో విజయం సాధిస్తారు. వీవీ శ్రీనివాసరావు కుమార్తె ఓ దశలో ఫ్రెంచ్ భాష నేర్చుకోవాలని భావించారు. ఆమెకు ఆ భాష నేర్పడం కోసం ఆయన ఇంటర్నెట్ను ఆశ్రయించి కొన్నాళ్ళ పాటు అకుంఠిత దీక్షతో ఫ్రెంచ్ భాషను అనర్గళంగా నేర్చుకుని... తన కుమార్తెకూ నేర్పారు. ప్రస్తుతం సీపీ ఆ భాషను మాట్లాడటం, రాయడం, చదవడం చేయగలరు. -
నగరంలో రైస్ పుల్లింగ్ ముఠా
సాక్షి, హైదరాబాద్: నగరంలో రైస్ పుల్లింగ్ పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. నార్త్ జోన్ పరిధిలో ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా నిందితుల నుంచి రూ. 34 లక్షల నగదు, కారు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
సాలూరులో రైస్ పుల్లింగ్ ముఠా అరెస్టు
విజయనగరం : విజయనగరం జిల్లా సాలూరులో అనుమానాస్పదంగా తిరుగుతున్న 11 మంది ముఠాను పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మాగ్నెట్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌గా అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీరి వద్ద నుంచి ఒడిశాకు చెందిన రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
కటకటాల్లో రైస్ పుల్లింగ్ ముఠా
హిందూపురం రూరల్ (అనంతపురం జిల్లా) : రాగి పాత్రకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని.. చెబుతూ మోసాలకు పాల్పడుతున్న రైస్ పుల్లింగ్ ముఠా గుట్టురట్టయింది. గోరంట్ల మండలానికి చెందిన మధురెడ్డి, కొండాపురం సత్యనారాయణ, హస్నాబాద్ గోవింద్, కదిరి ప్రభాకర్, గోరంట్ల మల్లికార్జున ముఠాగా ఏర్పడి రాగి బిందె మార్కెట్లో రూ.150 కోట్లు పలుకుతుందని చెబుతూ, రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లిస్తే ఇస్తామంటూ విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం నెల్లూరుకు చెందిన కె.మల్లికార్జునకు అమ్మేందుకు హిందూపురంలోని ఓ లాడ్జీలో బేరం కుదుర్చుకొని తూముకుంట చెక్‌పోస్టు వద్ద లావాదేవీలు జరిపేందుకు వెళ్లారు. టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ ఆంజినేయులు తమ సిబ్బందితో దాడి చేశారు. రాగి బిందెను స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని రూరల్ సీఐ రాజగోపాల్‌నాయుడు తెలిపారు.