అద్దెకు తీసుకున్న భవనం ఇదే, భవనంలో లోపల ఒక గదిలో తవ్విన దృశ్యం, (అంతరచిత్రం) వృద్ధుడు ఆటోడ్రైవర్‌పైకి విసిరిన చీటీ
సాక్షి, తాడేపల్లిగూడెం రూరల్ : గుర్తు తెలియని వ్యక్తులు 70 రోజులుగా తనను భవనంలో బందీగా ఉంచారని.. ఇక్కడి నుంచి విముక్తుడిని చేయాలని ఓ వృద్ధుడు సిగరెట్ పాకెట్ రేపర్‌పై రాసి ఆటో డ్రైవర్‌కు అందించిన లేఖ తాడేపల్లిగూడెంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ శివారులోని ఒక భవనాన్ని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆగస్టులో అద్దెకు తీసుకున్నారు. భవనం మొదటి అంతస్తులో ఒక వృద్ధుడిని బంధించి కాపలా ఏర్పాటు చేశారు. జనసంచారం లేని సమయంలో భవనంలో తవ్వకాలు చేపడుతున్నారు.
స్పీకర్ కోడెల తాలూకా అంటూ..
భవనంలో ఉంటున్న వారిపై స్థానికులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారు. తాము పోలవరం ప్రాజెక్టు వర్కర్లమని.. పంగిడి, ఆరుగొలనులోని క్వారీల్లో కాంట్రాక్ట్‌లు చేస్తుంటామని.. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తాలూకా అంటూ సమాధానాలు చెప్పారు. తీరా వారిని గుర్తింపు కార్డులు ఇవ్వాలంటూ స్థానికులు నిలదీయడంతో తీసుకొస్తామంటూ వారు అక్కడ నుంచి ఉడాయించారు. వీరు మొత్తం 12 నుంచి 15 మంది వరకు ఉన్నారు. వారు వేసుకువచ్చిన స్విఫ్ట్ డిజైర్‌కు కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబరు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.
వృద్ధుడి సందేశంతో బయల్పడిన ఉదంతం
భవనంలో బందీగా ఉన్న వృద్ధుడు శుక్రవారం ఉదయం సిగరెట్ పెట్టెలోని రేపర్‌పై ‘సార్, మాది నరసరావుపేట. నా పేరు వెంకటేశ్వర్లు. ఈ ఇంట్లో ఉండే వాళ్లు నన్ను 70 రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. మీ కాళ్లు పట్టుకుంటాను. దయచేసి ఈ విషయం జిల్లా ఎస్పీకి చెప్పి నా ప్రాణాలు కాపాడండి. ఈ విషయం బయట చెప్పొద్దు. వీరికి తెలిస్తే నన్ను చంపుతారు ప్లీజ్’అని రాసి, రిమోట్ బ్యాటరీకి ఆ కాగితాన్ని చుట్టి రోడ్డుపై వెళ్తున్న ఆటోడ్రైవర్ పైకి విసిరాడు. దీంతో ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావుకు తెలియడంతో ఆయన సూచనతో శుక్రవారం రాత్రి 11 గంటలకు పోలీసులు ఆ భవనం వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ బందీగా ఉన్న వృద్ధునితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఎటువంటి ఫిర్యాదు అందలేదు
హౌసింగ్ బోర్డు శివారులోని భవంతిలో చోటుచేసుకున్న పరిణామాలపై మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం.
–ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి, తాడేపల్లిగూడెం పట్టణ సీఐ
Comments
Please login to add a commentAdd a comment