మహానగరంలో మాయగాళ్లు
► రెండు చీటింగ్ గ్యాంగ్‌ల ఆటకట్టు
► నిందితుల నుంచి
► రూ. 53 లక్షలు స్వాధీనం
పంజగుట్ట : సామాన్యులను ప్రలోభ పెట్టి మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 33లక్షల నగదు, రెండు కార్లు, 15 సెల్‌ఫోన్లు, ఒక మ్యాజిక్ సూట్‌కేస్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం మురళీనగర్‌కు చెందిన పాతనేరస్థుడు కర్రి కనకరాజు అలియాస్ సుదర్శన్ రెడ్డి (40), తన బంధువు అంబటి సంతోష్‌కుమార్ అలియాస్ శ్రీనివాస్ (32), కలకత్తాకు చెందిన సీతారామ్ (45)తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
వారు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2005 కన్నా ముందు కరెన్సీని మార్చుకోవాలని ఇచ్చిన ప్రకటనను ఆసరాగా చేసకుని మోసాలకు పథకం పన్నారు. తమిళనాడు వెళ్లూరు జిల్లా అరక్కువం గ్రామంలో ఓ ట్రస్ట్‌కు సంబందించిన వేల కోట్ల నల్లధనం ఉందని దానిని బ్యాంకులో వేస్తే ఇన్‌కం ట్యాక్స్ సమస్య వస్తుందని అందుకు రూ. 5లక్షలు 2005 తరువాతి నోట్లు తమకు ఇస్తే రెట్టింపు ఇస్తామని కృష్ణాజిల్లాకు చెందిన నాగరాజుకు ఫోన్ చేసి నమ్మించారు. అతడిని నగదు తీసుకొని అమీర్‌పేట్‌లోని బిగ్‌బజార్ వద్దకు రావాల్సిందిగా చెప్పడంతో అతను గత నెల 21న బిగ్‌బజార్ వద్దకు వచ్చాడు. అప్పటికే కారులో సిద్దంగా ఉన్న కనకరాజు ముఠా నాగరాజును కారులో కూర్చోబెట్టుకుని అతడు ఇచ్చిన నగదును తీసుకుని తమ వద్ద సిద్ధంగా ఉన్న రెండువైపుల తెరుచుకునే మ్యాజిక్ సూట్‌కేస్ సహాయంతో తెల్లకాగితాలు ఇచ్చి మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు వారు సికింద్రాబాద్‌లోని భావనీ లాడ్జ్‌లో ఉన్నట్లు గుర్తించి శనివారం అరెస్టు చేశారు.
ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్న తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోటకు చెందిన ఏరోతు నాగేశ్వరరావు (36), అనంతపురం జిల్లా హిందూపూర్‌కు చెందిన ఆర్. రవీందర్ రెడ్డి (39), చిత్తూరు జిల్లా రామసముద్రంకు చెందిన షేక్ హైదర్ వలీ అలియాస్ బాషా (46) చిన్నకొత్తపల్లికి చెందిన టీ. హేమంత్ కుమార్ (23)లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరు ఖమ్మం జిల్లా మదిరకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి రూ.5.5లక్షలు, అదే జిల్లాకు చెందిన శ్రీనివాస్ నుంచి రూ.5 లక్షలు, ప్రసాద్ రూ.5 లక్షలు, రామకృష్ణ నుంచి రూ.4.5 లక్షలు మొత్తం 20 లక్షలు తీసుకొని శనివారం అమీర్‌పేట్ ఇమేజ్ ఆసుపత్రి వీధిలో నగదు మార్చుకుంటుండగా పంజగుట్ట పోలీసులు ఆకస్మికదాడులు చేసి పట్టుకున్నారు. కేసును చేధించిన పంజగుట్ట డిఐ లక్ష్మీనారాయణ రెడ్డి, ఇన్స్‌పెక్టర్ మోహన్‌కుమార్, డి ఎస్‌ఐ శివకుమార్‌లకు స్పెషల్ రివార్డు అందజేయనున్నట్లు డీసీపీ తెలిపారు.