రైస్ పుల్లింగ్ ముఠా సభ్యుడైన వేణుధర ప్రసాద్‌ను విలేకర్ల ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడిస్తున్న అమలాపురం డీఎస్పీ మసూమ్ బాషా, సీఐలు సురేష్‌బాబు, భీమరాజు, రాజశేఖర్
సాక్షి, అమలాపురం(తూర్పు గోదావరి) : అమలాపురంలో డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్యహత్య చేసుకున్న ఘటనలో లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చేస్తున్న దర్యాప్తులో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ కేంద్రంగా నలుగురు వ్యక్తులతో కూడిన ఈ ముఠా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని ఈ రైసు పుల్లింగ్ ఊబిలోకి లాగి రూ.కోట్లు కాజేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలో సభ్యుడైన కృష్ణా జిల్లా కోడూరు గ్రామానికి చెందిన వరికూటి వెంకటవేణుధర ప్రసాద్‌ను అమలాపురం పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రోజే అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా ఆదేశాలతో నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నాయి.
ఈ క్రమంలో ముఠా సభ్యుడైన వేణుధర ప్రసాద్‌ను అమలాపురం బస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పట్టణ సీఐ బి.సురేష్‌బాబు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ ముఠా సూత్ర, పాత్రధారి అయిన హైదరాబాద్‌కు చెందిన షావలిన్, ముఠాలోని మిగిలిన సభ్యులు అనంతరామ్, శ్రీనివాసరావులను అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ బాషా తెలిపారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్రంలో తమ పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని చెప్పారు. మన రాష్ట్రంలోనూ వీరి కోసం పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు.
డాక్టర్ కుటుంబం నుంచి రూ.ఐదు కోట్లు గుంజుకున్న ముఠా
ముఠా సభ్యుడైన వెంకట వేణుధర ప్రసాద్‌ను అరెస్ట్ అనంతరం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ బాషా మంగళవారం ఉదయం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అమలాపురం పట్టణ, రూరల్, ముమ్మిడివరం సీఐలు బి.సురేష్‌బాబు, ఆర్.భీమరాజు, రాజశేఖర్‌లతో కలిసి ముఠా వివరాలను వెల్లడించారు. ఏడాది నుంచి డాక్టర్ రామకృష్ణంరాజు ఈ ముఠా మాయమాటల్లో పడినట్టు చెప్పారు. తొలుత వేణుధరప్రసాద్ డాక్టర్‌కు పరిచయమై రైస్ పుల్లింగ్ ఆశ పుట్టించాడు. తర్వాత డాక్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రధాన నిందితుడు షావలిన్‌కు పరిచయం చేశాడు. దైవాంశ సంభూతమైన పురాతన విగ్రహాలు, నాణేలు, పాత్రల గురించి డాక్టర్‌కు వివరించి వాటి వల్ల రుణ విముక్తి కావడమే కాకుండా అష్టైశ్వర్యాలు ఎలా ప్రాప్తిస్తాయో తన ముఠాలోని సభ్యులతో ఆయనకు చెప్పించి నమ్మించాడు. రైస్‌పుల్లింగ్‌లో ఇవ్వబోయే పురాతన వస్తువు విలువ రూ.కోట్లలో ఉంటుందని మానసికంగా సిద్ధం చేశారు.
మీ కోసం రైస్ పుల్లింగ్ వస్తువు తయారవుతోందని డాక్టర్ కుటుంబం నుంచి ముఠా దఫదఫాలుగా నగదు రూపంలో, బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకుంది. ఇందు కోసం డాక్టర్ అధిక మొత్తాలను అధిక వడ్డీలకు అప్పు చేసి రూ.ఐదు కోట్లు ముఠాకు అతికష్టంగా సరిపెట్టారు. చివరకు ఈ ముఠా చేసిన మోసాలకు బలి అయ్యానని డాక్టర్ కుటుంబం గ్రహించి ఇటీవల హైదరాబాద్ వెళ్లి రెండు వారాలు ఉండి పొగొట్టుకున్న రూ.ఐదు కోట్లను ఏలాగైనా రాబట్టుకోవాలని విశ్వప్రయత్నం చేసి విఫలమైంది. ఇంతటి ఘోరమైన మోసానికి గురైన డాక్టర్ కుటుంబం చివరకు తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్యకు ఒడిగట్టిందని డీఎస్పీ బాషా తెలిపారు. డాక్టర్ పెద్ద కుమారుడు, మృతుడు డాక్టర్ కృష్ణ సందీప్ సూసైడ్ నోట్, డాక్టర్ చిన్న కుమారుడు కృష్ణ వంశీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ ఆదేశాల మేరకు రైస్ పుల్లింగ్ మోసాలు, ముఠాపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment