వివరాలు వెల్లడిçస్తున్న డీఎస్పీ ఎం. స్నేహిత, సీఐ బి. కల్యాణ్‌రాజు, ఎస్‌ఐ పి. సురేష్
గుంటూరు, తెనాలి రూరల్: పురాతన ఆలయాల గాలి గోపురాలపై కలశాలను అపహరించేందుకు పథకాలు రచిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కలశాలకు రసాయనిక చర్య వల్ల బియ్యాన్ని లాగే శక్తి వస్తుందని అమాయకుల్ని నమ్మిస్తూ కోట్లాది రూపాయిలకు అమ్ముతుంటారు. ఇటీవల చుండూరు మండలం చినపరిమిలోని గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థాన గాలి గోపురంపై కలశాలను అపహరించేందుకు ప్రయత్నించిన బృందంలోని సభ్యుడు మృతి చెందడంతో వీరి గుట్టుంతా బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మిగిలిన సభ్యులను అరెస్ట్ చేశారు. తెనాలి టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఎం.స్నేహిత వివరాలు వెల్లడించారు. పట్టణంలోని జయప్రకాష్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మీసాల ఫణీంద్ర, చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన ఓ యువకుడు, యడ్ల లింగయ్య కాలనీకి చెందిన మరో ముగ్గురు యువకులకు నంద్యాలకు చెందిన ఐదుగురు, గతంలో నంద్యాలలో నివసించి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న మరో వ్యక్తి పరిచయమయ్యారు. పురాతన ఆలయాలపై ఉండే కలశాలకు రైస్ పుల్లింగ్ శక్తి వచ్చిందో లేదో పరీక్షించి, శక్తి వచ్చి ఉంటే, కలశాలను అపహరించి అమ్ముకుంటే కోట్లాది రూపాయిలు సొమ్ము చేసుకోవచ్చని పథకం పన్నారు.
ఇందు కోసం చినపరిమిలోని శివాలయ గాలి గోపురం పైన కలశాలను పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 15న ఆలయం వద్దకు వచ్చారు. గాలి గోపురం ఎత్తుగా ఉండడంతో ఎక్కేందుకు ఎవరూ సాహసించలేదు. మరుసటి రోజు అర్ధరాత్రి దాటాక వచ్చి, ఫణీంద్రను ఎక్కించారు. చిన్న కర్రకు బియ్యం మూట కట్టుకుని పైకి ఎక్కిన అతను ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తెనాలి–గుంటూరు లైనులో పట్టాలపై తెనాలి రైల్వే నార్త్ క్యాబిన్ సమీపంలో పడేశారు. ఫణీంద్ర ఆటోను ఎక్కడయితే పెడతాడో అక్కడే వదిలేసి వెళ్లారు. పట్టాలపై మృతదేహాన్ని గమనించిన తెనాలి–దొనకొండ పాసింజరు రైలు డ్రైవరు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని తెచ్చి పట్టాలపై పడేశారని తేలడం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదై ఉండడంతో టూ టౌన్ పోలీసులకు బదిలీ చేశారు.
కేసును డీఎస్పీ స్వయంగా దర్యాప్తు చేయగా రైస్ పుల్లింగ్ వ్యవహారం బయటపడింది. ముఠా సభ్యుల కోసం తీవ్రంగా గాలించగా తెనాలి, నంద్యాల, హైదరాబాద్, శావల్యాపురానికి 10 మంది (మృతుడు ఫణీంద్రతో కలిపి 11 మంది) నిందితులుగా తేలినట్టు డీఎస్పీ వివరించారు. చినపరిమి శివాలయంలో మరలా కలశాన్ని అపహరించాలని ప్రయత్నిస్తుండగా అంగలకుదురు కొత్త కాల్వ వంతెన సమీపంలో వీరిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని, యడ్లలింగయ్య కాలనీకి చెందిన నిందితుడొకరు పరారీలో ఉన్నట్టు ఆమె తెలిపారు. వారి నుంచి ఆరు సెల్‌ఫోన్లు, కలశాలను పరీక్షించేందుకు వినియోగించిన బియ్యం, ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. టూ టౌన్ సీఐ బి. కల్యాణ్‌రాజు, ఎస్‌ఐ పి. సురేష్, క్రైం సిబ్బంది సీహెచ్.వి.శివయ్య, ఎం. కార్తీక్ దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. రైస్ పుల్లింగ్ శక్తి వస్తుందన్నది అపోహమాత్రమేనని, వీరంతా కోట్లాది రూపాయలు వస్తాయని చెప్పి మోసాలకు పాల్పడుతుంటారని డీఎస్పీ స్నేహిత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment